హంట్ రివ్యూ: ‘ఓర్ని అంత జరిగిందా’ అనిపించే ట్విస్ట్... దాన్నే నమ్ముకున్న సుధీర్ బాబు
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
థ్రిల్లర్ చిత్రాలకు ఈమధ్య క్రేజ్ బాగా పెరిగింది.
ఇది వరకు కొత్త హీరోలు మాత్రమే ఇలాంటి కథలు ఎంచుకొనే వారు.
ఇప్పుడు స్టార్లకూ ఈ జోనర్ బాగానే నచ్చుతోంది. దీంతో హిట్లు కూడా కొడుతున్నారు.
కాకపోతే... థ్రిల్లర్ కథలతో మెప్పించడం అంత ఈజీ కాదు.
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తరవాత అంతర్జాతీయ చిత్రాల్ని సైతం చూసి.. కొత్త విషయాల్ని తెలుసుకొంటున్నారు ప్రేక్షకులు.
హాలీవుడ్ కంటెంట్ అందరికీ అందుబాటులో ఉంది. థ్రిల్లర్ సినిమాల్ని తీయడంలో హాలీవుడ్ వాళ్లు ఎప్పుడో మాస్టర్లు అయిపోయారు.
ఇప్పుడు తెలుగులో అలాంటి ప్రయత్నం చేస్తే... అవుటాఫ్ ది బాక్స్ ఐడియా ఉండాలి. లేదంటే వర్కవుట్ అవ్వదు. అలాంటి ప్రయత్నాలు టాలీవుడ్లో జరుగుతున్నాయి.
కొన్ని... స్వీట్ షాకింగ్ కథలు.. తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు సుధీర్ బాబు `హంట్` అనే సినిమా చేశాడు.
ఇది కూడా థ్రిల్లరే. ఇందులోనూ షాకింగ్ ట్విస్టు ఒకటుంది. మరి... సుధీర్‌కి హిట్టు దొరికిందా? ఈ థ్రిల్లర్, అందులోని ట్విస్టు అందరికీ షాక్ ఇచ్చేలా ఉందా..?

ఫొటో సోర్స్, Apsara Rani/Facebook
హంతకుడి వేట
అర్జున్ (సుధీర్ బాబు) ఆర్యన్ (భరత్), మోహన్ (శ్రీకాంత్) ముగ్గురూ పోలీస్ ఆఫీసర్లు. ముగ్గురూ మంచి స్నేహితులు.
ఆర్యన్‌ని ఎవరో హత్య చేస్తారు. ఆ హత్య కేసుని అర్జున్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అన్ని దారులూ మూసుకుపోయిన ఈ కేస్‌లో అర్జున్ ఓ కీలకమైన ఆధారం సేకరిస్తాడు.
హంతకుడు ఎవరో తెలుసుకొంటాడు. అది మోహన్కి చెప్పేలోగా... అర్జున్‌కి యాక్సిడెంట్ జరుగుతుంది. గతం మర్చిపోతాడు.
కేసు మళ్లీ మొదటికి వస్తుంది. ఈ కేసుని అర్జున్ మళ్లీ హ్యాండిల్ చేస్తాడు. అయితే... ఈ కేసులో ఉన్న నిందితుల గురించీ, క్లూల గురించీ, తను మోహన్‌కి చెప్పాలనుకొన్న హంతకుడి పేరు గురించీ.. అన్నీ మర్చిపోతాడు అర్జున్.
మరి.. వాటిని అర్జున్ ఎలా రీ కలెక్ట్ చేసుకొన్నాడు? చివరికి హంతకుడ్ని పట్టుకొన్నాడా, లేదా? అనేది మిగిలిన కథ.

ఫొటో సోర్స్, facebook/bhavyacreations
నిజానికి చాలా మంచి పాయింట్ తో మొదలైన కథ ఇది.
ఓ పోలీస్ అధికారి....తన స్నేహితుడి మరణం వెనుక నిజాన్ని తెలుసుకొని, కేసుని క్లోజ్ చేసేసమయంలో ప్రమాదవశాత్తూ గతం మర్చిపోయి, ఆ కేసుని మళ్లీ తానే రీ ఓపెన్ చేయడం.. కొత్త పాయింటే!
`ఎలా? ఎందుకు? ఎవరు?`ఈ మూడు ప్రశ్నలకూ సమాధానం కావాలి..` అనే డైలాగ్ ఉంది. ఈ కథకి కూడా ఈ మూడు అంశాలే బేస్.
ఆర్యన్‌ని ఎలా చంపారు? ఎందుకు చంపారు? ఎవరు చంపారు? సినిమా అంతా ఈ మూడు ప్రశ్నలకు జవాబుల్ని వెదికే క్రమంలోనే సాగుతుంది.
సీన్ నెంబర్ వన్ నుంచే దర్శకుడు కథలోకి వెళ్లిపోవడం తెలివైన నిర్ణయం. అక్కడి నుంచి సమయం వేస్ట్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ మోడ్ లో కొంత.. ఫ్లాష్ బ్యాక్‌లో కొంత.. కథ నడుస్తుంటుంది.
ఆర్యన్ - అర్జున్ మధ్య బాండింగ్ చూపించడానికి కొన్ని సీన్లు వాడుకొన్నాడు దర్శకుడు. ఆర్యన్‌ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే ప్రశ్న ప్రతీసారీ తలెత్తుతూనే ఉంటుంది.
అయితే.. దానికి క్లైమాక్స్ వరకూ సమాధానాలు దొరకవు.

ఫొటో సోర్స్, Sudheer Babu/Facebook
ఎలా.. ఎందుకు.. ఎవరు?
ఇలాంటి కథల్లో సాధారణంగా జరిగే కొన్ని విషయాలు ఉంటాయి.
కొంతమంది అనుమానితులు తెరపైకి వస్తారు. వాళ్లని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రోసెస్‌లో ప్రతి ఒక్కరిపైనా అనుమానం బలపడుతూ ఉంటుంది.
చివరికి మరో కొత్త నిందితుడు తెరపైకి వస్తాడు. `హంట్` కూడా ఇదే తరహాలో సాగింది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫార్మెట్ ఎక్కడైనా ఇలానే ఉంటుంది.
దాన్ని తప్పు పట్టలేం. కాకపోతే.. ఆ అనుమానితుల్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు, వాళ్లని విచారణ జరుపుతున్నప్పుడు.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేగాలి.
హంతకుడు వీళ్లలోనే ఒకరు.. అని ప్రేక్షకుడు నమ్మాలి. అప్పుడు ఆ చిక్కుముడి మరింతగా బిగుసుకుంటుంది.
హంట్‌లో జరిగిన పొరపాటు ఏమిటంటే.... తెరపై ఎంత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా - ప్రేక్షకులకు ఎవరిపైనా అనుమానం రాదు.
వాళ్లంతా అమాయకుల్లానే కనిపిస్తారు. `ఇంత చిన్న కారణానికి.. ఆర్యన్‌ని చంపేస్తారా?` అని తనకు తానే సమాధానపడి కుదుట పడతాడు.
కానీ తెరపై హీరో మాత్రం `వీళ్లే హత్య చేశారు` అని బలంగా నమ్మి.. దాని చుట్టూ ఇన్వెస్టిగేషన్ నడుపుతుంటాడు. దాంతో.. ఆయా సన్నివేశాలు తేలిపోతాయి.
థ్రిల్లర్‌లో కీలకమైన అంశం.. మలుపులు. ట్విస్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఇంట్రవెల్లో ఓ ట్విస్ట్ ఉంటే... సెకండాఫ్ పై ఇంకాస్త ఆసక్తి ఏర్పడుతుంది.
కానీ `హంట్`లో అలాంటివేం ఉండవు. కథని చాలా సాదా సీదాగా చెబుతూ ఒక చోట పాజ్ ఇస్తాడు. అక్కడ ఇంట్రవెల్ బ్యాంగ్ వేస్తాడు. అప్పటి వరకూ ఏం జరిగింది? అని ప్రేక్షకుడు కాసేపు వెనక్కి వెళ్లి ఆలోచిస్తే.. కథ అక్కడే ఉంటుంది.
హీరో స్నేహితుడ్ని ఎవరో చంపేశారు.. అతడ్ని పట్టుకోవడానికి హీరో ప్రయత్నిస్తున్నాడు. అంతే. సీన్ నెంబర్ వన్లోనే కథలోకి వెళ్లిపోయి అభినందనలు అందుకొన్న దర్శకుడు... ఇంట్రవెల్ లో కూడా అక్కడే ఉండిపోవడం స్క్రీన్ ప్లే లోపం.

ఫొటో సోర్స్, facebook/bhavyacreations
అర్జున్ ఏ.. అర్జున్ బీ
హీరో పాత్రకు రెండు పార్శ్వాలు ఉంటాయి. గతం మర్చిపోక ముందు.. మర్చిపోయిన తరవాత.
యాక్సిడెంట్ కి ముందు. తను అర్జున్ ఏ అనుకొంటే, యాక్సిడెంట్ తరవాత.. తను అర్జున్ బీ. అర్జున్ ఏకీ, బీకీ... ప్రవర్తనలో సున్నితమైన తేడా ఒకటి స్పష్టంగా కనిపిస్తుంటుంది.
కశ్మీర్లో ఎపిసోడ్‌ని ఇంకాస్త పకడ్బందీగా తెరకెక్కిస్తే బాగుండేది. యాక్షన్ సీన్లు ఎక్కువే ఉన్నా, వాటిని తెరకెక్కించిన విధానం సహజంగా ఉన్నా, ఎందుకో ఇంపాక్ట్ రాదు.
ఈ సినిమాలో దర్శకుడు నమ్మింది.. క్లైమాక్స్ ట్విస్ట్. అదే ఈ కథకు మూలం. కచ్చితంగా... అక్కడ షాక్ అవుతారు.
కాకపోతే అది ఎలాంటి షాక్ అనేదే ప్రధానం. ఆ ట్విస్ట్ చూసి.. `ఓర్నీ ఇంత జరిగిందా` అని అనుకొంటే సినిమా గట్టెక్కుతుంది. `ఇంతేనా జరిగింది` అనుకొంటే సినిమా మునిగిపోతుంది.
ఇదంతా ప్రేక్షకుల మైండ్ సెట్‌ను బట్టి ఆధార పడి ఉంటుంది.
ఆ ట్విస్ట్‌ను నమ్ముకొని ఇంత కథ నడపాల్సిన అవసరం లేదు. డిస్కర్షన్ టేబుల్ మీద ఇలాంటి కథలు వీగిపోతూ ఉంటాయి.
`ట్విస్ట్ బాగానే ఉంది కానీ.. మన వాళ్లు అంతగా అప్ డేట్ అవ్వలేదు..` అనేస్తుంటారు. అయినా సరే.. దాన్ని నమ్మారంటే.. ఆ గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే.

ఫొటో సోర్స్, facebook/bhavyacreations
రిస్క్ చేసిన సుధీర్
`ఈ కథను ఏ హీరో చేయడు. నేను కథను నమ్మి చేశానంతే` అని ఓ ఇంట్వర్యూలో చెప్పాడు సుధీర్.
అవును.. అది అక్షరాలా నిజం. ఈ క్యారెక్టర్‌ని ఏ హీరో చేయడు. కానీ సుధీర్ రిస్క్ చేసి ఒప్పుకొన్నాడు.
పోలీస్ ఆఫీసర్‌గా తన ఫిజిక్ సరిగ్గా సూటవుతుంది. క్యారెక్టర్‌లో సీరియస్‌నెస్ ఉంది. అది తన కళ్లలో పలికింది.
అర్జున్ ఏ, అర్జున్ బీ.. ఇలా రెండు పార్శ్వాల్నీ చక్కగా పలికించాడు. ప్రేమిస్తే భరత్ చాలా కాలం తరవాత తెలుగు తెరపై కనిపించాడు.
తన పాత్ర డీసెంట్ గా ఉంది. హీరోకి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి కాబట్టి తన పాత్రని హైడ్ చేశారా? అనిపిస్తుంటుంది.
శ్రీకాంత్ తన సీనియారిటీ చూపించాడు. కథంతా ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మిగిలిన వాళ్లంతా పేరుకి మాత్రమే అన్నట్టు తెరపై కనిపిస్తారు.
చిన్న సినిమా ఇది. పరిమితమైన బడ్జెట్ లో తీసినా... ఆ లోటు పాట్లేం కనిపించవు. ఫైట్స్‌ని సహజంగా తీయాలన్న ఆలోచన బాగుంది.
అయితే.. సుధీర్ సినిమాల్లో యాక్షన్ సీన్స్‌కి ప్రాధాన్యం ఎక్కువ కనిపిస్తుంది. తను యాక్షన్ సీన్లు బాగా చేయగలడు కూడా. కానీ.. ఇవి ఆ స్థాయిలో లేవు.
పాటలకు స్కోప్ లేదు. ఒకే ఒక్క పాట ఉంది. అది కూడా అనవసరమే. 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ చిన్నదే.
కానీ సినిమా అంతా నిదానంగా సాగడం వల్ల.. మూడు గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ముంబై పోలీస్ అనే మలయాళ చిత్ర ప్రభావం ఈ సినిమాపై స్పష్టంగా కనిపిస్తుంది.
ఇది రీమేకా? ఫ్రీమేకా? అనేది దర్శక నిర్మాతలకే తెలియాలి. కేవలం క్లైమాక్స్ ట్విస్టుని నమ్ముకొని తీసిన సినిమా ఇది.
ఆ ట్విస్టు.. కొంతమందికి షాకింగ్ గా ఉంటుంది. కొంతమందికి.. ఇదేం ట్విస్టు అనిపిస్తుంది. ఆ తేడానే ఈ సినిమా జయాపజయాల్ని నిర్ణయిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- మథుర కారిడార్: ఇక్కడ ఆలయాలను కూలగొడతారా... బృందావన వాసులు ‘రక్తం’తో లేఖలు ఎందుకు రాస్తున్నారు
- పవన్ కల్యాణ్: తెలంగాణలో పోటీ చేస్తామన్న జనసేన అధినేత
- హుస్సేన్ సాగర్ తీరాన... హైదరాబాద్‌లో మరో ఐకాన్
- ‘అక్కినేని, తొక్కినేని’ అన్న నందమూరి బాలకృష్ణ... రగులుతోన్న వివాదం
- రాజమౌళి-ఆర్ఆర్ఆర్: ఆరంభం నుంచి ఆస్కార్ గుమ్మం వరకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















