కర్ణ్‌ప్రయాగ్: జోషీమఠ్‌లాగే ఇక్కడా ఇళ్లకు పగుళ్లు... ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఆసిఫ్ అలీ
- హోదా, బీబీసీ కోసం, కర్ణ్‌ప్రయాగ్ నుంచి
జోషీమఠ్ తర్వాత ఇప్పుడు చమోలీ జిల్లా కర్ణ్‌ప్రయాగ్‌లోని ఇళ్లకు కూడా పగుళ్లు రావడంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు.
కర్ణ్‌ప్రయాగ్‌లోని 8 ఇళ్లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇళ్లలో నివసించే ఎనిమిది కుటుంబాలకు ఇంటిని ఖాళీ చేయాలనే నోటీసులు ఇచ్చారు.

ఫొటో సోర్స్, ASIF ALI/BBC
నోటీసుపై బహుగుణ నగర్ ప్రజలు ఏం అంటున్నారు?
కర్ణ్‌ప్రయాగ్‌లోని బహుగుణ నగర్ నివాసి హరేంద్ర బిష్ట్. పట్వారీ తనకు ఇల్లు ఖాళీ చేయాలనే నోటీసులు ఇచ్చారని హరేంద్ర చెప్పారు. బహుగుణ నగర్‌లో ఆయనకు ఆరు గదులున్న ఇల్లు ఉంది.
ఆ ఇంట్లో భార్య ప్రియాంక, రెండున్నరేళ్ల కుమారుడు శివన్‌తో కలిసి హరేంద్ర నివసిస్తున్నారు. ఇంట్లోని అన్ని గదుల్లో పగుళ్లు వచ్చాయని హరేంద్ర తెలిపారు. ఆ పగుళ్లు చాలా వెడల్పుగా ఉన్నాయని, ఆ పగుళ్ల సందుల్లో నుంచి మరో గదిని చూడొచ్చని ఆయన తెలిపారు.
ఇంటి పరిస్థితిని చూసి ఆయన కలత చెందారు. ఇల్లూ వాకిలి వదిలేసి, చిన్న పిల్లాడితో వెళ్లిపోవడం చాలా కష్టమైన పని ఆయన బాధపడుతూ చెప్పారు.
‘‘ఉన్నపళంగా ఇంటిని విడిచి ఎలా వెళ్లిపోతాం’’ అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, ASIF ALI/BBC
‘‘పగుళ్లు చూసి భయపడ్డాను’’
ప్రభుత్వం జోషీమఠ్‌లో షిఫ్టింగ్ కోసం నగదు ఇచ్చినట్లుగా తమకు కూడా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని హరేంద్ర సింగ్ అన్నారు.
2012లో మండీ కమిటీ భవన నిర్మాణ సమయంలో జేసీబీ యంత్రాలతో తవ్వకాలు జరిపినప్పటి నుంచి ఇళ్లకు తరచుగా పగుళ్లు రావడం మొదలైందని ఆయన తెలిపారు.
బహుగుణ నగర్‌కే చెందిన పంకజ్ డిమ్రీకి నాలుగు గదులు ఇల్లు ఉంది. ఆ ఇంట్లోని అన్ని గదుల్లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.
‘‘ఆ పగుళ్లు చూడటానికే భయపడేంత పెద్దవిగా ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ASIF ALI/BBC
భార్య రుచితో పాటు ఇద్దరు పిల్లలు చిన్మయ్ (10 ), విభూతి (13)లతో కలసి ఆయన ఆ ఇంట్లో ఉంటున్నారు.
ఇంటిని ఖాళీ చేయాలనే నోటీసు ఆయనకు కూడా అందింది. ఇల్లును వదిలి వెళ్లడం చాలా బాధగా ఉందని పంకజ్ అన్నారు.
‘‘ఇల్లు లేకపోతే పిల్లల చదువు ఎలా సాగుతుంది? నైట్ షెల్టర్ నుంచి ప్రతీరోజూ ఉదయం పిల్లలు స్కూల్‌కు వెళ్లడం అసాధ్యం’’ అని ఆయన గద్గద స్వరంతో అన్నారు.

ఫొటో సోర్స్, ASIF ALLI/BBC
మున్సిపాలిటీకి చెందిన నైట్ షెల్టర్‌లో తమకు ఉండేందుకు ఒక గదిని ఇచ్చారని పంకజ్ చెప్పారు. తమకు మరో ఆధారం లేకపోవడంతో సామాన్లు అన్నీ తీసుకొని ఆ గదిలో ఉండేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఆ తర్వాత అద్దె ఇంటి కోసం వెదుకుతానని అన్నారు.
తన ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుందని ఆయన చెప్పారు.
గత ఏడాది వర్షాకాలంలో యంత్రాలతో రోడ్డును కట్ చేశారని, దాని కారణంగానే ఇల్లుకు పగుళ్లు వచ్చాయని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, ASIF ALI/BBC
కర్ణ్‌ప్రయాగ్ తహసీల్దార్ ఏం అంటున్నారు?
కర్ణ్‌ప్రయాగ్ తహసీల్దార్ సురేంద్ర సింగ్ దేవ్ మాట్లాడుతూ, ‘‘జనవరి 11న తహశీల్ పాలకవర్గం, ఇతర సాంకేతిక విభాగాలతో కలిసి 39 ఇళ్లను తనిఖీ చేశాం.
అందులో 8 ఇల్లు నివాసయోగ్యంగా లేనట్లు గుర్తించాం.
39 ఇళ్ల పరిస్థితి అధ్వాన్నంగానే ఉంది. కానీ ఈ ఎనిమిది ఇల్లు ఏమాత్రం నివాసయోగ్యంగా లేవు. ఆ ఇళ్లలో చాలా పగుళ్లు వచ్చాయి.
అందుకే బహుగుణ నగర్‌లోని ఆ 8 ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చాం.
ఆ ఇళ్లలో ఉండే ప్రజలకు కర్ణ్‌ప్రయాగ్ మున్సిపాలిటీకి చెందిన నైట్ షెల్టర్లలో వసతి ఏర్పాటు చేశాం.
జోషీమఠ్ తరహాలో ఇక్కడ కూడా సహాయం చేసేందుకు ప్రతిపాదనను సిద్ధం చేసి జిల్లా కార్యాలయానికి పంపించాలని జిల్లా అధికారి ఆదేశించారు’’ అని సురేంద్ర సింగ్ వెల్లడించారు.
జోషీమఠ్ పరిస్థితిలాగే తమ ఇళ్లకు కూడా పగుళ్లు రావడం చూసి కర్ణ్‌ప్రయాగ్ వాసులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇళ్లను ఖాళీ చేయాలనే ఆదేశాలు రావడంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది.
ఇవి కూడా చదవండి:
- దేశానికి రక్షణగా పెట్టని గోడలు - ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు...
- గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? నీటి నుంచి ఎలా ఉత్పత్తి చేస్తారు?
- తెలంగాణ: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజల కష్టాలేమిటి? మునిసిపాలిటీ పరిధిలోకి వస్తే ఏం జరుగుతుంది?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














