గూగుల్: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా... అయితే వచ్చే మార్పులివే

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

గూగుల్ భారత్‌లో ఒక కీలకమైన యాంటీ ట్రస్ట్ కేసు ఓడిపోవడంతో ఆండ్రాయిడ్ సిస్టంలో భారీ మార్పులు ప్రకటించింది.

ఇకపై ఆండ్రాయిడ్‌లో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్ ఉండదు. యూజర్లు తమకు నచ్చిన సెర్చ్ ఇంజిన్‌ను డీఫాల్ట్‌గా పెట్టుకోవచ్చు.

గత ఏడాది అక్టోబర్‌లో, కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), గూగుల్‌కు యాంటీ ట్రస్ట్ నోటీసులు జారీ చేసింది.

గూగుల్ భారత్‌లో తన మార్కెట్ పొజిషన్‌ను దుర్వినియోగం చేస్తోందని, అన్యాయమైన వ్యాపార విధానాలను పాటిస్తోందని ఆరోపిస్తూ 161 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది.

ఆండ్రాయిడ్ ఎకోసిస్టంలో పలు మార్పులు చేయాలని సీసీఐ కోరింది. 

భారత్‌లో సుమారు 97 శాతం స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ సిస్టం మీద నడుస్తున్నవేనని అంచనా.

వివిధ స్మార్ట్‌ఫోన్లు, వెబ్ సెర్చ్‌లు, బ్రౌజింగ్, వీడియో హోస్టింగ్ సర్వీసులలో తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఉండేలా చేస్తూ గూగుల్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తోందని సీసీఐ ఆరోపించింది.

మొబైల్ తయారీదారులతో ఒప్పందాలు చేసుకుని ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ యాప్‌లన్నీ ప్రీఇన్‌స్టాల్ చేయిస్తోందని సీసీఐ పేర్కొంది.

ఈ విధానాలు మార్కెట్‌లో పోటీని దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది.

దీనివల్ల వినియోగదారుల డాటా గూగుల్‌కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటోందని, ప్రకటనలకు ఎక్కువ అవకాశం లభిస్తోందని పేర్కొంది.

గూగుల్ ఈ విధానాలను తక్షణమే నిలిపివేయాలని సీసీఐ ఆదేశించింది.

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

సీసీఐ ఆదేశాలను గూగుల్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

"మరే ఇతర అధికార సంస్థ ఇంత పెద్ద మార్పులు చేయమని కోరలేదంటూ" పిటిషన్ వేసింది.

సీసీఐ కోరిన మార్పులు చేయాలంటే 1,100 కంటే ఎక్కువ పరికరాల తయారీదారులు, వేల సంఖ్యలో యాప్ డెవలపర్లతో ఒప్పందాలను మార్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

కానీ, సుప్రీంకోర్టు గూగుల్‌కు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. సీసీఐ మార్గనిర్దేశకాలను రద్దు చేసేందుకు నిరాకరించింది.

అయితే, గూగుల్ మొదట పిటిషన్ వేసిన కింది కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగించవచ్చని, కానీ మార్చి లోపల తీర్పు వెలువరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాగా, సీసీఐతో సహకరిస్తామని గూగుల్ గతవారం పేర్కొంది.

పరికరాల తయారీదారులకు గూగుల్ యాప్‌లు ప్రీఇన్‌స్టాల్ చేసేందుకు అనుమతిస్తూనే, యూజర్లు తమకు నచ్చిన సెర్చ్ ఇంజిన్‌ను డీఫాల్ట్‌గా పెట్టుకోవచ్చని బుధవారం తెలిపింది.

అయితే, ఈ మార్పులన్నీ తీసుకురావడానికి చాలా శ్రమపడాల్సి ఉంటుందని, ఇది క్లిష్టమైన ప్రక్రియ అని, భాగస్వాములు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (OEMs), డెవలపర్ల ప్రయత్నం, సహకారం కావాలని గూగుల్ అంటోంది. 

భారతదేశంలో గూగుల్ అనేక యాంటీ ట్రస్ట్ కేసులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ టీవీ మార్కెట్లో కూడా గూగుల్ విధానాలను పరీక్షించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)