దిల్లీ జహంగీర్‌పురి హింస: కేజ్రీవాల్ మౌనం ఎందుకు కలకలం రేపుతోంది?

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి, దిల్లీ

భారత రాజధాని దిల్లీలో ఇటీవలి మత హింస, ఆ తర్వాత ముస్లింలపై పోలీసుల అణచివేతపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైఖరి రాజకీయంగా ప్రయోజకరమైనదే కావచ్చు. కానీ, ఇది నైతికమేనా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన కేజ్రీవాల్... రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తానని హామీ ఇస్తూ దశాబ్దం క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు.

2013 నుంచి దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, అందుబాటు ధరల్లో క్లినిక్‌లు, చౌకగా విద్యుత్, నీటి సదుపాయాలు తీసుకొచ్చిన ఘనత ఈ పార్టీదే. ఇటీవలే వారు పంజాబ్‌లో కూడా పాగా వేశారు. ఎన్నికల్లో విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

అన్ని మతాలు సమానం, అందరికీ న్యాయం జరగాలి అనే అంశాలను తమ పార్టీ విశ్వసిస్తుందని కేజ్రీవాల్ తరచుగా చెప్పారు. ఎక్కువగా కుల, మతాలపైనే రాజకీయాలు ఆధారపడే ఈ దేశంలో... విభజన రాజకీయాలను దరిచేయనీయంటూ ఆప్ హామీ ఇచ్చింది. దీంతో దేశంలోని పెద్ద జాతీయ పార్టీలకు సరైన ప్రత్యామ్నాయంగా ఆప్‌ మారుతుందని చాలామంది ఆశించారు.

జహంగీర్‌పురిలో హిందు-ముస్లిం హింస తర్వాత నగరంలోని ముస్లింల గురించి కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడటం లేదంటూ విమర్శకులు గత వారం నుంచి అడుగుతున్నారు.

వీడియో క్యాప్షన్, దిల్లీలోని జహంగీర్‌పురిలో బుల్డోజర్ల హల్ చల్..

ఒక పండుగ సందర్భంగా నిర్వహించిన హిందూ మతపరమైన ఊరేగింపు మసీదును దాటి వెళ్లిన తర్వాత హింస చెలరేగింది. ఈ హింసకు మీరంటే మీరే కారణమంటూ హిందువులు, ముస్లింలు ఒకరినొకరు నిందించుకున్నారు.

దీని తర్వాత బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అక్కడికి పోలీసు బలగాలను పంపింది. ఈ బలగాలు ఎక్కువగా ముస్లింలనే అరెస్టు చేశాయి.

బీజేపీ నియంత్రణలో ఉన్న పౌర అధికారులు, అక్రమ నిర్మాణాలను తొలిగించడానికి బుల్డోజర్లను తీసుకువచ్చారు. ఇవి ఎక్కువగా ముస్లింలకు చెందిన దుకాణాలు, వ్యాపారాలనే లక్ష్యంగా చేసుకున్నాయి.

అక్రమ నిర్మాణాల పేరిట నిర్మాణాలను కూల్చుతున్నప్పటికీ... అల్లర్లలో పాల్గొన్న ముస్లింలకు గుణపాఠం చెప్పేందుకు ఇలా చేశారని భావిస్తున్నారు.

ఈ అణచివేత ఆశ్చర్యం కలిగించలేదు. ఇటీవల కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ తరహా చర్యలు జరిగాయి. దేశంలో కొన్నేళ్లుగా ముస్లిం వ్యతిరేక హింస పెరిగింది.

ఈ ఘటనపై కేజ్రీవాల్ పెద్దగా స్పందించకపోవడంపై వివర్శలు వస్తున్నాయి. హింస జరిగి వారం దాటిపోయినప్పటికీ కేజ్రీవాల్ ఇంకా ఆ ప్రాంతానికి వెళ్లలేదని విమర్శకులు అంటున్నారు.

జహంగీర్‌పురిలో హింసను కేజ్రీవాల్ ఖండించారు. హిందువులు చేస్తోన్న ఊరేగింపు ర్యాలీపై రాళ్లు రువ్విన వారిని ఆయన విమర్శించారు. కానీ, రెచ్చగొట్టే మతరపరమైన నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న హిందూ ఊరేగింపు ర్యాలీలోని సభ్యులను ఆయన ఏమనలేదు. వారు చేసిన నినాదాల్లో కొన్ని... ఇటీవలి సంవత్సరాల్లో ముస్లింలను అపహాస్యం చేయడానికి ఉపయోగించారు.

మత ఘర్షణలు జరిగిన కొన్ని రోజుల తర్వాత కూల్చివేతలు చేపట్టారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మత ఘర్షణలు జరిగిన కొన్ని రోజుల తర్వాత జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు

దీంతో ఆయన స్పందనను కొందరు విమర్శకులు వ్యతిరేకించారు.

''పౌరులందరికీ అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యత. కానీ, తాను కేవలం హిందువులకే ముఖ్యమంత్రి అన్నట్లుగా కేజ్రీవాల్ ప్రవర్తించారు'' అని సీనియర్ జర్నలిస్టు, ఆప్ పార్టీ మాజీ సభ్యుడు అశుతోష్ అన్నారు.

రాళ్లు రువ్విన వారిని విమర్శిస్తూ కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌పై ఆశుతోష్ మాట్లాడారు. ''ఇది ఏమాత్రం బాగాలేదు. ఎందుకంటే, రాళ్లు రువ్వడానికి కారణమైనదాన్ని ఖండించడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఊరేగింపు చేస్తోన్న గుంపు ఆయుధాలతో ఉంది. వారు ముస్లింలను ఎగతాళి చేశారు. అసహ్యకరమైన, తిట్లతో కూడిన నినాదాలు చేశారు'' అని ఆయన వివరించారు.

ఒకవేళ ఆయన అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఖండిస్తే... ఆయన ముస్లింలకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రజలు అనుకుంటారని కేజ్రీవాల్ భావించారు. జనాభాలో 80 శాతం హిందువులే ఉన్న దేశంలో మెజారిటీ ఓటు బ్యాంకు వైపే కేజ్రీవాల్ మొగ్గుతున్నారని అశుతోష్ అభిప్రాయపడ్డారు.

''విలువల కోసం నిలబడే నైతికత కేజ్రీవాల్‌కు లేకపోవడం దురదృష్టకరం'' అని ఆయన అన్నారు.

జహంగీర్‌పురిలో అల్లర్లు, కూల్చివేతలపై కేజ్రీవాల్ ప్రతిస్పందనను, ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఇతర ప్రతిపక్ష పార్టీలు, నాయకులతో పోల్చుతున్నారు.

ముఖ్యంగా కమ్యూనిస్టు నాయకురాలు బృందా కారాఠ్‌కు ఈ విషయంలో ప్రశంసలు దక్కాయి. ఆమె కూల్చివేతలను నిలిపివేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీతో ఘటనా స్థలానికి వెళ్లి కూల్చివేతలను అడ్డుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కేజ్రీవాల్‌తో పాటు ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా విమర్శలు వచ్చిన తర్వాత, ఆప్ ఎట్టకేలకు ఇద్దరు శాసనసభ్యులను ఘటనా స్థలానికి పంపింది. కూల్చివేతలు జరిగిన మరుసటి రోజు వారు అక్కడికి వెళ్లారు.

జహంగీర్‌పురికి వెళ్లిన ఇద్దరు శాసనసభ్యులు పవన్ శర్మ, అబ్దుల్ రహమాన్‌లతో నేను మాట్లాడాను.

మతహింసపై వ్యాఖ్యానించకూడదనే పార్టీ నిర్ణయాన్నిసమర్థిస్తూ వారు... ''ఆప్, మౌనంగా ఏమీ లేదు. కానీ, మేం హిందు-ముస్లిం, గుడి-మసీదు రాజకీయాల్లో తలదూర్చకూడదని అనుకున్నాం'' అని చెప్పారు.

''అన్ని మతాలు సమానం అని మేం నమ్ముతాం. మేం అభివృద్ధి రాజకీయాల్లో ఉంటాం. విద్య, ఆరోగ్యంపై దృష్టి సారిస్తాం. ప్రజలకు చౌకగా నీరు, విద్యుత్‌ను అందిస్తాం'' అని అన్నారు.

కూల్చివేతలను, వాటిని చేపట్టిన తీరును తమ పార్టీ ఖండించిందని పవన్ శర్మ చెప్పారు. ఈ గందరగోళానికి కారణమైన బీజేపీని నిందించినట్లు తెలిపారు.

''అసలు ఈ ఆక్రమణలు ఎలా జరిగాయి? గత 15 ఏళ్లుగా బీజేపీ నియంత్రణలోని పౌర సంఘాలు, ఈ అక్రమ నిర్మాణాలు ముందుకు సాగడానికి ఎలా అనుమతించాయి?'' అని ఆయన ప్రశ్నించారు.

అవసరమైన సమయంలో కేజ్రీవాల్, ఆయన పార్టీ తమను పట్టించుకోలేదని జహంగీర్‌పురి కూల్చివేతల్లో జీవనోపాధిని కోల్పోయిన పురుషులు, మహిళలు ఆరోపించారు. వీరిలో రోజూవారీ కూలీలు, చెత్త ఏరుకునే వారు, స్క్రాప్ డీలర్లు, రోడ్డు పక్కన వ్యాపారాలు నిర్వహించుకునే వారు ఉన్నారు.

''ఏ పార్టీ వారు మా దగ్గరికి రాలేదు. ప్రభుత్వం అందరి కోసం పని చేసయాలి. కానీ, మా కోసం పనిచేసేవారు ఎవరూ లేరని అనిపిస్తోంది'' అని బీబీసీతో ఆ ప్రాంతానికి చెందిన అన్వారీ బీబీ అన్నారు.

''కేజ్రీవాల్ అన్ని బాధ్యతల నుంచి చేతులు దులుపుకున్నారు. ఆయన ప్రతీదానికి కేంద్రాన్ని నిందిస్తున్నారు'' అని సరేజా అన్నారు.

''కేజ్రీవాల్ మా ఓట్లు కావాలనుకున్నారు, వాటిని పొందారు. ఇక ఆయన మమ్మల్ని పట్టించుకోరు.'' అని షేక్ సైఫిజుద్దీన్ వ్యాఖ్యానించారు.

కూల్చివేతలకు వ్యతిరేకంగా జహంగీర్‌పురిలో నిరసలు జరిగాయి

ఫొటో సోర్స్, NUPHOTO

ఫొటో క్యాప్షన్, కూల్చివేతలకు వ్యతిరేకంగా జహంగీర్‌పురిలో నిరసలు జరిగాయి

అల్లర్లు, కూల్చివేతల సమయంలో దిల్లీ ప్రభుత్వం ఒక ప్రేక్షకుడి పాత్ర పోషించిందని సీనియర్ జర్నలిస్టు రాకేశ్ దీక్షిత్ ఆరోపించారు.

''కేజ్రీవాల్, తన మతాన్ని బహిరంగంగా ప్రదర్శించడంలో సిగ్గు పడరు. 2020 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ప్రార్థనలు చేయడానికి ఆయన ఒక హిందు దేవాలయానికి ఊరేగింపుగా వెళ్లారు. మళ్లీ ఆయనే తరచుగా అన్ని మతాల సమానత్వం, గౌరవం గురించి కూడా మాట్లాడతారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆప్ ఇక ఏమాత్రం ఒక భిన్నమైన రాజకీయ పార్టీ కాబోదు అని దీక్షిత్ అన్నారు. ''ఇది ఇతర పార్టీల తరహాలోనే ఇది కూడా రాజకీయ ప్రయోజనాల పరంగా పనిచేస్తోంది. భవిష్యత్‌లో హిందూ జాతీయవాద ఆధిపత్యం ఉంటుందని ఆప్ గ్రహించింది. అందుకే ముస్లింలను ఉపేక్షిస్తోంది'' అని ఆయన వివరించారు.

ముస్లింలు అణచివేతకు గురవుతున్నప్పుడు కేజ్రీవాల్ మౌనంగా ఉండటం ఇదేం తొలిసారి కాదని ఆయన అన్నారు. వివాదాస్పద పౌరసత్వబిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన చేస్తున్నప్పుడు, 2020 దిల్లీ అల్లర్ల సందర్భంగా కూడా ఆయన మౌనంగానే ఉన్నారని చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చిన వారిలో మొదటి వ్యక్తి ఆయనే అని అన్నారు.

''వారు ఎప్పుడూ కూడా తమ అవసరం నెరవేరడంలో ఏది సహాయం చేస్తుందనే దాని ఆధారంగా తమ భావజాలాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు వారి దృష్టి అంతా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ ఎన్నికల మీదే ఉంది. అక్కడ ముస్లిం జనాభా చాలా తక్కువ. అందుకే ఇప్పుడు ముస్లింలకు దూరంగా వెళ్తోన్న ఆప్, ఆయా రాష్ట్రాల్లో హిందువుల ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది'' అని ఆయన విశ్లేషించారు.

వీడియో క్యాప్షన్, ప్రజాస్వామ్యంలో ‘బుల్డోజర్ న్యాయం’ దేనికి సంకేతం?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)