భారత్‌లో మతపరమైన హింస తగ్గుతోందా, చరిత్ర ఏం చెబుతోంది?

మతపరమైన హింస

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘భారత్‌లో అల్లర్లు, ఘర్షణలు చాలా ఎక్కువ అవుతున్నాయి’’అని రెండేళ్ల క్రితం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆంత్రోపాలజిస్టు థామస్ బ్లామ్ హసన్ నాతో అన్నారు.

‘‘చుట్టుపక్కల జరిగే అల్లర్లు, హింసలో సాధారణ పౌరులు కూడా ఎందుకు భాగం అవుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు’’అని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

‘‘ఇది చాలా తీవ్రమైన సమస్య. ప్రజాస్వామ్యానికి ఇలాంటి ఘటనల వల్ల చాలా ముప్పు వాటిల్లుతుంది’’ అని 2021లో తన పుస్తకం ‘‘ ది లా ఆఫ్ ఫోర్స్: ది వయొలెంట్ హార్ట్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’’లో ప్రొఫెసర్ హసన్ ఆందోళన వ్యక్తంచేశారు.

అయితే, ఈ విషయంలో ఆయనతో అమెరికాకు చెందిన పొలిటికల్ సైంటిస్టులు అమిత్ అహుజా, దేవేశ్ కపూర్ విభేదిస్తున్నారు.

‘‘ఇంటర్నల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా: వయొలెన్స్, ఆర్డర్, అండ్ ద స్టేట్’’ పేరుతో వీరు ఒక పుస్తకం రాశారు. దేశంలో అల్లర్లు, హింస చాలా తగ్గాయని వీరు చెబుతున్నారు.

‘‘భారత్‌లో ఈ శతాబ్దంలోని మొదటి రెండు దశాబ్దాల్లో వీటికి మునుపటి రెండు దశాబ్దాలతో పోల్చినప్పుడు హింస చాలా తగ్గినట్లు తెలుస్తోంది’’అని వారు వివరించారు.

తమ పరిశోధనలో భాగంగా కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అహుజా, జాన్స్ హాప్కిన్క్ ప్రొఫెసర్ కపూర్.. భారత్‌లోని అల్లర్లు, హింసకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను పరిశీలించారు.

కులంతో మొదలుపెట్టి మతపరమైన ఘర్షణల వరకు, సాయుధ పోరాట నుంచి ఉగ్రవాదం వరకు, రాజకీయ హత్యల నుంచి హైజాక్‌ల వరకు అన్ని వివరాలనూ వీరు విశ్లేషించారు.

చాలా అంశాల్లో హింస తగ్గిందని వీరు గుర్తించారు. కొన్ని కేసుల్లో అయితే, 1970ల నుంచి 2000 వరకు పతాకస్థాయిలకు వెళ్లిన హింస నేడు చాలా తగ్గినట్లు వారు వివరించారు.

మతపరమైన హింస

ఫొటో సోర్స్, Getty Images

పరిశోధనలో వెల్లడైన అంశాలు..

  • 2002లో గుజరాత్‌లో మతపరమైన ఘర్షణలు, 1984లో సిక్కుల ఊచకోత, 1983లో అసోంలో.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల హత్యలు.. మొత్తంగా ఈ ఘర్షణల్లో 6,000 మందికిపైగా మరణించారు. అయితే, 2002 తర్వాత ఈ తరహా ఘర్షణలు మళ్లీ చోటుచేసుకోలేదు.
  • 2013లో ముజఫర్‌నగర్‌లో హిందూ-ముస్లింల ఘర్షణలు, 2020లో దిల్లీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ రెండు ఘర్షణల్లో మొత్తంగా 90 మంది చనిపోయారు. ‘‘ఈ రెండు ఘటనలూ ఇంకా ఘర్షణలకు పాల్పడేవారు క్రియాశీలంగానే ఉన్నారని తెలియజేస్తున్నాయి’’అని అహుజా, కపూర్ వివరించారు.
  • గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2020 ప్రకారం, 2001 నుంచి భారత్‌లో ఉగ్రవాద దాడుల్లో 8,749 మంది మరణించారు. అయితే, 2010 తర్వాత ఈ దాడులు చాలా తగ్గాయి. కశ్మీర్‌ను పక్కనపెడితే, 2000 నుంచి 2010 మధ్య ఉగ్రవాద దాడులు 71 నుంచి 21కు (70 శాతం) తగ్గాయి.
  • దేశ విభజన సమయంలో మతపరమైన ఘర్షణల వల్ల దాదాపు పది లక్షల మంది మరణించారు. మరో కోటి మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత 1970 నుంచి 2002 వరకు హిందూ-ముస్లింల మధ్య హింస భయానకంగా మారింది. ఈ సమయంలోనే గుజరాత్‌లోనూ ఘర్షణలు జరిగాయి. అయితే, ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, 2017 నుంచి 2021 మధ్య కాస్త 2,900 చిన్నచిన్న మతపరమైన ఘర్షణల కేసులు నమోదైనట్లు గత డిసెంబరులో పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించింది.
  • 1970 నుంచి 2000వరకు మధ్య కాలాన్ని ఆ ముందు కాలంతో పోల్చినప్పుడు మతపరమైన ఘర్షణలు దాదాపు అయిదు రెట్లు ఎక్కువయ్యాయి. అయితే, 1990ల్లో ఈ కేసులు తగ్గడం మొదలైంది. మళ్లీ 2009 నుంచి 2017 మధ్య స్వల్పంగా కేసులు పెరిగాయి. అయితే, ప్రస్తుతం మాత్రం ముందెన్నడూలేని కనిష్ఠ స్థాయికి కేసులు తగ్గాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
  • మరోవైపు ఎన్నికల్లో హింస, రాజకీయ హత్యలు కూడా చాలావరకు తగ్గాయి. ఇద్దరు ప్రధానులు ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 నుంచి 1991 మధ్య హత్యకు గురయ్యారు. 1989 నుంచి 2019 మధ్య ఎన్నికల్లో హింస, ఆ ఘర్షణల్లో హత్యల కేసులు దాదాపు 70 శాతం తగ్గాయి. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ కూడా ఎక్కువైంది. ఓటర్ల సంఖ్యతోపాటు పోలింగ్ కేంద్రా సంఖ్య కూడా పెరిగింది.
  • గత మూడు దశాబ్దాల్లో వ్యక్తిగత కారణాలతో హత్యలు కూడా బాగా తగ్గాయి. 1990ల్లో ప్రతి లక్షల మందిలో 5.1 కేసులు నమోదుకాగా.. 2018లో ఇది 3.1కి తగ్గింది. ఇక్కడ మహిళల హత్యలతో పోల్చినప్పుడు పురుషుల హత్యలు చాలా తగ్గాయి.
  • 1970 నుంచి 1990ల మధ్య 15 భారతీయ విమానాలు హైజాక్‌కు గురయ్యాయి. చివరిసారిగా 1999లో కాఠ్‌మాండూ నుంచి 180 మందితో దిల్లీ వస్తున్న విమానం హైజాక్‌కు గురైంది. 1999 తర్వాత ఇలాంటి కేసులు వెలుగుచూడలేదు.
  • గత నాలుగు దశాబ్దాల్లో భారత్‌లో నాలుగు ప్రధాన సాయుధ పోరాటాలు చెలరేగాయి. 1980ల నుంచి 1990ల మొదటివరకు పంజాబ్‌లో చోటుచేసుకున్న హింసలో దాదాదాపు 20,000 మంది మరణిచారు. మరోవైపు ఈశాన్య భారత్‌లో; కశ్మీర్‌లో; దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో మావోయిస్టుల హింస కూడా చెలరేగింది. ప్రస్తుతం వామపక్ష తీవ్రవాదం 2018 నుంచి 2020 మధ్య మూడింట రెండొంతులు తగ్గింది. వీటి వల్ల జరిగే పౌరులు, భద్రతా బలగాల మరణాలు కూడా నాలుగింట మూడొంతులు తగ్గాయి. మరోవైపు ఈశాన్య భారత్‌తోపాటు పంజాబ్‌లో హింస కూడా తగ్గింది.
  • భారీ స్థాయిలో కులాల మధ్య ఘర్షణల కేసులు గత కొన్ని దశాబ్దాల్లో చాలావరకు తగ్గాయి. అయితే, ఇప్పటికీ కులాల మధ్య ఘర్షణల కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
మతపరమైన హింస

ఫొటో సోర్స్, Getty Images

భిన్న రకాల హింస తగ్గడానికి భిన్న కారణాలు ఉన్నాయి.

సాయుధ ఘర్షణలు, ఎన్నికల సమయంలో హింస, అల్లర్లు తగ్గడానికి భద్రతా సంస్థలు కట్టుదిట్టంగా ముందుకు వెళ్లడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు నిఘా పెట్టేందుకు ప్రస్తుతం హెలికాప్టర్లు, డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు.

మొబైల్ ఫోన్ టవర్ల ఏర్పాటు, పోలీస్ స్టేషన్లకు పటిష్ఠమైన భద్రత, కొత్త రోడ్ల నిర్మాణం, ఆరోగ్య, విద్యా సదుపాయాలను మెరుగుపరచడంతో కొన్ని ప్రాంతాలకు ఈ హింస నుంచి విముక్తి లభించిందని ప్రొఫెసర్లు అహుజా, కపూర్‌లు చెబుతున్నారు.

‘‘హింస తగ్గడానికి ప్రధాన కారణం ప్రభుత్వ సామర్థ్యం పెరగడమే. ఇక్కడ రాజకీయ ఒప్పందాలతో హింస తగ్గలేదు. ఇలాంటి ఒప్పందాలతో అక్కడి ప్రభావితులు చెప్పే అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు, మళ్లీ హింస చోటుచేసుకోకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది’’అని వారు వివరించారు.

మతపరమైన హింస

ఫొటో సోర్స్, AFP

హైజాక్‌లు గణనీయంగా తగ్గడానికి 9/11 తర్వాత ఎయిర్‌పోర్టులలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయడమే కారణం. మరోవైపు హత్యలు తగ్గడానికి భారత్‌లో కఠినమైన చట్టాలను కారణంగా చెప్పుకోవచ్చు. (కానీ, 2018లో భారత్‌లోని జారీచేసిన 36 లక్షల తుపాకుల లైసెన్సుల్లో 60 శాతం ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లోనే తీసుకున్నారు.)

అయితే, ఇక్కడ మహిళలపై హింస కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఈ విషయంలో అందుబాటులోనున్న సమాచారం విశ్వసనీయమైనది కాదు. ఎందుకంటే చాలా ఘటనలు అసలు వెలుగులోకి కూడా రావు.

భారత్‌లో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు జీవిత భాగస్వామి నుంచి హింసను ఎదుర్కొంటున్నారు. అయితే, కేవలం పదిమందిలో ఒకరు మాత్రమే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు.

మరోవైపు డిజిటల్ వేధింపుల కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. వరకట్న హత్యలు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, మత విద్వేష వ్యాప్తికి మాధ్యమంగా సంగీతాన్ని వాడుకుంటున్న హిందూ రైట్ వింగ్ సమర్థకులు

ప్రొఫెసర్ అహుజా, ప్రొఫెసర్ కపూర్‌లో పరిశోధనలో మరికొన్ని ముఖ్యాంశాలు

నేడు కొత్త రకమైన హింస ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మతాంతర వివాహాలను లేదా పశువు అక్రమ రవాణాలను అడ్డుకునే పేరుతో చోటుచేసుకునే మూకదాడులు లాంటివి పెరుగుతున్నాయి.

‘‘గోరక్షకుల పేరుతో దాడులు, మూకదాడులు లాంటివి దేశం మొత్తం క్యాన్సర్‌లా విస్తరిస్తున్నాయి’’ అని ప్రొఫెసర్ అహుజా, ప్రొఫెసర్ కపూర్ వివరించారు.

అయితే, ఇలాంటి ఘటనలకు సాధారణ ప్రజలు కూడా ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియడంలేదన్న ప్రొఫెసర్ హసన్ వీరు ఏకీభవించారు.

‘‘హింసను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం కావడానికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఇటు ఆన్‌లైన్‌లో, అటు వీధుల్లో కొన్ని మూకలు విజృంభిస్తున్నాయి. ఇవి ఒక్కోసారి పరిస్థితులను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఏమీచేయలని పరిస్థితి వస్తోంది’’అని వారు వివరించారు.

మొత్తంగా హింస తగ్గడమంటే మళ్లీ ఇలా జరగదని తమ ఉద్దేశంకాదని వీరు చెప్పారు. ‘‘ప్రజల మధ్య సామరస్యం దెబ్బతిన్నా, నిరుద్యోగ సమస్య పెరిగినా, రాజకీయ సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగినా మళ్లీ హింస చెలరేగే ముప్పుంటుంది’’ అని వారు తెలిపారు.

‘‘హింస ముప్పును తగ్గించేందుకు భారత్ చేయాల్సింది చాలా ఉంది’’ అని ప్రొఫెసర్ అహుజా, ప్రొఫెసర్ కపూర్ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, నిర్దోషులను పోలీసులు అమానుషంగా హింసించారంటున్న కుటుంబాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)