క్రికెట్: మహిళా ఐపీఎల్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసిన అంబానీ, అదానీ

డబ్ల్యూపీఎల్‌

ఫొటో సోర్స్, Getty Images

ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మహిళల ఐపీఎల్ టోర్నీ.

ముంబై, దిల్లీ, లక్నో, బెంగళూరు, అహ్మదాబాద్‌లకు చెందిన ఐదు జట్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి.

అహ్మదాబాద్ జట్టు యాజమాన్య హక్కులను అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,289 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముంబై జట్టు యాజమాన్య హక్కులను రూ.912.99 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. పురుషుల ఐపీఎల్‌లోని ముంబై జట్టు కూడా ఈ కంపెనీదే.

రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.901 కోట్లు వెచ్చించి బెంగళూరు టీం హక్కులను కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టుకు కూడా ఇదే ఫ్రాంచైజీ సంస్థ.

జేఎస్‌డబ్ల్యూ జీఎం‌ఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దిల్లీ జట్టును కొనుగోలు చేసింది. రూ.810 కోట్లు వెచ్చించి యాజమాన్య హక్కులను సొంతం చేసుకుంది.

లక్నో జట్టు యాజమాన్య హక్కులను క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. రూ.757 కోట్లు వెచ్చించి హక్కులను కొనుక్కుంది.

పురుషుల ఐపీఎల్‌లో ముంబై, దిల్లీ, బెంగళూరు జట్లను కొనుగోలు చేసిన కంపెనీలే డబ్ల్యూపీఎల్‌లోనూ జట్లను సొంతం చేసుకున్నాయి.

ఈ ఐదు జట్ల మొత్తం విలువ రూ.4,669.99 కోట్లుగా ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ఐదు జట్ల కోసం త్వరలో క్రీడాకారుల వేలం నిర్వహించనున్నారు. వేలం తేదీని ఇంకా ప్రకటించలేదు.

కాగా, చెన్నై సూపర్ కింగ్స్ డబ్ల్యూపీఎల్ జట్టు కోసం బిడ్‌ వేసి వెంటనే ఉపసంహరించుకుంది.

5 జట్లను కొనుగోలు చేసేందుకు 17 కంపెనీలు పోటీ పడ్డాయి. వయాకామ్18 మహిళల ఐపీఎల్ టోర్నమెంట్ ప్రసార హక్కులను పొందింది.

ఈ కంపెనీ ఐదేళ్ల కోసం బీసీసీఐకి రూ.951 కోట్లు చెల్లించనుంది. ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.7.09 కోట్లు చెల్లించనుంది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

నిబంధనలు ఎలా ఉన్నాయి?

ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఒక్కో ఫ్రాంచైజీ వద్ద మొత్తం రూ.12 కోట్లు ఉండనున్నాయి.

పురుషుల ఐపీఎల్‌లో ప్రతి జట్టుకు ఒక ఐకాన్ ప్లేయర్ ఉండేవాడు. డబ్ల్యూపీఎల్‌లో ఐకాన్ ప్లేయర్లు ఉండరు.

పురుషుల ఐపీఎల్‌లో నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే జట్టులో చోటు దక్కేది. డబ్ల్యూపీఎల్‌ టోర్నీలో ఐదుగురు విదేశీ ప్లేయర్స్ ఫైనల్ ఎలెవన్‌లో ఆడొచ్చు.

అయితే ఈ ఐదుగురిలో ఒకరు తప్పనిసరిగా అసోసియేట్ దేశాలలో ఒకదానికి చెందిన ప్లేయర్ అయి ఉండాలి.

విజేతగా నిలిచిన జట్టుకు రూ.6 కోట్ల బహుమతిని అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.3 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.1 కోటి అందనుంది.

డబ్ల్యూపీఎల్‌లో ఏ నగరాల జట్లు ఉంటాయో స్పష్టమైంది. కానీ, మ్యాచ్‌ వేదికలు మాత్రం ప్రకటించలేదు.

ముంబైలో 3 అంతర్జాతీయ వేదికలు ఉన్నాయి. ముంబై జట్టు వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలలో ఒకదానిని ఎంచుకోవచ్చు.

దిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధంగా ఉంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కూడా ప్రతిపాదనలో ఉంది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

మహిళల కోసం నాలుగేళ్లు టోర్నమెంట్

డబ్ల్యూపీఎల్‌ టోర్నమెంట్‌కు సన్నాహకంగా బీసీసీఐ 4 సంవత్సరాల పాటు మహిళల ట్వంటీ 20 ఛాలెంజ్ టోర్నమెంట్‌ను నిర్వహించింది.

పురుషుల ఐపీఎల్ టోర్నీ సందర్భంగా మహిళల మ్యాచ్‌లు జరిగాయి. టీమ్‌లకు ట్రైల్‌బ్లేజర్స్, సూపర్‌ నోవాస్, వెలాసిటీ అని పేర్లు పెట్టారు.

మూడు జట్లలో ప్రధానంగా భారత ప్లేయర్స్ ఉన్నారు. వారితో పాటు ఇతర దేశాల జట్లకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణులు కూడా జట్టులో ఆడారు.

2018, 2019, 2022 టైటిళ్లను సూపర్‌నోవాస్ జట్టు గెలుచుకుంది. 2020 టైటిల్‌ను ట్రైల్‌బ్లేజర్స్ జట్టు గెలుచుకుంది. కరోనా కారణంగా 2021లో టోర్నీ నిర్వహించలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)