లెస్బియన్‌గా జీవితం ఎలా ఉంటుంది... ఇందులోనూ మోసాలు ఉంటాయా

సౌందర్య

ఫొటో సోర్స్, SOUNDARYA

ఫొటో క్యాప్షన్, సౌందర్య
    • రచయిత, కె.శుభగుణం
    • హోదా, బీబీసీ తమిళ్

భారత్‌ లాంటి ‘సంప్రదాయ’ దేశాల్లో స్వలింగ సంపర్కులు తమ జెండర్‌ను బయటపెట్టం సవాల్ లాంటిది.

అదే బైసెక్సువల్స్ అయితే వారి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది.

ఈ సవాళ్ల నడుమ ఒక యువతి సగర్వంగా తన జెండర్‌ను బయటకు చెబుతున్నారు. సమాజంలో వివక్ష ఎదురైనప్పటికీ ఆమె తలఎత్తుకుని ముందుకు వెళ్తున్నారు.

తమిళనాడు సేలం జిల్లాకు చెందిన సౌందర్య కథ ఇదీ. తను ప్రేమించిన అమ్మాయి గురించి తన కుటుంబానికి, బయట ప్రపంచానికి చెప్పినప్పుడు తను కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

‘‘ఇదే నా ఐడెంటిటీ. దీన్ని ఎందుకు నేను దాచుకోవాలి. ఎంత కష్టమైనా నేను భరిస్తాను. దేన్నీ దాచుకోవాల్సిన పనిలేదు’’ అని ఆ యువతి చెప్పారు.

సమాజంలో తను ఎదుర్కొన్న వివక్ష, అవమానాలు ఆ అమ్మాయి మాటల్లోనే..

సౌందర్య

ఫొటో సోర్స్, SOUNDARYA

మూడేళ్ల క్రితం మొదట మా అక్క, బావతో నా జెండర్ గురించి చెప్పాను. వారు నన్ను అర్థం చేసుకున్నారు. అయితే, ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పినప్పుడు, అలా జరగలేదు.

మా అక్కా, బావ నుంచి లభించిన మద్దతుతో ఏడాదిన్నర క్రితం మా అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పాను. కానీ, మా అమ్మ నుంచి చాలా ప్రతిఘటన ఎదురైంది. వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది.

అయితే, కుటుంబం కంటే బయటి సమాజం నుంచే నేను ఎక్కువ వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను ఒక ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు.. ‘‘నువ్వు అబ్బాయిలా జట్టు ఎందుకు కత్తిరించుకున్నావు?’’అని అడిగారు.

‘‘ఎందుకంటే నేను లెస్బియన్‌ ’’అని చెప్పాను. ఆ ఇంటర్వ్యూ చేసిన వారిలో ఒక వ్యక్తి టీమ్ లీడర్ ఉన్నారు.

పారదర్శకంగా ఉండేందుకు ఆ ఇంటర్వ్యూలో అన్ని వివరాలూ వెల్లడించాను. అయితే, నాకు కుటుంబ మద్దతు లేదనే విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి నన్ను వేధించడం మొదలుపెట్టాడు.

సౌందర్య

ఫొటో సోర్స్, Getty Images

రాత్రి పది గంటల తర్వాత అతడు ఫోన్ చేసేవాడు. అడిగితే, ఆఫీసు మీటింగ్ అని చెప్పేవాడు. ఐదు నిమిషాల తర్వాత అనవసరమైనవన్నీ మాట్లాడేవాడు. అడగకూడని ప్రశ్నలు అడిగేవాడు.

ఒక రోజు అలా అర్ధరాత్రి మాట్లాడుతున్నప్పుడే, పరిస్థితి చేజారుతోందని అర్థమైంది. అప్పుడు మా అక్క కూడా నాతోనే ఉంది. ఆ ఫోన్ స్క్రీన్ షాట్ కూడా మేం తీసుకున్నాం.

అతడు నాపై చాలా ఒత్తిడి చేసేవాడు. దీంతో చాలా భయం పెరిగేది. ఎవరితోనూ చెప్పలేకపోయాను. ఒకవేళ చెప్పినా, అందరూ నన్నే తప్పు పడతారు.

ఒకరోజు నేను ఆ మీటింగ్‌లో ఉన్నప్పుడే, తను పురుషాంగం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. వెంటనే నేను మ్యూట్ చేశాను. అతడు మొదట్నుంచీ నాతో అభ్యంతరకరంగా మాట్లాడేవాడు.

కానీ, నాకు కుటుంబ సభ్యుల సాయం లేకపోవడంతో నేనేమీ చేయలేకపోదాన్ని.

నేను చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ బాధ నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేదు. మరోవైపు ఆ టీమ్ లీడర్ కూడా చాలా ఒత్తిడి చేసేవాడు. ఈ ఒత్తిడి తట్టుకోలేక, నేను కౌన్సెలింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను.

ఒకసారి ఈ ఒత్తిడి తట్టుకోలేని స్థాయికి వెళ్లింది. దీంతో టీమ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాను. అయితే, ఇలాంటి ఫిర్యాదులతో టీమ్ మొత్తాన్ని భ్రష్టుపట్టిస్తున్నాని ఆయన అన్నారు.

‘‘నీకు నువ్వే ఏదో ఊహించేసుకొని నా దగ్గరకు రావద్దు’’ అని మేనేజర్ నాతో అన్నారు. ఇక నేను ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి లేదు. ఉద్యోగం మానేద్దామని అనుకున్నాను. అప్పుడు హెచ్ఆర్‌ విభాగంలో ఒకరితో మాట్లాడమని ఒకరు చెప్పారు.

అక్కడకు వెళ్లి ఏం జరిగిందో నేను వారికి చెప్పాను. వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.

అక్కతో సౌందర్య

ఫొటో సోర్స్, SOUNDARYA

ఫొటో క్యాప్షన్, అక్కతో సౌందర్య

మా లాంటి అమ్మాయిలకు పెద్దగా కుటుంబ సభ్యుల మద్దతు ఉండదు. అలానే అటు ఉద్యోగం, ఇటు ఇంటి దగ్గర ఎవరూ మమ్మల్ని సరిగా అర్థం చేసుకోరు.

స్వలింగ సంపర్కులకు ఇల్లు కూడా అద్దెకు ఇవ్వరు. ఇక బహిరంగ ప్రాంతాల్లో మరుగుదొడ్డి ఉపయోగించడం కూడా సమస్యే. నేను అబ్బాయిల్లా బట్టలు వేసుకుంటాను, నా జుట్టు కూడా అబ్బాయిల్లానే ఉంటుంది. కాబట్టి ప్రజామరుగుదొడ్లు ఉపయోగించడం చాలా కష్టం.

నేడు బయటకు వెళ్లినా, అందరూ నన్ను అలానే చూస్తారు. ‘‘అసలు ఈమె ఎందుకు ఇలా ఉంది’’ అనేలా చూస్తారు.

అందుకే నేను నా సోషల్ మీడియా అకౌంట్‌లో లెస్బియన్‌ను అని రాసుకున్నాను. దీంతో చాలా మంది మేం కూడా లెస్బియన్ల మంటూ నాతో చాలా మంది మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.

అలానే సోషల్ మీడియాలో ఒక అమ్మాయితో నాకు పరిచయమైంది. మా పరిచయం ప్రేమగా మారింది.

సౌందర్య

ఫొటో సోర్స్, Getty Images

అయితే, నేను ప్రేమలో పడిన అమ్మాయి చెల్లి మా ప్రేమ గురించి తెలుసుకొని నాకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది.

నిజానికి సాధారణ జంటలకు స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ సాయం చేస్తారు. అయితే, ఇలాంటి సాయం స్వలింగ సంపర్కులకు దొరకదు. అందుకే ఆమె చెల్లి నుంచి సాయంపై నేను ఆసక్తి చూపలేదు.

కానీ, నెమ్మదిగా నా దగ్గర నుంచి డబ్బులు గుంజడానికే ఈ ప్రేమ అని అర్థమైంది. తమ కుటుంబం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, తమకు సాయం చేయాలని వారు అడిగేవారు.

నీ ప్రేమికురాలి కుటుంబ సమస్య నీది కాదా? అని నన్ను ఆమె చెల్లి అడిగేది. ఇది అలా పతాక స్థాయికి వెళ్లింది. దీంతో నేను డబ్బులు ఇవ్వడం మానేశాను.

ఆ తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి కూడా డబ్బులు అడగడం మొదలుపెట్టింది. నేను ఇవ్వనని చెప్పాను. దీంతో నా ప్రేమకు ఆమె గుడ్‌బై చెప్పి వెళ్లిపోయింది.

నేను నా జెండర్‌ను ఇన్‌స్టాతోపాటు అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశాను. దీంతో చాలా మంది నన్ను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నిజమేంటో తెలుసుకునే సమయానికే నేను చాలా నష్టపోయేదాన్ని.

వీడియో క్యాప్షన్, ట్రాన్స్‌వుమన్ గురించి ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఎందుకు వస్తాయో?

‘‘నేను నాలా ఉండటమే నా బలం’’

ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అసలు నా జెండర్‌ను ఎందుకు బయటపెట్టానా? అని ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఎందుకంటే అది నా ఐడెంటిటీ.

నా స్నేహితులు కొద్ది మందే ఉన్నప్పటికీ, వారు చాలా మంచివారు.

నా స్నేహితుల్లో చాలా మంది బాగా చదువుకున్నవారే ఉన్నారు. మరికొంతమంది నా గురించి తెలిసిన వెంటనే, నన్ను దూరం పెడతారు. మరికొందరు నన్ను బ్లాక్ చేస్తుంటారు. ఒక్కోసారి బాగా చదువుకున్నవారికి కూడా దీని గురించి ఏమీ తెలియదని అనిపిస్తుంది.

ఇక్కడ మాకు అన్నీ సమస్యలే. బట్టలు మార్చుకోవడం నుంచి మరుగుదొడ్డి నుంచి ప్రతి విషయంలోనూ మాకు ఇబ్బంది ఉంటుంది.

ఒక బాలికకు స్కూలులో ఉన్నప్పుడే తన జెండర్ గురించి తెలిస్తే, తను అబ్బాయిలా బట్టలు వేసుకోగలదా?

చాలా కష్టం. ఎందుకంటే స్కూలు, కాలేజీల్లో చాలా మంది పిల్లలకు ఆ అవగాహనే ఉండటం లేదు.

వీడియో క్యాప్షన్, "తల్లిదండ్రులు మమ్మల్ని ట్రాన్స్‌జెండర్లుగా గుర్తిస్తే, మేం ఇలా వీధిన పడం"

మీరు మగవారి శరీరంతో పుడితే, మగవారి బట్టలే వేసుకునేలా ఒత్తిడి చేస్తారు. అమ్మాయిల శరీరంతో పుడితే, అమ్మాయిల బట్టలే వేసుకోవాలి. స్కూళ్లు, కాలేజీల నుంచి పిల్లలకు అవగాహన కల్పిస్తేనే ఈ విషయంలో సమాజంలో మార్పు వస్తుంది.

నేనోంటో నా కుటుంబానికి, నా స్నేహితులకు తెలుసు. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ఈ విషయంపై నాలాంటి వారితో నేను మాట్లాడుతున్నాను. దీని వల్ల నాకు మద్దతు లభిస్తున్నట్లు అనిపిస్తుంది.

ఇదివరకు నేను స్నేహితులతో మాట్లాడేందుకు ఇష్టపడేదాన్ని కాదు. ఒకవేళ నా గురించి తెలిస్తే, వారు ఏం అనుకుంటారు? అని నేను అనుకునేదాన్ని.

కానీ, ఒక సాధారణ వ్యక్తి ఎలా ప్రేమలో పడతాడో మేం కూడా అలానే ప్రేమలో పడతాం. కానీ, దీన్ని ఎవరూ గుర్తించరు.

అయితే, ఇప్పుడు ఎవరో గుర్తించరనే భయం నాకు లేదు. ‘‘నా స్నేహితుల్లో ఒక ఆమె బైసెక్సుల్ ఉంది. ఆమె వచ్చి మన ఇద్దరం కలిసి వేరొకరితో సెక్స్ చేద్దామా’’అని అడిగింది.

ఇలాంటి చెత్త కామెంట్లకు ఎలా సమాధానం ఇవ్వాలో నాకు తెలుసు.

నేడు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. నేను నా ఐడెంటిటీని బయటపెట్టాను, ఎందుకంటే అదే నేను. వేరొకరి కోసం వెనకడుగు వేయను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)