స్మార్ట్‌ఫోన్ తయారీలో చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్ వేయగలదా?

ఫొటో సోర్స్, DEEPA ASWANI
- రచయిత, ప్రీతి గుప్తా, బెన్ మోరిస్
- హోదా, బీబీసీ న్యూస్
ముంబయిలో ఓ మార్కెటింగ్ సంస్థ కోసం పనిచేస్తున్న దీప అశ్వినికి ఫోన్ కొనడం అన్నది ఒక పెద్ద తతంగం లాంటిది.
‘‘ఏ ఫోన్ కొనాలి అనే విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. మరీ ఎక్కువ డబ్బులు కూడా పెట్టను’’అని ఆమె చెప్పారు.
దాదాపు రెండు నెలలు చాలా మందితో మాట్లాడిన తర్వాత, వన్‌ప్లస్ 10ఆర్ కొనాలని ఆమె నిర్ణయించుకున్నారు. దీని కోసం ఆమె రూ. 40,000 ఖర్చుపెట్టారు. నిజానికి భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇది కాస్త ఎక్కువనే చెప్పాలి.
‘‘ఫోన్ కొనడం వల్ల నా జేబుకు చిల్లు పడకూడదు.అదే సమయంలో అన్ని మంచి ఫీచర్లూ నాకు కావాలి. నా కొత్త ఫోన్ విషయంలో చాలా సంతృప్తిగా అనిపిస్తోంది’’అని దీప చెప్పారు.
భారత్‌లో విక్రయించే చాలా ఫోన్లలానే ఆ వన్‌ఫ్లస్ ఫోన్ కూడా చైనాలో తయారుచేసినదే. క్రిసిల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 2022లో భారత్‌లో విక్రయించిన 60 శాతం ఫోన్లు చైనా నుంచి వచ్చినవే.
అయితే, 2021లో ఈ మొత్తం 64 శాతంగా ఉండేది. అంటే ఇప్పుడు కొన్ని భారత ఫోన్ తయారీ సంస్థలు పుంజుకున్నాయని చెప్పుకోవాలి.

ఫొటో సోర్స్, MICROMAX
‘‘చైనాతో పోటీ కష్టం’’
చైనా ఫోన్ తయారీ సంస్థలకు సవాల్ విసురుతున్న కంపెనీల్లో మైక్రోమ్యాక్స్ ఇన్‌ఫర్మేటిక్స్ కూడా ఒకటి. 2008లో మొబైల్ తయారీ వ్యాపారంలోకి సంస్థ అడుగుపెట్టింది.
కేవలం రెండేళ్లలోనే భారత్‌లో చౌక స్మార్ట్ ఫోన్లు తయారుచేసే ప్రధాన సంస్థల్లో ఒకటిగా మైక్రోమ్యాక్స్ మారింది.
మార్కెట్‌లో ప్రభావం చూపిస్తున్నప్పటికీ, చైనా సంస్థలతో పోటీ పడటం చాలా కష్టమని మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాజేశ్ అగర్వాల్ చెప్పారు.
‘‘మా సంస్థ కొత్త ఫోన్లు తయారుచేసినప్పుడు, ఇవి పది లక్షల మందికి చేరువ కావాలని మేం ఆశిస్తాం. కానీ, చైనా సంస్థలు కోటి మందికి తమ ఫోన్లను విక్రయించగలవు. దీని వల్ల వారు చాలా మెరుగ్గా, చౌక ధరకే ఫోన్లను తయారుచేయగలరు’’అని ఆయన చెప్పారు.
‘‘తయారీలో వారితో పోటీపడటం చాలా కష్టం’’అని ఆయన చెప్పారు.
అదే సమయంలో, చైనాలో ఫోన్ల తయారీకి అవసరమైన అన్ని విడిభాగాలు వారికి స్థానికంగా దొరుకుతాయి.
భారత్‌లో చార్జర్లు, కేబుళ్లు, బ్యాటరీలను స్థానికంగా తయారుచేసినప్పటికీ, స్క్రీన్లు, కంప్యూటర్ చిప్స్ లాంటి టెక్నాలజీతో ముడిపడిన భాగాలను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, MICROMAX
‘‘తయారీ విషయానికి వస్తే, భారత్‌లో ఇప్పుడే అన్ని మొదలవుతున్నాయని చెప్పుకోవాలి. మనకు కావాల్సినవన్నీ మన దేశంలోనే తయారు చేసుకునేలా పరిస్థితులు ఉండాలి’’ అని అగర్వాల్ చెప్పారు.
‘‘నెమ్మదిగా మన దేశంలో అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయడం దగ్గర నుంచి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వెళ్లాలి. ఫోన్లు మాత్రమే కాదు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా మనం పూర్తిగా ఇక్కడే తయారుచేసుకోవాలి’’అని ఆయన చెప్పారు.
భారత్‌లో తయారీ వేగం పుంజుకుంటుందని ఇక్కడి ప్రభుత్వం కూడా ఆశిస్తోంది.
ఏప్రిల్ 2021లో.. ప్రొడక్షన్ లింకెడ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ)ను టెలికాం, నెట్‌వర్కింగ్ ఎక్విప్‌మెంట్ విభాగాలకు కూడా వర్తించేలా కేంద్రం మార్పులు తీసుకొచ్చింది.
భారత్‌లో తయారీ ప్రక్రియలకు ఊతమిచ్చే దిశగా ఏళ్ల నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల్లో ఇది తాజా పరిణామం.
భారత్‌లో తయారుచేసే మొబైల్ విడిభాగాలకు ఈ పథకం కింద సబ్సిడీలు ఇస్తారు. ఫలితంగా ఉత్పత్తిని పెంచొచ్చని, మార్కెట్‌లో ఆరోగ్యకర పోటీ కూడా ఉంటుందని సంస్థ భావిస్తోంది.
సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) డేటా ప్రకారం, భారత్‌లో తయారుచేస్తున్న ఫోన్లలో కేవలం 15 నుంచి 20 శాతం విడిభాగాలను మాత్రమే ఇక్కడ తయారుచేస్తున్నారు.
పీఎల్ఐతో ఈ మొత్తాన్ని 35 నుంచి 40 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఫొటో సోర్స్, MICROMAX
‘‘ఎలక్ట్రానిక్స్ తయారీలో పీఎల్ఐను విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవాలి’’ అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్‌రూ చెప్పారు.
‘‘ప్రపంచంలో మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో భారత్ కూడా ఒకటి. నేడు మొబైల్స్ తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది’’ అని ఆయన చెప్పారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో మొబైల్స్ మొదటి స్థానంలో ఉన్నట్లు ఐసీఈఏ చెబుతోంది. వచ్చే ఏడాది మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో ఈ వాటా 50 శాతం వరకూ ఉండొచ్చని సంస్థ వివరిస్తోంది.
‘‘మొబైల్ తయారీలో భారత్ ఒక గ్లోబల్ హబ్‌గా మారుతుంది’’అని ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ చైర్మన్ హరి ఓం రాయ్ చెప్పారు.
‘‘చైనా నేడు అభివృద్ధి చెందిన దేశంగా మారుతోంది. ఫలితంగా అక్కడ కార్మికుల వేతనాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడి కంటే భారత్‌లో వ్యాపారానికి అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి’’అని ఆయన వివరించారు.
చైనాపై ఆందోళన
ప్రపంచంలోని చాలా దేశాలు చైనా ఉత్పత్తులపై ఆధారపడటంపై చాలా ఆందోళనతో ఉన్నట్లు హరి ఓం రాయ్ వివరించారు.
షెంగ్‌ఝౌలోని ఇటీవల యాపిల్ ఫోన్ల తయారీ సంస్థ పరిసరాల్లో నిరసనలు ఈ ఆందోళనలను మరింత పెంచాయి.
ఒకవేళ సంస్థలు తమ తయారీ కేంద్రాలను వేరే ప్రాంతాలకు తరలించాలని భావిస్తే, వారికి భారత్ గమ్యస్థానం అవుతుందని ఓం రాయ్ చెప్పారు.
‘’18 శాతం ప్రపంచ జనాభాకు భారత్ నిలయం. అయితే, ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 3.1 శాతం మాత్రమే. ప్రస్తుతం మన జీడీపీ పెరుగుతోంది, అంటే ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్ మారుతోంది. ఇక్కడ వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాయి’’అని ఆయన చెప్పారు.
అయితే, పారిశ్రామిక విధానం ఎలా ఉన్నా తనకేమీ అభ్యంతరం లేదని దీప అంటున్నారు. ‘‘నా ఫోన్ ఎక్కడ తయారు చేశారో నాకు అనవసరం. ఒక వినియోగదారుడిగా ఫీచర్లు, ధర మాత్రమే నాకు ముఖ్యం. అధునాతన ఫీచర్లతో తక్కువ ధరకు వచ్చే ఫోన్ల కోసం నాలాంటి వారు ఎదురుచూస్తారు’’అని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
- భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?
- గౌతమ్ అదానీ: మోదీతో స్నేహాన్ని ఒప్పుకున్నారా, సోషల్ మీడియాలో చర్చ ఏంటి?
- మనుమరాలిని తొమ్మిది నెలలు కడుపులో మోసి జన్మనిచ్చిన 61 ఏళ్ల బామ్మ
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
- మొబైల్ ఫోన్: సిగ్నల్ అందకపోతే నేరుగా శాటిలైట్‌తో కనెక్షన్, ఇది ఎవరికి అందుబాటులో ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















