యుక్రెయిన్: వంట గదిలోకి దూసుకొచ్చిన మిసైల్, ఇంటి యజమాని మృతి

యుక్రెయిన్‌పై రష్యా దాడి

ఫొటో సోర్స్, YAN DOBRONOSOV

    • రచయిత, బెన్ టోబియాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రష్యా మిస్సైల్ దాడితో యుక్రెయిన్‌లో ఒక ఫ్యామిలీ కిచెన్ గోడంతా పూర్తిగా ధ్వంసమైపోయింది. వంటగది లోపల దృశ్యాలన్ని బయటికి కనిపిస్తున్నాయి.

ఈ ఫోటోలను చూసి సోషల్ మీడియా ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఆ అపార్ట్‌మెంట్ ప్రముఖ బాక్సింగ్ కోచ్ మిఖాయిలో కొరెనోవ్స్కీకి చెందినది. శనివారం జరిగిన ఈ దాడిలో ఆయన చనిపోయారు. మిఖాయిలో భార్య, పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు.

మిఖాయిలో ఇటీవల తన కుటుంబంతో కలిసి ఇదే ఫ్లాట్‌లో జరుపుకున్న పుట్టిన రోజు వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

యుక్రెయిన్‌లోని నిప్రోలో జరిగిన రష్యా దాడిలో 40 మంది చనిపోయారు. వారిలో ముగ్గురు పిల్లలున్నారు.

రష్యన్ మిసైల్ దాడికి వంటగది పూర్తిగా ధ్వంసమైంది.

యుక్రెయిన్‌పై రష్యా దాడి

ఫొటో సోర్స్, YAN DOBRONOSOV

ఈ దాడి తర్వాత వంటగది బయట గోడంతా పూర్తిగా ధ్వంసమైపోయినప్పటికీ ఆ కప్‌బోర్డులు మాత్రం చెక్కు చెదరలేదు.

టేబుల్‌పై ఆపిల్ అలానే ఉన్నాయి. సింక్ పక్కన కడగడానికి పెట్టిన గిన్నెలు, హుక్స్‌కి వరుసగా తగిలించి ఉన్న గ్లోవ్స్ కనిపిస్తున్నాయి.

‘‘ఇక్కడ కుటుంబ సభ్యులు వంట చేసుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, సెలవుల్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఆడుకుంటారు, పోట్లాడుకుంటారు’’ అని కివ్ ఎంపీ జోయ యరోష్ తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

ఆ భవంతిని ధ్వంసం చేయడం తమ దేశ తలరాతని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఇవి యుక్రెయిన్ శరీరాలకు తగులుతున్న గాయాలు. మా ఇళ్లకు తగులుతున్న దెబ్బలు’’ అని ఆమె అన్నారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడి

ఫొటో సోర్స్, UKRAINIAN ARMED FORCES/TELEGRAM

సోషల్ మీడియాలో చాలా మంది ప్రజలు ఈ ఫోటోలో ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా చర్చిస్తున్నారు.

ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పటికీ ఈ ఫ్యామిలీ తమ జీవితాన్ని వీలైనంత ఉన్నతంగా జీవిస్తుందని సోషల్ మీడియా యూజర్లన్నారు.

‘‘ఈ కిచెన్‌ను నేను చూసినప్పుడు, నేను పెరిగిన ఫ్లాట్, నా తాతముత్తాతలు నివసించిన ఇల్లు, నా కజిన్లున్న ఫ్లాట్ గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే, మాకు కూడా ఇలానే కిచెన్, టేబుల్, దానికింద రెండు స్టూల్స్ ఉండేవి’’ అని యుక్రెనియన్ కు చెందిన అలినా ట్విటర్‌లో పోస్టు చేశారు.

మిస్సైల్ దాడికి ముందు, పిల్లల పుట్టిన రోజు వేడుకతో ఆ కుటుంబమంతా చాలా సంతోషంగా ఆ కిచెన్‌లో గడిపింది.

యుక్రెయిన్ సాయుధ దళాలు రీపోస్టు చేసిన, ఆన్‌లైన్‌లో పబ్లిష్ అయిన వీడియోలో, ఒక పాప తన ముందున్న పెద్ద కేక్‌ను నవ్వుతూ చూస్తూ, దానిపై అమర్చిన క్యాండిల్స్‌ను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది.

ఆ వీడియోలో అవే పసుపు రంగు కప్‌బోర్డు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోడకు టెలివిజన్, ఓవెన్ గ్లోవ్స్ కూడా ఉన్నాయి.

ఈ వీడియోలో కనిపిస్తున్న మిఖాయిలో కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తుంది. కానీ బాక్సింగ్ కోచ్ మాత్రం ప్రాణాలతో లేనట్లు రిపోర్టులు వచ్చాయి.

అయితే, ఈ వీడియోను ఎప్పుడు చిత్రీకరించారో తెలియదు. కానీ, అకస్మాత్తుగా జరిపే యుద్ధం వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో ఈ వీడియో గుర్తుకు చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)