వర్షాలు, వరదలతో పాకిస్తాన్ అతలాకుతలం.. ఆరు వారాల్లో 500 మందికి పైగా మృతి
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది.
గత ఆరు వారాలుగా దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలకు 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
రోడ్లు, వంతెనలు, భవనాలు సహా వేల సంఖ్యలో ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.
మారుమూల ప్రాంత ప్రజలకు సహాయ చర్యలు నెమ్మదిగా అందుతున్నాయి.
తీవ్రంగా ప్రభావితమైన బలూచిస్తాన్‌లో 160 మందికి పైగా ప్రజలు మరణించారు.
విధ్వంసం తర్వాత తమ జీవితాన్ని పునర్నించుకునే పనిలో పడ్డ కరాచీవాసులతో బీబీసీ ప్రతినిధి పమ్జా ఫిహ్లానీ మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు 47 వేలకు పైగా ఇళ్లు పూర్తిగానో లేదా పాక్షికంగానో దెబ్బతిన్నాయి.
కోల్పోయింది ఒక్క ఇళ్లనే కాదు... తమ బతుకుదెరువు ఆధారాన్ని కూడా కోల్పోయారు.
ఇది వ్యవసాయ సమాజం. ఏడాది పాటు కడుపు నింపాల్సిన పంటను కొద్ది రోజుల్లోనే కోల్పోయానని, తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావడంలేదని ఈయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరద కారణంగా ఇంతలా మరణాలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ సంభవించలేదు. బలహీనమైన వారి మీదే దీని ప్రభావం ఎక్కువగా ఉంది.
200 మందికి పైగా పిల్లలు మరణించారు.
ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వాతావారణ పరిస్థితులు పాకిస్తాన్ చవి చూస్తూ ఉంటుంది. ఇక్కడ తరచూ ప్రకృతి విపత్తులు విరుచుకపడుతుంటాయి.
పరిస్థితి ఇంకా దారుణంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని స్థానిక వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వర్షాలు మారుమూల ప్రాంతాలనే కాదు, నగరాలను సైతం అతలాకుతలం చేశాయి. దీంతో కరాచీలో వర్షం నీరు రోజుల తరబడి రోడ్లపైనే నిలిచిపోయింది.
తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో ఇక్కడి వాళ్లు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎంత బలహీనంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
ముందస్తు ప్రణాళిక సక్రమంగా ఉంటే ఇలాంటి వాటిని ముందే అరికట్టవచ్చని కొంత మంది భావిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో సహాయ చర్యల్లో జాప్యం జరుగుతోందని అధికారులు అంగీకరిస్తున్నప్పటకీ, అది పెద్ద విషయమేం కాదని, అది వనరుల లేమితో ముడిపడిన అంశమని అంటున్నారు.
వర్షాకాలంలో వర్షాలు మామూలే. అయినా, వరదల వల్ల ఇలా వందలాది మంది ఇలా చనిపోవడం అన్యాయమని నిపుణులంటున్నారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా, పాకిస్తాన్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. అప్పుడే అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉంటారు.