'తీవ్రవాదుల నుంచి 20మంది గర్భిణులను కాపాడాను'

అంజలి కుల్థే
ఫొటో క్యాప్షన్, అంజలి కుల్థే

ముంబయి దాడుల సమయంలో అనేకమంది ప్రాణాలు కాపాడిన ఒక నర్స్ ఐక్యరాజ్య సమితిలో తన అనుభవాలను పంచుకున్నారు. 

2008 నవంబర్ 26న తీవ్రవాదులు ముంబయి నగరంలోని పలు ప్రాంతాలలో దాడులు చేశారు.

ఆ దాడిలో పాల్గొన్న అజ్మల్ కసబ్‌ను జైల్లో చూశానని, అతడి మొహంలో ఎలాంటి విచారం లేదని అంజలి తెలిపారు. 

అంజలి కుల్థే గురువారం వీడియో లింక్ ద్వారా ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి ప్రసంగించారు. 

ఐక్యరాజ్య సమితి భద్రతామండలి 'ది గ్లోబల్ కౌంటర్-టెర్రరిజం అప్రోచ్: చాలెంజెస్ అండ్ ది వే ఫార్వర్డ్'పై సమావేశం నిర్వహించింది.

ఇందులో భాగంగా, అంజలి 26/11 దాడుల గురించి తన అనుభవాలను పంచుకున్నారు.

2008లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా తీవ్రవాదులు పది మంది ముంబయిలోని అయిదు ప్రదేశాలపై ప్రణాళికాబద్ధంగా దాడి చేశారు. ఇందులో 166 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు.

ఈ దాడుల సమయంలో అంజలి కుల్థే 'కామా అండ్ ఆల్‌బ్లెస్ మహిళలు, పిల్లల ఆస్పత్రి'లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. 

జైలులో కసబ్‌ను చూశానని, అతడి ముఖంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అన్నారు. 

అంజలి కుల్థే

"ఆ రాత్రి నేను ఇరవై మంది గర్భిణులను, వారి కడుపులో ఉన్న పిల్లలను రక్షించగలిగాను. కానీ, ఆ రాత్రి జరిగిన ఘటనలు, ఆ భయం ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది. నేను, నా సహచరులు అనేకమంది ప్రాణాలను కాపాడాం అన్నదే నాకు మనశ్శాంతిని ఇచ్చే విషయం. 

దాడి జరిగిన ఒక నెల తరువాత, ప్రాణాలతో బయటపడిన అజ్మల్ కసబ్‌ని గుర్తించడానికి అధికారులు నన్ను పిలిచారు. కోర్టులో సాక్ష్యం అనేసరికి మా ఇంట్లోవాళ్లు భయపడ్డారు. కానీ, నేను సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నాను.

జైలులో కసబ్‌ని గుర్తించినప్పుడు, అతడు నవ్వుతూ 'మేడమ్ మీరు నన్ను సరిగ్గా గుర్తించారు, నేనే అజ్మల్ కసబ్‌ని ' అని చెప్పాడు. కసబ్‌లో పశ్చాత్తాపం, సిగ్గు, అపరాధభావం ఏమీ లేదు. అతడి ముఖంలో విజయం సాధించామన్న గర్వం కనిపించింది. అది ఈనాటికీ నన్ను వెంటాడుతోంది" అని అంజలి చెప్పారు. 

ప్రపంచంలో ఎక్కడైనా తీవ్రవాద దాడుల వార్తలను చూసినప్పుడు చాలా బాధ కలుగుతుందని, ఆ దాడుల బాధితులు, బతికి బయటపడ్డవారి గురించి ఆలోచిస్తే హృదయం ద్రవిస్తుందని ఆమె అన్నారు. 

"ముంబయి దాడుల బాధితులు ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇంత దారుణమైన దాడులకు ఉసిగొల్పినవాళ్లు మాత్రం స్వేచ్ఛగా ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది పిల్లలు అనాథలైపోయారు. మరెంతోమంది ఆ భయాలను వెంటమోసుకుని కాలం గడుపుతున్నారు. 26/11 దాడుల స్పాన్సర్‌లను శిక్షించాలని ఈ కౌన్సిల్ ద్వారా అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే బాధిత కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది" అని అంజలి అన్నారు.

అజ్మల్ కసబ్‌ సహా తీవ్రవాదులు ఆస్పత్రి గేటిలోకి ప్రవేశించి గార్డులను చంపడం అంజలి స్వయంగా చూశారు. 

2008, నవంబర్ 26న ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, నారిమన్ హౌస్ వాణిజ్య, నివాస సముదాయం, కామా హాస్పిటల్, లియోపోల్డ్ కెఫే, ది ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, తాజ్ హోటల్ అండ్ టవర్‌లను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడి చేశారు.

అజ్మల్ కసబ్‌
ఫొటో క్యాప్షన్, FILE FOOTAGE

ఐరాసలో మాట్లాడిన అంజలి కుల్థేకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. 

"26/11 దాడులు సహా అనేక తీవ్రవాద ఘటనలలో బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని అంజలి ఇచ్చిన వాంగ్మూలం గుర్తుచేస్తోంది" అని జైశంకర్ అన్నారు. 

అంజలి కుల్థే కసబ్‌ను గుర్తించి, కోర్టులో అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పినప్పుడు అంజలి నర్సు డ్రెస్ వేసుకున్నారు.

2012 నవంబర్ 21న అజ్మల్ కసబ్‌ను ఉరితీశారు. అతడి మృతదేహాన్ని పుణెలోని ఎరవాడ జైలులో ఖననం చేశారు. 

ఇవి కూడా చదవండి: