యుక్రెయిన్: యుద్ధ క్షేత్రంలో కొడుకు మృతదేహాన్ని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?

- రచయిత, అనస్టసియా గ్రిబనోవా, ఇవాన్ ఎర్మకోవ్, క్లెయిరీ ప్రెస్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
బురదతో నిండిన పొలంలో లుడ్మిలా కుప్రియచుక్ అలానే ఏడుస్తూ కనిపించారు.
అక్కడే తన కుమారుడి మృతదేహంపై తన మాజీ భర్త వస్త్రాన్ని కప్పుతూ కనిపించారు.
‘‘నేను ఆ వార్తవిని మూర్ఛపోయాను’’ అని ఆమె చెప్పారు. ‘‘మనం ఇప్పుడు కారు వెనకి భాగంలో అతడి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వెళ్లాలా?’’అని తన మాజీ భర్తను ఆమె అడిగారు.
‘‘వెంటనే నా మాజీ భర్త గట్టిగా అరిచారు. కాస్త ప్రశాంతంగా ఉంటావా? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని ఆయన అన్నారు’’ అని ఆమె తెలిపారు.
తమ కుమారుడి మృతదేహం కోసం ఈ జంట పాత మెర్సిడీస్ కారులో వందల కిలోమీటర్ల దూరం వచ్చారు.
యుక్రెయిన్ సైనికుడిగా పనిచేసిన తమ కుమారుడు మృతదేహం కోసం వీరు రష్యా ఆధీనంలోని ప్రాంతానికి వచ్చారు. మోర్టార్ షెల్స్‌తో పేలుళ్లు జరిపిన ప్రాంతంలోని మృతదేహాలను పూడ్చిపెట్టిన చోట వీరు వెతికారు. అక్కడ వారికేమీ కనిపించలేదు.
దీంతో కారులో మరికొంత దూరం వచ్చారు. అక్కడే అగ్నికి ఆహుతైన కొన్ని మిలిటరీ వాహనాలు కనిపించాయి. పక్కనే కొన్ని మృతదేహాలు కూడా నేలపై పడి ఉన్నాయి.
‘‘ఆ మృతదేహాల్లో ఎవరికైనా చేతిపై పచ్చబొట్టు ఉందేమో చూసేందుకు వాటి యూనిఫామ్‌లను నా మాజీ భర్త తొలగించి చూశారు’’అని లుడ్మిలా చెప్పారు. ‘‘అక్కడే ఒక మృతదేహంపై నెవర్ గివప్ అనే టాటూ కనిపించింది’’అని ఆమె వివరించారు.
‘‘దాన్ని చూసే మేం మృతదేహాన్ని గుర్తుపట్టాం’’అని 40 ఏళ్ల లుడ్మిలా గద్గద స్వరంతో చెప్పారు.
‘‘రోజుల తరబడి ఆ మృతదేహాలను అలానే రోడ్డుపై వదిలేశారు. అక్కడ ఎవరూ లేరు. వాటికి కనీసం నిప్పు కూడా పెట్టలేదు. కొన్ని జంతువులు కూడా మృతదేహాలను పీక్కుతిన్నాయి’’అని ఆమె చెప్పారు.
ఆమె కూమారుడు మాక్సిమ్ వయసు 20 ఏళ్లు మాత్రమే. 2022 ఫిబ్రవరి 25న రష్యా దాడి మొదలైన రెండో రోజు అతడు మరణించాడు.

ప్రమాదకరంగా...
రష్యా అధీనంలోని టొమరినే గ్రామంలోకి ఈ జంట వస్తున్నప్పుడు కూడా రష్యా సైనికులు అడ్డుపడ్డారు. వీరు ఖేర్సన్‌కు 90 నిమిషాల దూరంలోని రష్యా ఆధీనంలోని ప్రాంతానికి కారులో వచ్చారు.
ఈ ప్రాంతంలో రష్యా ఇంకా పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. మార్చి 2022లో ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా గందరగోళంగా అనిపించిందని ఆ జంట వివరించింది. వారు వచ్చేటప్పుడు ఊరి శివార్లలో ఒక చెక్‌పోస్టు కనిపించింది.
‘‘నేను కారు నుంచి బయటకు దిగాను. నావైపు తుపాకీ గురి పెట్టిన వ్యక్తి దగ్గరకు నేరుగా వెళ్లాను’’అని లుడ్మిలా గుర్తుచేసుకున్నారు.
‘‘నేనేమీ భయపడలేదు. కానీ, వారిని చూస్తే అసహ్యం అనిపించింది’’అని ఆమె చెప్పారు. మొత్తానికి ఆ గ్రామం లోపలకు వెళ్లేలా రష్యా సైనికులను ఆమె ఒప్పించగలిగారు.
తన కొడుకు మృతదేహం ఫోటోను వారికి ఆమె చూపించారు. ఆయన చనిపోయినట్లుగా చెప్పిన ప్రాంతానికి వెళ్లేందుకు వారి నుంచి ఆమె అనుమతి తీసుకున్నారు.
ఆ తర్వాత కారు వెనుక భాగంలో మృతదేహాన్ని పెట్టుకొని 12 గంటలు ప్రయాణించి సెంట్రల్ యుక్రెయిన్‌లోని విన్నిట్సియాలో తమ ఇంటికి వీరు చేరుకున్నారు.

ఇప్పటివరకు ఈ యుద్ధంలో ఎంతమంది యుక్రెయిన్ సైనికులు మరణించారు? లేదా కనిపించకుండాపోయారు? లాంటి ప్రశ్నలకు సైన్యం స్పందించడం లేదు.
పశ్చిమ యుక్రెయిన్‌లోని లివీవ్‌లో ఎయిర్ అసాల్ట్ విభాగంలో సైనికుడిగా లుడ్మిలా కుమారుడు మాక్సిమ్ పనిచేసేవారు. రష్యా సేనలను అడ్డుకునేందుకు మాక్సిమ్ పనిచేస్తున్న విభాగాన్ని దక్షిణ యుక్రెయిన్‌కు పంపించారు.
మాక్సిమ్ చనిపోయాడని అతడి ప్రియురాలు ఫోన్‌చేసి చెప్పినప్పుడు లుడ్మిలా షాక్‌కు గురయ్యారు.
ఒక పొలంలో మాక్సిమ్ మృతదేహం పడినట్లుగా కనిపిస్తున్న ఒక ఫోటోను అతడితో పనిచేసిన ఒకరి దగ్గర ఉంది. ఆ మృతదేహం ఇప్పటికీ అక్కడే ఉండొచ్చని లుడ్మిలాకు ఆయనే చెప్పారు. భారీగా కాల్పులు జరిపినప్పుడు మాక్సిమ్ అక్కడే ఉండాల్సి వచ్చిందని, అతడు ఎలా చనిపోయాడో కచ్చితంగా చెప్పలేనని ఆయన వివరించారు.
మాక్సిమ్ మిలిటరీ యూనిట్‌కు లుడ్మిలా ఫోన్ చేశారు. అయితే, సమాచారం సేకరించేందుకు కాస్త సమయం ఇవ్వాలని వారు కోరారు.
‘‘గడ్డకట్టే చలిలో నా కొడుకు మృతదేహం అలానే ఉండిపోయిందని రోజూ రాత్రి తలచుకొని ఏడ్చేదాన్ని. అసలు అతడి మృతదేహంపై ఏ వస్త్రమూ కప్పలేదు’’అని ఆమె తెలిపారు.
దీంతో ఎలాగైనా మాక్సిమ్ మృతదేహాన్ని వెనక్కి తీసుకురావాలని లుడ్మిలా, ఆమె మాజీ భర్త అనటోలియ్ బయల్దేరారు.
వీరి దగ్గర కేవలం తమ కుమారుడి మృతదేహం ఫోటో, అతడు చనిపోయిన గ్రామం పేరు, ఆ గ్రామంలో పనిచేస్తున్న ఒక వాలంటీర్ ఫోన్ నంబరు మాత్రమే ఉన్నాయి.
చాలా ప్రయత్నాలు..
సైనికుల హక్కుల కోసం యుక్రెయిన్ అధ్యక్షుడి సలహాదరుడిగా పనిచేస్తున్న అలియోనా వెర్బిట్స్‌కా మాట్లాడుతూ.. మొత్తంగా 15,000 మంది యుక్రెయిన్ సైనికులు, పౌరులు కనిపించకుండా పోయినట్లు చెప్పారు. వారు చనిపోయు ఉండొచ్చు. లేదా రష్యా సైనికులకు పట్టబడి ఉండొచ్చు.
మరోవైపు దాదాపు 600 మంది రష్యా సైనికులు కూడా యుక్రెయిన్‌లో కనిపించకుండా పోయినట్లు బీబీసీ రష్యా డేటా చెబుతోంది.
తమ ఆప్తులను కనిపెట్టేందుకు తమ ముందున్న అన్ని మార్గాల్లోనూ ప్రజలు అన్వేషిస్తున్నారు. ఇలా కనిపించకుండాపోయిన వారిని కనిపెట్టేందుకు ఒక ప్రముఖ టీవీ యాంకర్ ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా మొదలుపెట్టారు.
యుద్ధ క్షేత్రంలో పడివున్న మృతదేహాలను వారి సొంత ప్రాంతాలకు పంపేందుకు ప్రత్యేక వ్యాన్లను కొన్ని యుక్రెయిన్ బృందాలు ఏర్పాటుచేస్తున్నాయి.
దీని కోసం ఫేస్‌బుక్, టెలిగ్రామ్‌లలో కొన్ని గ్రూపులు కూడా పనిచేస్తున్నాయి. కనిపించకుండాపోయిన వారి కోసం వీటిలో తరచూ పోస్టులు చేస్తున్నారు.

వినిట్సియాకు చెందిన నటాలియా కర్పోవా కూడా ఇలానే గత ఏప్రిల్‌లో రష్యన్ టెలిగ్రామ్ చానెల్‌లో తమ కుమారుడు రోమన్ మృతదేహాన్ని గుర్తుపెట్టారు.
రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో మృతదేహాల ఫోటోలను ఇలాంటి గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. మృతదేహాలను వెతికేందుకు ఇలాంటి గ్రూపులపైనే చాలా మంది ఆధారపడాల్సి వస్తోంది.
30 ఏళ్ల రోమన్‌ను ఒక స్నైపర్ కాల్చి చంపినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.
రోమన్ చనిపోయాడనే వార్తను అతడి స్నేహితులు ఫోన్ చేసి నటాలియాకు చెప్పారు. దీంతో అతడి మృతదేహం ఎక్కడుందోనని నటాలియా కూడా వెతకడం మొదలుపెట్టారు.
ఆ ఫోటో కనిపించిన వెంటనే, ఆమె అతడి ఎయిర్ ఫోర్స్ విభాగానికి ఫోన్ చేశారు.
‘‘అది ఫేక్ ఫోటో అని కొట్టిపారేశారు. రష్యా మీడియాపై మీరు ఆధారపడకూడదని అన్నారు’’అని ఆమె చెప్పారు.
‘‘మీ అబ్బాయి చనిపోయినట్లు మాకు ఎలాంటి సమాచారం అందలేదు’’అని వారు చెప్పారని ఆమె తెలిపారు.

సైన్యం స్పందించడం లేదు..
మార్షల్ లా ప్రకారం.. కనిపించకుండా పోయిన సైనికులపై సైన్యం స్పందించదు. కాబట్టి అటు ప్రభుత్వమో లేదా వాలంటీర్లో సాయం చేయాలని బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
59 ఏళ్ల నటాలియా వైద్యురాలు. అయితే, తన కొడుకు మృతదేహాన్ని వెతికేందుకు ఆమె తన వృత్తిని పక్కనపెట్టారు. యుద్ధ క్షేత్రంలో రోమన్ పనిచేయడానికి వెళ్లాడని ఆమెకు తెలుసు. కానీ, సరిగ్గా ఎక్కడికి వెళ్లాడో ఆమె దగ్గర సమాచారం లేదు.
అయితే, టెలిగ్రామ్‌లో పోస్టుచేసిన ఫోటోలో అతడి ఐడీ, అతడి మృతదేహమున్న తూర్పు యుక్రెయిన్‌లోని ఒక గ్రామం పేరు కూడా పెట్టారు. ఆ ప్రాంతంలో మరో సైనిక విభాగం సాయంతో డ్రోన్ ఎగువేయించి మరింత సమాచారం సేకరించారు.
మొత్తంగా ఇజుయుమ్ నగరం శివార్లలోని డోవెంకే గ్రామంలో అతడి మృతదేహమున్నట్లు వీరు తెలుసుకున్నారు. అయితే, రష్యా ఆధీనంలోని ఈ ప్రాంతంలో భీకర పోరాటం జరిగేది. మొత్తానికి సెప్టెంబరు 2022లో ఈ ప్రాంతంపై మళ్లీ యుక్రెయిన్ పట్టు సంపాదించింది.
‘‘అప్పుడే అసలు సమయం వృథా చేయకుండా అక్కడికి వెళ్లాలి అని భావించాను’’అని నటాలియా చెప్పారు.
‘‘ఒకవేళ చలికాలం మొదలైతే, మంచు కురుస్తుంది. అప్పుడు మృతదేహాన్ని గుర్తుపట్టడం మరింత కష్టం అవుతుంది’’అని ఆమె తెలిపారు.
స్థానిక రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల సాయంతో ఆమె సెర్చ్ టీమ్‌ను ఏర్పాటుచేసుకొని అక్కడికి వెళ్లారు. దట్టమైన చెట్లు, అన్నివైపులా ల్యాండ్‌మైన్లు ఉన్నచోట రోమన్ మృతదేహం వారికి కనిపించింది. ఒక మిలిటరీ సునకం ఆ మృతదేహాన్ని గుర్తుపట్టింది.
‘‘ఆ మృతదేహాన్ని చూసిన వెంటనే నా కాలి కింద నేల కంపించినట్లు అయింది’’అని ఏడుస్తూ నటాలియా చెప్పారు.
‘‘అసలు కొడుకు మృతదేహాన్ని ఇంటికి కూడా తీసుకెళ్లలేని నిస్సహాయ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కూడా కష్టం’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తానికి వినిట్సియాలోని తన సొంత ఊరికి ఆ మృతదేహాన్ని ఆమె తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?
- గౌతమ్ అదానీ: మోదీతో స్నేహాన్ని ఒప్పుకున్నారా, సోషల్ మీడియాలో చర్చ ఏంటి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
- మొబైల్ ఫోన్: సిగ్నల్ అందకపోతే నేరుగా శాటిలైట్‌తో కనెక్షన్, ఇది ఎవరికి అందుబాటులో ఉంటుంది?
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















