ఆర్‌ఆర్‌ఆర్: నాటునాటు పాటకు ఆస్కార్ వస్తుందా... గత పదేళ్ల గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ చరిత్ర ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, #RRRMovie
- రచయిత, వద్ది ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆర్‌ఆర్‌ఆర్ ( రౌద్రం రణం రుధిరం). భారతదేశమంతటా మారుమోగుతున్న సినిమా పేరు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా అది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతోన్న ఇద్దరు నిజ జీవిత ఉద్యమకారుల కల్పిత కథను ఈ సినిమాలో చూపించారు.
అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్, కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాకు సంగీతం ఎంఎం కీరవాణి అందించారు.
ప్రపంచవ్యాప్తంగా 2022 మార్చి 25న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్, జపనీస్ తదితర భాషల్లో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
సినిమా విడుదలై 10 నెలలు గడిచినా ఆర్‌ఆర్‌ఆర్ మేనియా తగ్గలేదు. ఆర్‌ఆర్‌ఆర్ గురించి ఏ వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయి కూర్చుంటోంది.
తెలుగు భాషలోనే కాకుండా ప్రపంచంలోని చాలా భాషల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఆర్ఆర్ఆర్.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1,200 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించినట్లు ట్రేడ్ పండితుల అంచనా. అమెరికాలో నెట్‌ఫ్లిక్స్‌లో వారాల పాటు టాప్-10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు జపాన్‌లో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతోంది.

ఫొటో సోర్స్, Twitter/JrNTR
అవార్డుల వేటలో ఆర్‌ఆర్‌ఆర్
ఆర్‌ఆర్‌ఆర్ అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ సాంగ్ కేటగిరీల్లో ఈ అవార్డులు దక్కాయి.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ దర్శకుడి అవార్డును రాజమౌళికి అందించింది. ఉత్తమ విదేశీ చిత్రంగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కూడా దక్కింది.
జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో ఔట్‌స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఈ చిత్రానికి అవార్డ్ వచ్చింది.
బీబీసీ కల్చర్ ఫిల్మ్ విమర్శకులు నికోలస్ బార్బర్, కరిన్ జేమ్స్ ఈ ఏడాది టాప్-20 సినిమాల జాబితాలో ఈ సినిమాను కూడా చేర్చారు.
ఇక కీరవాణి స్వరపరిచిన 'నాటునాటు' తెలుగు పాట ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనుసు దోచుకుంటోంది. ఇండియాలోనే కాదు ఆయా థియేటర్లలో పాట విన్న ప్రతి ఒక్కరిచేత స్టెప్పులు వేయిస్తోంది.
లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ చైనీస్ థియేటర్‌లో సైతం అభిమానులు 'నాటునాటు' పాటకు వేదికపైకి వెళ్లి డ్యాన్స్ చేయడం కనిపించింది.
ఈ 'నాటునాటు' పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డు దక్కింది. అంతేకాదు, ఈ పాటకు క్రిటిక్స్ చాయిస్ 2023 అవార్డు కూడా లభించింది.

ఫొటో సోర్స్, RRR
దేశవ్యాప్తంగా ఆస్కార్ మేనియా
ఇక ప్రపంచ సినిమా రంగంలో అత్యున్నత అవార్డులుగా పరిగణించే ఆస్కార్‌కు సైతం ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది.
అకాడమీ జనవరి 24న ఆస్కార్ బరిలో నిలిచే నామినేషన్ల జాబితా ప్రకటించింది.
ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని 'నాటునాటు' పాటకు నామినేషన్లలో చోటు దక్కింది. అకాడమీ పోటీలో నిలిచిన టాప్ 5 పాటల జాబితా విడుదల చేసింది.
ఇందులో నాటునాటుతో పాటు హోల్డ్ మై హ్యాండ్, అప్లాజ్, లిఫ్ట్ మి అప్, దిస్ ఈజ్ లైఫ్ పాటలకు కూడా చోటు దక్కింది. ఈ ఏడాది మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.
అయితే నెటిజన్లు నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు ఖాయం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. గత పదేళ్ల గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోందని అంటున్నారు .
ఇంతకీ గత పదేళ్లలో గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్‌ల అవార్డులు ఎలా ఉన్నాయి? ఎవరెవరికి ఇచ్చాయి?
గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
1944 సంవత్సరం అమెరికాలో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ప్రారంభించింది.
ఇది అమెరికన్, అంతర్జాతీయంగా సినిమా, టెలివిజన్ లో విడుదలైన పలు ఉత్తమ సినిమాలకు ఆయా కేటగిరీల్లో అవార్డులను అందజేస్తుంది.
మొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు జనవరి 1944లో లాస్ ఏంజిల్స్‌లో జరిగాయి. 2022లో విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్-2023 అవార్డు అందించింది.
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు
ది క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డులను గతంలో బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు అని పిలిచేవారు.
అమెరికన్-కెనడియన్ క్రిటిక్స్ ఛాయిస్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను అందిస్తుంది.
1996లో ఈ అవార్డులను ప్రారంభించారు. ఈ ఏడాదికి గానూ 'నాటునాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం ప్రదానం చేశారు.
ఈ అవార్డు అకాడమీ అవార్డ్ విజయానికి సూచికగా పరిగణిస్తారు చాలామంది.

ఫొటో సోర్స్, Reuters
గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డులను ఫాలో అవుతున్న ఆస్కార్?
గత పదేళ్ల ఆస్కార్ అవార్డులు పరిశీలిస్తే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాాయిస్ అవార్డులు పొందిన విజేతలే ఎక్కువగా ఆస్కార్ విన్నర్‌లుగా నిలిచినట్లు రికార్డులు ద్వారా తెలుస్తోంది.
వాటిని ఒకసారి పరిశీలిస్తే 2013 ఏడాదికి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ అవార్డు దక్కించుకున్న స్కై ఫాల్ సాంగ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డునూ గెలుచుకుంది. అదే పాటకు 2013లో ఆస్కార్ అవార్డు దక్కింది.
ఆర్డినరీ లవ్ పాటకు గోల్డెన్ గ్లోబ్-2014 అవార్డు దక్కితే, లెట్ ఇట్ గో పాటకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు దక్కింది. అయితే ఆ ఏడాది లెట్ ఇట్ గో పాటకు ఆస్కార్ పురస్కారం లభించింది.
2015 ఏడాదిలో గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు గ్లోరీ పాటకు దక్కితే, అదే పాట క్రిటిక్స్ చాయిస్ అవార్డూ సాధించింది. ఇక ఆస్కార్ అవార్డు కూడా గ్లోరీ పాటకే రావడం గమనార్హం.
గోల్డెన్ గ్లోబ్-2016 అవార్డు దక్కిన రైటింగ్స్ ఆన్ ది పాటకే ఆ ఏడాది ఆస్కార్ అవార్డు లభించింది.
2017లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సిటీ ఆఫ్ స్టార్స్ పాటకే క్రిటిక్స్ చాయిస్ అవార్డు లభించింది. అదే పాటకు అకాడమీ ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం అందించింది.
ఇలా 2018, 2019, 2020, 2022లలో గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డులు దక్కించుకున్న పాటలకే అకాడమీ ఆస్కార్ అందించింది.
అంతేకాకుండా, 2013, 2015, 2017, 2019, 2020, 2022లలో ఒకే పాటకు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్‌లు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డులను అందించాయి. ఆస్కార్ పురస్కారం కూడా ఆయా పాటలకే వరించింది.
అయితే, ఈ ఏడాది 'నాటునాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డులు రెండూ దక్కడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
గత పదేళ్ల చరిత్ర లాగే ఈ ఏడాది కూడా ఆస్కార్ 'నాటునాటు'కే దక్కుతుందని నెట్టింట రచ్చ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
గత పదేళ్లలో ఏ పాటలకు అవార్డులు వచ్చాయి?

ఇవి కూడా చదవండి
- పవన్ కల్యాణ్: తెలంగాణలో పోటీ చేస్తామన్న జనసేన అధినేత
- మథుర కారిడార్: ఇక్కడ ఆలయాలను కూలగొడతారా... బృందావన వాసులు ‘రక్తం’తో లేఖలు ఎందుకు రాస్తున్నారు
- ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు ఏడాదికి రూ.13,500 స్కాలర్షిప్ పొందడం ఎలా?
- ‘అక్కినేని, తొక్కినేని’ అన్న నందమూరి బాలకృష్ణ... రగులుతోన్న వివాదం
- మల్లికా సారాభాయ్: బీజేపీతో విభేదాల వల్లే ఆమె నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














