ఈ దేశంలో చికెన్ కన్నా ఉల్లిపాయల ధర మూడు రెట్లు ఎక్కువ... కిలో రూ. 890

ఉల్లిపాయలు

ఫొటో సోర్స్, ROLEX DELA PENA/EPA-EFE/REX/Shutterstock

    • రచయిత, కామిలాస్ వెరాస్ మోటా
    • హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్

ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వంటల్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉంటుంది. దాదాపు అన్ని కాయగూర వంటకాల్లో ఉల్లిపాయలు వేసుకుంటారు. మాంసం రేటు ఎక్కువ కాబట్టి, వారానికి ఒకసారో రెండుసార్లో వండుకుంటారు.

కానీ, ఫిలిప్పీన్స్‌లో పరిస్థితి వేరు ఇక్కడ కోడి మాంసం, పశు మాంసం కంటే ఉల్లిపాయల ధరే ఎక్కువగా ఉంది.

1521 నుంచి 1898 మధ్య ఇక్కడ స్పెయిన్ వలస పాలన ఏర్పాటు చేసినప్పటినుంచీ ఉల్లిపాయలు, వెల్లుల్లిలకు ఇక్కడి వంటలతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఫిలిప్పీన్స్ ఆహార అలవాట్లపై స్పెయిన్ చాలా ప్రభావం చూపింది.

అయితే, ఫిలిప్పీన్స్‌లో నెల రోజుల నుంచి ఉల్లిపాయలు అందని ద్రాక్షలా మారిపోయాయి. వీటితోపాటు కొన్ని కూరగాయల ధరలు కూడా చికెన్, బీఫ్‌లను మించిపోయాయి.

ఒక కేజీ ఎర్ర లేదా తెల్ల ఉల్లిపాయల ధర ఇక్కడ 11 డాలర్లకు (రూ.890) పెరిగింది. మరోవైపు చికెన్ మాత్రం రూ.4 డాలర్లకే (రూ.325) దొరకుతోంది.

ఫిలిప్పీన్స్‌లో ప్రజల కనీస వేతనం రోజుకు 9 డాలర్లు (రూ.730). ఇప్పుడు కేజీ ఉల్లిపాయల ధర దీని కంటే ఎక్కువగా ఉంది.

ఉల్లిపాయలు

ఫొటో సోర్స్, Getty Images

ధరలు విపరీతంగా పెరగడంతో, అక్రమంగా భారీగా నిల్వచేస్తున్న ఉల్లిపాయలను అధికారులు పట్టుకుంటున్నారు. బట్టల వ్యాపారం పేరుతో చైనా నుంచి అక్రమంగా తరలిస్తున్న 3,10,000 డాలర్ల (రూ.2.51 కోట్లు) విలువైన ఉల్లిపాయలను జనవరి మొదటివారంలో ఫిలిప్పీన్స్ అధికారులు అడ్డుకున్నారు.

మరోవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో చాలామంది ఫిలిప్పీన్స్ వాసులు ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వమే కారణమని వారు ఆరోపిస్తున్నారు.

‘‘చాక్లెట్స్‌కు గుడ్‌బై.. హలో ఉల్లిపాయలు.. నేడు ఎవరికైనా బహుమతి ఇవ్వాలంటే ఉల్లిపాయలనే తీసుకెళ్లొచ్చు’’అని అమెరికాలో జీవిస్తున్న ఒక ఫిలిప్పీన్స్ వాసి ట్వీట్ చేశారు.

‘‘సౌదీ అరేబియా పర్యటకు వెళ్లి వస్తున్నప్పుడు చాక్లెట్లకు బదులు మేం ఉల్లిపాయలు తీసుకొచ్చాం’’అని మరో వినియోగదారుడు ట్వీట్ చేశారు.

మరోవైపు అమెరికాకు వెళ్తూ ఒక డబ్బా ఉల్లిపాయల పొడి తీసుకెళ్తున్న ఫోటోను ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ‘‘ఫిలిప్పీన్స్‌లో ఉల్లిపాయలు బంగారంలా మారిపోయాయి. అందుకే వీటిని తీసుకొచ్చి మిత్రులు, కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాను. కానీ, ఐదు సూపర్ మార్కెట్లు తిరిగాను. ఎక్కడా నిల్వలు లేవు. అసలు ఉల్లిపాయలు ఏమయ్యాయి? అడిగితే, ఫిలిప్పీన్స్ పర్యటకులు అన్నీ కొనుక్కొని వెళ్లిపోయారని అక్కడ కూరగాయలు అమ్ముతున్న ఒక ఆమె చెప్పారు’’అని మరో యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఉల్లిపాయలు

ఫొటో సోర్స్, ROLEX DELA PENA/EPA-EFE/REX/Shutterstock

వంటల్లో ఉల్లిపాయలు లేవు...

దేశ రాజధాని మనీలాలోని రెస్టారెంట్లలో చాలా వంటకాలను ఉల్లిపాయలు లేకుండానే చేస్తున్నట్లు ఐఎన్‌జీ బ్యాంకు సీనియర్ ఆర్థికవేత్త నికోలస్ మాపా చెప్పారు. ‘‘సాధారణంగా ఇక్కడ బర్గర్లలో ఉల్లిపాయలు పెడతారు. కానీ, కొన్నిచోట్ల అసలు బర్గర్లే మెనూలో కనిపించడం లేదు’’అని ఆయన వివరించారు.

‘‘ఉల్లిపాయలు వేసిన వంటకాల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. లేదంటే అసలు ఉల్లిపాయలే లేకుండా వంటలు చేస్తున్నారు’’అని బీబీసీతో ఆయన చెప్పారు.

కొన్ని రెస్టారెంట్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. ఉల్లిపాయలకు బదులుగా స్థానికంగా ఉపయోగించే లసోనాను ఇప్పుడు వాడుతున్నామని మూవ్‌మెంట్ టు ప్రిసెర్వ్ ద కలినరీ హెరిటేజ్ ఆఫ్ ఫిలిప్పీన్స్ వ్యవస్థాపకుడు, చెఫ్ జామ్ జామ్ మెల్కార్ చెప్పారు. ‘‘లసోనా ద్రాక్ష పండు పరిమాణంలో కాస్త చిన్నగా ఉంటుంది. దానీ రుచి కూడా భిన్నంగా ఉంటుంది’’అని ఆయన వివరించారు.

‘‘ప్రస్తుత పరిస్థితి వల్ల అటు రెస్టారెంట్లు, ఇటు సాధారణ ప్రజలు ఇద్దరూ బాధపడుతున్నారు. నేడు ఉల్లిపాయల ధర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రస్తుతం అందుబాటులోనున్న ప్రత్యామ్నాయాలతో ఉల్లిపాయలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని బీబీసీతో ఆయన చెప్పారు.

‘‘ఇక్కడి వంటకాల్లో ఉల్లిపాయలకు విడదీయరాని అనుబంధం ఉంది. దాదాపు అన్ని వంటకాల్లో ఉల్లిపాయలను వాడతారు’’అని ఆయన వివరించారు.

ఉల్లిపాయలు

ఫొటో సోర్స్, ROLEX DELA PENA/EPA-EFE/REX/Shutterstock

ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి?

ధరల పెరుగుదలకు రెండు కారణాలు ఉన్నాయని నికోలస్ మాపా చెప్పారు.

అవసరమైన దానికంటే ఈ ఏడాది ఉల్లిపాయల దిగుబడి కాస్త తక్కువగా ఉండొచ్చని గత ఆగస్టులో వ్యవసాయ విభాగం అంచనా వేసింది. అయితే, వాస్తవానికి ఆ అంచనాల కంటే దగుబడి తగ్గిపోయింది. దీనికి ఆగస్టు, సెప్టెంబరు మధ్య నెలల్లో విధ్వంసం సృష్టించిన తుపాను కూడా ఒక కారణం.

‘‘మరోవైపు ఉల్లిపాయల దిగుమతులు కూడా ఆలస్యం అయ్యాయి. ధరలు విపరీతంగా పెరిగిన తర్వాతే దిగుమతులకు అనుమతులు ఇచ్చారు’’అని ఆయన చెప్పారు.

జనవరి మొదటివారంలో సరఫరా పెంచేందుకు, ధరలను తగ్గించేందుకు 22 మిలియన్ టన్నుల ఉల్లిపాయల దిగుమతికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అయితే, అప్పటికే చాలా ఆలస్యమైందని ఫెర్మిన్ అడ్రియానో లాంటి నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు వ్యవసాయ విభాగానికి ఆయన సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని ఆయన అంటున్నారు.

దేశీయంగా దిగుబడి తగ్గుతుందని ప్రభుత్వానికి ముందే తెలిసినప్పుడు, దీనికి తగినట్లుగా దిగుమతులకు ముందే ప్రభుత్వం అనుమతి ఇచ్చుండాల్సిందని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు

ప్రభుత్వ వైఫల్యం...

ప్రస్తుత పరిస్థితికి దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌ను కూడా సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు. గత ఏడాది ఎన్నికల తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖను కూడా ఆయన దగ్గరే ఉంచుకున్నారు. అయితే, అసలు ఆయనకు ఆ విభాగంలో ఎలాంటి అనుభవమూలేదని చాలామంది విమర్శిస్తున్నారు.

నియంతగా పేరున్న ఫెర్డినాండ్ మార్కోస్‌కు జూనియర్ మార్కోస్ కుమారుడు. 1970, 1980లలో ఫిలిప్పీన్స్‌లో సీనియర్ మార్కోస్ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దీన్ని నిరసనలతో ప్రజలు కూలదోశారు. దీంతో 1986లో ఆయన కుటుంబంతో సహా విదేశాలకు పరారయ్యారు.

1991లో జూనియర్ మార్కోస్ మళ్లీ ఫిలిప్పీన్స్‌కు వచ్చి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. మొదట గవర్నర్‌గా, ఆ తర్వాత సెనేటర్‌గా కూడా ఆయన పనిచేశారు.

తన తండ్రి పాలన ఒక స్వర్ణ యుగంగా ఎన్నికల ప్రచారాల్లో జూనియర్ మార్కోస్ అభివర్ణించారు. అయితే, ప్రస్తుతం ఆ స్వర్ణం మరేదోకాదు, ఉల్లిపాయలేనని చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంకకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే తేయాకు ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది.

దిగుమతులే ఆధారం

సాధారణంగా ఫిలిప్పీన్స్ ప్రజలు ఉల్లిపాయల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతుందటారని, ఇక్కడ ఉపయోగించే వాటికంటే పండించేవి తక్కువగా ఉంటాయని రాబోబంక్ సంస్థలో కూరగాయల సాగు విశ్లేషకురాలిగా పనిచేస్తున్న సిండీ వ్యాన్ రిజ్‌స్విక్ చెప్పారు.

అయితే, ఈ విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంటుంది. 2011లో కేవలం 50 లక్షల కేజీల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటే 2016లో అది 13.2 కోట్ల కేజీలకు పెరిగింది.

‘‘ఎక్కువగా భారత్, చైనా, నెదర్లాండ్స్ లాంటి ప్రాంతాల నుంచి ఉల్లిపాయలను ఫిలిప్పీన్స్ దిగుమతి చేసుకుంటుంది’’అని ఆమె వివరించారు.

ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడటానికి ఇక్కడి వాతావరణం కూడా ఒక కారణం. కేవలం కొన్ని నెలల్లో మాత్రమే ఇక్కడ ఉల్లిపాయలు పండుతాయి. అయితే, ఉత్తర ఐరోపా, ఉత్తర అమెరికా లాంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఉల్లిపాయలను సాగుచేసేందుకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

‘‘ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉల్లిపాయలను పండిస్తారు. దిగుబడిలో చూస్తే, టమోటాలు, కీరా దోసకాయల తర్వాత ప్రపంచంలో అతి ఎక్కువగా పండించే మూడో కూరగాయల్లో ఉల్లిపాయలు ఉంటాయి’’అని ఆయన చెప్పారు.

చాలాచోట్ల ధరల ప్రభావం

మరికొన్ని దేశాల్లో కూడా ఉల్లిపాయల ధరలు సమస్యగా మారుతున్నాయి. ఉదాహరణకు బ్రెజిల్ తీసుకోండి. 2022లో ఇక్కడ ఉల్లిపాయల ధర 130.14 శాతం పెరిగింది.

సాగుచేసే భూమి తగ్గిపోవడం, ఎరువులు, పురుగుమందులు సహా సాగు వ్యయం పెరగడం, యుక్రెయిన్ సంక్షోభంతో కరెన్సీ మారకపు విలువలు పడిపోవడం లాంటి కారణాలు ఉల్లిపాయల ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)