‘ఆ ప్లాంట్లకు మా భూములు ఇచ్చి తప్పుచేశాం’ - అదానీ సిమెంట్ ప్లాంట్ల మూతతో రోడ్డున పడ్డ వేలాది జనం

డిసెంబర్‌లో మూసివేసిన దార్లఘాట్‌ సిమెంట్ ప్లాంట్
ఫొటో క్యాప్షన్, డిసెంబర్‌లో మూసివేసిన దార్లఘాట్‌ సిమెంట్ ప్లాంట్
    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, దార్లఘాట్, బీబీసీ న్యూస్

‘‘మా తప్పేమిటో మాకు తెలియదు. ఈ దుస్థితి మాకెందుకు వచ్చింది?’’ అని కాంతా శర్మ తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో సిమెంట్ ప్లాంట్ల మూసివేత వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వేలాది కుటుంబాల్లో ఆమె కూడా ఉన్నారు.

అదానీ గ్రూప్‌కు ఉన్న రెండు ప్లాంట్లలో దార్లఘాట్‌లో ఉన్న ఒక సిమెంట్ ప్లాంట్‌ను డిసెంబర్‌లో మూసివేశారు. మరో ప్లాంట్ దీనికి 48 కి.మీల దూరంలో ఉంది.

ఈ సిమెంట్ ప్లాంట్ల మూసివేతతో వేలాది మంది ప్రజలు పనులు లేక రోడ్డున పడ్డారు.

కాంత శర్మ భర్త 2009లో చనిపోయినప్పటి నుంచి ఆమె కుటుంబమంతా ఈ ప్లాంట్‌పై ఆధారపడే జీవిస్తోంది.

తన సేవింగ్స్‌తో పాటు, బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుని కాంత శర్మ ఒక ట్రక్కు కొన్నారు. ఆ ట్రక్కు ద్వారా ప్లాంట్ నుంచి, ప్లాంట్‌కి సిమెంట్‌ను, ముడి సరుకులను రవాణా చేసేవారు.

ఈ ప్లాంట్‌ను కట్టే సమయంలో, వారికున్న కొంత మేర భూమిని ఈ సిమెంట్ ప్లాంట్ యజమాన్యం తీసేసుకుంది.

బిలీనియర్, ప్రపంచంలో మూడో అతిపెద్ద సంపన్నుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఈ ఫ్యాక్టరీలను సెప్టెంబర్‌లోనే కొనుగోలు చేసింది.

సరుకు రవాణా చార్జీల విషయంలో స్థానిక రవాణా సంఘాలతో తలెత్తిన వివాదంతో కొనుగోలు చేసిన కొన్ని నెలల వ్యవధిలోనే ఈ ప్లాంట్లను మూసివేసింది అదానీ గ్రూప్.

రవాణా ఖర్చులు అత్యధికంగా ఉంటుండటంతో నష్టాలు భారీగా పెరిగిపోతున్నాయని, వీటి కార్యకలాపాలు కొనసాగించడం సాధ్యం కావడం లేదని కంపెనీ తెలిపింది.

జీవనోపాధిని కోల్పోయిన కాంత శర్మ కుటుంబం
ఫొటో క్యాప్షన్, జీవనోపాధిని కోల్పోయిన కాంతా శర్మ కుటుంబం

అదానీ గ్రూప్ ఈ నిర్ణయం ద్వారా ఈ ప్లాంట్లలో పనిచేస్తున్న 2 వేల నుంచి 3 వేల మంది ప్రత్యక్ష ఉద్యోగులు మాత్రమే కాక, పరోక్షంగా ఈ ప్లాంట్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న ఎంతో మంది ప్రభావితమయ్యారు.

ఈ ప్లాంట్లపై ఆధారపడి 10 వేల నుంచి 15 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరిలో ట్రక్కు ఆపరేటర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, రోడ్డు పక్కన తినుబండారాలు అమ్మేవారు, వెహికిల్ రిపేర్ గ్యారేజ్‌లలో పనిచేసే వారు ఉన్నట్లు రాష్ట్ర పరిశ్రమల, రవాణా కార్యదర్శి ఆర్‌డీ నజీమ్ అన్నారు.

వీరందరూ ప్రస్తుతం భూమి, ఇళ్లు లేని వారికి ఉన్నారు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలను నిర్మించే సమయంలో వారి భూములను ధారదత్తం చేశారు.

ఈ ప్రాంతంలో రవాణా వ్యాపారాన్ని ఎక్కువగా స్థానికులే నిర్వహిస్తున్నారు. వీరిలో చాలా మంది 1990లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసే సమయంలో తమ పంట పొలాలను వీటి నిర్మాణం కోసం అందించారు.

ఒక్కో కిలోమీటర్‌కి ఒక్కో టన్ను సిమెంట్‌ రవాణాకి వీరు రూ. 11ను చార్జ్ చేశారు. కానీ, అదానీ గ్రూప్ ఈ మొత్తాన్ని ఆరు రూపాయలకి తగ్గించాలని కోరుతోంది.

ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయని, తాము వసూలు చేస్తున్న ఈ చార్జీలు సమ్మతంగానే ఉన్నాయని ట్రాన్స్‌పోర్టర్లు చెప్పారు.

రెండు ప్లాంట్లలో తమ కార్యకలాపాలను కొనసాగించాలంటే, ట్రాన్స్‌పోర్టర్ల నుంచి తమకు అవసరమైన సహకారం లభించాలని అదానీ గ్రూప్ బీబీసీకి చెప్పింది.

పోటీ రేట్లలో కార్యకలాపాలు సాగిచేందుకు ఇతర ట్రాన్స్‌పోర్టర్లకు స్థానిక రవాణా సంఘాలు అనుమతివ్వడం లేదన్నారు.

 గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ

రవాణా సౌకర్యం కావాలనుకున్నప్పుడు తాము ట్రక్కులతో స్వేచ్ఛగా సంప్రదింపులు జరపగలగాలని అదానీ గ్రూప్ కోరుకుంటోంది. దీని ద్వారా తమ కస్టమర్లకు ఉన్నతమైన సర్వీసులు అందజేయగలుగుతామని చెబుతోంది.

కానీ, స్థానిక రవాణా సంఘాలు మాత్రం ఈ ప్లాంట్ల నిర్మాణానికి తమ పంట పొలాలను వదులుకోవడంతో, ట్రక్కులను ఆపరేట్ చేసే తొలి హక్కు తమకే ఉంటుందని వాదిస్తున్నాయి.

‘‘ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వారు దాచుకున్న కొద్దిపాటి సేవింగ్స్‌తో ట్రక్కులను కొనుగోలు చేశారు. ఈ ట్రక్కుల ద్వారా ప్లాంట్ నుంచి మెటీరియల్‌ను రవాణా చేస్తున్నారు’’ అని ఒక స్థానిక నివాసి మహేష్ కుమార్ చెప్పారు.

ప్లాంట్ల మూసివేతతో, వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు.

1990 ప్రారంభంలో ఈ సిమెంట్ ప్లాంట్లను నిర్మించేందుకు దార్లఘాట్‌లో భూములను కొనుగోలు చేశారు.

పంట పండే ఈ భూములను సుమారు అర ఎకరానికి రూ. 62 వేలు చెల్లించారు. బీడు భూములకు అర ఎకరానికి రూ. 19 వేలు చెల్లించినట్టు స్థానిక నివాసి పరాస్ ఠాకూర్ తెలిపారు.

ఆ సమయంలో ఈ ఫ్యాక్టరీల వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని స్థానికులు భావించారు. దీంతో ఉద్యోగాల కోసం వారు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినవసరం లేదని యోచించారు.

వీడియో క్యాప్షన్, ‘భూములు పోయాయి.. ఉపాధీ పోయింది’: స్థానికుల ఆక్రోశం

1992 నుంచి ఐదు గ్రామాలకు చెందిన 1,400 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసినప్పటికీ, కేవలం 72 కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే ఈ ప్లాంట్లలో ఉద్యోగాలొచ్చినట్టు ఠాకూర్ తెలిపారు.

ఈ రెండు ప్లాంట్లకు చెందిన 143 మంది ఉద్యోగాలు కాపాడేందుకు వారిని ఇతర ప్రాంతాల ప్లాంట్లకు తరలించినట్టు అదానీ గ్రూప్ తెలిపింది.

‘‘మేము అప్పట్లో అన్ని రకాల పంటలు పండించే వాళ్లం. మొక్కజొన్న, గోధుమలు, అన్ని రకాల పప్పుధాన్యాలను పండించే వాళ్లం. సిమెంట్ ప్లాంట్ల కోసం మా భూమిని ఇచ్చి తప్పు చేశామని ఇప్పుడనిపిస్తోంది’’ అని స్థానిక నివాసి ప్రేమ్ లాల్ ఠాకూర్ అన్నారు.

ప్రజలకు ప్రయోజనకరంగా సరుకు రవాణా రేట్లను నిర్ణయించడంపై పనిచేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

కానీ, అక్కడ నివాసితులు మాత్రం అన్ని ఆశలు వదిలేసుకున్నారు.

‘‘తొలుత మేము మా భూములను కోల్పోయాం. ఆ తర్వాత, ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్లు నిలుపుకోలేదు. తగినంత రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన సమయంలో, సరుకు రవాణా చార్జీలు అధికంగా ఉన్నాయని ప్లాంట్లను మూసివేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?’’ అంటూ శర్మ ప్రశ్నించారు.

ఇతర స్థానికులు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)