జల్లికట్టు, కోడి పందేలు తరహాలో కుక్కల కొట్లాటలు... జంతువులతో ఇలా ఎన్ని రకాల పోటీలు జరుగుతున్నాయో మీకు తెలుసా?

కుక్కల పందం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రణీతరణ్
    • హోదా, బీబీసీ తమిళ్

తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహిస్తారు. అయితే, ఈ పోటీలపై మొదట్నుంచీ చాలా వివాదాలు రాజుకుంటున్నాయి. ఇలానే ఎద్దులకు బదులుగా ఇతర జంతువులతో ఇలాంటి పోటీలు మన దేశంలో చాలా నిర్వహిస్తున్నారు తెలుసా? అవేమిటో చూద్దాం.

కోడి పందేలు

ఇది రెండు కోళ్ల మధ్య జరిగే పోరు. జల్లికట్టు కోసం ఎద్దులను ఎలా సిద్ధంచేస్తారో కోళ్లకు కూడా అలానే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. భారత్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.

కొన్నిచోట్ల పందేల్లో ఉపయోగించే కోళ్ల కాలికి కత్తులు కూడా కడతారు. ఇవి కత్తులతో ప్రత్యర్థి కోళ్లకు గాయాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి.

కొన్ని పోటీల్లో అవతలి కోడిని చంపితే ఆ కోడిని విజేతగా ప్రకటిస్తారు. ఇలాంటి పోటీలకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. సంక్రాంతి సమయంలోనే ఇక్కడ కోడి పందేలను నిర్వహిస్తారు.

కోడి పందాలు

ఫొటో సోర్స్, Getty Images

చరిత్ర: సింధు నాగరికత సమయంలోనూ కోడి పందేలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కూడా భారత్, చైనా, పర్షియా, గ్రీకు పురాతన నాగరికల్లో ఈ పందాలు నిర్వహించినట్లు ఆధారాలు చెబుతున్నాయి.

నిజానికి కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలను మతపరమైన ఆచారంగా దేవాలయాల ఆవరణల్లో నిర్వహించేవారు. కానీ, నేడు ఇవి ఆచారాల రూపంలో కంటే కోట్ల రూపాయల బెట్టింగ్‌కు కేంద్రాలుగా మారుతున్నాయి.

తమిళ్ దీన్ని ‘‘వెట్రికాల్’’అని, తులులో ‘‘గోరిక్ కట్ట’’అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలతోపాటు కర్నాటకలోని ఉడుపి, కేరళలోని కాసర్‌గోడ్‌లలోనూ కోడి పందాలను నిర్వహిస్తుంటారు.

లీగల్ స్టాటస్: ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చెబుతూ కోడి పందేలపై భారత న్యాయ వ్యవస్థ నిషేధం విధించింది. మరోవైపు ఈ పందేల్లో భాగంగా కోళ్లను దారుణంగా హింసిస్తున్నారని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా ఒక నివేదిక విడుదల చేసింది. అయినప్పటికీ, రాష్ట్రంలో చాలాచోట్ల కోడి పందేలను నిర్వహిస్తూనే ఉన్నారు.

కంబళ

కంబళ

‘‘కంబళ కన్నడ’’ అనేది ఎద్దుల రేసు. కర్నాటకలోని తీర ప్రాంతాల్లో భూస్వాములు, పంచాయతీ పెద్దల మద్దతుతో దీన్ని నిర్వహిస్తుంటారు.

సాధారణంగా బురద నేలలు లేదా వరి పొలాల్లో ఈ రేసు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనే రైతులు కొరడా ఝుళిపిస్తూ రెండు ఎద్దులతో వేగంగా ముందు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.

ఒకప్పుడు పందెంలో గెలిచిన ఎద్దుల యజమానులకు కొబ్బరి, అరటి పళ్లను బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ కూడా బంగారం, వెండి నాణేలు ఇస్తున్నారు. మరోవైపు డబ్బు కూడా ఇక్కడ ఏరులై పారుతుంది.

చరిత్ర: ఖాత్రి కంబళ అనేది మంగళూరు ఖాత్రిలోని మంజునాథ ఆలయ పరిసరాల్లో నిర్వహించేవారు. దీన్నే థీవర కంబళ అని కూడా పిలిచేవారు. 300 ఏళ్ల క్రితం నిర్వహించే ఈ వేడుకకు ఆనాటి అలూబ రాజులు కూడా హాజరయ్యేవారు. ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కంబళను నిర్వహిస్తుంటారు.

సాధారణంగా నవంబరు చివరి నుంచి మార్చి మొదటివరకు కంబళ సీజన్‌గా చెబుతారు. కర్ణాటకలో దాదాపు అన్ని తీర ప్రాంతాల్లోనూ ఏదో ఒక పేరుతో ఈ పోటీని నిర్వహిస్తుంటారు. మరోవైపు కేరళలోనూ కోతల తర్వాత ఈ పోటీలు నిర్వహిస్తుంటారు.

లీగల్ స్టాటస్: ఈ పోటీల్లో కొరడాలను ఉపయోగించడంపై జంతు హక్కుల కార్యకర్తలు మొదట్నుంచీ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై 2014 మే 7న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. జల్లికట్టు లేదా కంబళలో జంతువులను హింసించకూడదని స్పష్టంచేసింది. దీనిపై నిషేధం కూడా విధించింది.

అయితే, రాష్ట్రంలో జంతువులను హింసించకుండా కంబళ పోటీలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఒక సవరణను తీసుకొచ్చింది.

ఎద్దుల రేసు

ఫొటో సోర్స్, Getty Images

ఎద్దుల బళ్ల రేసు

మహారాష్ట్రలో ఎద్దుల బళ్ల రేసులను ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మీటర్ల దూరాన్ని ఎద్దుల బళ్లపై ఎవరైతే వేగంగా చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. దీనిలో చాలా మంది రైతులు పాల్గొంటారు.

వినాయకచవితి సమయంలో ఎక్కువగా ఈ పోటీలను నిర్వహిస్తారు. గ్రామాల్లోని జాతరల్లో ఈ పోటీలను మనం చూడొచ్చు.

శతాబ్దాల నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నమని, ఇవి తమ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకని ఎద్దుల బళ్ల పోటీల నిర్వాహకులు చెబుతుంటారు. వీటి కోసం కొన్ని ఎద్దులను ప్రత్యేకంగా సిద్ధంచేస్తుంటారు.

ఒకవేళ ఈ పోటీలపై నిషేధం విధిస్తే, వీటి కోసం ప్రత్యేకంగా సిద్ధంచేస్తున్న ఎద్దులు అంతరించేపోయే ముప్పుందని పోటీ నిర్వాహకులు చెబుతున్నారు. మహారాష్ట్రతోపాటు పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ రేసు నిర్వహిస్తుంటారు.

లీగల్ స్టాటస్: ఈ రేసుల్లో భాగంగా ఎద్దులను హింసిస్తున్నారని జంతు హక్కుల సంస్థ పెటా చెబుతోంది. ముఖ్యంగా బురద, మట్టిరాళ్లపై వేగంగా ముందుకు వెళ్లేలా జంతువులను కొరడాతో కొడతారని వివరిస్తోంది. అయితే, 2014లో వీటిపై కూడా సుప్రీం కోర్టు నిషేధం విధించింది.

కానీ, స్థానిక రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో ఈ పోటీలు మహారాష్ట్రలో జరుగుతూనే ఉన్నాయి.

ఒంటెల రేసు

ఒంటెల పందేలు

రాజస్థాన్‌లోని అజ్‌మేర్ జిల్లా పుష్కర్‌లో గుర్రం, ఒంటెల పందాలు నిర్వహిస్తుంటారు. వీటిలో విజేతలకు నేరుగా రాజస్థాన్ ప్రభుత్వమే నగదు బహుమతిని అందిస్తుంటుంది.

ఈ రేసులో గెలిచేందుకు ఒంటెలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఈ రేసులకు ముందుగా గిరిజనుల నృత్యాలు, ఒంటెల అందాల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.

సాధారణంగా ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించిన ఒంటెను విజేతగా ప్రకటిస్తారు. అక్టోబరు లేదా నవంబరులో వారం రోజులపాటు ఈ పుష్కర్ ఒంటెల పందాలను నిర్వహిస్తారు.

లీగల్ స్టాటస్: ఒంటెల పోటీలను రాజస్థాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే, ఒంటెల ముక్కులకు పెద్దపెద్ద ఆభరణాలు పెట్టడం, వాటిని హింసించడం లాంటి చర్యలపై ఇక్కడ ఆంక్షలు అమలులో ఉన్నాయి.

కుక్కల పందం

కుక్కల పందేలు

ఆహూతులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా కుక్కల పందేలు నిర్వహిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు వీటిల్లో రక్తపాతం కూడా జరుగుతుంది.

ఆ కుక్కలను ఆహారం పెట్టకుండా ఒక బోనులో బందిస్తారు. ఒక్కసారిగా వాటిని వదిలిన వెంటనే, ఎదుటి కుక్కపై భయానకంగా అవి దాడులు చేస్తాయి. ఒక్కోసారి వీటిలో ఒక కుక్క చనిపోవచ్చు కూడా.

ఇక్కడ గెలిచిన కుక్క యజమానికి లక్షల రూపాయల్లో డబ్బులు కూడా ఇస్తారు.

చరిత్ర: 18వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో ఈ పోటీలను ఎక్కువగా నిర్వహించేవారు. అయితే, నేడు భారత్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాలకూ ఇవి చేరిపోయాయి.

ఈ పోటీల కోసం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాల నుంచి ప్రత్యేకంగా కుక్కలను తీసుకువస్తుంటారు. దిల్లీ శివార్లతోపాటు గురుగ్రామ్‌, నోయిడాలలోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి.

వీటికి చూడటానికి వచ్చే వారు కూడా చాలా కొద్దిమందే ఉంటారు. మరోవైపు పంజాబ్, హరియాణాల్లో ధనవంతులు సరదా కోసం ఇలాంటి పోటీలను నిర్వహించే సంప్రదాయం పెరుగుతోంది.

లీగల్ స్టాటస్: ఇలాంటి పోటీలను నిర్వహించడానికి ఎలాంటి అనుమతులూ లేవు.

ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారం కుక్కల పందాలు నిర్వహించడం నేరం. వీటిని సుప్రీం కోర్టు కూడా నిషేధించింది.

బుల్‌బుల్ పోటీ

ఫొటో సోర్స్, Getty Images

బుల్‌బుల్ పోటీ

సంక్రాంతి సమయంలోనే అసోంలో భోగలి బిహు వేడుక నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా గువాహటికి 30 కి.మీ. దూరంలో హయగ్రీవ మాధవ ఆలయానికి సమీపంలో బుల్‌బుల్ పందేలు నిర్వహిస్తారు.

వీటి కోసం బుల్‌బుల్‌ను పట్టి వారాల పాటు గ్రామస్థులు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఈ పోటీల్లో గెలిచే పక్షుల యజమానులకు భిన్న రకాల బహుమతులు ఇస్తుంటారు. అయితే, ఈ పోటీల్లో పక్షులు కూడా గాయపడుతుంటాయి.

పోటీల్లో ఓడిపోయిన పక్షుల ముక్కు ముందు భాగాన్ని కత్తిరిస్తారు. దీంతో మరోసారి మళ్లీ ఇవి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండదు.

ఈ పోటీ అంటే అహోం రాజు స్వర్గదేవ్ బ్రహ్మథ సింఘకు చాలా ఇష్టమని చరిత్ర చెబుతోంది. ఈ పోటీల కోసం పక్షులను పట్టుకోవాలని ఆయన సూచించేవారని, ఆ తర్వాత ఇది అస్సాంలో ఒక సంప్రదాయంలా మారిందని చెబుతారు.

లీగల్ స్టాటస్: ఈ పక్షుల పోటీపై నిషేధం విధించాలని జంతు ప్రేమికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే, 2016లో ఈ పోటీ నిర్వహించకుండా గువాహటి హైకోర్టు ఆదేశాలు విడుదల చేసింది. కానీ, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ పందాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గుర్రాల రేసు

ఫొటో సోర్స్, Getty Images

గుర్రాల పోటీ

ఇది గుర్రాల రేసుగా చెప్పుకోవాలి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఒక నిర్దేశిత మార్గంలో గుర్రాలను పరుగులు పెట్టిస్తుంటారు.

గమ్యానికి వేగంగా చేరుకునే గుర్రాన్ని విజేతగా ప్రకటిస్తారు. గ్రీసు, సిరియా, ఈజిప్టులలో పురాతన కాలం నుంచీ ఈ రేసులను నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది.

దీనికి భారత్‌లోనూ దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. భారత్‌లో తొలి రేసు కోర్స్‌ను చెన్నైలో 1777లో ఏర్పాటుచేశారు. తొమ్మిది రేసింగ్ ట్రాకులపై అప్పట్లో ఈ పందాలు నిర్వహించేవారు.

1891లో మైసూర్‌లోనూ బ్రిటిష్ రాజ కుటుంబాలు ఈ పందాలను నిర్వహించడం మొదలుపెట్టాయి.

లీగల్ స్టాటస్: 1996లో గుర్రాల రేసులు.. పోలీస్ యాక్ట్ 1888, లేదా గేమింగ్ యాక్ట్ 1930ను ఉల్లంఘించడంలేదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.

ఆ తీర్పు తర్వాత గుర్రాల పందాలకు మరింత ప్రజాదరణ లభించింది. భారత్‌లో గుర్రాల రేసులను నిర్వహించడం చట్ట వ్యతిరేకం కాదు. వీటిని ప్రొఫెషనల్ రేసింగ్‌గా పరిగణిస్తారు.

వీడియో క్యాప్షన్, రోజూ తనకు అన్నం పెట్టే వ్యక్తి చనిపోయినప్పుడు కొండముచ్చు ఏం చేసింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)