తాలిబాన్ ఎఫెక్ట్: యూనివర్సిటీలు, ఎన్జీవోలలో మహిళలపై బ్యాన్, ఆగిపోతున్న విదేశీ సాయం

తాలిబాన్లు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పలు విదేశీ ఎన్జీవోలు అఫ్గానిస్తాన్‌లో ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి.

అఫ్గానిస్తాన్‌లో 5 ఎన్జీవోలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. తమ వద్ద పని చేయకుండా మహిళలను తాలిబాన్‌లు నిషేధించడమే ఇందుకు కారణం.

కేర్ ఇంటర్నేషనల్, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ (ఎన్‌ఆర్‌సీ), సేవ్ ది చిల్డ్రన్ సంస్థలు మహిళా సిబ్బంది లేకుండా పని కొనసాగించలేమని చెప్పాయి.

ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (ఐఆర్‌సీ) కూడా సేవలను నిలిపివేసింది. ఇస్లామిక్ రిలీఫ్ కూడా కార్యకలాపాలు చాలా వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

అఫ్గానిస్తాన్‌లోని అధికార తాలిబాన్ మహిళల హక్కులను క్రమంగా అణచివేస్తోంది.

యూనివర్శిటీలో మహిళలు చేరడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిషేధించిన కొద్ది రోజులకే ఎన్జీవోలపై ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

నిషేధంపై ఎన్‌జీవోలు ఏమంటున్నాయి?

విదేశీ సహాయక బృందాలలోని మహిళా కార్యకర్తలు హిజాబ్‌లు ధరించకుండా దుస్తుల కోడ్‌లను ఉల్లంఘించారని తాలిబాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ రెహ్మాన్ హబీబ్ ఆరోపించారు.

తాలిబాన్ నిషేధాన్ని పాటించని ఏ సంస్థ లైసెన్స్‌ అయినా రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే మహిళలపై ఇలాంటి నిషేధాలను పలు సంస్థలు ఖండించాయి. పనిచేయడానికి వాళ్లను అనుమతించాలని డిమాండ్ చేశాయి.

మహిళా సిబ్బందే లేకుంటే "ఆగస్టు 2021 నుంచి కష్టాలలో ఉన్న లక్షలాది అఫ్గాన్‌లకు సహాయం చేయలేకపోయేవాళ్లం" అని కేర్, ఎన్‌ఆర్‌‌సీ, సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధులు ఓ సంయుక్త ప్రకటనలో స్పష్టంచేశారు.

" ఇక్కడ మా కార్యక్రమాలను నిలిపివేస్తున్నాం. మా ప్రాణాలను రక్షించే బాధ్యతను పురుషులు, మహిళలు సమానంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం" అని వారు ఆ ప్రకటనలో తెలిపారు.

అఫ్గానిస్తాన్‌లో 3,000 మంది మహిళలను నియమించామని ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (ఐ‌ఆర్‌సీ) మరో ప్రకటనలో తెలిపింది. మహిళా సిబ్బందిపైనే తమ కార్యకలాపాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొంది.

మహిళలు లేకపోతే సమస్యల్లో ఉన్నవారిని గుర్తించలేమని స్పష్టంచేసింది.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గాన్ మహిళలకు యూనివర్సిటీ చదువులు వద్దని తాలిబాన్లు నిషేధం విధించారు.

‘ఇది విచారకరం’

అఫ్గానిస్తాన్‌లో తమ ''కార్యకలాపాలను'' తాత్కాలికంగా నిలిపివేస్తుండటం బాధాకరమైన నిర్ణయమని ఇస్లామిక్ రిలీఫ్ పేర్కొంది.

ఇందులో పేద కుటుంబాలకు జీవనోపాధిని పొందేందుకు సహకరించే ప్రాజెక్ట్‌లతో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని తెలిపింది.

అయితే, ప్రాణాలను రక్షించే ఆరోగ్య సంరక్షణ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

"మహిళా ఎన్‌జీవో వర్కర్లపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఇస్లామిక్ రిలీఫ్ అఫ్గాన్ అధికారులను కోరుతోంది" అని ఆ సంస్థ ఈ సందర్భంగా తెలిపింది.

"నిషేధం దేశవ్యాప్తంగా లక్షలాది పురుషులు, మహిళలు, పిల్లలపై భయంకరమైన ప్రభావాన్ని చూపుతుంది. అఫ్గాన్ బాలికల విద్యపై ఆంక్షలు పెరిగిన కొద్ది రోజులకే ఈ తీర్పు రావడంతో మేం విస్తుబోయాం" అని ఆ సంస్థ వెల్లడించింది.

విద్యార్ధినులు

ఐక్యరాజ్య సమితికి తాలిబాన్‌లు ఏం చెప్పారు?

ఐక్యరాజ్యసమితి అత్యున్నత హ్యుమానిటేరియన్ కో ఆర్డినేటర్ రమీజ్ అలక్‌బరోవ్ మాట్లాడుతూ.. నిషేధాన్ని వెనక్కి తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నిస్తోందన్నారు.

ఇది "మొత్తం సమాజానికి ఇది రెడ్ లైన్" అని ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళలపై విధించిన నిషేధాలను తాలిబాన్‌లు వెనక్కి తీసుకోకపోతే ఐక్యరాజ్యసమితిలో అఫ్గానిస్తాన్‌కు అందే మానవతా సాయం కూడా నిలిచిపోగలదని ఆయన బీబీసీతో తెలిపారు.

అయితే తాలిబాన్‌ ఆదేశాల అర్థం ఏంటో ఇప్పటికీ అస్పష్టంగా ఉందని అలక్‌బరోవ్ అన్నారు.

కాగా, ఏజెన్సీ తన ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను కొనసాగించాలని తాలిబాన్ ఆరోగ్య మంత్రి ఐక్యరాజ్యసమితికి చెప్పారని ఆయన తెలిపారు. మహిళలు వారి సేవలను కొనసాగించవచ్చునని స్పష్టం చేశారు.

అంతేకాకుండా అఫ్గాన్‌లో విపత్తు నిర్వహణ, అత్యవసర పరిస్థితుల కార్యకలాపాలను కొనసాగించాలని ఇతర మంత్రిత్వ శాఖలు కూడా ఐక్యరాజ్యసమితిని సంప్రదించాయని ఆయన తెలిపారు.

ఎన్‌ఆర్‌సీకి చెందిన జాన్ ఎగెలాండ్ మాట్లాడుతూ...సహాయక బృందంలోని 1,400 మంది కార్యకర్తల్లో దాదాపు 500 మంది మహిళలు ఉన్నారన్నారు.

మహిళా సిబ్బంది అన్ని సంప్రదాయ విలువలు, డ్రెస్ కోడ్, నడవడికతో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

రానున్న రోజుల్లో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నామని, ఎన్జీవోల పనిని అడ్డుకుంటే లక్షలాది మంది నష్టపోతారని జాన్ హెచ్చరించారు.

ఆర్థిక సంక్షోభం పరిస్థితులుండగానే ఈ నిషేధం విధించడంతో ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశముందని ఎన్జీవోలు ఆందోళన వ్యక్తం చేశాయి.

అఫ్గాన్ ఎన్జీవో మహిళలలో చాలామంది వారి ఇంటిని పోషించే ముఖ్యమైన వ్యక్తులని, ఈ నిషేధంపై వారు ఆందోళన వ్యక్తం చేశారని జాన్ బీబీసీకి చెప్పారు.

"నేను ఉద్యోగానికి వెళ్లలేకపోతే, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు?" అని ఒకరు ప్రశ్నించారని ఆయన తెలిపారు. మరొకరు ఈ వార్తను "షాకింగ్"గా వారు అభివర్ణించినట్లు చెప్పారు.

అఫ్గాన్ మహిళ
ఫొటో క్యాప్షన్, అఫ్గాన్ మహిళ

అంతర్జాతీయంగానూ వ్యతిరేకత

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పందిస్తూ.. లక్షలాది మందికి కీలకమైన, ప్రాణాలను రక్షించే సహాయానికి ఇది అంతరాయం కలిగిస్తుందని హెచ్చరించారు.

గతేడాది దేశంలో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబాన్‌లు మహిళల హక్కులను క్రమంగా పరిమితం చేస్తూ వస్తున్నారు.

1990‌లలో చూసిన పాలన కంటే ఇది బాగుంటుందని వాగ్దానం చేసినప్పటికీ అలా జరగడం లేదు. విద్యార్థుల వద్ద తాలిబాన్ బలగాలు పహారా కాస్తున్నాయి.

యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశంపై, ఎన్జీవోలలో మహిళా కార్యకర్తలపైనా నిషేధాలు విధించారు. చాలా ప్రావిన్సులలో బాలికల సెకండరీ పాఠశాలలు మూసివేశారు.

ఇతర బహిరంగ ప్రదేశాలతో పాటు పార్కులు, జిమ్‌లలోకి కూడా మహిళలు ప్రవేశించకుండా నిషేధించారు.

వీడియో క్యాప్షన్, కన్న కొడుకుల కన్నా ప్రజలే ముఖ్యమంటున్న బో క్యార్ యైన్...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)