స్విగ్గీబాయ్ రిజ్వాన్: అన్నయ్య ఐడీ మీద డెలివరీకి వెళ్లాడు, శవమై తిరిగొచ్చాడు... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images/BBC
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా మహమ్మద్ ఖాజా డ్యూటీ చేస్తున్నాడు. కానీ ఆ రోజు అతనికి కుదరలేదు.
దీంతో తమ్ముడు మహమ్మద్ రిజ్వాన్‌ను డ్యూటీకి పంపాడు. స్విగ్గీ డీటెయిల్స్ లో ఖాజా పేరే ఉంటుంది, కానీ వాస్తవంగా డ్యూటీకి వెళ్లింది రిజ్వాన్.
రిజ్వాన్‌కి కూడా అదేమీ కొత్త కాదు. తను కూడా మూడేళ్లుగా స్విగ్గీ, జొమాటోల్లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.
కాకపోతే వేరే కారణాల వల్ల అతని స్విగ్గీ ఐడీ బ్లాక్ అవడంతో ఒకరి ఐడీ మీదే, అన్నదమ్ములిద్దరూ డ్యూటీలు చేస్తున్నారు.
ఆ రోజు జనవరి 11. సమయం రాత్రి 9 గంటలు. హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లాడు రిజ్వాన్.
ఫ్లాట్ ముందు నుంచొని బెల్ కొట్టగానే యజమాని రాలేదు. ఆవిడ పెంచుకుంటోన్న జర్మన్ షెఫర్డ్ కుక్క వచ్చింది.
ఆ కుక్క వచ్చిన వేగం చూసిన రిజ్వాన్ భయపడ్డాడు. పరుగెత్తాడు. రిజ్వాన్ వెనక కుక్క పరుగెత్తింది. ఆ వేగంలో మూడో అంతస్తు నుంచి కింద పడ్డాడు.
తలకి గాయం అయింది. పక్కటెముకలు విరిగాయి. రెండు కాళ్లూ విరిగాయి. ఆ ఇంటి యజమానురాలు, ఇతరులు కలసి నిమ్స్ లో చేర్చారు.
నాలుగు రోజులు మృత్యువుతో పోరాడాడు. చివరకి 14వ తేదీ శనివారం 23 ఏళ్ల రిజ్వాన్ తుదిశ్వాస విడిచాడు

కుటుంబ పోషణ కోసం చదువు వదిలేసి
యూసఫ్ గూడ శ్రీరామ నగర్‌లో రిజ్వాన్ చాలా మందికి తెలుసు. నలుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడు. అందరికీ ఇష్టమైన వాడు.
వీధిలో అతను ఎక్కువమందికి ఎందుకు తెలుసంటే, క్రికెట్ బాగా ఆడే రిజ్వాన్ అనేక స్థానిక టోర్నమెంటుల్లో ఎన్నో మెడల్స్ గెలిచాడు. ఎప్పడూ చురుగ్గా, కష్టపడుతూ కనిపించేవాడు.
రిజ్వాన్ తల్లి అయిదేళ్ల కిందట చనిపోయింది. తండ్రి గతంలో వెయిటర్ గా పనిచేసేవాడు. అనారోగ్యం వల్ల ఇప్పుడు పనిచేయడం లేదు.
తండ్రిని చూసుకునేవాళ్లు లేరు. ఇల్లు గడిచే మార్గమూ లేదు. దీంతో బీకామ్ మొదటి సంవత్సరంలోనే చదువు మానేశాడు.
ఇంట్లో ఉండి తండ్రిని చూసుకుంటూ, చిన్నా చితకా పనులు చేసుకునేవాడు. అలా మూడేళ్ల క్రితం స్విగ్గీ, జొమాటోలకు డెలివరీ బాయ్ గా చేయడం మొదలుపెట్టాడు.
ఇల్లు గడవడానికి లోటు లేకుండా వెళుతోంది. తను రోజుకు 10 గంటలకుపైగా బయటి కష్టపడి పనిచేస్తూ, ఇంట్లో తల్లిలేని లోటు తీరుస్తున్నాడు.
తండ్రికి అన్నీ తానై చూసుకుంటాడు. అందుకే మిగిలిన ముగ్గురు అన్నలకీ అతనంటే ఇష్టం.
ముందుగా పోలీసులు ఐపీసీ 289 (జంతువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం), ఐపీసీ 336 (నిర్లక్ష్యంతో ఇతరులకు గాయాలయ్యేలా చేయడం) సెక్షన్లు కింద కేసు పెట్టారు. రిజ్వాన్ మరణించిన తరువాత ఐపీసీ 304 ఏ సెక్షన్ కింద కేసు మార్చారు.
‘‘చనిపోయిన రిజ్వాన్ అన్నయ్య ఖాజా ఫిర్యాదు మేరకు కేసు పెట్టాం. ఎవర్నీ అరెస్టు చేయలేదు. కేసు విచారణ జరుగుతోంది.’’ అని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎ.నరేందర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Swiggy/twitter
బాధిత కుటుంబానికి పరిహారం అందుతుందా?
నిజానికి ఆ రోజు డ్యూటీకి వెళ్లాల్సిన ఖాజా ఇప్పుడు ఫిర్యాదుదారు అయ్యారు. అయితే అలా డ్యూటీ మార్చుకోవడం వల్ల తమకు స్విగ్గీ నుంచి పరిహారం వస్తుందో రాదో అన్న ఆందోళన వారిలో కనిపించింది.
దీనిపై స్విగ్గీ స్పందించింది. ‘‘ఘటన దురదృష్టకరం. స్విగ్గీ విధుల్లో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది.
ఆ కుటుంబంతో మేం టచ్ లో ఉన్నాం.’’ అన్ని స్విగ్గీ ప్రకటన విడుదల చేసింది. కానీ ఆ రోజు డ్యూటీలో ఎవరు ఉన్నారు? ఎవరు వెళ్లారు? వంటి విచారణ జరిగితే తమకు పరిహారం రాదనే స్పష్టత ఆ కుటుంబానికి ఉంది.
మరోవైపు గిగ్ వర్కర్ల సంఘం వారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. తెలంగాణ గిగ్ వర్కర్ల సంఘం కో ఫౌండర్ సలావుద్దీన్ దీని గురించి పోరాడుతున్నారు.
చనిపోయిన వ్యక్తికి కార్మిక చట్టాల ప్రకారం దాదాపు రూ. 22 లక్షల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరోవైపు కేసు ఉపసంహరించుకుని పెద్ద మనుషుల దగ్గర సమస్యను పరిష్కరించుకోవాలనే ప్రయత్నాలు కూడా రిజ్వాన్ కుటుంబ సభ్యులు కొందరు చేస్తున్నారు.
ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఈ కేసును లోక్ అదాలత్‌లో కూడా పరిష్కరించుకోవచ్చు. దీంతో రిజ్వాన్ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేలా కేసును వెనక్కు తీసుకునేలా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి.
బహుశా రిజ్వాన్ మరణానికి స్విగ్గీ నుంచి అధికారికంగా అందాల్సిన పరిహారం అందకపోవచ్చు. కేవలం మానవతా దృక్పథంతో కొంత మొత్తం ఇవ్వవచ్చు. మరోవైపు ఈ ఘటన జరిగిన ఇంటి యజమాని నుంచి ఆ కుటుంబానికి పరిహారం అందవచ్చు.
కానీ మరో రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని కలలు కన్న చలాకీ యువకుడు, రోజుకు ఐదొందలో, ఏడొందలో సంపాదిస్తూ చురుగ్గా ఉండే యువకుడు, అన్నిటికీ మించి కుటుంబాన్ని తన రెక్కల మీద మోస్తున్న మనిషి వారికి ఎప్పటికీ దొరకడు.
ఇవి కూడా చదవండి
- కూర్మగ్రామం: ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- ఈ దేశంలో చికెన్ కన్నా ఉల్లిపాయల ధర మూడు రెట్లు ఎక్కువ... కిలో రూ. 890
- జేపీ నడ్డా మీద నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఎందుకంత నమ్మకం?
- కేసీఆర్: విశాఖ ఉక్కును మోదీ అమ్మితే... మేం మళ్లీ తీసుకొస్తాం
- మెదక్: తన పేరు మీద రూ.7 కోట్లకు బీమా... ‘తన లాంటి వ్యక్తిని చంపేసి తానే చనిపోయినట్లు నాటకం’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














