సైనికుల వీర్యాన్ని ఉచితంగా ఫ్రీజర్లో భద్రపరిచేందుకు రష్యా ఎందుకు అనుమతిస్తోంది?

ఫొటో సోర్స్, EPA/SERGEY FADEICHEV/KREMLIN/POOL
ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై మొదలైన రష్యా దాడికి మరో రెండు నెలల్లో ఏడాది పూర్తికాబోతోంది.
ఈ యుద్ధంలో దాదాపు లక్ష మంది రష్యా సైనికులు, మరో లక్ష మంది యుక్రెయిన్ సైనికులు మరణించడం లేదా క్షతగాత్రులు అయినట్లు అమెరికా సైన్యం అంచనా వేస్తోంది.
మరోవైపు దాదాపు 40,000 మంది పౌరులు కూడా ఈ యుద్ధంలో మరణించినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.
యుద్ధం వల్ల 78 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. అయితే, వీరిలో యుక్రెయిన్‌లో వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు లేవు. మరోవైపు ఇప్పటికీ యుద్ధం ముగిసే సూచనలేమీ కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
పేట్రియాట్ క్షిపణులు
తాజాగా అధునాతన పేట్రియాక్ క్షిపణులను యుక్రెయిన్‌కు ఇవ్వబోతున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ ప్రసంగించిన తర్వాత, అమెరికా ఈ సాయాన్ని ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చల్లో మరిన్ని ఆయుధాలు ఇవ్వాలని జెలియెన్‌స్కీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆలోచిస్తామని బైడెన్ కూడా చెప్పారు.
యుక్రెయిన్-రష్యా యుద్ధానికి సంబంధించి యుక్రెయిన్‌కు ఇప్పటివరకు 67 బిలియన్ డాలర్లను అమెరికా సాయంగా అందించింది. మరోవైపు వచ్చే ఏడాది కూడా 45 బిలియన్లను కేటాయించే అవకాశముంది.
మరోవైపు రష్యా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల తగిలిన ఎదురుదెబ్బల అనంతరం మరో మూడు లక్షల మంది సైనికులను యుద్ధ క్షేత్రంలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పుతిన్ ప్రభుత్వ నిర్ణయానికి కారణం ఏమిటి?
మరింత మందిని మోహరించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, చాలా మంది దేశాన్ని వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కొంతమంది తమ వీర్యాన్ని ఫ్రీజ్ చేసుకునేందుకు క్లినిక్‌లకు వెళ్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై రష్యాకు చెందిన ప్రముఖ న్యాయవాది ఐగోర్ ట్రునోవ్ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్‌తో మాట్లాడారు. యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లే రష్యా సైనికుల వీర్యాన్ని ఉచితంగా ఫ్రీజ్ చేసేందుకు పుతిన్ ప్రభుత్వం అనుమతిస్తోందని ఆయన చెప్పారు.
‘‘సైనికుల వీర్యాన్ని ఫ్రీజ్ చేసేందుకు క్రయోబ్యాంక్ ఏర్పాటుచేయాలని, నిర్బంధ వైద్య బీమా పథకంలోనూ మార్పులు చేయాలని మేం పెట్టిన ప్రతిపాదనకు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది’’అని ఆయన వివరించారు.
తమ వీర్యాన్ని ఇప్పటికే ఫ్రీజ్ చేసుకునేందుకు రష్యా సైనికులు క్లినిక్‌లకు వెళ్తున్నారని టాస్ వెల్లడించింది.
యుక్రెయిన్‌లో స్పెషల్ మిలిటరీ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న సైనికుల భార్యల తరఫున తమ యూనియన్ ఆ ప్రతిపాదనను ఆరోగ్య శాఖకు పంపినట్లు ఐగోర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
అయితే, ఐగోర్ వ్యాఖ్యలపై రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు. ఆ ప్రతిపాదనను అమలు చేసే దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని మంత్రిత్వ శాఖతో మరోసారి చర్చలు జరుపుతామని బీబీసీ ప్రతినిధి పాల్ కిర్బీతో ఐగోర్ చెప్పారు.
సైనికుల ఆందోళన దేనికి?
‘‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’’లో పాల్గొనేందుకు వెళ్తున్న సైనికులు తమ వీర్యాన్ని ఫ్రీజ్ చేసుకునేందుకు ఆర్థిక సాయానికి వీలుకల్పించేలా కేంద్ర బడ్జెట్‌లోనూ ప్రతిపాదనలు తీసుకురాబోతున్నట్లు టాస్ వార్తా సంస్థతో ఐగోర్ చెప్పారు.
మరోవైపు రష్యాలో రెండో అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఐవీఎఫ్ క్లినిక్‌లకు వస్తున్న పురుషుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు ఫోంతంకా వెబ్‌సైట్ వెల్లడించింది.
వీర్యాన్ని ఫ్రీజ్ చేయడంతోపాటు దీన్ని తమ భార్యలు ఉపయోగించుకునేలా పత్రాలను కూడా సైనికులు సిద్ధం చేస్తున్నట్లు ఆ వెబ్‌సైట్ వివరించింది.
సైన్యం కోసం పనిచేయడానికి వెళ్తున్న వారితోపాటు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారు కూడా తమ వీర్యాన్ని ఫ్రీజ్ చేయించుకోవడానికి వస్తున్నట్లు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని మెరిన్‌స్కీ హాస్పిటల్‌కు చెందిన ఆండ్రేయి ఇవనోవ్ చెప్పారు.
‘‘ఇదివరకు ఈ క్లినిక్‌లకు రష్యా పురుషులు, లేదా మహిళలు ఎక్కువగా వచ్చేవారు కాదు. అసలు ఇక్కడ ఇలాంటి అవకాశం కూడా ఉందని చాలా మందికి తెలియదు’’అని ఆయన వివరించారు.
యుద్ధంలో సైనికులు చనిపోతే వారి భార్యలు ఆ వీర్యంతో గర్భం దాల్చేందుకు ఈ ఫ్రీజ్ చేసిన వీర్యం ఉపయోగపడుతుంది.

ముగింపు కనిపించడం లేదు
అయితే, ఈ యుద్ధం ముగిసే సూచనలేమీ కనిపించడం లేదు.
ఇటు యుక్రెయిన్, అటు రష్యా... రెండూ పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదని బీబీసీ ప్రతినిధి హ్యూగో బచేగా ఇటీవల విశ్లేషించారు.
‘‘ఈ యుద్ధం అసలు ముందుకు వెళ్లడం లేదు. ఎదుటి సైన్యాన్ని ఇలా ఓడించడం జరగని పని. అందుకే మేం కొత్త ఆయుధాల కోసం ఎదురుచూస్తున్నాం’’అని బీబీసీతో యుక్రెయిన్ సైనిక నిఘా విభాగం అధిపతి కిరిల్ బుడానోవ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















