ఎవర్‌గివెన్: సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన నౌక విడుదలకు అంగీకారం

ఎవర్ గివెన్

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాది మార్చి నెలలో సూయజ్ కాలువలో అడ్డంగా చిక్కుకుపోయింది ఎవర్‌గివెన్ అనే భారీ సరకు రవాణా నౌక. దాంతో ఆ మార్గంలో కొన్ని రోజుల పాటు జల రవాణా ఆగిపోయింది. రోజుకు దాదాపు రూ.70వేల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేశారు.

దాదాపు వారం రోజుల పాటు శ్రమించి ఈ నౌకను కాలువకు అడ్డు తప్పించారు.

అయితే, అక్కడి నుంచి వెళ్లిపోవడానికి, తిరిగి ప్రయాణం ప్రారంభించడానికి ఈ నౌకకు సూయజ్ కెనాల్ అథారిటీ(ఎస్‌సీఏ) అనుమతి ఇవ్వలేదు.

ఈ నౌక సూయజ్ కాలువలో ఆగిపోవడం వల్ల ఆ మార్గంలో జల రవాణాకు ఆటంకం కలిగింది. దానికి నష్టపరిహారం చెల్లిస్తేనే నౌకను అక్కడి నుంచి కదలనిస్తామని సూయజ్ కెనాల్ అథారిటీ(ఎస్‌సీఏ) స్పష్టం చేసింది.

ఎవర్ గివెన్

ఫొటో సోర్స్, Getty Images

పరిహారం కోసం కోర్టులో కేసు వేసిన సూయజ్ కెనాల్ అథారిటీ

ఆ మార్గంలో జల రవాణా ఆగిపోవడం వల్ల కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ సూయజ్ కెనాల్ అథారిటీ ఈజిప్ట్ కోర్టులో దావా వేసింది.

91.6 కోట్ల అమెరికన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఎస్‌సీఏ కోరింది.

అనంతరం ఆ మొత్తాన్ని 55 కోట్ల డాలర్లకు తగ్గించింది.

అయితే, నష్ట పరిహారం చెల్లించడంపై నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీ మధ్య పీఠముడి పడింది.

ఈ డబ్బు ఎవరు చెల్లించాలనే విషయంలో ఎవర్‌గివెన్ నౌక యజమాని జపాన్‌కు చెందిన షోయీ కిసెన్, బీమా కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి.

దాదాపు మూడు నెలల తర్వాత ఎట్టకేలకు నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీల మధ్య ఆదివారం ఒక ఒప్పందం కుదిరింది.

దాంతో ఎవర్‌గివెన్ నౌక సూయజ్ కాలువ నుంచి కదలడానికి కెనాల్ అథారిటీ నుంచి అనుమతి లభించింది.

ఈ నౌక జులై 7 నుంచి తిరిగి తన ప్రయాణం ప్రారంభించబోతోంది.

సూయజ్ కాలువ

ఫొటో సోర్స్, Reuters

ఒప్పందం కుదిరింది కానీ పరిహారం ఎంతో చెప్పలేదు

బుధవారం పరిహార ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని ఎస్‌సీఏ వెల్లడించింది.

అయితే, ఎంత పరిహారానికి ఒప్పందం కుదిరిందనే విషయం ఎస్‌సీఏ కానీ, నౌక యజమాని కానీ, బీమా సంస్థ కానీ వెల్లడించలేదు.

75 టన్నుల సామర్థ్యం గల ఒక టగ్ బోట్ ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా సూయజ్ కెనాల్ అథారిటీకి వస్తుందని మాత్రం ఎస్‌సీఏ చైర్మన్ ఒసామా రబీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)