26/11 ముంబై దాడులు: అజ్మల్ కసబ్‌తో పాటు మిగిలిన 9 మంది మృతదేహాలను ఏం చేశారు?

అజ్మల్ కసబ్

2008 నవంబర్ 26న ముంబైపై పది మంది తీవ్రవాదులు దాడి చేశారు.

ఈ ఘటనలో 166 మంది మరణించగా, వందలాది మంది గాయాలపాలయ్యారు.

తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా వద్ద శిక్షణ పొందిన, భారీ ఆయుధాలను కలిగిన పది మంది తీవ్రవాదులు ముంబైలోని అనేక ప్రాంతాల్లో, భవనాల్లో చొరబడి నాలుగు రోజుల పాటు దాడులకు పాల్పడ్డారు.

ముంబై దాడుల్లో పాల్గొన్న పది మంది తీవ్రవాదుల్లో అజ్మల్ కసబ్‌ను మాత్రమే పోలీసులు ప్రాణాలతో పట్టుకోగలిగారు.

అతన్ని 2012 నవంబర్ 21న పుణేలోని ఎరవాడ జైలులో ఉదయం 7:30 గంటలకు ఉరి తీశారు.

కసబ్

కసబ్ గ్రామానికి బీబీసీ వెళ్లినప్పుడు ఏం జరిగిందంటే..

కసబ్‌ను ఉరి తీసిన తర్వాత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన ఫరీద్‌కోట్‌కు బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ చేరుకున్నారు. అక్కడ జాఫ్రీ ఏం చూశారో చదవండి.

‘‘కసబ్‌ను ఉరి తీశారనే వార్తలు వచ్చిన తర్వాత నేను పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌కు వెళ్లాను. ఆ ఊరిని కసబ్ గ్రామం అని చెబుతుంటారు.

‘కసబ్ ఇల్లు’ అని పిలిచే ఒక ఇంటి వద్దకు నేను చేరుకున్నా. ఆ ఇంటి చుట్టూ చాలామంది గుమిగూడారు. దానికి దగ్గరలో కొన్ని దుకాణాలు ఉన్నాయి. అక్కడ కూడా పెద్ద సంఖ్యలో జనాలు ఉన్నారు.

అక్కడి యువకులతో పాటు మరికొంతమందితో నేను మాట్లాడటానికి ప్రయత్నించిప్పుడు వారంతా కసబ్‌ను తమ గ్రామానికి చెందిన వాడని అంగీకరించడానికి నిరాకరించారు.

‘మేం ఇక్కడే పుట్టి పెరిగాం. కసబ్‌ అనే వ్యక్తిని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. కసబ్ పేరుతో ఈ గ్రామం పరువును తీస్తున్నారని’ వారు అన్నారు.

మీడియాలోనే కసబ్ పేరును విన్నట్లు వారంతా చెప్పారు. కసబ్ గానీ, కసబ్‌ కుటుంబానికి చెందిన వారు గానీ ఎవరూ ఇక్కడ నివసించడం లేదని వారంతా చెప్పారు.

ఆ ఇంటి పక్కనే దుకాణం వద్ద నిల్చున్న కొంతమందితో మాట్లాడగా... ఇదంతా పెద్ద డ్రామా అని, తమ గ్రామం పరువును తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు’’ అని జాఫ్రీ వివరించారు.

తాజ్ హోటల్

‘ఇంటి నుంచి బయటకు నడవండి’

‘‘ఆ ఇంటి ముందు కొన్ని పశువులు కట్టేసి ఉన్నాయి. లోపలికి వెళ్లగానే ఇంట్లో కొందరు మహిళలు కనిపించారు.

ఆ ఇంట్లో ప్రస్తుతం కొందరు నివసిస్తున్నారు. అక్కడివారు చెప్పినదాని ప్రకారం, కసబ్‌ కుటుంబీకులు చాలా కాలం క్రితమే ఆ ఇంటిని వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో వేరే వాళ్లు ఉంటున్నారు.

మమ్మల్ని చూసి ఆ మహిళలు లోపలికి వెళ్లిపోయారు. అక్కడున్న దృశ్యాలను కెమెరాలో బంధించడం మొదలుపెట్టగానే కొంతమంది వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం మొదలుపెట్టారు.

‘మీరు లోపలికి ఎలా వచ్చారు? వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోండి’ అని మమ్మల్ని కోరారు.

మా కెమెరాలు ఆఫ్ చేసి మేం ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి మాతో వాదనకు దిగారు. బహుశా ఆయన ఆ ప్రాంతానికి చెందినవారు కావొచ్చు.

యూనిఫామ్‌లో ఉన్న భద్రతా సిబ్బంది ఎవరూ మాకు ఆ గ్రామంలో కనిపించలేదు. అక్కడ విషాద వాతావరణం నెలకొన్నట్లు కూడా మాకు అనిపించలేదు. కానీ, అక్కడి ప్రజలు కోపంగా ఉన్నట్లు కనిపించారు’’ అని జాఫ్రీ తెలిపారు.

కసబ్

ఏడాదికి పైగా భద్రంగా మృతదేహాలు

అజ్మల్ కసబ్‌కు 2012 నవంబర్ 21న పుణేలోని ఎరవాడ జైలులో ఉదయం ఉరి శిక్ష అమలు చేశారు.

కసబ్‌ను ఉరి తీసినట్లు పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చామని, అయితే మృతదేహాన్ని తమకు అప్పగించాలని పాకిస్తాన్ కోరలేదని అప్పటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.

కసబ్ మృతదేహాన్ని ఎరవాడ జైలు పరిసరాల్లోనే ఖననం చేసినట్లు మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు.

దీనికంటే ముందు ముంబై దాడుల్లో మృతి చెందిన మిగతా తొమ్మిది మంది తీవ్రవాదుల మృతదేహాలను తీసుకోవడానికి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరించింది.

అప్పుడు వారి శవాలను ఏడాది కాలానికి పైగా భద్రపరిచిన ప్రభుత్వం ఆ తర్వాత వాటిని 2010 జనవరిలో ఒక గుర్తు తెలియని ప్రాంతంలో ఖననం చేసింది.

భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం ఈ విషయాన్ని 2010 ఏప్రిల్‌లో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)