నాలుగు ‘0’లు, రెండు ‘1’లు.. ఇండియా ఎలా ఓడిపోయిందంటే

India vs South Africa Super 8 match

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 4 నిమిషాలు

టీ20 వరల్డ్‌కప్ సూపర్ - 8 మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

ఆదివారం రెండు జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు టోర్నీలో తొలి ఓటమి ఎదుర్కొంది.

దక్షిణా ఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 111 పరుగులకు ఆలవుటై 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత జట్టులో శివం దుబే ఒక్కడే 42 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ నాలుగు, కేశవ్ మహారాజ్‌ మూడు వికెట్లు తీసి ఇండియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలో తడబడినా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

డేవిడ్ మిల్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు .

టీ20 ప్రపంచ కప్‌-2026 లో టీమిండియాకు ఇది తొలి ఓటమి. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దక్షిణాఫ్రికా,ఇండియా పోరు, సూపర్ 8 మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

టాప్ ఆర్డర్ విఫలం

దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది.

దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు.

ఆ తర్వాత రెండో ఓవర్ మొదటి బంతికి తిలక్ వర్మ ఔటయ్యాడు. అతని వికెట్‌ను యాన్సెన్ తీసుకున్నాడు. దీంతో 7 బంతులు పూర్తయ్యే సరికి భారత్ కేవలం ఐదు పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది.

ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న అభిషేక్ శర్మ నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. తొలి ఓవర్ చివరి బంతికి ఫోర్ బాదాడు. తరువాత కొద్దిసేపు షాట్లు ఆడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితంలేకపోయింది. దీంతో ఐదో ఓవర్ మూడవ బంతికి అవుట్ అయ్యాడు. ఇలా స్కోరు బోర్డుమీద 26 పరుగులు చేరేసరికే భారత్ టాప్ఆర్డర్ పెవిలియన్ చేరింది.

దక్షిణాఫ్రికా,ఇండియా పోరు, సూపర్ 8 మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

వాషింగ్టన్ సుందర్‌ను ముందు పంపినా...

ఆరంభంలోనే మూడు వికెట్లు పడిపోవడంతో వాషింగ్టన్ సుందర్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించారు. సుందర్ కేవలం 11 పరుగులకే ఔటయ్యాడు. తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 22 బంతుల పాటు క్రీజులో పోరాడి అవుట్ అయ్యాడు. అతను 18 పరుగులు మాత్రమే చేశాడు.

ఆ తరువాత హార్దిక్ పాండ్యా, శివం దుబేతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను గాడినపెట్టేందుకు ప్రయత్నించాడు.

కేశవ్ మహారాజ్ 15వ ఓవర్లో హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అర్ష్‌దీప్ సింగ్ వికెట్లు పడగొట్టాడు. రింకు సింగ్ రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు.

శివం దుబే ఒక్కడే 37 బంతుల్లో 42 పరుగులు చేసి భారత్ స్కోరును 100 దాటించాడు. దుబె యాన్సెన్‌ బౌలింగ్‌లో అవుటవడంతో భారత్ ఓటమి దాదాపు ఖరారైపోయింది.

భారత జట్టులో నలుగురు ఆటగాళ్లు ఇషాన్ కిషన్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రాలు ఒక్క పరుగూ చేయలేదు. తిలక్ వర్మ, అర్ష్‌దీప్‌లు ఒక్కొక్క పరుగు మాత్రమే చేశారు.

ఈ మ్యాచ్‌లో శివం దుబె(42 పరుగులు) తరువాత ఎక్కువ స్కోర్ చేసింది సూర్యకుమార్(18) యాదవ్, హార్దిక్ పాండ్యా(18) మాత్రమే.

భారత్,దక్షిణాఫ్రికా పోరు, సూపర్ 8 మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

తడబడి నిలబడిన దక్షిణాఫ్రికా

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ కూడా సాఫీగా మొదలుకాలేదు. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఫోర్ కొట్టడానికి 10 బంతులు ఆడాల్సి వచ్చింది. అయితే తరువాత బంతికే బుమ్రా డికాక్‌ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు.

తర్వాతి ఓవర్‌లో అర్ష్‌దీప్ కూడా రాణించాడు. మూడో ఓవర్ నాల్గవ బంతికి కెప్టెన్ మార్‌క్రమ్ వికెట్ తీసుకున్నాడు. 2.4 ఓవర్ల తర్వాత, దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 12 పరుగులు చేసింది.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రికెల్టన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. నాలుగో ఓవర్ చివరి బంతికి బుమ్రా చేతిలో ఔటయ్యాడు. మొత్తం మీద దక్షిణాఫ్రికా నాలుగు ఓవర్లలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది.

భారత్,దక్షిణాఫ్రికా పోరు, సూపర్ 8 మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

కానీ ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ ఎదురుదాడి ప్రారంభించారు. ఈ జోడీ 30 బంతుల్లో నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి ధాటికి దక్షిణాఫ్రికా స్కోరు 10 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.

అయితే, 13వ ఓవర్ రెండో బంతికి శివం దుబే బ్రెవిస్‌ను అవుట్ చేశాడు. బ్రెవిస్ 29 బంతుల్లో 45 పరుగులు చేశాడు. మరోవైపు మిల్లర్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని స్కోర్ బోర్డ్ పరుగెత్తించాడు.

బ్రెవిస్ ఔట్ తర్వాత, మిల్లర్, స్టబ్స్‌తో కలిసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను నిలకడగా నడిపించారు.

వరుణ్ చక్రవర్తి.. మిల్లర్ వికెట్ తీశాడు. మిల్లర్ 35 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు.

మిల్లర్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. దీంతో దక్షిణాఫ్రికా 152 పరుగుల వద్ద 5వ వికెట్‌ను కోల్పోయింది. 18వ ఓవర్ రెండో బంతికి యాన్సెన్‌ను అవుట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికాను మళ్లీ ఒత్తిడిలోకి నెట్టాడు.

స్టబ్స్ 24 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి, దక్షిణాఫ్రికా స్కోరును 187 పరుగులకు తీసుకెళ్లాడు.

బుమ్రా మూడు వికెట్లు తీయడంతో పాటు, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, శివం దుబే ఒక్కో వికెట్ తీశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)