ఐఎన్‌ఎస్ మార్ముగావ్: క్షిపణులను కూల్చేసే ఈ విధ్వంసకర యుద్ధనౌక గురించి తెలుసుకోవాల్సిన 7 అంశాలు..

ఫొటో సోర్స్, RAJNATH SINGH@TWITTER
భారత నౌకాదళంలో మరో అస్త్రం చేరింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ‘పీ15బీ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక’ను నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
ముంబయిలో జరిగిన యుద్ధనౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘భారత్‌లో తయారయ్యే అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఇదొకటి. సముద్రంలో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను ఇది పెంచుతుంది’’ అని అన్నారు.
‘‘మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్ తయారు చేసిన ఈ యుద్ధనౌక, రక్షణ ఉపకరణాల తయారీలో దేశ సామర్థ్యాలకు గొప్ప ఉదాహరణ. రాబోయే రోజుల్లో కేవలం మన అవసరాల కోసమే కాకుండా ప్రపంచ అవసరాల కోసం కూడా యుద్ధనౌకలను తయారు చేయగలమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ మాట్లాడుతూ, ‘‘మార్ముగావ్ పోర్టు ఆధారంగా ఈ యుద్ధనౌకకు ఆ పేరు వచ్చింది.
ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా పథకాలకు ఈ యుద్ధనౌక ఒక ఉదాహరణ. ఇందులో భారత్‌లో తయారైన వస్తువులనే 75 శాతం ఉపయోగించారు’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారు?
ఐఎన్‌ఎస్ మార్కింగ్ వేడుక (యుద్ధనౌకను నౌకదళానికి అప్పగించడానికి ఏర్పాటు చేసిన వేడుక)లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘ఇటీవల మన దేశం ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. ప్రపంచంలోని ఒక పెద్ద ఏజెన్సీ అంచనాల ప్రకారం, వచ్చే ఐదేళ్లలో భారత్, ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భాగం అవుతుంది.
వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో అన్ని పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. కాలంతో పాటు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, వ్యాపార సంబంధాలు మారుతుంటాయి’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, PIB
భారత్‌కు సంబంధించి పెరుగుతున్న వాణిజ్యం, సముద్ర మార్గాల ప్రాధాన్యం గురించి కూడా ఆయన మాట్లాడారు.
‘‘మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. అంటే, వాణిజ్యం పెరుగుతోంది అన్నట్లు. సముద్ర మార్గాల ద్వారానే వాణిజ్యం ఎక్కువగా జరుగుతుంది. మనం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. ఈ కాలంలో అన్ని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఆర్థిక వృద్ధి, ప్రపంచ అభివృద్ధి కోసం సముద్రంలో నావిగేషన్ స్వేచ్ఛ, సముద్ర మార్గాల్లో సురక్షత అనేవి గతంలో కంటే మరింత ముఖ్యమైనవిగా మారాయి.
ప్రపంచ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలన్నీ తమ సైనిక బలాన్ని పెంచుకుంటున్నాయి. సైన్యాన్ని ఆధునికంగా, పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాయి.
హిందూ మహాసముద్రంపై ఆధారపడి ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ రీజియన్‌లో కీలక దేశంగా ఇక్కడి భద్రతలో నౌకాదళం పాత్ర చాలా ముఖ్యమైనది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, PIB
ఐఎన్‌ఎస్ మార్ముగావ్ ప్రత్యేకతలు
- ఈ యుద్ధనౌకను భారత నౌకాదళానికి చెందిన ప్రాజెక్ట్ 15బీ కింద తయారు చేశారు. ఈ ప్రాజెక్టును 2013 అక్టోబర్‌లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, మార్ముగావ్, ఇంఫాల్, సూరత్ అనే నాలుగు యుద్ధనౌకలను నిర్మించాలి. ఇండియా నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన నాలుగు విశాఖపట్నం క్లాస్ విధ్వంసకర యుద్ధనౌకలలో ఐఎన్‌ఎస్ మార్ముగావ్ రెండోది. ఈ తరగతికి చెందిన తొలి యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ను 2021 నవంబర్ 21న అధికారికంగా భారతీయ నౌకాదళంలో చేర్చారు.
- ఐఎన్‌ఎస్ మార్ముగావ్ యుద్ధనౌక తయారీని 2016 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. 2021 డిసెంబర్ 19న సముద్రంలో ట్రయల్ నిర్వహించారు.
- ఐఎన్‌ఎస్ మార్ముగావ్ 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు ఉంటుంది. నీటిలో దిగినప్పుడు దాని కెపాసిటీ 7,400 టన్నులు.
- శత్రువుల దాడిని పక్కాగా అంచనా వేసేందుకు ఈ యుద్ధనౌకలో అత్యాధునిక సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. ఆయుధాలతో కూడిన ప్రపంచంలోనే అత్యాధునిక క్షిపణి వాహక నౌక ఇదేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
- ఈ యుద్ధనౌకలో ఉపరితలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే మధ్యస్థ శ్రేణి క్షిపణులు, ఉపరితం నుంచి ఉపరితానికి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి. సముద్రంలోని శత్రు జలాంతర్గాములను లక్ష్యంగా చేయడానికి దేశీయంగా తయారైన టార్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఏర్పాటు చేశారు.
- నౌకాదళం చెప్పిన దాని ప్రకారం, ఈ యుద్ధనౌక అణు, బయోలాజికల్, రసాయన యుద్ధాలను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉంది. ఇందులో ఆధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ శత్రువుల దాడిని కచ్చితంగా అంచనా వేస్తుంది.
- ఇందులో నాలుగు శక్తిమంతమైన టర్బైన్లు ఉన్నాయి. ఈ యుద్ధనౌక 30 నాట్ల వేగంతో ప్రయాణించగలదు.
ఇవి కూడా చదవండి:
- పఠాన్: బికినీ రంగు, ‘లవ్ జిహాద్’ వివాదంలో షారుఖ్, దిపికల సినిమా
- చైనాతో ‘సరిహద్దు ఘర్షణలు’ జరుగుతున్నా.. చైనా నుంచి భారత్ దిగుమతులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి.. ఎందుకు?
- Argentina vs France: అర్జెంటీనాకు యువ ఆటగాడు జులియన్ అల్వారెజ్ ఎలా కీలకం అయ్యాడు
- పవన్ కల్యాణ్: ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదు’ - సత్తెనపల్లి సభలో జనసేన నేత
- ఆంధ్రప్రదేశ్: 20 రూపాయలకే ‘మన భోజనం’ - ఎక్కడంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














