మెదక్: తన పేరు మీద రూ.7 కోట్లకు బీమా... ‘తన లాంటి వ్యక్తిని చంపేసి, తానే చనిపోయినట్లు నాటకం’

కాలిపోయిన కారు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

ఆయనొక ప్రభుత్వ ఉద్యోగి. తెలంగాణ సెక్రటేరియట్‌లో పని చేస్తున్నారు.

ఆయనకు కోట్ల రూపాయలు విలువైన జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. ఎలాగైన బీమా డబ్బులు తీసుకోవాలని భావించారు.

ఆయన చనిపోతే కానీ బీమా డబ్బులు రావు. కానీ బతికి ఉండగానే డబ్బులు తీసుకోవాలని ఈయన ప్లాన్ వేశారు.

అది ఎలా సాధ్యమైంది?

జనవరి 9న మెదక్ జిల్లా టేక్మల్ మండలం వెంకటాపూర్ శివారులోని ఓ చెరువు సమీపంలో మంటల్లో కాలిపోయిన కారు, అందులో ఓ వ్యక్తి శవం బయటపడ్డాయి. స్థానికుల సమాచారంతో టేక్మల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

తెలంగాణ సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగి ‘పాత్ లోత్ ధర్మా’ అని ముందు పోలీసులు గుర్తించారు.

మంటల్లో కాలిపోయింది ధర్మా అని అతని భార్య నీల, ఇతర కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద నిర్ధారించారు.

కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం ఆ మృతదేహం ధర్మాదే అని మొదట్లో నమ్మిన పోలీసులు, ఐపీసీ సెక్షన్-174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మలుపు తిప్పిన పెట్రో బాటిల్

కారుకు ప్రమాదం జరిగి, ఒక వ్యక్తి చనిపోయి ఉన్నారనే విషయాన్ని ముందుగా వెంకటాపూర్ గ్రామ పంచాయతి పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు.

చెరువు ఒడ్డున పెట్రోల్‌తో ఉన్న బాటిల్‌ను వారు చూశారు. దాన్ని తీసుకునేందుకు రాగా వారికి మంటల్లో కాలిపోయిన కారు, అందులో శవం కనిపించాయి.

ఈ విషయాన్ని వారు వెంటనే వెంకటాపూర్ గ్రామ సర్పంచ్‌కు తెలియజేశారు.

‘గ్రామంలోని చెత్త తీసుకుని ట్రాక్టర్‌ మీద వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులకు కారు, అందులో శవం కనిపించింది. వారు ఆ సంగతి నా దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని టేక్మల్ ఎస్.ఐకు తెలియజేశాను.

నాలుగు పోలీస్ బృందాలు, జాగిలాలతో వచ్చి విచారణ చేపట్టారు. అదే సమయంలో శవం తన భర్తదే అని ధర్మా నాయక్ భార్య పోలీసుల వద్ద చెప్పింది. కారులో శవం మొత్తం కాలిపోయినా కాళ్లు మాత్రం కాలలేదు. మంటల్లో కాలని కాళ్లను చూసే మరో బంధువు కూడా అది ధర్మ శవమే అని నిర్ధారించారు’ అని వెంకటాపూర్ సర్పంచ్ లచ్చ గౌడ్ తెలిపారు.

కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.

ధర్మా నాయక్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, భార్యతో ధర్మా నాయక్

స్టాక్ మార్కెట్ నష్టాలతో

మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం...

ధర్మా నాయక్‌ది మెదక్ జిల్లా టేక్మల్ మండలం భీమ్లాతాండ.

2007 నుంచి తెలంగాణ సెక్రటేరియట్‌లో నీటిపారుదలశాఖ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆరు సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు.

అతనికి భార్య నీల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు ఐఐటీలో చదువుతున్నారు. ఇంటర్ చదివే మైనర్ కొడుకు కూడా ఉన్నాడు.

కూకట్ పల్లిలో ఒక ఫ్లాట్‌లో ఉండే ధర్మా అప్పుడప్పుడు భీమ్లా తాండలోని తన కుటుంబం దగ్గరికి వెళ్లి వస్తుండేవారు.

భారీగా డబ్బు సంపాదించాలనే ఆశతో 2018 నుంచి ధర్మా నాయక్ స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెడుతున్నారు. మొదట్లో లాభాలు భారీగా వచ్చాయి. వాటితో విలాస జీవితం గడిపాడు.

ఆ తరువాత కరోనా సంక్షోభం, యుక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్‌లు పడిపోయి చాలా డబ్బులు నష్టపోయాడు.

చిట్టీలు పాడి, తెలిసిన వారి దగ్గర అప్పులు తెచ్చి మళ్లీ స్టాక్ మార్కెట్‌లో పెట్టాడు. అయినా నష్టాలే వచ్చాయి. మొత్తం మీ అప్పులు రూ.85 లక్షల వరకు చేరాయి.

అప్పుల వాళ్ల ఒత్తిడులు పెరగడంతో ఇంట్లో వివాదాలు మొదలయ్యాయి. అప్పుల నుంచి బయటపడే మార్గాల కోసం తన కుటుంబ సభ్యులు, నిజామాబాద్ జిల్లా నవీపేటలో నివసించే తన అక్క తేజావత్ సునంద, సిసి కెమెరా టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మేనల్లుడు తేజావత్ శ్రీనివాస్‌లతో ఏడాది కాలంగా చర్చిస్తున్నాడు.

వెంకటాపూర్ గ్రామం బోర్డు

ఫొటో సోర్స్, UGC

బీమా డబ్బులతో అప్పులు తీర్చాలని పథకం

అప్పులు తీర్చడానికి కావాల్సిన డబ్బు కోసం బీమాను మార్గంగా ఎంచుకున్నాడు ధర్మా.

రూ.7.4 కోట్ల విలువ చేసే 25 బీమా పాలసీలు తన పేరు మీద తీసుకున్నాడు.

తాను చనిపోకుండానే బీమా డబ్బులు పొందడం మీద ఒక ప్లాన్ వేశాడు. అందులో ధర్మా భార్య, అక్క, మేనల్లుడు, కొడుకు కూడా భాగస్వామి అయ్యారు.

ధర్మా చనిపోయినట్లు పోలీసులను, సమాజాన్ని నమ్మించాలి. ధర్మా మాదిరిగా ఉండే వ్యక్తిని ఆయన స్థానంలో శవంగా చూపించాలి. ఇది వాళ్ల ప్లాన్. ఏడాది కాలం నుంచి దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మామిడి తోటలో పని ఇస్తామని...

పోయిన ఏడాది నవంబర్‌లో నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద తనలాంటి పోలికలతో ఉన్న అంజయ్య అనే వ్యక్తిని ధర్మా కలిశాడు. నిజామాబాద్‌లో ఉన్న తన మామిడి తోటలో పని ఉందని చెప్పాడు.

తన ప్లాన్‌లో భాగంగా ఓ సెకండ్ హ్యాండ్ కారును ధర్మా కొనుగోలు చేశాడు.

ఈ ఏడాది జనవరి 7న మేనల్లుడు శ్రీనివాస్‌తో కలిసి నాంపల్లి మెట్రో స్టేషన్‌లో అంజయ్యను ధర్మా కలిశాడు.

నెలకు రూ.20 వేల జీతం ఇస్తామని చెప్పి కారులో తమ వెంట తీసుకుని నిజామాబాద్ వైపు బయలుదేరారు.

ఆరోజే చంపాలని భావించినా అంజయ్య మద్యం మత్తులో ఉండటంతో ప్లాన్‌ను మరుసటి రోజుకు వాయిదా వేశారు.

మద్యం సేవించి వాహనం నడిపితే ఇన్సూరెన్స్ డబ్బులు రావని వారు భావించారు.

ధర్మా నాయక్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ధర్మా నాయక్

హత్యచేసి కారుకు నిప్పు

చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అంజయ్యకు చెప్పి ఆ రోజు రాత్రి నిజామాబాద్‌లోని ఓ లాడ్జిలో ధర్మా అతని మేనల్లుడు శ్రీనివాస్‌లు బస చేశారు.

భోజనం చేసి రావాల్సిందిగా అంజయ్య ను బయటకు పంపారు. అయితే అంజయ్య ఎంతకూ లాడ్జికి తిరిగి రాకపోవడంతో అతన్ని చంపాలనే పాచిక పారలేదు.

జనవరి 8 తెల్లవారు జాము నిజామాబాద్ రైల్వే స్టేషన్ కూలీ అడ్డా వద్ద తన పోలికలతోనే ఉన్న బాబు అనే వ్యక్తిని ధర్మా చూశాడు. అతనికి పని ఇస్తామని చెప్పి తమతో పాటు బాసరకు తీసుకెళ్లి అక్కడ గుండు కొట్టించి తన బట్టలను వేశారు.

అదే రోజు రాత్రి వెంకటాపూర్ సమీపంలోని చెరువు కుంట వద్దకు తీసుకొచ్చి, కారులో పెట్రోల్ చల్లి కారు ముందు భాగంలో కూర్చోమని బాబుకు చెప్పారు.

కానీ బాబు అందుకు నిరాకరించడంతో ధర్మా, శ్రీనివాస్‌లు తమ తో తెచ్చుకున్న గొడ్డలి, కర్రతో కొట్టి బాబును హత్య చేసారు.

చనిపోయిన బాబును బాబు చనిపోయాడని నిర్ధారించుకుని శవాన్ని కారు ముందు సీటులో కూర్చొబెట్టారు.

మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి

ధర్మా బతికే ఉన్నాడని ఎలా తెలిసింది:

శవం ధర్మాదా కాదా అన్న విషయంలో మొదటి నుంచి పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. అదే సందర్భంలో కుటుంబ సభ్యుల అనుమానాస్పద ప్రవర్తన వల్ల వారిపై నిఘా పెట్టారు. కారులో లభ్యమైన శవం కాళ్ల రంగు, ధర్మా స్కిన్ టోన్‌తో మ్యాచ్ కాకపోవడం పోలీసుల అనుమానికి బలం చేకూర్చింది.

దీంతో మరింత లోతుగా విచారించగా ధర్మా కదలికలు నిజామాబాద్‌లోని సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యి కనిపించాయి. కుటుంబ సభ్యులను లోతుగా విచారించగా ధర్మా బతికే ఉన్నాడన్న విషయం బయటపడింది.

అంజయ్య, బాబుల వివరాల కోసం విచారణ జరుగుతోంది.

హత్య చేసిన తర్వాత ఇండోర్‌కు పారిపోయిన ధర్మా, తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అరెస్ట్ చేశామని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి తెలిపారు.

ప్లాన్ పక్కగా అమలైతే బీమా డబ్బులతో అప్పులు తీరుతాయని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం, భార్యకు పెన్సన్ రావడంతోపాటు తీసుకున్న ఇంటి లోను మాఫీ అవుతుందని ధర్మా భావించారని ఆమె వెల్లడించారు.

ఈ కేసులో ఐపీసీ సెక్షన్స్ 302,364,120 B,201,202 కింద కేసు నమోదు చేసి

ధర్మాతో సహా అతని భార్య, అక్క, కొడుకు, మేనల్లుడిని అరెస్ట్ చేశారు. కొడుకు మైనర్ కావడం వల్ల జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)