జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి

జహాన్ ఆరా

ఫొటో సోర్స్, MUSEUM OF FINE ARTS, BOSTON

మొఘల్‌ల కాలంలో అత్యంత ప్రభావవంతమైన రాణిగా చెప్పే జహాన్ ఆరా గొప్ప అందగత్తె మాత్రమే కాదు అత్యంత సంపన్నురాలు కూడా.

చరిత్ర పుటలు తిరగేస్తే ఆమె పాలన, మొఘల్‌ల కాలంలో ఆమె ప్రభావం, ప్రాబల్యం గురించి రాసిన వివరాలు దొరుకుతాయి.

అయితే, పాకిస్తాన్‌లోని పెషావర్‌కు ఆమె వెళ్లడం.. అక్కడ మొఘల్ సామ్రాజ్యంలోని వ్యాపారుల కోసం అత్యాధునిక సదుపాయాలతో సత్రాలు నిర్మించడం, మసీదులు నిర్మించడం గురించి మాత్రం పెద్దగా ప్రస్తావన లేదు.

మొఘల్‌ల కాలంలో పెషావర్ పెద్ద వ్యాపారకేంద్రం. దిల్లీ నుంచి పెషావర్ మీదుగా మధ్య ఆసియా ప్రాంతం వరకు వ్యాపారం సాగేది.

దిల్లీ, మధ్య ఆసియా ప్రాంతాల మధ్య తిరుగుతూ వ్యాపారాలు చేసేవారికి పెషావర్ విడిది కేంద్రంలా ఉండేది. వ్యాపారులు, సరకు రవాణా చేసేవారు పెషావర్‌లో ఆగేవారు.. అక్కడ వ్యాపార వ్యవహారాలు, సంప్రదింపులు కూడా పెషావర్ కేంద్రంగా జరిగేవి.

పెషావర్‌లో వ్యాపారులు, వారి సరకులు మోసుకెళ్లే జంతువుల కోసం సదుపాయాలు ఉండేవి

అయితే, ఇవన్నీ పెషావర్‌కు జహాన్ ఆరా రాకమునుపు లేవు. జహాన్ ఆరా పెషావర్ వచ్చాకే అక్కడ ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

1638లో జహాన్ అరా పెషావర్ వెళ్లారు. ఆ సమయంలో జహాన్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.

అక్కడి ప్రజల సమస్యలు, ముఖ్యంగా వ్యాపారులు బస విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు చూసినా జహాన్ ఆరా ఆధునిక సత్రాలు నిర్మిస్తామని ప్రకటించారు.

ఆమె చెప్పినట్లే సత్రాల నిర్మాణం 1638 లో ప్రారంభమైంది. 1641 నాటికి సత్రాల నిర్మాణం పూర్తయింది. చరిత్ర పుస్తకాలలో కారవాన్ సరాయ్, సరాయ్ జహాన్ బేగం, సరాయ్ దో దార్ పేర్లతో ఈ సత్రాల ప్రస్తావన ఉంది.

ఖైబర్ పఖ్తుంక్వాలోని పురావస్తు శాఖ డైరెక్టర్ అబ్దుస్ సమద్ ఖాన్ ఈ సత్రాల గురించి వివరించారు.

పెషావర్ నగరంలోని కోట లోపల ఈ సత్రాలు నిర్మించారని, ఆ నగరంలోని కీలక ప్రాంతం, సురక్షిత ప్రాంతంలో దీన్ని నిర్మించారని సమద్ ఖాన్ చెప్పారు.

ఈ సత్రంలో బస చేయడానికి గదులే కాకుండా వ్యాపారులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచారని చెప్పారు.

నగరం మధ్యలోని ఎత్తయిన ‘గోర్ గఠరీ’ ప్రాంతంలో ఈ సత్రం నిర్మించారు. సత్రంలోని గదులను కలుపుతూ పెద్ద హాళ్లు, ప్రతి గది ఎదుట అద్దం ఉంటాయి.

పెషావర్‌లో సత్రం

ఈ హాల్‌లలో కూర్చుని వ్యాపారులు సంప్రదింపులు జరపడం, వ్యవహారాలు సెటిల్ చేసుకోవడం వంటివి చేసేవారు. వ్యాపారుల సరకులను మోసుకెళ్లే జంతువులను కట్టడానికి, వాటికి గ్రాసం పెట్టడానికి కూడా ఏర్పాట్లు చేశారు. సత్రానికి నీటి సరఫరా కోసం బావి, పక్కనే మసీదు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం గోర్ గఠరీకి ఇంచార్జిగా పనిచేస్తున్న నూర్ ఖాన్ బీబీసీతో మాట్లాడారు. ‘ఇందులో చాలా గదులు ఉన్నప్పటికీ అందులో 140 మాత్రమే ఉపయోగించడానికని వీలున్నవి’ అని చెప్పారు.

ఆ కాలంలో పెషావర్‌లో మొత్తం ఎనిమిది సత్రాలు ఉండేవని.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు, ప్రజలు వాటిలోనూ బస చేసేవారని... కానీ, జహాన్ ఆరా నిర్మించిన సత్రాల స్థాయిలో వాటిలో సౌకర్యాలు ఉండేవి కావని నూర్ ఖాన్ చెప్పారు.

జబ్బుపడిన ముంతాజ్‌ను దగ్గరకు తీసుకున్న షాజహాన్, చిత్రంలో జహాన్ ఆరా

ఫొటో సోర్స్, HULTON ARCHIVEHULTON ARCHIVE

జహాన్ ఆరా ఎవరు?

షాజహాన్ చక్రవర్తి పెద్ద కుమార్తె జహాన్ ఆరా బేగం. మొఘల్‌ల కాలంలోని ముఖ్యమైన మహిళల్లో ఆమెది అగ్రస్థానం.

ఆమె తల్లి ముంతాజ్ మహల్. ముంతాజ్ అసలు పేరు అర్జుమంద్ బానో బేగం.

షాజహాన్‌కు జహాన్ ఆరా అత్యంత ఇష్టురాలైన కుమార్తెగా చెబుతాారు. ఆమెకు బాద్షా బేగం, ఫాతిమా జమాన్ బేగం అనే పేర్లు కూడా ఉన్నాయి.

చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రవేత్త అలీ జాన్ బీబీసీతో మాట్లాడుతూ ‘పెషావర్‌లో జహాన్ బేగం గురించి పెద్దగా ప్రస్తావన లేనప్పటికీ మొఘల్‌ల కాలంలో వాణిజ్యపరంగా పెషావర్ కీలక నగరంగా ఉండేది. ఆ కాలంలో జహాన్ ఆరా అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆమెది ఆకట్టుకునే వ్యక్తిత్వం’ అని చెప్పారు.

ప్రజాసంక్షేమానికి సంబంధించిన పనులపై జహాన్ దృష్టిపెట్టినట్లు చరిత్ర చెప్తోంది.

ఆమె దిల్లీలోనూ భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మసీదులు నిర్మించి వాటికి ఆదాయ వనరులు ఏర్పాటు చేశారు.

వనరుల నుంచి వచ్చిన ఆదాయంతో మసీదుల ఇమామ్‌లు, ముఅజ్జీన్, ఖతీబ్, ఇతర సిబ్బందికి జీతభత్యాలు చెల్లించేవారు. మసీదు నిర్వహణ, మరమ్మతులు, ఇతర పనులకు కూడా ఈ వనరుల నుంచే ఆదాయం సమకూరేది.

సత్రం

తండ్రి షాజహాన్, తల్లి ముంతాజ్ నుంచి జహాన్‌కు ఆస్తిలో భారీ వాటా దక్కింది. నగదు రూపంలో ఆస్తితో పాటు తోటలు కూడా ఆమెకు వాటాగా రావడంతో ఆ తోటలపై ఆమెకు ఆదాయం సమకూరేది.

తల్లి ముంతాజ్ మరణానంతరం తన తోబుట్టువుల బాధ్యతలనూ జహాన్ చూసుకున్నారు. కానీ, అధికారం కోసం పోరాటంలో సోదరులతో ఆమెకు వివాదం తలెత్తింది.

జహాన్ ఆరా తన పెద్దన్న దారాశికోహ్‌కు మద్దతు పలకగా.. మరో సోదరుడు ఔరంగజేబు తన బలాన్ని ఉపయోగించి అధికారం దక్కించుకున్నాడు.

దారా శికోహ్, ఔరంగజేబు మధ్య అధికారం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి.

గోర్ గఠరీలోని భవనం

పెషావర్ నగరంలోని ఎత్తయిన ప్రదేశం గోర్ గఠరీ. ఈ మాటకు అర్థం యోధుల సమాధి.

ఇక్కడ బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా దొరికినట్లు చరిత్రకారులు అలీ జాన్ చెప్పారు. బుద్ధుడి భిక్షపాత్ర కూడా ఇక్కడ దొరికిందని కొన్ని చరిత్ర పుస్తకాలలో ఉంది.

ప్రాచీన హిందూ నాగరికతకు సంబంధించిన అవశేషాలూ ఇక్కడ లభ్యమయ్యాయని అలీ జాన్ చెప్పారు.

మొఘల్ చక్రవర్తి జీవిత చరిత్ర బాబర్‌నామాలోనూ గోర్ గఠరీ ప్రస్తావన ఉంది. పెషావర్‌లోని గోర్ గఠరీకి బాబర్ వెళ్లినట్లు ఉంది.

గోర్ గఠరీలోని భవనం

గోరఖ్ నాథ్ నుంచి గోర్‌ గఠరీ పేరు వచ్చిందా?

గోరఖ్ నాథ్ అనే హిందూ వైద్యుడు ఈ ప్రాంతంలో ఉండేవారని, ఆయన దగ్గర వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవారని స్థానికంగా ప్రచారంలో ఉంది.

ఇక్కడ గోరఖ్‌నాథ్ ఆలయం కూడా ఉంది. గోరఖ్ నాథ్ కారణంగానే ఈ ప్రాంతానికి గోర్ గఠరీ అనే పేరు వచ్చిందన్న కథలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.

గోర్ గఠరీలోనికి వెళ్లేందుకు రెండు పెద్ద తలుపులు ఉంటాయి.

అబ్దుస్ సమద్ ఖాన్ మాట్లాడుతూ... రంజిత్ సింగ్ పాలన వచ్చినప్పుడు ఆయన ఈ ప్రాంతం కేంద్రంగా నగర పాలన సాగించినట్లు చరిత్రలో ఉందన్నారు. ఇక్కడ మునిసిపల్ కార్యాలయం కూడా కట్టారని చెప్పారు.

దీని గేట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. గేటుపైన కూడా గదులు నిర్మించారు. అందులోనూ బస చేయడానికి వసతులు ఉంటాయి.

బ్రిటిష్ కాలంలో తహసీల్ కమిటీ కార్యాలయాలు, అగ్నిమాపక దళ కేంద్రాలు ఇక్కడ నిర్మించారు. ఇప్పటికీ ఇక్కడ అగ్నిమాపక వాహనాలు ఉన్నాయి.

2000 సంవత్సరం తరువాత ఇక్కడి భవనాలు, పురావస్తు సంపదను సంరక్షించడానికి.. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళికలు రూపొందించారు.

సత్రంలోని గదులను దుకాణాలుగా మార్చారు.

పురావస్తు పరంగా ప్రాధాన్యం ఉన్న స్థలాల్లో తవ్వకాలు జరిపించారు. ఈ తవ్వకాలలో అనేక చారిత్రక ఆధారాలు, వస్తువులు లభ్యమయ్యాయి. గోర్ గఠరీలోనే నెలకొల్పిన మ్యూజియంలో ఇవన్నీ ఉంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)