రాజమౌళి-ఆర్ఆర్ఆర్: ఆరంభం నుంచి ఆస్కార్ గుమ్మం వరకు

రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్

ఫొటో సోర్స్, rajamouli ss/Twitter

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

ఆర్ఆర్ఆర్... ప్ర‌పంచం తెలుగు సినిమా గురించి మాట్లాడుకొనేలా చేసిన చిత్రం.

ఇప్పుడు `నాటు నాటు` పాట‌ ఆస్కార్‌‌కు నానిమేట్ అవడం ద్వారా మరొక చరిత్ర సృష్టించింది.

ఆరంభం నుంచి ఆస్కార్ నామినేషన్ వరకు దాని ప్రయాణం చూద్దాం...

సినిమా ఆరంభం ఇలా..

బాహుబలి-2 తర్వాత రాజమౌళి ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే బాహుబ‌లి సిరీస్‌తో రాజ‌మౌళి స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఆయ‌నతో ప‌ని చేయాలని బాలీవుడ్ స్టార్స్ అంతా ఆస‌క్తితో ఎదురు చూశారు.

అలాంటి సమయంలో రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సోషల్ మీడియాలో ఒక ఫోటోని పంచుకున్నారు. దాంతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా చేయబోతున్నారని ఫ్యాన్స్ నిర్ణయానికి వచ్చేశారు.

అయితే కొందరిలో ఇంకా ఏదో చిన్న అనుమానం.. సరదాగా తీసుకున్న ఫోటో అది.. ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టారర్ కుదిరేపనేనా? అనుకున్నారు. అయితే ఈ డ్రీమ్ కాంబినేషన్‌ని రాజమౌళి నిజం చేసి చూపించారు.

మార్చి 2018లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్... ఆర్ఆర్ఆర్ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

ఆర్ ఆర్ ఆర్

ఫొటో సోర్స్, RRR

టైటిల్ పుట్టిందిలా..

రామ్ చరణ్, రామారావు, రాజమౌళి.. కాంబినేష‌న్‌ కావడం వలన.. ఈ చిత్రానికి సోషల్ మీడియా అభిమానులు ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌ను కాయిన్ చేశారు. ఇదే టైటిల్ ట్రెండ్ అయ్యింది. దాన్ని వ‌ర్కింగ్ టైటిల్‌గా తీసుకొన్నారు.

అయితే క‌థ‌కు సరిప‌డే.. మరో టైటిల్ కోసం అన్వేషించారు. సినిమా పాన్ ఇండియా కావడం.. ఆర్ఆర్ఆర్ టైటిల్ అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ కావడంతో అదే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ టైటిల్‌ను కథలో భాగం చేస్తూ `రౌద్రం రణం రుధిరం` అంటూ సినిమాలో కథానాయకులని పరిచయం చేయడం రాజమౌళి క్రియేటివిటికి అద్దం పట్టింది. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా సెట్స్‌పై ఉంది.

ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో భారీ సెట్లు వేయించారు రాజ‌మౌళి. అక్క‌డే.. ఓ ఆఫీసు కూడా తెరిచారు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, కీర‌వాణి.. ఇలా ఈ చిత్రంలో ప‌నిచేసే కీల‌క‌మైన స‌భ్యులంద‌రికీ ఈ ఆఫీసులో ఒక్కోగ‌ది కేటాయించారు.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యేవ‌ర‌కూ ఇంచుమించు అల్యుమిన‌యం ఫ్యాక్ట‌రీనే ఈ చిత్ర బృందానికి ఇల్లుగా మారిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత భాగం చిత్రీక‌రించారు. యుక్రెయిన్‌లో మ‌రి కొన్ని స‌న్నివేశాల్ని, ఓ పాట‌ని తెర‌కెక్కించారు.

ఆర్ ఆర్ ఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/RRR

ఊహకు అందని ఆలోచనలు

రాజమౌళి ఆలోచనలు ఊహకు అందవు. ఆర్ఆర్ఆర్ కథ కూడా ఎవరూ ఊహించనిదే. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌.. ఇద్దరూ విప్లవ వీరులు. వీరిద్దరూ రెండు భిన్నమైన కాలాల్లో జీవించారు. ఈ ఇద్దరికీ ఒక సారూప్యం వుంది. ఇద్దరూ కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారని చరిత్ర చెబుతుంది.

రాజమౌళికి సరిగ్గా ఇదే అంశం ఆసక్తిని రేకెత్తించింది. ఒకవేళ ఈ ఇద్దరూ ఆ అజ్ఞాత‌కాలంలో క‌లిసి ఉంటే..? అనేదే ఈ క‌థ‌కు బీజం పోసింది. తాను అనుకున్నట్లుగా సినిమాను మలిచేందుకు రాజమౌళి ఎక్కడా వెనక్కి తగ్గరు. ఆయనకు తగ్గట్లుగానే నిర్మాతలు సైతం ఎంత బడ్జెట్‌ పెట్టేందుకైనా సిద్ధంగా ఉంటారు.

ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు రూ.550 కోట్లపైనే ఖర్చు చేశారు. రాజమౌళిపై ఉన్న నమ్మకంతో నిర్మాత దానయ్య ఎక్కడా వెనకడుగు వేయలేదు. రాజమౌళి సినిమా అంటే వాయిదాలు తప్పని సరి. ఎందుకంటే ఆయన అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకూ నిర్మాణంలో రాజీపడరు.

ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా వాయిదాల పర్వం నడిచింది. పైగా కరోనా లాక్ డౌన్ కూడా దెబ్బకొట్టింది. కొన్ని వాయిదాల తర్వాత 2022 జనవరి 7న సినిమాను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేశారు. అయితే మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో మూతపడ్డాయి. దీంతో రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు.

‘‘ఎంతో కష్టపడి అవిశ్రాంతంగా పనిచేసినా, కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఆలస్యమైనా ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తాం. ఇండియన్‌ సినిమా వైభవాన్ని సరైన సమయంలో మళ్లీ మీ ముందుకు తీసుకొస్తాం’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్లుగానే 2022 మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.

ఆర్ఆర్ఆర్.. విజువల్ వండర్

బాహుబలితో తను ఎన్ని అద్భుతాలు చేయగలడో చూపించాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్‌తో ఆయన దర్శకత్వ ప్రతిభ మరోస్థాయికి వెళ్లింది. ప్రతి ఫ్రేం ఒక విజువల్ ట్రీట్‌లా చూపించారు. ఎమోషన్స్, ఒళ్లు గగుర్పాటు పొడిచే పోరాట సన్నివేశాలను ఇండియాలో మరో దర్శకుడు చిత్రీకరించలేడనేంత అద్భుతంగా ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

ఇద్దరు పెద్ద స్టార్స్ ఉన్నపుడు వారిని బ్యాలెన్స్ చేయడం ఒక సవాల్. అయితే రాజమౌళి ప్రతిభ ముందు ఈ సవాల్ చిన్నదైపోయింది. ఇద్దరి హీరోల పాత్రలను డిజైన్ చేసిన తీరు వారి పరిచయ సన్నివేశాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి.

ఇండియా సినిమా చరిత్రలోనే హీరోలకు ఇలాంటి ప‌రిచ‌య స‌న్నివేశాలు లేవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రామ్.. కేవలం ఒక లాఠీ పట్టుకొని ఒక పెద్ద గుంపు ముందు నిలబడిన సన్నివేశం, భీమ్ అడవిలో పెద్ద పులిని బంధించే సన్నివేశం.. ఎవ్వరూ మర్చిపోలేరు. రామ్‌ను నిప్పుకి, భీమ్‌ను నీటికి ప్రతీకగా చూపించి ఆ రెండిటినీ కలిపి ఓ పిల్లాడిని కాపాడే సన్నివేశం.. అలాగే భీమ్ అడ‌విలోని జంతువులను బ్రిటిష్ సైన్యం మీద వదిలిన షాట్‌.. ఈ చిత్రాన్ని మ‌రో స్థాయిలో నిలబెట్టాయి.

రాజమౌళి

ఫొటో సోర్స్, FACEBOOK/RRRMOVIE

ఆర్ఆర్ఆర్.. అవార్డుల పంట..

ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్‌లో బాక్సాఫీస్‌ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్‌ చేసింది. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది.

జపాన్‌లో తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. రజినీకాంత్‌ ‘ముత్తు’ పేరిట వున్న రికార్డ్‌ను బ్రేక్ చేసింది. జపాన్‌తో పాటు అమెరికా, చైనా లాంటి మిగతా దేశంలో కూడా ఆర్ఆర్ఆర్ హవా నడిచింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవార్డుల వెల్లువ కొనసాగుతోంది. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలకు ఇచ్చే శాటర్న్‌ అవార్డు ఆర్ఆర్ఆర్‌ను వరించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది.

అలాగే ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ స్పాట్‌లైట్‌ విన్నర్‌గా ఈ చిత్రం నిలిచింది. నటులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ అవార్డు దక్కుతుంది. ‘అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్స్‌’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సత్తా చాటింది. సన్‌సెట్‌ సర్కిల్‌ గౌరవం కూడా ఈ చిత్రానికి లభించింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట వరల్డ్ ఫేవరేట్ అయింది. ఇప్పుడీ పాట రూపంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో విశిష్ఠ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డును ‘ఆర్ఆర్‌ఆర్‌’ సొంతం చేసుకుంది.

ఒరిజినల్‌ సాంగ్‌ విభాగానికి గానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’ పాటను పురస్కారం వరించింది. ఇప్పుడు ‘నాటు... నాటు’ పాట ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)