రిపబ్లిక్ డే: ఈజిప్ట్‌కు భారత్ రహస్య సహకారం అందించిందా? రెండు దేశాల సంబంధాలు ఇప్పుడెలా ఉన్నాయి?

అల్-సిసీ, మోదీ

ఫొటో సోర్స్, HARISH TYAGI/EPA-EFE/REX/Shutterstock

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశ 74వ గణతంత్ర వేడుకల్లో ఈసారి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్-ఫత్తా-అల్-సిసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఇదే తొలిసారి.

ప్రెసిడెంట్ అల్-సిసీ భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈజిప్టు ఆర్మీకి చెందిన బృందం కూడా పాల్గొంది.

రెండు దేశాల మధ్య సంబంధాలకు అల్-సీసీ భారత పర్యటన ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఈజిప్ట్ అధ్యక్షుడి భారత పర్యటన 'చరిత్రాత్మకమైనది' గా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌లో అభివర్ణించారు.

ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ అల్-సిసీ మధ్య జరిగిన సమావేశం గురించి భారత ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

"రక్షణ పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఉగ్రవాద నిరోధక సమాచారం, ఇంటెలిజెన్స్ మార్పిడిని మెరుగుపరచాలని సమావేశంలో నిర్ణయించారు" అని తెలిపింది.

భారతదేశం, ఈజిప్టు దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈజిప్టు అధ్యక్షుడి భారత పర్యటన జరుగుతోంది.

జి-20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తుండటంతో ఈజిప్టును 'అతిథి'గా ఆహ్వానించింది.

ఈజిప్ట్

ఫొటో సోర్స్, Getty Images

భారత్, ఈజిప్ట్ సంబంధాలపై నిపుణులు ఏమంటున్నారు?

పశ్చిమాసియా, అరబ్ ప్రపంచంలో ఈజిప్ట్ ప్రాముఖ్యత, పశ్చిమాసియా దేశాలతో భారత్‌కు పెరుగుతున్న సంబంధాల దృష్ట్యా ఇది ఒక ముఖ్యమైన పర్యటన అని ముహమ్మద్ ముదస్సిర్ కమర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముదస్సిర్ కమర్ మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసీస్‌లో అసోసియేట్ ఫెలో.

ఈజిప్ట్ అతిపెద్ద అరబ్ దేశమని, మధ్యప్రాచ్య రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించిందని ఆయన తెలిపారు.

"అరబ్ దేశాల్లో ఈజిప్ట్ భారత్‌కు మంచి మిత్ర దేశం. దీనికి కారణం మొత్తం అరబ్ దేశాల్లో ఈజిప్ట్ అగ్రగామిగా కనిపించడమే" అని ప్రొఫెసర్ ముజిబుర్ రెహ్మాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముజిబుర్ రెహ్మాన్ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ అరబ్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రొఫెసర్.

1950లలో అరబ్ జాతీయవాదం, నాన్-అలీన ఉద్యమంలో ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు కమల్ అబ్దుల్ నాసర్ ప్రముఖ పాత్ర పోషించారు.

ఆయన తర్వాత వచ్చిన ముహమ్మద్ అన్వర్ సాదత్ ఇజ్రాయెల్‌తో శాంతి, పశ్చిమ దేశాలతో మెరుగైన సంబంధాల కోసం అడుగులు వేశారు.

అబ్దుల్ ఫతాహ్ అల్-సిసీ 2014 మేలో అధ్యక్షుడయ్యారు. ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన భారత్‌కు వచ్చారు.

2021-22 సంవత్సరంలో భారత్‌, ఈజిప్ట్ దేశాల మధ్య దాదాపు రూ. 59 వేల కోట్ల వాణిజ్య ఒప్పందాలు జరిగాయి.

భారత్‌కు చెందిన 50కి పైగా కంపెనీలు ఈజిప్టులోని వివిధ రంగాలలో రూ.24 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి.

ఈజిప్ట్

ఫొటో సోర్స్, Getty Images

రహస్య సహకారం ఎప్పుడు అందింది?

ఈజిప్టు అధ్యక్షులుగా గమల్ అబ్దుల్ నాసర్, భారత ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ ఉన్న సమయంలో అలీనోద్యమంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడడం మొదలైంది.

ఇద్దరు నేతల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉండేది. ఈజిప్టులోని మాజీ భారత రాయబారి నవదీప్ సూరి రాసిన కథనం ప్రకారం "రాజకీయంగా రెండు దేశాలు చాలా సన్నిహితంగా ఉన్నాయి.

1956లో చోటుచేసుకున్న సూయజ్ సంక్షోభం సమయంలో భారత్ రహస్యంగా ఈజిప్ట్‌కు సైనిక సామగ్రి పంపింది.

అణు సహకారం, ఉమ్మడి ఫైటర్ ప్రాజెక్ట్‌ల గురించి కూడా చర్చించారు.

మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్‌ల కాలం అది. వారి పుస్తకాలను అరబ్ సాహిత్యంలో ప్రముఖులు అరబిక్‌లోకి అనువదించారు" తెలిపింది.

సూయజ్ కెనాల్ సంక్షోభం అంటే అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు నాసర్ సూయజ్ కాలువను జాతీయం చేసిన సమయం.

ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ తమ బలగాలను ఆ ప్రాంతానికి పంపాయి.

ఈజిప్ట్ అధ్యక్షుడు అవమానంగా భావించారా?

అయితే అన్వర్ అల్-సాదత్ పాలన తర్వాత భారత్, ఈజిప్ట్ దేశాల మధ్య సంబంధాలు కొద్దిగా తగ్గాయని ప్రొఫెసర్ పుష్ప అధికారి అభిప్రాయం వ్యక్తంచేశారు.

దీనికి ఇందిరా గాంధీ, సాదత్‌ల విభిన్న విధానాలే కారణమని ప్రొఫెసర్ ఆరోపించారు.

పుష్ప అధికారి నేపాల్‌లోని త్రిభువన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు.

"జమాల్ అబ్దుల్ నాసర్ జాతీయవాద నాయకుడు. ఆయన సూయజ్‌ కాలువను జాతీయం చేశారు.

దీంతో పాశ్చాత్య దేశాలన్నీ నాసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ తర్వాత వచ్చిన అన్వర్ సాదత్ దాన్ని బ్యాలెన్స్ చేయడం ప్రారంభించారు" అని ప్రొఫెసర్ తెలిపారు.

సాదాత్ హత్య తర్వాత ఈజిప్టులో హోస్నీ ముబారక్ అధికారంలోకి వచ్చారు.

అదే సమయంలో 1983 సంవత్సరంలో ఢిల్లీలో అలీనోద్యమ సదస్సు జరిగింది.

అప్పుడు ఇందిరా గాంధీ, హోస్నీ ముబారక్‌ల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని ప్రొఫెసర్ పుష్ప అధికారి అభిప్రాయం వ్యక్తంచేశారు.

1983లో న్యూ ఢిల్లీలో జరిగిన నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ సమావేశంలో సీట్ల సర్దుబాటులో చోటుచేసుకున్న ఒక చిన్న ప్రోటోకాల్ లోపాన్ని ముబారక్ అవమానంగా భావించి ఉండవచ్చని నవదీప్ సూరి కథనం ఆధారంగా చెబుతున్నారు.

ఆ తర్వాత 25 ఏళ్ల పాటు ముబారక్ భారత్‌కు రాలేదు. చివరకు 2008 నవంబర్‌లో ఇండియాకు వచ్చారు.

హోస్నీ ముబారక్ అధికారంలో ఉన్నంత కాలం భారతదేశంతో ఈజిప్ట్ సంబంధాలు ఎక్కువగా లేవని పుష్ప అధికారి తెలిపారు.

కాగా, 2011లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి రావడంతో ముబారక్ అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

ఈజిప్ట్

ఫొటో సోర్స్, ANI

రెండు దేశాలకూ అవసరం

కానీ, కాలం మారింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి.

ముహహ్మద్ ముదస్సిర్ కమర్ మాట్లాడుతూ "గత మూడు-నాలుగు సంవత్సరాలలో భారత్, ఈజిప్టు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రెండూ దేశాలు చాలా దగ్గరయ్యాయి. 2013లో అల్-సిసి భారత్‌కు వచ్చినప్పుడు ఈజిప్టు విదేశాంగ విధానంలో మార్పు వచ్చింది.

ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆయన ఈజిప్టుతో గతంలో మంచి సంబంధాలు కలిగి ఉన్న దేశాలతో సాన్నిహిత్యం కొనసాగించే ప్రయత్నాలు చేశారు'' అని తెలిపారు.

ఈజిప్టు, ఇండియాలు రెండూ ఒకదానికొకటి అవసరం. 2021లో కోవిడ్-19 వేవ్ సమయంలో ఈజిప్టు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, రెమ్‌డెసివిర్ మందులను భారతదేశానికి పంపింది.

అదేవిధంగా 2022 మేలో భారత్ 61,500 టన్నుల గోధుమలను ఈజిప్టుకు పంపింది.

తాజాగా ఈజిప్టులో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు భారత కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు రూ. 65 వేల కోట్ల పెట్టుబడిని అక్కడ పెట్టనుంది.

పాకిస్తాన్ ప్రతిపాదనపై ఈజిప్టు అభ్యంతరం

విద్య, ఐటీ, రక్షణ మొదలైన రంగాల్లో ఈజిప్టునకు ఇండియా అవసరమని పుష్ప అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

పశ్చిమాసియా, ఆఫ్రికా రాజకీయాలలో ఈజిప్ట్ చాలా బలంగా ఉన్నందున ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడానికి భారత్‌కు ఈజిప్ట్ ఒక మార్గంగా మారవచ్చన్నారు ప్రొఫెసర్.

పుష్ప అధికారి మాట్లాడుతూ "ఈజిప్టులో విద్యారంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారు భారతదేశం నుంచి సాయం కోరుకుంటున్నారు.

ఈజిప్ట్ ఇప్పటికీ ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలో బలమైన సైనిక శక్తిగా ఉంది.

ఇజ్రాయెల్‌లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అలాంటిదే ఈజిప్టులో జరగాలనుకుంటోంది. కానీ, అలా కావడం లేదు.

అందుకే ఈజిప్ట్‌కు సైనిక సాయం కూడా అవసరం. రక్షణ రంగంలో భారత్ నుంచి ఈజిప్ట్ చాలా కోరుకుంటోంది.

రెండు నెలల క్రితం ఇస్లామిక్ దేశాల సదస్సు (ఓఐసీ) జరిగింది. అందులో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ తీర్మానం చేసింది.

ఈజిప్టు నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో దానికి ఆమోదం లభించలేదు. ఈ విధంగా ఈజిప్ట్ భారతదేశం పట్ల సుహృద్భావాన్ని ప్రదర్శిస్తోంది'' అన్నారు. 2022లో మహ్మద్ ప్రవక్త గురించి బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తర్వాత భారత్ ఇస్లామిక్ దేశాల నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది.

అనేక అరబ్ దేశాలు కూడా దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే ఈ సమయంలో ఈజిప్ట్ ఎటువంటి వ్యాఖ్యానం చేయలేదు.

ఈ అంశానికి సంబంధించి పాకిస్థాన్ ఓఐసీలో ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే అల్-సిసి మద్దతు ఇవ్వకపోవడంతో ఈ ప్రతిపాదన ఆమోదం పొందలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)