కేసీఆర్: విశాఖ ఉక్కును మోదీ అమ్మితే... మేం మళ్లీ తీసుకొస్తాం

ఫొటో సోర్స్, Facebook/BRS Party
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)... భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారిన తరువాత భారీ స్థాయిలో తొలిసారి బహిరంగ సభను పెట్టారు.
ఒకనాడు కమ్యూనిస్టుల కోటగా ఉన్న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను పెట్టారు ఆ పార్టీ అధినేత కేసీఆర్.
కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీని నేరు ఢీ కొడుతున్నారు కేసీఆర్. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి కూడా ఈ సభకు హాజరయ్యారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మరొక ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా ఈ సభకు వచ్చారు. డి.రాజా వంటి కమ్యూనిస్టు నేతలు కూడా వచ్చారు.
కేసీఆర్ ప్రసంగంలోని కీలకాంశాలు... ఆయన మాటల్లోనే
- భారతదేశం తన లక్ష్యం ఏంటి? బిత్తర పోయి గత్తర పడుతోంది? దారి తప్పిందా? దీని మీద మనమంతా చాలా సీరియస్‌గా ఆలోచించాలి.
- ప్రపంచబ్యాంకులను అడుక్కోవడం, అమెరికా కాళ్లు మొక్కడం వంటివి చేయాల్సిన అవసరం లేదని లక్షల కోట్ల సహజ సంపద ఈ దేశంలో ఉంది.
- అమెరికా, చైనా కంటే కూడా సాగుకు అనుకూలమైన భూమి మన దేశంలో ఉంది. దేశంలో 50శాతానికి పైగా భూమి సాగులో ఉంది.
- వాన ద్వారా ప్రతి ఏడాది లక్షా 40వేల టీఎంసీల నీరు వస్తోంది. అందులో 70-75వేల టీఎంసీల నీటిని ఉపయోగించుకోగలం. కానీ19 నుంచి 20వేల టీఎంసీల నీటిని మాత్రమే మనం వాడుకుంటున్నాం.
- అద్భుతమైన ఆగ్రో క్లైమెట్ జోన్స్ ఉన్నాయి. భారత్‌లో యాపిల్ పండుతుంది, మామిడి కాయ పండుతుంది.
- ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్‌గా ఉండాల్సిన భారత్... పిజ్జాలు, బర్గర్లు తింటోంది. కెనడా నుంచి కంది పప్పు దిగుమతి చేసుకోవాలా? ఇంతకంటే సిగ్గు చేటు ఏమైనా ఉందా?
- భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో కట్టిన ప్రాజెక్టులు తప్ప ఆ తరువాత అతీగతి లేదు.
- జింబాబ్వేలో జాంబేజీ నది మీద 6,533 టీఎంసీల రిజర్వాయర్ ఉంది. రష్యాలో అంగారా నది మీద 5,968 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది. ఘనా, కెనడా, ఈజిప్టు, అమెరికా, చైనాలలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మన దేశానికి ఇలాంటి ప్రాజెక్ట్ ఏది?
- మన గొంతులు తడవాల్నా... ఎండాల్నా... భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం చేసైనా సరే సహజ సంపదను వాడుకోవడంలో ఉండే ఇబ్బందులను తొలగిస్తాం. బీఆర్‌ఎస్ పుట్టింది అందుకే.
- ఈ దుస్థితికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.
- మోదీ అన్ని అమ్ముతా అంటున్నారు... అమ్ముకో. ఎల్‌ఐసీని నువ్వు అమ్మినా మళ్లీ మేం కొంటాం. విశాఖ ఉక్కును అమ్ము... మేం తిరిగి తెచ్చుకుంటాం.
- లక్షల కోట్ల ప్రజల ఆస్తులను అమ్ముతామంటున్నరు.
- విద్యుత్ రంగం పబ్లిక్ సెక్టార్‌లోనే ఉంటది.
- మహిళల అభ్యుదయాన్ని సాధిస్తాం. లింగ వివక్ష నిర్మూలన చేపడతాం. మహిళలకు చట్టసభలలో 35% రిజర్వేషన్లు ఇస్తాం.
- దళితబంధు పథకాన్ని దేశం మొత్తం 25 లక్షల కుటుంబాలకు అమలు చేసి చూపిస్తాం.
- బీఆర్‌ఎస్ లాంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే రెండేళ్లలో వెలుగు నింపుతాం.
- మన దగ్గర మేకిన్ ఇండియా, జోకిన్ ఇండియా అయిపోయింది.
- అగ్నిపథ్‌ను కూడా రద్దు చేస్తాం. సైన్యానికి సిస్టం ఉండాలె. పాత పద్ధతిలో కొనసాగిస్తాం.
- దేశమంతా ఉచిత కరెంటు ఇవ్వాలి.
ఇవి కూడా చూడండి:
- ఎన్టీఆర్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
- జల్లికట్టు, కోడి పందేలు తరహాలో కుక్కల కొట్లాటలు... జంతువులతో ఇలా ఎన్ని రకాల పోటీలు జరుగుతున్నాయో మీకు తెలుసా?
- పాకిస్తాన్ ఆర్థికసంక్షోభం: ఈసారి చైనా, సౌదీ అరేబియా కూడా కాపాడలేవా
- తెలంగాణ: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడిపై క్రిమినల్ కేసు- 'ఇది రాజకీయ ప్రతీకార చర్య' అని ఆరోపించిన సంజయ్
- ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




