ఆర్మీ డే: భారత సైన్యానికి జనవరి 15 ఎందుకంత ముఖ్యం... స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకు కూడా భారత సైన్యం బ్రిటిష్ ఆధీనంలోనే ఉందా?

ఫొటో సోర్స్, ANI
భారత్‌లో ప్రతీ ఏటా జనవరి 15న సైనిక దినోత్సవాన్ని (ఆర్మీ డే) వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఏడాది భారత్ 75వ ఆర్మీ డే వేడుకలను జరుపుకుంటోంది.
ఈ సంబరాలను జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. భారత చరిత్రలోని ఒక కీలకమైన ఘట్టాన్ని పురస్కరించుకొని ఆర్మీ డేను జరుపుతారు.
200 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత, 1949 జనవరి 15న తొలిసారిగా ఒక భారతీయునికి భారత సైన్యం పగ్గాలను అప్పగించారు.
ఈ సందర్భంగా దేశం కోసం సైనికులు సాధించిన విజయాలు, వారు చేసిన సేవ, సహకారం, త్యాగాలను గౌరవిస్తూ, వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ చోటా ఆర్మీ డే వేడుకలను నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కారణం
1949 జనవరి 15వ తేదీన కమాండర్ ఇన్ చీఫ్ అనే పదవి బ్రిటిష్ సైన్యాధికారి నుంచి తొలిసారిగా భారతీయ సైన్యాధికారికి బదిలీ అయింది. త్రివిధ దళాల అధిపతిని కమాండర్ ఇన్ చీఫ్ అని పిలుస్తారు.
కమాండర్ ఇన్ చీఫ్‌గా భారత రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము త్రివిధ దళాలకు అధిపతి.
బ్రిటిష్ సైన్యాధికారి జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప జనవరి 15న భారత సైన్యం కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించిన చివరి బ్రిటిష్ సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్. ఆ సమయంలో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్నారు.
అప్పుడు కరియప్ప వయస్సు 49 సంవత్సరాలు. ‘జై హింద్’ అనే నినాదాన్ని స్వీకరించారు. జై హింద్ అంటే భారత్ విజయం అని అర్థం.
ఈస్టిండియా కంపెనీ సైన్యం నుంచి భారతీయ సైన్యం ఏర్పాటైంది. తర్వాత అది ‘బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ’గా మారింది. స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్మీగా ఏర్పడింది.
ప్రపంచంలో నాలుగో అత్యంత బలమైన సైన్యంగా భారత సైన్యాన్ని పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, AIR MARSHAL K C NANDA CARIAPPA
ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప
ఆ సమయంలో భారతీయ సైన్యంలో ఫీల్డ్ మార్షల్ స్థాయి ‘ఫైవ్ స్టార్’ ర్యాంకు ఉన్న అధికారులు కేవలం ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు కేఎం కరియప్ప, మరొకరు సామ్ మానెక్షా.
కరియప్పను ‘కిపర్’ అనే పేరుతో పిలిచేవారు. ఫతేగఢ్‌లో కరియప్ప విధులు నిర్వహిస్తుండగా ఒక బ్రిటిష్ అధికారి భార్యకు కరియప్ప అనే పేరు పలకడం రాకపోవడంతో ఆమె ఆయనను ‘కిపర్’ అని పిలవడం ప్రారంభించారని చెబుతారు.
కేఎం కరియప్ప 1900 జనవరి 28న కర్ణాటకలో జన్మించారు. తొలి ప్రపంచ యుద్ధం (1914-1918) సమయంలో ఆయన సైనిక శిక్షణ పొందారు.
1942లో కరియప్ప, లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన తొలి భారతీయ అధికారి అయ్యారు. 1944లో ఆయన బ్రిగేడియర్‌గా మారిన తర్వాత బన్నూ ఫ్రాంటియర్ బ్రిగేడ్‌కు ఆయన కమాండర్‌గా నియమితులయ్యారు.
1986 జనవరి 15న ఆయనను ఫీల్డ్ మార్షల్‌గా ప్రకటించారు. అప్పుడు ఆయన వయస్సు 86 సంవత్సరాలు.
1947 భారత్-పాక్ యుద్ధంలో ఫీల్డ్ మార్షల్ కరియప్ప, వెస్ట్రన్ కమాండ్‌ను నడిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
లేహ్‌ను భారత్‌లో ఒక భాగంగా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
1947 నవంబర్‌లో కరియప్ప రాంచీ ఈస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా నియమితులయ్యారు.
కానీ, రెండు నెలల్లోనే కశ్మీర్‌లో పరిస్థితులు దిగజారడంతో లెఫ్టినెంట్ జనరల్ డడ్లీ స్థానంలో దిల్లీ, ఈస్ట్ పంజాబ్ జీఓసీ ఇన్ చీఫ్‌గా కరియప్పను నియమించారు. ఈ కమాండ్‌కు వెస్ట్రన్ కమాండ్ అని పేరు పెట్టింది కరియప్పనే.
ఈ పదవిలోకి వచ్చిన వెంటనే ఆయన కలవంత్ సింగ్ స్థానంలో జనరల్ థిమయ్యాను జమ్మూకశ్మీర్ ఫోర్స్ చీఫ్‌గా నియమించారు.
జోజిలా, డ్రాస్, కార్గిల్ ప్రాంతాలను భారత ఆర్మీ స్వాధీనం చేసుకునేవరకు లేహ్‌కు వెళ్లే రహదారిని తెరిచేందుకు ఎలాంటి అవకాశం లేదు.
దీంతో పై అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్గిల్, డ్రాస్, జోజిలా ప్రాంతాల్లో భారత సైన్యాన్ని కరియప్ప నడిపించాడు. ఆయన అలా చేసి ఉండకపోతే లేహ్ నేడు భారత్‌లో భాగంగా ఉండకపోయేది.
ఆయన రచించిన ప్రణాళిక ప్రకారమే భారత ఆర్మీ మొదట నౌషేరా, జంగర్‌ను స్వాధీనం చేసుకుంది. తర్వాత జోజిలా, డ్రాస్, కార్గిల్‌లో దాడి చేస్తోన్న శత్రువులను వెనక్కి తరిమికొట్టింది.
1953లో రిటైర్ అయిన కరియప్ప, 94 ఏళ్ల వయస్సులో 1993లో కన్నుమూశారు.

ఫొటో సోర్స్, HARDIK CHHABRA/THE INDIA TODAY GROUP VIA GETTY IMA
ఈసారి ‘ఆర్మీ డే’ ప్రత్యేకత ఏంటి?
ఈసారి సైనిక దినోత్సవాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరులో జనవరి 15న నిర్వహిస్తారు. దేశ రాజధాని దిల్లీలో కాకుండా వేరే ప్రాంతంలో ఆర్మీ డే వేడుకలు జరుగడం ఇదే తొలిసారి.
దిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
జాతీయ ప్రాధాన్యత ఉన్న కార్యక్రమాలను దిల్లీ వెలుపల నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరింత ఎక్కువ మందికి చేరువ కావడంతోపాటు వీటిలో ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘దేశం కోసం దక్షిణ భారత ప్రజలు చేసిన త్యాగం, చూపించిన శౌర్య పరాక్రమాలకు గుర్తింపుగా ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ఈసారి బెంగళూరులో నిర్వహిస్తున్నాం. అలాగే ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో ఈ చర్యను ఆయనకు నివాళిగా భావించాలి’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఈ వేడుకల్లో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు బెంగళూరులో నివాళులు అర్పిస్తారు. ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొంటారు.
ఈ పరేడ్‌లో భారత ఆర్మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. మారుతున్న సాంకేతిక పరంగా భవిష్యత్ కోసం భారత ఆర్మీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా వెల్లడిస్తారు.
వీటితో పాటు మోటార్ సైకిల్, పారా మోటార్స్, కాంబాట్ ఫ్రీ ఫాల్ వంటి విన్యాసాల్లో సైనికులు తమ ప్రతిభాపాటవాలను చూపుతారు.
ఈ సందర్భంగా సైనికులు, ఆర్మీ యూనిట్లు చూపిన శౌర్యపరాక్రమాలకు గుర్తుగా ఆర్మీ చీఫ్ వారికి శౌర్యతా పురస్కారాలు అందజేస్తారు.

ఫొటో సోర్స్, TWITTER/@IASOUTHERN
ఆర్మీ డే థీమ్
ప్రతీ ఏటా ఏదో ఒక థీమ్‌తో ఆర్మీ డేను జరుపుతారు. ఈ ఏడాది ‘రక్తదానం చేయండి- ప్రాణాలను కాపాడండి’ అనే థీమ్‌తో ఈ వేడుకలను జరుపుతున్నారు.
ఇందులో భాగంగా డిసెంబర్ నుంచే రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివిధ ప్రాంతాల్లోని భారత ఆర్మీ దళాలు డిసెంబర్ 24న రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ సమయంలో 7500 యూనిట్ల రక్తాన్ని సేకరించారని, 75 వేల మంది వాలంటీర్లతో కూడిన డేటా బ్యాంకును సిద్ధం చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) పేర్కొంది.
గత ఏడాది ‘భవిష్యత్‌తో పాటు పురోగతి’ అనే థీమ్‌తో ఆర్మీ డే జరిగింది.
ఆధునిక యుద్ధంలో పెరుగుతున్న ఆధునాతన, విధ్వంసకర సాంకేతిక పరిజ్ఞానం పాత్రను నొక్కి చెప్పే ఉద్దేశంతో ఈ థీమ్‌ను ఎంచుకున్నారు.
భారత సైన్యం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు చేస్తోన్న ప్రయత్నాలను ప్రదర్శించారు.
ఇవి కూడా చదవండి:
- సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయారు, ఒక దీవిలో చిక్కుకున్నారు.. తరువాత ఏమైంది?
- దిల్లీ: గర్భంతో ఉన్న భార్యను తగులబెట్టాలని ప్రయత్నించాడు... ఇలాంటి నేరాలకు శిక్షలేంటి?
- రాజమౌళి: ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ దేవుడు అన్న స్టీవెన్ స్పీల్బర్గ్ ఎవరు
- సంక్రాంతి: ‘ఓటు ఉంటేనే బతికుంటాం... లేదంటే శవాలమే’... గంగిరెద్దుల కుటుంబాలపై గ్రౌండ్ రిపోర్ట్
- మిషన్ మజ్ను: ఈ భారతీయ సినిమా మీద పాకిస్తాన్ వాళ్లకు కోపం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















