అఫ్గానిస్తాన్: 'సూపర్ కార్' తయారుచేసిన అఫ్గాన్ టెకీ, తాలిబాన్ పాలనలో ఇదెలా సాధ్యమైంది?

స్పోర్ట్స్ కారు

ఫొటో సోర్స్, SUHAILSHAHEEN/@TWITTER

ఫొటో క్యాప్షన్, రజా అహ్మదీ తయారు చేసిన కారు
    • రచయిత, అజీజుల్లా ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"అమెరికా, దాని మిత్ర దేశాల దళాలు కాబూల్ బాగ్రామ్ ఎయిర్‌బేస్‌లో ఉన్నప్పుడు, రాత్రిపూట అక్కడ వెలుగులు విరజిమ్మేవి. ఏదో ఒక రోజు నేను నా కారును ఆ ఎయిర్‌బేస్‌పై నడపాలని కలలు కన్నాను."

"నా కల కలలాగే మిగిలిపోతుంది, ఎప్పటికీ నెరవేరదు అనుకున్నా. కానీ ఇప్పుడు అది సాకారమైంది. అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం నా కారును బాగ్రామ్ ఎయిర్‌బేస్‌లో ప్రదర్శించింది. అప్పుడు నేను కలగనట్టే ఆ ప్రాంతంలో వెలుగులు విరజిమ్మాయి."

కాబూల్‌కు చెందిన ఇంజనీర్ మహ్మద్ రజా అహ్మదీ అన్న మాటలవి. యుద్ధంతో నలిగిపోయిన అఫ్గానిస్తాన్‌లో మొదటి 'సూపర్‌కార్'ని రూపొందించారు ఆయన.

ఎస్‌టాప్ అనే స్థానిక డిజైన్ స్టూడియో సోషల్ మీడియా పేజీలో మహ్మద్ రజా అహ్మదీ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

టెక్నికల్ అండ్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్గానిస్తాన్‌తో కలిసి ఎస్‌టాప్ కార్ డిజైన్ స్టూడియోలో ఈ కారును రూపొందించారు.

మహ్మద్ రజా అహ్మదీతో టెలిఫోన్‌లో మాట్లాడటానికి మేం ప్రయత్నించాం. కానీ కుదరలేదు.

అఫ్గానిస్తాన్‌లో వాహనాల తయారీ పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్‌కార్‌ను తయారు చేయాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చింది, దాని సాంకేతికత, విడిభాగాలను ఎక్కడ సంపాదించారో మేం తెలుసుకోవాలనుకున్నాం.

మహ్మద్ రజా సెక్రటరీ మాతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ వాహనం తయారీకి 10 నుంచి 12 మందితో కూడిన బృందం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇది ప్రోటోటైప్ స్పోర్ట్స్ కారు. మాకు అందిన సమాచారం ప్రకారం టయోటా ఇంజిన్ ఇందులో ఉపయోగించారు.

అఫ్గానిస్తాన్‌

ఫొటో సోర్స్, Getty Images

కారు తయారీకి ఎంత ఖర్చయింది?

అఫ్గానిస్తాన్‌లోని విద్య, సాంకేతిక విద్య విభాగాధిపతి మౌల్వీ గులాం హైదర్ షహమత్ అఫ్గానిస్తాన్‌ నుంచి టెలిఫోన్ ద్వారా బీబీసీతో మాట్లాడారు.

''ఈ వాహనం నిర్మాణం ఐదేళ్లుగా కొనసాగుతోంది. అంటే కారు పని గత ప్రభుత్వంలో ప్రారంభించారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తయారీ పూర్తయింది'' అని తెలిపారు.

ఇంతకు ముందు కేవలం 50 శాతం పని మాత్రమే జరిగిందని, అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ పాలన ఏర్పడినప్పుడు, మహ్మద్ రజా అహ్మదీ 8 నెలల క్రితం తమ సంస్థను సంప్రదించారని చెప్పారు.

ఆ తరువాత పని పూర్తయిందని వివరించారు హైదర్. అయితే కారు ఇంటీరియర్ పని ఇంకా బాకీ ఉందని చెప్పారు.

ఈ వాహనం కోసం ఇప్పటి వరకు 40 నుంచి 50 వేల డాలర్లు వెచ్చించామని, ఇంటీరియర్ డిజైన్ పూర్తి చేయడానికి మరికొంత ఖర్చవుతుందని ఆయన తెలిపారు.

ఈ కారును పూర్తిగా సిద్ధం చేసి ప్రపంచానికి చూపించి అఫ్గానిస్థాన్‌ పురోగతిని, ఉజ్వల భవిష్యత్తును చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తానని హైదర్ వెల్లడించారు.

ఈ ఏడాది ఖతార్‌లో జరగనున్న వాహనాల ఎగ్జిబిషన్‌లో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం ఈ కారును ప్రదర్శనకు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వాహనం చిత్రాలు, కొన్ని వీడియోలు గతేడాది నవంబర్‌లో సోషల్ మీడియాలో కనిపించాయి. కొన్ని రోజుల క్రితమే ఈ కారును అఫ్గానిస్తాన్‌లో ప్రదర్శించారు.

ఐక్యరాజ్యసమితికి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ ప్రతినిధిగా నామినేట్ అయిన సుహైల్ షాహీన్ మూడు రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు.

ఇందులో అఫ్గానిస్థాన్ ఇంజినీర్ తయారు చేసిన వాహనం పనితీరు గురించి తెలిపారు.

అఫ్గానిస్తాన్ అభివృద్ధి కోసం అఫ్గాన్ యువకులందరూ తమ పాత్రలను పోషించాలని ఆయన వ్యాఖ్యానించిన వీడియో కూడా ఇందులో ఉంది.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

నెటిజన్లు ఏమంటున్నారు?

అఫ్గానిస్తాన్ సమాచార విభాగం హెడ్ జబీహుల్లా ముజాహిద్ ఈ ఘనతను ప్రశంసించారు.

సోషల్ మీడియాలో చాలా మంది కారు నిర్మాణాన్ని ప్రశంసించారన్నారు. 40 ఏళ్లుగా యుద్ధం జరుగుతున్న దేశంలోనూ నైపుణ్యం ఉన్నవారు దీన్ని చేయగలరని ముజాహిద్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు చాలా మంది విమర్శకులు ఈ వాహనంలోని భాగాలు ఇతర వాహన కంపెనీలకు చెందినవని లేదా మాడిఫై చేసినవని ఆరోపిస్తున్నారు.

అఫ్గానిస్తాన్ తమ దేశంలో విడిభాగాలు, ఇతర ఉపకరణాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించాలని విమర్శలు గుప్పిస్తున్నారు.

మొహమ్మద్ రజా అహ్మదీ, ఆయన భాగస్వామి సంస్థ ఎంటాప్ సోషల్ మీడియా పేజీలలో వాహనం తయారీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

కారు విడి భాగాలు, బాడీని ఎలా తయారు చేశారో వీడియోలో చూపించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)