ప‌ఠాన్ రివ్యూ: షారుక్ ఖాన్ హిట్ కొట్టాడా

పఠాన్ పోస్టర్

ఫొటో సోర్స్, YRF - Yash Raj Films/Facebook

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

బాలీవుడ్‌కు కొంతకాలంగా బాక్సాఫీసు వద్ద కలిసి రావడం లేదు.

షారుక్ ఖాన్ కెరీర్ కూడా అంతే. బాలీవుడ్ బాద్ షాగా పేరొందిన షారుక్ హిట్ కొట్టి చాలాకాలమైంది. ఇవి రెండూ `ప‌ఠాన్‌` సినిమాతో ముడిప‌డిపోయాయి.

షారుక్ హిట్ కొడితే, ఆ స్థాయి ఎలా ఉంటుందో సినీ జ‌నాల‌కు బాగా తెలుసు. సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న `ప‌ఠాన్‌` వ‌చ్చేశాడు. భారీ అంచ‌నాలు, ఇంకెన్నో వివాదాలు మోసుకొంటూ వ‌చ్చిన `ప‌ఠాన్‌` ఆశించిన మేర రాణించాడా..? ఈ సినిమాతో... బాలీవుడ్ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డిన‌ట్టేనా..?

ప‌ఠాన్

ఫొటో సోర్స్, Yash Raj Films

దేశం కోసం...

ఆర్టిక‌ల్-370ను భార‌త ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్తుంది. దాంతో.. క‌శ్మీర్‌పై క‌న్నేసిన పాకిస్తాన్ ర‌గిలిపోతుంది. ఎలాగైనా భార‌త్‌లో మార‌ణ‌హోమం సృష్టించాల‌నుకొంటుంది. అందుకోసం జిమ్(జాన్ అబ్ర‌హం) స‌హాయం తీసుకొంటుంది. భార‌త్‌కీ త‌న‌కూ వ్య‌క్తిగ‌త శ‌త్రుత్వం కూడా ఉంటుంది. అందుకే.. భార‌త్‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకొంటాడు.

పాకిస్తాన్ నుంచి భార‌త్‌కు ముప్పు ఉంద‌న్న విష‌యాన్ని నిఘా సంస్థ‌లు గ్ర‌హిస్తాయి. దాన్ని తిప్పికొట్ట‌డానికి ఏజెంట్ ప‌ఠాన్ (షారుక్ ఖాన్) రంగంలోకి దిగుతాడు. ఆ త‌ర‌వాత ఏమైంది..? ప‌ఠాన్ భార‌త్‌ని పెను ప్ర‌మాదం నుంచి ఎలా ర‌క్షించాడు? అనేది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఇదో స్పై థ్రిల్ల‌ర్‌. సాధార‌ణంగా ఇలాంటి క‌థ‌ల్ని చాలా ఈజీగా ఊహించొచ్చు. దేశానికి శ‌త్రువుల నుంచి ప్ర‌మాదం పొంచి ఉంటుంది. దాన్ని హీరో కాపాడ‌తాడు. అంతే క‌థ‌. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి గ‌తంలో వ‌చ్చిన `ఏక్ థా టైగ‌ర్‌`, `టైగ‌ర్ జిందా హై` సినిమాల్లోనూ ఇదే క‌థ‌. ఇప్పుడూ అంతే.

`ప‌ఠాన్‌` చూసొచ్చాక‌... క‌థేమిటి? అని అడిగితే చెప్ప‌డానికి పెద్ద‌గా ఏం ఉండ‌దు. ఇంత సాధార‌ణ‌మైన క‌థ‌ని ద‌ర్శ‌కుడు సిద్దార్థ్ ఆనంద్ ఎలా రాసుకొన్నాడు? దాన్ని షారుక్ ఎలా న‌మ్మాడు? అనిపిస్తుంది.

వాళ్ల బ‌లం.. యాక్ష‌న్ సీక్వెన్స్‌. ఓ సాధార‌ణ‌మైన క‌థ‌ని విజువ‌ల్‌గా అందంగా తీర్చిదిద్దొచ్చు. స్టార్ బ‌లం తోడైతే.. మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. క‌థ‌లో చిన్నచిన్న ట్విస్టులు, ఎమోష‌న్ బ్యాగేజీ ఉంటే.. అదో ప్యాకేజీలా మారిపోతుంది.

సిద్దార్థ్ ఇది వ‌ర‌కు తీసిన `వార్‌` కూడా ఇదే కొల‌త‌ల‌తో తెర‌కెక్కింది. ఇప్పుడూ అంతే. క‌థ కంటే.. ప్యాకేజీని న‌మ్ముకొని తీసిన సినిమా ఇది. అది వ‌ర్క‌వుట్ అయ్యింది కూడా. వెండి తెర‌పై షారుక్, జాన్ అబ్ర‌హాం లాంటి ఇద్ద‌రు స్టార్లు కొట్టుకోవ‌డం, గాల్లో ఎగ‌ర‌డం, మిష‌న్ గ‌న్నుల‌తో బీభ‌త్సాలు సృష్టించ‌డం.. ఇవ‌న్నీ యాక్ష‌న్ ప్రియుల్ని అల‌రించేలా ఉన్నాయి.

దీపికా ప‌దుకొణె స‌ర్‌ప్రైజింగ్ ట్విస్టులు, స‌ల్మాన్ ఖాన్ స్వీట్ ఎంట్రీ.. ఇవ‌న్నీ బోన‌స్‌గా అనిపిస్తాయి. దేశం కోసం హీరో పోరాడుతున్నాడంటే.. చూడ్డానికి కూడా బాగుంటుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో దేశం గురించి, సైనికుల గురించి సంభాష‌ణ‌లు చెబుతుంటే... రోమాలు నిక్క‌బొడుస్తాయి.

ఈ సినిమాలో అడుగ‌డుగునా ఇవే క‌నిపిస్తుంటాయి. కాబ‌ట్టి... రొటీన్ క‌థ సైతం పాసైపోతుంటుంది.

దీపిక పదుకొణె

ఫొటో సోర్స్, YRF - Yash Raj Films/Facebook

ప‌ఠాన్ ప‌టాకులు

షారుక్ ఎంట్రీ నుంచీ... ఈ సినిమాను అభిమానుల‌కు, యాక్ష‌న్ ప్రియుల‌కు న‌చ్చేలా డిజైన్ చేసుకొంటూ వ‌చ్చాడు సిద్దార్థ్ ఆనంద్‌.

బంధీగా ఉన్న షారుక్‌... శ‌త్రుమూక‌ను మిష‌న్‌గ‌న్నుల‌తో విరుచుకుప‌డుతున్న‌ప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో... ఓ పాప్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. ఓ భారీ యాక్ష‌న్ స‌న్నివేశంలో రొమాంటిక్ బీజియం వినిపించ‌డం.. షారుక్ ఖాన్ ఇమేజ్‌కి స‌రిగ్గా స‌రిపోయిందేమో అనిపిస్తుంటుంది.

జాన్ అబ్ర‌హాం ప‌రిచ‌య స‌న్నివేశాన్నీ త‌క్కువ చేయ‌లేదు. తెర‌పై షారుక్, జాన్ త‌ల‌ప‌డే తొలి స‌న్నివేశ‌మే క్లైమాక్స్‌లా ఉంటుంది. హెలికాఫ్ట‌ర్ ప‌ట్టుకొని ఎగర‌డాలూ, దుబాయ్ రోడ్ల‌పై బాంబ్ బ్లాస్టులూ ఇవ‌న్నీ... ఓవ‌ర్ ద బోర్డ్ అనిపించినా, అవ‌న్నీ షారుక్‌, జాన్‌ల స్క్రీన్ ప్రెజెన్స్ ముందు మ‌టుమాయం అయిపోతుంటాయి.

ఈ సినిమాలో మాట‌లు త‌క్కువ‌, తూటాల శ‌బ్దాలు, బాంబుల మోత‌లు ఎక్కువ‌. యాక్ష‌న్ సీక్వెన్సులతోనే స‌గం సినిమా న‌డిచిపోతుంది. అయితే ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. కార‌ణం.. ఓ ఫైటు రోడ్డుపై తీస్తే.. ఇంకోటి మంచు ప‌ర్వ‌తాల్లో. ఆఖ‌రిదైతే.. ఆకాశంలోనే పోరాటం. ఇలా.. ఒక్కో ఫైట్ ఒక్కో స్టైల్‌లో సాగుతుంది.

ఇదంతా పూర్తి సినిమా టిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌. కేవ‌లం అభూత క‌ల్ప‌న‌. హాలీవుడ్‌లో ఈ త‌ర‌హా స్టంట్స్ చాలా చూసుంటాం. భార‌తీయ తెర‌పై ధూమ్‌, వార్‌ల‌లో చూశాం. వాటికి భిన్నంగా ఏమీ క‌నిపించ‌క‌పోయినా.. షారుక్ వ‌ల్ల‌... త‌న స్క్రీన్ ప్రెజెన్స్ వ‌ల్ల కొంత కొత్త క‌ళ వ‌చ్చింది. మ‌ధ్య‌లో... స‌ల్మాన్ ఖాన్ ఎంట్రీ అదిరిపోయింది.

దీపికా ప‌దుకొణే

ఫొటో సోర్స్, Getty Images

లేడీ హీరో

దీపికా ప‌దుకొణే క్యారెక్ట‌ర్‌ను బాగా డిజైన్ చేశారు. బేష‌ర‌మ్ పాట‌లో దీపిక గ్లామ‌ర్ కోణం క‌నిపిస్తుంది. అయితే ఆ వెంట‌నే యాక్ష‌న్ మోడ్‌లోకి మారిపోతుంది. ఇంట్ర‌వెల్‌లో వ‌చ్చే ట్విస్టు షాక్ ఇస్తుంది. ద్వితీయార్థంలో సైతం ఆ పాత్ర‌ని క‌థ‌లోకి లాక్కొచ్చారు. ఈ సినిమాకి దీపిక సెకండ్ హీరో అనుకోవచ్చు.

ప‌తాక స‌న్నివేశాల్లో హీ మాన్ లా మిష‌న్ గ‌న్నుల‌తో విరుచుకుప‌డుతుంటే చూడ్డానికి బాగుంటుంది. ఓ హీరోయిన్‌ను ఈ త‌ర‌హా యాక్ష‌న్ సీక్వెన్సులో చూడ‌డం ఇదే తొలిసారి. బ‌యోవార్ జ‌రిగితే ఎలా ఉంటుంది? అనే ఊహ‌తో కొన్ని ఎపిసోడ్లు రూపొందించారు. అది చూస్తే నిజంగానే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది.

షారుక్‌, దీపికల ఫ్లాష్ బ్యాక్‌లో బ‌లం లేక‌పోవ‌డం ఈ సినిమాకి ప్ర‌ధాన‌మైన మైన‌స్‌. ఆ విష‌యంలో బాగా వ‌ర్క‌వుట్ చేసి ఉంటే బాగుండేది. ఓ విధంగా `ప‌ఠాన్‌` `వార్‌` ఫ్రాంచైజీ అనుకోవ‌చ్చు. ఎందుకంటే.. `వార్‌` సినిమాలోని కొన్ని ఎపిసోడ్ల‌కీ ఈ క‌థ‌కూ లింకు ఉంటుంది. జాన్ అబ్ర‌హాం పాత్ర‌ని అక్క‌డి నుంచి తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలూ సిద్దార్థ్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో.. తదుప‌రి చిత్రాల్లో కూడా `వార్‌`, `ప‌ఠాన్‌` రిఫ‌రెన్సులు క‌నిపించే అవ‌కాశం ఉంది.

వీడియో క్యాప్షన్, షారుక్‌ఖాన్ 'పఠాన్' సినిమా ఎలా ఉందో 2.30 నిమిషాల్లో చూసేద్దాం

స్టార్ బ‌లం

ఏ సినిమాకైనా క‌థే బ‌లం. అయితే `ప‌ఠాన్‌` మాత్రం స్టార్ల‌ని న‌మ్ముకొంది. షారుక్ ఖాన్ స్టార్ డ‌మ్ ఈ సినిమాకి బాగా క‌లిసొస్తుంది. షారుక్ నుంచి సినిమా వ‌చ్చి నాలుగేళ్ల‌య్యింది. ఇంత యాక్ష‌న్ ప్యాక్డ్ సినిమాకి ఇది వ‌ర‌కు చేయ‌లేదు. కాబ‌ట్టి షారుక్ ఫ్యాన్స్‌కి ప‌ఠాన్ కొత్త‌గా అనిపిస్తాడు. త‌న లుక్ బాగుంది. త‌న‌ది రొమాంటిక్ ఈమేజ్‌. దానికి త‌గ్గ‌ట్టు కొన్ని సీన్లు డిజైన్ చేసినా.. ఎక్కువ భాగం యాక్ష‌న్ చుట్టూనే న‌డిచింది.

జాన్ అబ్ర‌హాం ఎలివేష‌న్ బాగుంది. ఆ పాత్ర‌ని ప‌రిచ‌యం చేసిన విధానం న‌చ్చుతుంది. అయితే దీపిక వ‌చ్చిన త‌ర‌వాత‌... ఆ పాత్ర సైడ్ అయిపోతుంది. సెకండాఫ్ వ‌ర‌కూ గుర్తుకు రాదు. కాక‌పోతే బ‌ల‌మైన విల‌న్ ఉన్న‌ప్పుడు తెర‌పై హీరోయిజం ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ప‌ఠాన్ విష‌యంలో అదే జ‌రిగింది.

సాధార‌ణంగా యాక్ష‌న్ చిత్రాల్లో క‌థానాయిక పాత్ర‌ల‌కు అంత‌గా ప్రాధాన్యం ఉండ‌దు. కానీ ఈ సినిమాలో దీపిక పాత్ర‌ని క‌థ‌లోకి లాక్కొచ్చిన తీరు ఆక‌ట్టుకొంటుంది.కొన్ని ప్ర‌ధానమైన మ‌లుపుల‌కు ఆ పాత్రే కీల‌కం అవుతుంది. ఈ త‌ర‌హా పాత్ర‌లో దీపిక‌ను చూడ‌డం ఇదే తొలిసారి.

సాంకేతికంగా చెప్పాలంటే.. నేప‌థ్య సంగీతం బాగుంది. బేష‌ర‌మ్ పాట ముందే హిట్టు. మ‌రో పాట‌ని ఎండ్ టైటిల్స్‌లో వాడుకొన్నారు. బేష‌ర‌మ్ పాట చుట్టూ వివాదాలు రేగిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట‌తో ఇంకెన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయో అని అంతా ఎదురు చూశారు. అయితే.. ఆ పాట‌లో దీపిక ఎంట్రీ చూశాక‌.. వివాదాలు మ‌ర్చిపోయి కేవ‌లం ఆమెపైనే ఫోక‌స్ చేస్తారంతా.

యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ల‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. 2గంట‌ల 35 నిమిషాల సినిమాఇది. దాదాపు గంట సేపు యాక్ష‌నే ఉంటుంది. కొన్ని సీన్లు, షాట్స్‌.. ఓవ‌ర్ ది బోర్డ్ అనిపిస్తాయి. తెర‌పై ఎవ‌రికీ సాధ్యం కాని విన్యాసాల‌తో, సైన్స్ సూత్రాల‌కు విరుద్ధంగా షారుక్, జాన్ అబ్ర‌హాం త‌ల‌ప‌డుతుంటారు. కాక‌పోతే షారుక్‌, జాన్‌ల ఇమేజ్ వ‌ల్ల‌... అలాంటి లాజిక్ లెస్ సీన్లు కూడా చూడ‌బుద్దేస్తుంది.

గ్రాఫిక్స్ విష‌యంలో ఇంకాస్త శ్ర‌ద్ధ పెట్టాల్సింది. సిద్దార్థ్ ఆనంద్ చాలా సాదా సీదా క‌థ రాసుకొన్నాడు. త‌న బ‌లం యాక్ష‌న్ సీన్లు. వాటిపై దృష్టి పెట్టాడు. స‌రైన స‌మ‌యంలో.... స‌ల్మాన్ ఖాన్‌ని వాడుకొన్నాడు. అది బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇలాంటి స్టార్లు అందుబాటులో ఉన్న‌ప్పుడు కథ‌పై కూడా దృష్టి పెడితే.. ప‌ఠాన్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించేవాడు. ఇప్ప‌టికీ మించిపోయిందేం లేదు. షారుక్ ఫ్యాన్స్‌కి ముఖ్యంగా యాక్ష‌న్ ప్రియుల‌కు ఏం కావాలో అవ‌న్నీ ఓ ప్యాకేజీగా మార్చి అందించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)