పాకిస్తాన్ చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు: ‘నేను, వలంటీర్లు కలిసి వరద నీటిలోంచి చాలా శవాలు బయటకు తీశాం’

ఫొటో సోర్స్, Muhammad Awais Tariq
ఇటీవలి చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ వరదలతో పాకిస్తాన్ అతలాకుతలమైంది. అంతర్జాతీయ సమాజం అందిస్తున్న సాయం ఇప్పుడిప్పుడే పాక్‌కు చేరుతోంది. అయితే నిరాశ్రయులైన లక్షలాది మంది జనం ఇంకా ఎలాంటి సాయమూ అందక అల్లాడుతున్నారు.
ఇది 'విలయ సంక్షోభం' అని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీ ఖర్ అభివర్ణించారు.
''పర్యావరణానికి ఎలాంటి చేటూ చేయని నిరుపేదలు ఈ వాతావరణ సంక్షోభం పర్యవసానాలను చవిచూస్తున్నారు'' అని ఆమె వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్‌లో మూడో వంతు భూభాగం వరదల్లో నీట మునిగింది. వెయ్యి మందికి పైగా చనిపోయారు. వరదల వల్ల వాటిల్లిన నష్టం వెయ్యి కోట్ల డాలర్లకు పైనే ఉంటుందని అధికార యంత్రాంగాలు చెప్తున్నాయి.
ఈ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారితో బీబీసీ మాట్లాడింది. వారికి సాయం చేయటం కోసం ప్రయత్నిస్తున్న వారితోనూ సంభాషించింది.

ఫొటో సోర్స్, Muhammad Awais Tariq
'వరద నీటిలోంచి శవాలను బయటకు తీశాను'
''మా ప్రాంతంలో చాలా మంది చనిపోయారు. నేను, ఇంకొందరు వలంటీర్లం కలిసి వరద నీటి లోంచి 15కు పైగా శవాలను బయటకు తీశాం'' అని ముహమ్మద్ అవాయిస్ తారిక్ చెప్పారు.
ఈ 20 ఏళ్ల యువకుడు మెడిసిన్ చదువుతున్నారు. ఇస్లామాబాద్‌కు నైరుతి దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాన్సా షరీఫ్ నగరంలో నివసిస్తున్నారు.
ఈ ప్రాంతం చాలా భాగం నీట మునిగింది. నగరంలోని స్మశాన వాటికలను కూడా వరద ముంచెత్తింది.
''స్మశానంలో పొడిగా ఉన్న చోటే లేదు. అదంతా ఇప్పుడు నీటి అడుగున ఉంది. దీంతో చనిపోయిన వారిని వారి ఇళ్ల దగ్గరే సమాధి చేయాలని మేం నిర్ణయించాం'' అని తారిక్ వివరించారు.

ఫొటో సోర్స్, Muhammad Awais Tariq.
అయితే వరదల్లో మునిగి చనిపోయిన వారిలో కొందరి శవాలు ఇంకా దొరకలేదు.
ముంచెత్తబోతున్న వరదల గురించి ముందుగా హెచ్చరించే వ్యవస్థ లేకపోవటం వల్ల.. ఎంత విషాదకర పరిణామాలు సంభవిస్తాయనేది తారిక్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.
''మా పట్టణం దగ్గర ఒక ఊర్లో బురదలో మునిగివున్న ఓ ఐదేళ్ల చిన్నారిని నేను చూశాను. ఆ ప్రాంతాన్ని కొన్ని గంటల ముందే ఆకస్మిక వరదలు ముంచెత్తాయని స్థానికులు చెప్పారు. ఆ వరదల్లో ఆ బాలుడితో పాటు, అతడి తండ్రి కూడా చిక్కుకుపోయారు. ఆ తండ్రి తన కొడుకుని ఎలాగో సురక్షిత ప్రదేశానికి చేర్చాడు. కానీ ఆ క్రమంలో ఆ తండ్రి వరదనీటిలో మునిగిపోయాడు'' అని ఆయన బీబీసీకి తెలిపారు.
ఆ తండ్రి శవాన్ని గ్రామస్తులు వెలికితీయగలిగారు. ఆ బాలుడు ఇప్పుడు తన తల్లి దగ్గర క్షేమంగా ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు.

ఫొటో సోర్స్, Muhammad Awais Tariq
''ఆగస్టు 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ మా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే ప్రస్తుతానికి వర్షం ఆగింది. వరద నీరు క్రమంగా తగ్గుతోంది'' అని తారిక్ వివరించారు.
వరదల కారణంగా గ్రామాల నుంచి ప్రజలు ఇప్పుడు తలదాచుకోవటానికి పట్టణాలు, నగరాలకు వెల్లువెత్తుతున్నారని.. దీనివల్ల తొలుత వరదల ప్రభావం లేని ప్రాంతాల మీద ఒత్తిడి పెరుగుతోందని కూడా తారిక్ చెప్తున్నారు.
ఇప్పటికీ తన ఇల్లు మోకాలి లోతు వరద నీటిలో ఉందని, చాలా మంది జనం వరదల్లో సగం మునిగిన ఇళ్లలోనే గడుపుతున్నారని ఆయన తెలిపారు.
అయితే.. తమ ప్రాంతంలో ఏడు రోజుల పాటు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభం కావటం కాస్త ఊరటనిస్తోందని చెప్పారు.

ఫొటో సోర్స్, Muhammad Awais Tariq
'ఉప్పొంగిన సరస్సు మా ఇళ్లను ఊడ్చేసింది'
''వరదల వల్ల మా ప్రాంతంలో కనీసం ఆరు ఊర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా మంది తమ ఇళ్లు కోల్పోయారు. వెయ్యికి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి'' అని పీర్జాదా తెలిపారు.
ఆయన పర్వత ప్రాంతమైన కైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలోని అప్పర్ చిత్రాల్ జిల్లా రాజధాని బునీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు.
''వరద నీరు బునీ వరకూ రాలేదు. కానీ చుట్టుపక్కల గ్రామాలను నాశనం చేశాయి. భారీ వర్షాలు కురిసాయి, హిమనీనదాల సరస్సులు ఉప్పొంగాయి. వాటివల్లే ఈ భీకర వరదలు ముంచెత్తాయి'' అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Peerzada
తనకు తెలిసినంతవరకూ బునీలో కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎవరూ చనిపోలేదని చెప్పారు.
కానీ వందలాది మంది జనం ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారని, ఇప్పుడు టెంట్లలో నివసిస్తున్నారని తెలిపారు. జలకు తాగునీరు కూడా దొరకటం లేదని, ఇతర నిత్యావసరాలు గననమైపోయాయని చెప్పారు.
''చలి చాలా పెరుగుతోంది. జనానికి స్వెటర్లు, కంబళ్లు అవసరం. సెప్టెంబర్ చివరి నాటికి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో జనం టెంట్లలో బతకలేరు'' అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Peerzada
'వరదల ప్రభావం మా మీద లేదు.. అందుకే సాయం చేస్తున్నాం'
ముబీన్ అన్సార్‌ది పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రాత్ జిల్లా. ఈ ప్రాంతం మీద వరదల ప్రభావం లేదు. అందువల్ల అవసరంలో ఉన్న వారికి సాయం చేయటం కోసం ఆయన తన శక్తి మేర కృషి చేస్తున్నారు.
''నిజానికి మా ప్రాంతంలో వరదలు లేవు. పెద్దగా వర్షాలు కూడా కురవలేదు. అందువల్ల కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలని మా వాళ్లని మేం కోరుతున్నాం'' అని చెప్పారాయన.
ముబీన్ తను నివసించే గుమ్తీ గ్రామంలో 300 మంది నుంచి విరాళాలు సేకరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Mubeen Ansar
''విదేశాల్లో నివసిస్తున్న మా గ్రామ ప్రజలను సోషల్ మీడియా ద్వారా విరాళాలు కోరుతున్నాం. మా మసీదులో కూడా సాయంగా అందించే సామగ్రిని సేకరిస్తున్నాం'' అని ఆయన తెలిపారు.
ఒక ట్రక్కుకు సరిపడా దుస్తులు, కంబళ్లు వంటి వస్తువులతో పాటు.. బియ్యం, పప్పులు వంటి ఆహార పదార్థాలను ఇప్పటికే విరాళంగా లభించినట్లు అన్సార్ చెప్పారు.
''శిశువులకు ఆహారం, మహిళలకు శానిటరీ ఉత్పత్తులు కొని ఇవ్వాలని మేం భావిస్తున్నాం'' అని చెప్పారాయన.
వీరు వరద బాధితులకు సాయం చేయటానికి దాదాపు 2,000 డాలర్లు సేకరించగలిగారు.
ఈ సాయాన్ని తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాలకు చేర్చటం మీద తమ వలంటీర్ల బృందం పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లింలు ఈ స్కూలు మీద ఒత్తిడి తెచ్చారా... విద్యార్థులు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చేయకూడదని చెప్పారా?
- గోదావరి వరదలు: ప్రమాద హెచ్చరికలు అంటే ఏంటి, ఎంత వరద వస్తే వీటిని జారీ చేస్తారు?
- ప్రపంచ జనాభా దినోత్సవం: 'భారత్ జనాభా 2023లో చైనాను మించిపోతుంది' - ఐక్యరాజ్యసమితి
- శ్రీలంక సంక్షోభం లాంటిదే పాకిస్తాన్, నేపాల్ దేశాలలోనూ వస్తే ఏమవుతుంది?
- ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















