ఆంధ్రప్రదేశ్: టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు రాబోయే ఎన్నికలకు ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదా?

ఫొటో సోర్స్, GETTY IMAGES/YS JAGAN MOHAN REDDY/FB
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల దృష్టి మళ్లుతోంది. గతంలో పార్లమెంట్ సీటు మీద దృష్టిపెట్టిన నాయకులు కూడా వచ్చే ఎన్నికల కోసం అసెంబ్లీ వైపు చూస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీలు కూడా అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. అధిష్టానం ఆశీస్సుల కోసం చూస్తున్నారు. రెండు ప్రధాన పార్టీల్లోనూ ఇది కనిపిస్తోంది.
దీంతో సీట్ల కోసం కొత్త నేతలను ఎంపిక చేయాల్సిన పరిస్థితి అన్ని పార్టీల్లోనూ ఉంది. అసెంబ్లీ సీట్ల కోసం ఒకరిద్దరిని మించి పోటీ పడుతుండగా, పార్లమెంట్ సీట్లకు ఒక్కరిని కూడా గుర్తించడం కష్టంగా మారుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువ మంది హస్తిన రాజకీయాల మీద ఆసక్తి తగ్గిందనే వాదన ఉంది. అందుకు తోడుగా మారిన సామాజిక, ఆర్థిక వ్యవహారాలు కూడా రాష్ట్ర రాజకీయాల మీద అందరి దృష్టి పడడానికి కారణమయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫొటో సోర్స్, Facebook/Ram Mohan Naidu Kinjarapu
సిట్టింగ్ ఎంపీలు సైతం
ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 25 మంది ఎంపీలలో 22 మంది అధికార వైఎస్సార్సీపీకి చెందిన వారు కాగా, తెలుగుదేశం పార్టీ తరుపున ముగ్గురున్నారు.
టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా వరుసగా రెండు ఎన్నికల్లోనూ గెలిచిన వారే. ఇక వచ్చే ఎన్నికల్లో వారిలో ఎవరెవరు ఎంపీ సీటుకి పోటీలో ఉంటారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండాలని చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.
అధికార పార్టీకి చెందిన ఎంపీల్లో అరడజను మంది వరకూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఇప్పటికే ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం మీద దృష్టిపెట్టారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ పేరుని నగరంలోని తూర్పు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ ఆలోచిస్తోంది. ఇప్పటి వరకూ తమకు గెలుపు దక్కని ఈ స్థానంలో బలమైన అభ్యర్థి అవుతారని అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, Facebook/Margani Bharat
కాకినాడ ఎంపీ వంగా గీత కూడా పిఠాపురం అసెంబ్లీ సీటు మీద గంపెడాశతో ఉన్నారు. గతంలో ఆమె అక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఇప్పటికే సిటీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. నగరంలో గడపగడపకూ తిరుగుతున్నారు.
బాపట్ల ఎంపీ నందిగామ సురేశ్ కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు మీద గురిపెట్టారు.
హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల మాధవ్ కూడా వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి తన పేరు పరిశీలించాలని అధిష్టానాన్ని విన్నవించినట్టు సమాచారం.
అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కూడా కళ్యాణదుర్గం అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు.
వీరితో పాటుగా అమలాపురం ఎంపీ చింతా అనురాధ, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి తదితరులు కూడా అసెంబ్లీ వైపు ఆసక్తి చూపుతున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకట రమణ సైతం మరోసారి రేపల్లె అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు. తనకు గానీ, తన కుమారుడికి గానీ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన రేపల్లెలో ఓటమి పాలయిన తర్వాత తొలుత ఎమ్మెల్సీగానూ, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగానూ అవకాశం దక్కించుకున్నారు.
మంత్రి పదవి దక్కుతుంది...
వర్తమాన రాజకీయాల్లో ఎంపీల కన్నా ఎమ్మెల్యేలకు అన్ని వ్యవహారాల్లోనూ కీలక పాత్ర దక్కుతుండడమే ఎక్కువ మంది అసెంబ్లీ వైపు చూడడానికి ప్రధాన కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది.
"దిల్లీలో అధికారం దక్కే పార్టీ గానీ, కనీసం అధికార కూటమిలో భాగస్వామిగా ఉండే పార్టీగానీ అయితే ఎంపీగా పోటీ చేయాలనే వారికి ఆసక్తి ఉంటుంది. రాష్ట్రంలో అయితే మంత్రి పదవికి పోటీ పడవచ్చు. అన్ని సమీకరణాలు కలిసి వస్తే క్యాబినెట్ బెర్త్ దక్కుతుంది. తమ నియోజకవర్గంతో పాటుగా జిల్లాలో సైతం చక్రం తిప్పవచ్చు. కీలక నేతగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఎంపీ పదవుల మీద ఆసక్తి చూపడం లేదు" అంటూ సీనియర్ జర్నలిస్ట్ గోపి దారా అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మంది ఎంపీలు అసెంబ్లీకి పోటీ పడుతుండడంతో ఎంపీలుగా పోటీ చేసే వారి కోసం అన్ని పార్టీలు వెదుక్కోవాల్సి వస్తోందని ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకనాడు దిల్లీలో చక్రం తిప్పాలని..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉండేది. అధికారంలో గానీ, ప్రధాన ప్రతిపక్షంగా గానీ కాంగ్రెస్ కనిపించేది. రాష్ట్రంలో అధికారం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉంటామనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉండేది.
ఎక్కువ మంది నాయకులు తమ అధిష్టానం దృష్టిలో పడేందుకు తగ్గట్టుగా హస్తిన మీద దృష్టి కేంద్రీకరించేవారు. దిల్లీలో చక్రం తిప్పగలిగితే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితి వస్తుందని చాలా దశాబ్దాల పాటు నాయకులు నమ్మేవారు.
తొలినాళ్లలో పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన నేతలే రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించేవారు. పార్టీలే వేరయినప్పటికీ ఎంపీలదే ప్రధాన పాత్ర అన్నట్టుగా ఉండేది. ఎన్టీ రంగా, కేఎల్ రావు వంటి నేతలు అందులో ముఖ్యులు.
కొంతకాలం తర్వాత పీవీ నరసింహరావు, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి వారు కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం తర్వాత కూడా దిల్లీ రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. తద్వారా తెలుగు రాజకీయాల్లో తమకంటూ వర్గాలను నడిపించేందుకు అనుగుణంగా వ్యవహరించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా పర్వతనేని ఉపేంద్ర, ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర రావు వంటి వారు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా తమ పార్టీలో కీలక నాయకులుగా వ్యవహరించేవారు. జీఎంసీ బాలయోగి, కింజరాపు ఎర్రన్నాయుడు వంటి నేతలు కూడా పార్లమెంట్ సభ్యులుగానే గల్లీతో పాటుగా దిల్లీ రాజకీయాల్లో సైతం గుర్తింపు సాధించారు.
కార్పోరేట్ల ప్రభావం..
1991 తర్వాత మారిన ఆర్థిక విధానాల కారణంగా దిల్లీ రాజకీయాల మీద చాలామందికి ఆసక్తి తగ్గింది. ముఖ్యంగా కార్పోరేట్, పెట్టుబడిదారీ విభాగాలకు చెందిన వారు మాత్రమే హస్తిన వైపు ఎక్కువగా చూస్తున్నారు. కాంట్రాక్టర్లు, ఇతర రాష్ట్రాల్లో సైతం వివిధ వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారు అటు ఎక్కువగా మొగ్గుతున్నారు.
సంప్రదాయ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారు, స్థానికంగానే ఆర్థిక వ్యవహారాలు ముడిపడిన వారు హస్తిన కన్నా అసెంబ్లీ ఉత్తమం అని భావిస్తున్నారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే ప్రస్తుతం పోటీ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో ఆయా పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశాలు తక్కువగా ఉండడం కూడా ఎక్కువ మంది అసెంబ్లీల వైపు చూసేందుకు కారణమవుతోందని రాజకీయ విశ్లేషకుడు ఐనం ప్రసాద్ అన్నారు.
"బీజేపీ, కాంగ్రెస్ పార్టీలయితే దిల్లీ వ్యవహారాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీలకు ఏపీలో అంత ప్రభావం చూపించే అవకాశం లేదు. దాంతో ప్రాంతీయ పార్టీల్లో దిల్లీ స్థాయిలో వ్యవహారాలు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్న వారు మాత్రమే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రిటైర్డ్ సివిల్స్ అధికారులు, సినీ, పారిశ్రామిక వర్గాలు ఎక్కువగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండేందుకు ఈ పరిస్థితులు దోహదపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐ లు కూడా ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం ఉంది"అని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్పోరేట్ ప్రతినిధులు నేరుగా రాజ్యసభకి అవకాశం దక్కించుకోవడం ఉత్తమమనే ఆలోచనతో ఉండడం కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితికి ఓ కారణమని ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Margani Bharat
వేట మొదలెట్టిన పార్టీలు
ఇప్పటికే వైఎస్సార్సీపీ, టీడీపీలు తమ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు కొన్ని ప్రకటించారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తూ ఇన్‌చార్జులుగానూ, కోఆర్డినేటర్లుగానూ ఉన్న నేతలను వచ్చే ఎన్నికల బరిలో దింపబోతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. వారిని గెలిపించాలంటూ బహిరంగంగానే పిలుపునివ్వడం ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
పార్లమెంట్‌కు వచ్చే సరికి మాత్రం ఇరు పార్టీల నేతలు గట్టిగా శోధించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల బరిలో దిగిన చాలామంది కూడా ఈసారి మొగ్గు చూపకపోవడం విశేషం.
గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోయిన మూడు ఎంపీ సీట్లకు గానూ శ్రీకాకుళం లో ఓటమి పాలయిన దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. తాను ఇన్‌చార్జి గా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ సీటు ఆయన ఆశిస్తున్నారు.
విజయవాడలో వైఎస్సార్సీపీ టికెట్ పై పోటీ చేసి పరాజయం పాలయిన పొట్లూరి వర ప్రసాద్ ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, TDP/FB
గుంటూరు నుంచి ఓటమి పాలయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఈసారి నరసారావుపేట సీటు ఆశిస్తున్నారు. దాంతో ఈ మూడు సీట్లకు వైఎస్సార్సీపీకి కొత్త నేతలను వెదుర్కోవాల్సి ఉంటుంది.
నర్సాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఇప్పటికే తిరుగుబాటు చేశారు. దాంతో దాదాపుగా 10 స్థానాల వరకూ వైఎస్సార్సీపీ కొత్త ఎంపీ అభ్యర్థులను చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.
టీడీపీ తరుపున పోటీ చేసిన పారిశ్రామికవేత్తల్లో చలమలశెట్టి సునీల్(కాకినాడ), అడారి ఆనంద్(అనకాపల్లి), శిద్ధా రాఘవరావు( ఒంగోలు), బీదా మస్తాన్ రావు( నెల్లూరు) వంటి వారు పార్టీ ఫిరాయించి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీదా మస్తాన్ రావుకి రాజ్యసభ అవకాశం కల్పించింది వైఎస్సార్సీపీ.
కడప నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
రాజంపేట నుంచి బరిలో నిలిచి డీకే సత్యప్రభ, చిత్తూరు నుంచి పోటీ చేసిన ఎన్ శివప్రసాద్ వంటి నేతలు మరణించారు.
దాంతో తెలుగుదేశం పార్టీకి 15 మంది వరకూ కొత్త మొఖాలను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.
అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల ప్రచారం నిజమయితే ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఏ పార్టీకయినా కొంత తేలిక అవుతుంది. కానీ సాధారణ ఎన్నికలయితే ఎంపీ అభ్యర్థుల ప్రభావం కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉంటుంది కాబట్టి పార్టీలకు పెద్ద పరీక్ష తప్పేలా లేదు.
పోటీ సహజమే...
ఎంపీ ఎన్నికల కన్నా అసెంబ్లీ ఎన్నికల వైపు ఎక్కువ మంది దృష్టి సారించడం సహజమేనని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
"వచ్చే ఎన్నికల్లో కొందరు ఎంపీలు ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కూడా ఎంపీ సీటు కోసం బరిలో నిలవాల్సి రావడం వంటివి జరగినా ఆశ్చర్యం లేదు. ఇది సహజమే. రాజకీయ సమీకరణాలను బట్టి అభ్యర్థులను మార్చాల్సి ఉంటుంది. ఏ నియోజకవర్గానికి, ఆ స్థానంలో పరిస్థితిని బట్టి ఇది జరుగుతుంది. ఎక్కడెక్కడ అలాంటి అవసరం ఉందనేది అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది" అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ మూడేళ్ల క్రితం రాజ్యసభలో అడుగుపెట్టారు. రాష్ట్ర రాజకీయాలకు, పార్లమెంటరీ వ్యవహారాలకు చాలా తేడా ఉంటుందన్నారు. ఎంపీ అభ్యర్థిత్వం కోసం ఆశిస్తున్న వారిలో తగిన వారిని ఎంపిక చేయడానికి అధినేత ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన తెలిపారు.
టీడీపీలో కూడా ఆశావాహుల లిస్టు ఉందని ఈపార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు.
"ప్రతీ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా కొందరు కొత్త అభ్యర్థులు పోటీలో ఉంటారు. అందుకు తగ్గట్టుగా కసరత్తు జరుగుతోంది. ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి తగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుంది"అని ఆయన బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వీరసింహారెడ్డి: అమెరికా థియేటర్లను హడలగొడుతున్న తెలుగు సినిమా ‘సంస్కృతి’
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- గంగా విలాస్ క్రూయిజ్: డిజైన్ చేసింది తెలుగు మహిళ.. మోదీ ప్రారంభించిన ఈ షిప్ ప్రత్యేకతలేమిటి? విమర్శలు ఎందుకు?
- దేవికా రాణి: బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ఈ ‘ముద్దు సీన్’ చుట్టూ అల్లుకున్న కథలేంటి?
- క్రైస్తవ మిషనరీలు మత మార్పిడుల కోసం బుద్ధుడి జన్మస్థలాన్ని టార్గెట్ చేశాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















