GLOFs: పాకిస్తాన్‌ను భయపెడుతున్న బురద, రాళ్ల వరదలు.. ఇవి ఎందుకు వస్తున్నాయంటే..

గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్సులోని ఘిజెర్ జిల్లాలో వరదల్లో కొట్టుకొచ్చిన రాళ్లను తొలగిస్తున్న స్థానికులు

ఫొటో సోర్స్, Gilgit Baltistan Disaster Management Authority

ఫొటో క్యాప్షన్, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్సులోని ఘిజెర్ జిల్లాలో వరదల్లో కొట్టుకొచ్చిన రాళ్లను తొలగిస్తున్న స్థానికులు
    • రచయిత, నవీన్‌సింగ్ ఖడ్కా
    • హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి

ఉత్తర పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతాలను గత వారం రోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఇవి అసహజమైన రీతిలో ఏర్పడుతున్న వరదలు. మంచు పర్వతాలు, హిమానీ నదాలు కరిగిపోవడం వల్ల వస్తున్న వరదలు ఇవి.

ఉత్తర పాకిస్తాన్‌లోని రెండు ప్రావిన్సుల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరాయి. దీంతో మంచు పర్వతాలు కరిగి వరదగా మారి, రాళ్లు, బురదతో కూడిర ప్రవాహం ఆ దారిలో ఏముంటే వాటిని తుడిచిపెట్టేస్తోంది. ఇలాంటి 20కి పైగా సంఘటనలు ఈ మధ్య నమోదయ్యాయి.

ఈ అకాల వరదల వల్ల గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్సులో ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు. ఏడు వంతెనలు కూడా ధ్వంసం అయ్యాయి.

''ఈ ప్రాంతంలో ఇలాంటి చాలా వరదలు చాలా తక్కువ కాలంలోనే రావడొ ఒక రికార్డు'' అని ప్రావిన్సు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథార్టీ డైరెక్టర్ జనరల్ కమాల్ కమర్ బీబీసీతో అన్నారు.

చిత్రాల్ జిల్లాలో వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చిన బురద, చిన్నచిన్న రాళ్లలో మునిగిపోయిన కారు

ఫొటో సోర్స్, Rashid Ghafoor

ఫొటో క్యాప్షన్, చిత్రాల్ జిల్లాలో వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చిన బురద, చిన్నచిన్న రాళ్లలో మునిగిపోయిన కారు

గిల్గిట్ బాల్టిస్తాన్, పొరుగునే ఉండే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులు హిమాలయాలు, హిందూకుష్, కారకోరం పర్వతాల పరిధిలో ఉన్నాయి. ఈ రెండు ప్రావిన్సుల్లో మొత్తం 7 వేల మంచుతో గడ్డకట్టుకుపోయిన కొండలు, హిమానీ నదాలు ఉన్నాయి.

హిమానీనదంలోని మంచు కరిగిపోవడంతో వచ్చే నీటి ప్రవాహం కనుక కట్టలు తెంచుకుంటే ఇక ఆ ప్రవాహ శక్తి తీవ్రంగా ఉంటుందని, అది ప్రవహించే దారిలో ఏళ్లుగా గడ్డకట్టుకుపోయిన మంచును, అక్కడ పేరుకుపోయిన రాళ్లను కూడా కదిలిస్తుందని, దీనివల్ల ఆ రాళ్లు విరిగిపడతాయని నిపుణులు చెబుతున్నారు. నీళ్లు, ఇసుక, మట్టితో ఉండే ఈ ప్రవాహానికి రాళ్లు కూడా తోడౌతాయని వెల్లడించారు.

ఈ ప్రాంతంలో హిమానీనదాల్లో బండరాళ్లు, వాటి ముక్కలు కూడా కలిసిపోతాయి.

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథార్టీకి చెందిన అధికారి రాషిద్ ఘఫూర్ మాట్లాడుతూ.. వేడి గాలులు పెరుగుతున్నాయని, దీనివల్ల బురద ప్రవాహాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.

వీడియో క్యాప్షన్, 'నందాదేవి' అధిరోహణలో చనిపోయిన పర్వతారోహకుల చివరి వీడియో

పాకిస్తాన్ వాతావరణ శాఖకు చెందిన డాక్టర్ ఫరూఖ్ బషీర్ మాట్లాడుతూ.. వరద, రాళ్లు లేదా కొండచరియలు విరిగి పడటంతో ఏర్పడే ఈ బురద ప్రవాహాన్ని హైపర్ కాన్సన్‌ట్రేటెడ్ ఫ్లో (అధిక సాంద్రత కలిగిన ప్రవాహం) అని పిలుస్తామని చెప్పారు.

''ఇలాంటి అధిక సాంద్రత కలిగిన ప్రవాహాలు చాలా ప్రమాదకరమైనవి. వీటి దారికి అడ్డుగా ఏమున్నా వాటిని తోసిపారేస్తాయి. ఎంతటి బలమైన నిర్మాణాలనైనా ఇవి దెబ్బతీస్తాయి. వీటివల్ల ఆ ప్రాంతంలో ఉండే ఉపరితలం కూడా విపరీతంగా కోతకు గురవుతుంది'' అని బషీర్ చెప్పారు.

ఈ బురద ప్రవాహాలు ఎక్కువగా ఇళ్లు, రోడ్లు, వంతెనలను దెబ్బతీస్తుంటాయి.

ఉత్తర పాకిస్తాన్‌లో ఇలాంటి గ్లేసియర్‌లు 7 వేలకు పైగా ఉన్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర పాకిస్తాన్‌లో ఇలాంటి గ్లేసియర్‌లు 7 వేలకు పైగా ఉన్నాయి

గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా హిమనీ నదాలు కరిగిపోవడం, ఇలా కరిగిపోయిన నీళ్లతో సరస్సులు ఏర్పడటం పెరిగింది.

ఉత్తర పాకిస్తాన్‌లోని ఈ రెండు ప్రావిన్సుల్లోనే 3 వేల సరస్సులు ఏర్పడ్డాయి. వీటిలో 33 సరస్సుల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. ఎప్పుడైనా కట్టలు తెంచుకుని, విరుచుకుపడేలా ఇక్కడ పరిస్థితి ఉందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) తెలిపింది.

యూఎన్‌డీపీ కోసం పనిచేసే పర్యావరణవేత్త హమీద్ అహ్మద్ మాట్లాడుతూ.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో 2000వ సంవత్సరం తర్వాత 15కు పైగా హిమనీ నదాలు కట్టలు తెగడం వల్ల వరదలు (గ్లేసియల్ లేక్ ఔట్‌బర్ట్స్ ఫ్లడ్స్-జీఎల్‌ఓఎఫ్) వచ్చాయని తెలిపారు. అంతకుముందు 20 ఏళ్లలో ఈ వరదలు నాలుగు మాత్రమే వచ్చాయి.

అయితే, ఈ హిమనీ నదాల బురద వరదలు సమస్యలో ఒక భాగం మాత్రమేనని ఆయన చెప్పారు.

''ఈ జీఎల్‌ఓఎఫ్లు ఎంత త్వరగా వస్తున్నాయనేది కాదు, ఎంత తీవ్రంగా ఉంటున్నాయి అనేది మమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది. ప్రతి ఏటా వీటి తీవ్రత పెరుగుతోంది'' అని హమీద్ అహ్మద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)