పాకిస్తాన్ ఆర్థికసంక్షోభం: ఈసారి చైనా, సౌదీ అరేబియా కూడా కాపాడలేవా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజినీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌ను నలుదిక్కుల నుంచి సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి.
1971 నాటి కంటే దారుణమైన పరిస్థితులను పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటుందని నిపుణులంటున్నారు. 1971లోనే పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది.
ఇటీవలే పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునిర్‌లు యూఏఈకి వెళ్లి, తమకు ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థించారు.
రెండు బిలియన్ డాలర్ల రుణ చెల్లింపు కాలాన్ని పొడిగించేందుకు యూఏఈ ఒప్పుకుందని పాకిస్తాన్ ప్రధాని అన్నారు. అదనంగా 1 బిలియన్ డాలర్ల వరకు రుణం ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు.
పాకిస్తాన్‌కి ప్రపంచ దేశాలు 100 బిలియన్ డాలర్లు ఇచ్చాయని, వీటిలో 21 బిలియన్ డాలర్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాల్సి ఉందని ఆ దేశ ఆర్థికశాఖ మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ అన్నారు. మిగతా 70 బిలియన్ డాలర్లను వచ్చే మూడేళ్లలో చెల్లించాల్సి ఉంది.
ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 4.3 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యంత కనిష్టం. ఈ నిల్వలతో కనీసం ఒక నెల దిగుమతి బిల్లును కూడా పాకిస్తాన్ చెల్లించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నలుదిక్కులా సంక్షోభమే
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది. సోషల్ మీడియాలో పోస్టు అవుతున్న చాలా వీడియోల్లో పాకిస్తాన్ ప్రజలు ఆహారం కోసం కొట్లాడుకుంటున్నారు. ఈ కొట్లాటలో ఒక వ్యక్తి కూడా మరణించాడు.
ఆర్థిక వేత్తలు పాకిస్తాన్ సమస్యను రెండు కోణాల నుంచే చూస్తున్నారని, ఒకటి కరెంట్ అకౌంట్ లోటు, రెండు రెవెన్యూ లోటని పాకిస్తాన్ రచయిత, సిటీ గ్రూప్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ మాజీ హెడ్ యూసఫ్ నజర్ అన్నారు.
‘‘పాకిస్తాన్ కేవలం ఈ రెండు సమస్యలతోనే సతమతం కావడం లేదు. పాకిస్తాన్ ఇంటెలెక్చువల్ డీఫాల్ట్ సమస్యను, మిలిటరీ సమస్యలను, సంపన్న వ్యక్తుల నుంచి ఆర్థిక, రాజకీయ, భూయాజమాన్య హక్కుల ఇబ్బందులను ఎదుర్కొంటుంది’’ అని యూసుఫ్ నజర్ అన్నారు.
పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక విధానం చాలా విరుద్ధమైనదిగా ఉంటుందని అమెరికన్ ఆర్థిక వేత్త విలియం ఈస్ట్రెలీ అన్నారు. ఎలాంటి ఆర్థిక పురోగతి లేదని, గత 25 ఏళ్లుగా పురోగతి అక్కడే నిలిచిపోయిందని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘25 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌లో జీడీపీ తలసరి ఆదాయం భారత్ కంటే 46 శాతం అత్యధికంగా ఉండేది. ప్రస్తుతం ఇది 20 శాతం తగ్గిపోయింది. ఆ తర్వాత ఏమైంది? ప్రపంచమంతా ప్రపంచీకరణ దిశగా ముందుకు సాగింది. భారత్, చైనా, బంగ్లాదేశ్‌లు దీన్ని అవకాశంగా మలుచుకున్నాయి’’ అని యూసుఫ్ నజర్ రాశారు.
కానీ, పాకిస్తాన్ మేల్కొనలేదు. ప్రపంచీకరణకు అనుగుణంగా భారత్, చైనా, బంగ్లాదేశ్‌లు తమ విధానాలను రూపొందించాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి.
‘‘అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ విధానాన్ని దుర్వినియోగపరిచింది. అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ విధానం ఒక వ్యూహాత్మక విపత్తు. రెండు దశాబ్దాలకు పైగా తాలిబాన్లకు మద్దతు ఇచ్చింది. 2021 ఆగస్టులో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రాగానే వేడుక చేసుకుంది’’ అని యూసుఫ్ నజర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక బానిసత్వం నుంచి అఫ్గానిస్తాన్ ప్రజలు విముక్తి దొరికిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ వ్యాఖ్యల ఫలితంగా పాకిస్తాన్ ఒంటరి అయింది.
‘‘పశ్చిమ దేశాలు పాకిస్తాన్‌కు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. సౌదీ అరేబియా, చైనాలు కూడా సాయాన్ని నిరాకరించేందుకు ఇంకా ఎంతో దూరంలో లేదు. వారి ప్రయోజనాలను పణంగా పెట్టి ఎవరూ కూడా సాయం చేయరు’’ అని పట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్, ఎకనామిక్స్ ప్రొఫెసర్ డీఎం దివాకర్ అన్నారు.
‘‘ఇది కేవలం పాకిస్తాన్ పరిస్థితి మాత్రమే కాదు. దక్షిణాసియా మొత్తం పరిస్థితి. 1991లో భారత్ పరిస్థితి కూడా ఇంతే. రాబోయే రోజులు భారత్‌కు అంత అనుకూలంగా లేవు. దక్షిణాసియా దేశాలన్ని కూడా పశ్చిమ దేశాలకు వినియోగదారిగా ఉన్నాయి. వినియోగదారి వద్ద డబ్బులుంటేనే ఖర్చు చేయగలడు’’ అని అన్నారు.
పాకిస్తాన్ వాణిజ్య లోటు పెరుగుతుంది. భారత్ పరిస్థితి కూడా అంత బాగా లేదు. భారత్ 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అవతరించి ఉండొచ్చు. బ్రిటన్ వెనక్కి పడిపోయి ఉండొచ్చు. కానీ, బ్రిటన్‌లోని తలసారి ఆదాయంతో పోల్చి చూస్తే, భారత్ ఎక్కడుందో తెలుస్తుంది.
‘‘ప్రపంచానికి మనం మార్కెట్‌గా మారాం. మనం ఏమీ అమ్మడం లేదు. కొంటున్నాం అంతే. పాకిస్తాన్ మనకు శత్రువుగా చెబుతున్నాం. ఆయుధ విక్రయదారులు ఇరు దేశాలకు వీటిని విక్రయిస్తున్నారు. మనం బేసిక్ విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంది. కానీ, ఎవరూ కూడా దీన్ని అర్థం చేసుకునేందుకు సిద్ధంగా లేరు’’ అని ప్రొఫెసర్ డీఎం దివాకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకప్పుడు భారత్‌కు ఇదే పరిస్థితి
1991 జూన్‌లో భారత విదేశీ మారక నిల్వలు ఖాళీ అయిన పరిస్థితి నెలకొంది. 1 బిలియన్ డాలర్ కంటే తక్కువకి పడిపోయాయి. ఆయిల్, ఆహార బిల్లులు చెల్లిస్తే కేవలం 20 రోజుల్లోనే ఈ డాలర్లన్ని అడుగంటిపోతాయి.
ప్రపంచంతో వాణిజ్యం చేసేందుకు కనీసం భారత్ వద్ద సరిపడ విదేశీ కరెన్సీ కూడా లేదు. భారత విదేశీ రుణాలు 72 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బ్రెజిల్, మెక్సికో తర్వాత భారత్ అప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద రుణగ్రహీతగా మారింది.
దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ద్రవ్యోల్బణం, రెవెన్యూ లోటు, కరెంట్ అకౌంట్ లోటులు రెండంకెల స్థాయికి పెరిగాయి.
1990లో కొన్ని అంతర్జాతీయ పరిస్థితులతో భారత్ ఈ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 1990ల్లో గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది. ఇది నేరుగా భారత్‌పై ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరగడంతో, భారత్ ఈ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంది.
1990-91లో పెట్రోలియం దిగుమతి బిల్లు 2 బిలియన్ డాలర్ల నుంచి 5.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. క్రూడాయిల్ ధరలు పెరగడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
ఇది నేరుగా భారత ట్రేడ్ బ్యాలెన్స్‌పై ప్రభావం చూపింది. దీంతో పాటు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారతీయుల ఆదాయాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లు తగ్గిపోయాయి. భారత్‌లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. 1990, 91 మధ్య కాలంలో రాజకీయ అస్థిరత బాగా పెరిగింది.
1989 ఎన్నికల్లో, రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనతా దళ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కానీ, ఈ సంకీర్ణ ప్రభుత్వం కుల, మత కొట్లాటలతో ఎంతో కాలం నిలవలేకపోయింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబర్ 1990లో, వీపీ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మే 1991లో మళ్లీ సాధారణ ఎన్నికలు జరిగే వరకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ రాజకీయ అస్థిర పరిస్థితుల నేపథ్యంలోనే, రాజీవ్ గాంధీ మే 21, 1991న హత్యకు గురయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఎన్‌ఆర్ఐలు దేశం నుంచి తమ నగదును వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. భారత్ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో కూరుకుపోయిందని ఎగుమతిదారులు భావించారు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి.
దిగుమతులు ఆగిపోయాయి. ప్రభుత్వం ఖర్చులని తగ్గించింది. రూపాయి విలువను 20 శాతం తగ్గించారు. బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి.
ఐఎంఎఫ్ భారత్‌కు 1.27 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ, ఆ మొత్తం కూడా భారత పరిస్థితులను మార్చలేదు. 1991 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి, చంద్రశేఖర్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో 20 టన్నుల బంగారాన్ని తనఖా పెట్టాల్సి వచ్చింది.
1991 జూన్ 21న పీవీ నరసింహా రావు ప్రధాన మంత్రి అయిన సమయంలో, భారత్ గడువు లోపల విదేశీ రుణాలను తిరిగి చెల్లించే పరిస్థితిలో కూడా లేదు. రుణ ఎగవేతదారిగా ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ, ఆ సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి పీవీ నరసింహా రావు పలు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పులపై ఆధారపడ్డ పాకిస్తాన్
‘‘నిధులను పొందేందుకు ఐఎంఎఫ్ పెట్టిన షరతుల్లో ఒకటైన ఆర్థిక సంస్కరణలను పాకిస్తాన్ అంగీకరించింది. కానీ త్వరలోనే ఐఎంఎఫ్ ప్రొగ్రామ్ కూడా ముగుస్తుంది. మళ్లీ పాత మార్గానే పాకిస్తాన్ ఎంచుకోనుంది’’అని పాకిస్తాన్ దివంగత ఆర్థిక వేత్త మిఖాల్ అహ్మద్ చెప్పిన విషయాన్ని అమెరికా, బ్రిటన్, యూఎన్‌కి పాకిస్తాన్ అంబాసిడర్ అయిన మలిహా లోధి గుర్తుకు చేశారు.
23 ఏళ్ల క్రితం మిఖాల్ అహ్మద్ చెప్పిన దాన్ని మలిహా లోధి గుర్తుకు చేస్తూ.. రెండు దశాబ్దాలు గడిచినా పాకిస్తాన్‌లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కొన్ని మినహాయిస్తే తప్ప, ఆర్థిక వ్యవస్థలో ఉన్న అసలు సమస్యను పరిష్కరించేందుకు ఎవరూ ప్రయత్నించలేదన్నారు. మిలిటరీ ప్రభుత్వమైనా లేదా ప్రజా ప్రభుత్వమైనా సమస్యల పరిష్కారంలో విఫలమైనట్టు తెలిపారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా విదేశీ సహకారంపై ఆధారపడుతుందని, రుణాలు తీసుకోవడం ఆపడం లేదని మలిహా లోధి చెప్పారు. ఆర్థిక సమగ్రత కోసం ఎవరూ కూడా నిజంగా ప్రయత్నించలేదన్నారు.
మిత్ర దేశాల నుంచి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడాన్ని ప్రభుత్వం సంబరంగా చేసుకుంటుందని చెప్పారు. మీడియా కూడా రుణం పొందితే సెలబ్రేట్ చేస్తుందన్నారు. విదేశీ రుణాలతో దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభం ముగియదని స్పష్టం చేశారు.
‘‘ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా తరఫున పాకిస్తాన్ ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్‌కి పశ్చిమ దేశాల నుంచి తేలిగ్గా, తక్కువ వడ్డీకి రుణాలు వచ్చాయి. ఈ రుణాలు పొందడాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఒక పరిష్కారంగా భావించింది. కానీ ఎలాంటి ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టలేదు’’ అని మలిహా లోధి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వారు పొందే పన్నులు చాలనుకున్నారు. పాకిస్తాన్ విదేశీ రుణాలపై ఆధారపడింది. అభివృద్ధి పరంగా, వినియోగపరంగా కూడా ఈ విదేశీ సాయాలనే ఉపయోగించుకుంది.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికాతో స్నేహం మిలిటరీ సంబంధాలను కూడా పెంచింది. ఆ తర్వాత 1980లో పశ్చిమ దేశాల నుంచి పాకిస్తాన్ ఆర్థిక సహకారాన్ని పొందుతూ వచ్చింది.
9/11 దాడి తర్వాత, పాకిస్తాన్‌ను అమెరికా వ్యూహాత్మకంగా ముఖ్యమైనదిగా భావించి, ఆర్థిక ప్యాకేజీ అందిస్తూ వచ్చింది. అమెరికా సాయంతో, ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ సాయం పొందింది. రుణాలు తిరిగి చెల్లింపు కాలం కూడా పెరిగింది.
పశ్చిమ దేశాలు నుంచి సాయం పొందినన్ని రోజులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి సమస్య లేదు. కానీ, రుణాలు, ఈ విదేశీ సహకారంతో ఎంతో కాలం పాకిస్తాన్ కాలం గడపలేదు. సాయం ముగిసిన వెంటనే, ఇది గాలి బుడగలాగా పేలిపోనుంది.
పాకిస్తాన్ కనీసం తన ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రాథమిక సమస్యలను గుర్తించడం లేదు. ‘‘విదేశీ రుణాలు, విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీల ఆదాయమే ఒక పరిష్కారంగా తీసుకున్నాయి. కానీ, ఎలాంటి ఆర్థిక సంస్కరణలను చేపట్టలేదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక సమస్యను ఎలా పరిష్కరించాలో కనీసం ప్రయత్నించలేదు’’అని మలిహా లోధి ఆవేదన వ్యక్తం చేశారు.
ఫలితంగా ఈ చౌకగా లభించే రుణాలు ఆగిపోయాయి. విదేశీ రుణాల ఊబిలో పాకిస్తాన్ కూరుకుపోయింది. రుణ ఆధారిత వృద్ధి ఎంతో కాలం నిలవదు. ఇది భరించలేని నష్టాన్ని మిగులుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘2017లో పాకిస్తాన్ వార్షిక రుణ చెల్లింపులు 7 బిలియన్ డాలర్లుగా ఉండేవి. కానీ ఈ ఏడాది, వచ్చే ఏడాది 20 బిలియన్ డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంది. పాకిస్తాన్ ముందు ఎలాంటి అవకాశం లేదు. ’’ అని పాకిస్తాన్ ఆర్థిక వేత్త సాకిబ్ షహ్రాని, అల్ జజీరాతో అన్నారు.
స్పష్టమైన ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాల్సి ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను రాజకీయ కోణంలోనే చూస్తుంది. ఈ ఏడాది జూన్-జూలై వరకు ఈ పాలసీ తీసుకురాకుండా వాయిదా వేయాలనుకుంటుంది. జూన్-జూలైలోనే ఈ ప్రభుత్వ పదవీ కాలం ముగియనుంది.
పశ్చిమ దేశాలపై ఆధారపడ్డ పాకిస్తాన్ ప్రస్తుతం చైనా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటుందని మలిహా లోధి అన్నారు. పశ్చిమ దేశాలతో పోలిస్తే, ఈ దేశాల సాయంతో పాకిస్తాన్ బయటపడాలనుకుంటోంది.
ఇటీవలే సౌదీ అరేబియా, యూఏఈలు రుణ తిరిగి చెల్లింపు కాలాన్ని పొడిగించాయి. పాకిస్తాన్‌కు కొత్తగా అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.
డాలర్లను ఆదా చేసుకునేందుకు పాకిస్తాన్ దిగుమతులపై కూడా ఆంక్షలు విధిస్తుంది. తయారీ వస్తువులు కొనేందుకు అంత మొగ్గు చూపడం లేదు. ఫలితంగా, చాలా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గత కొన్ని వారాల నుంచి, టయోటా మోటార్, సుజుకి మోటార్ కంపెనీలు పాకిస్తాన్‌లో ఉన్న తమ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేశాయి. దీంతో పాటు, టెక్స్‌టైల్, ఇతర తయారీ రంగాలు కూడా ఉత్పత్తిని తగ్గించాయి.
ఒకదాని తర్వాత ఒక సంక్షోభంలో పాకిస్తాన్ పడుతుందని, ఒకవేళ దీన్ని పరిష్కరించుకోకపోతే, ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదముందని అమెరికాలో డెలావేర్ యూనివర్సిటీకి చెందిన భారతీయ సంతతి ప్రొఫెషర్ ముక్తదర్ ఖాన్ అన్నారు.
ఇది కూడా చదవండి:
- నేపాల్: పోఖరా విమానాశ్రయానికి భారత్ విమానాలు నడపదు... ఎందుకు
- యుక్రెయిన్: వంట గదిలోకి దూసుకొచ్చిన మిసైల్, ఇంటి యజమాని మృతి
- భారత్‌లో మతపరమైన హింస తగ్గుతోందా, చరిత్ర ఏం చెబుతోంది?
- నేపాల్: విమానప్రమాదంలో ‘చనిపోయిన’ కో పైలెట్ అంజూకు తెనాలికి సంబంధం ఏంటి...
- ముకరం జా: ఇస్తాంబుల్‌లో మరణించిన ఈ ఎనిమిదో నిజాం చరిత్ర ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














