అభిషేక్ శర్మ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఈ యువ హిట్టర్ గురించి ఏం చెబుతున్నారు, అక్కడ శర్మకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంది?

అభిషేక్ శర్మ, న్యూజీలాండ్, టీీ ట్వంటీ

ఫొటో సోర్స్, Getty Images

20 బంతుల్లో 68 పరుగులు.. అందులో 7 ఫోర్లు, 5 సిక్సులు.. స్ట్రైక్ రేట్ 340.

న్యూజీలాండ్‌తో జరగుతున్న టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్‌ విధ్వంసకర విన్యాసం ఇది.

అభిషేక్ ఆటతీరు గురించి భారత్‌లోనే కాదు, పాకిస్తాన్‌లోనూ చర్చ జరుగుతోంది.

"నేను అప్పుడే మ్యాచ్ చూడడం మొదలుపెట్టాను. అంతలోనే అయిపోయింది" అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.. యూట్యూబ్ షో "ది గేమ్ ప్లాన్"లో చెప్పారు.

మాజీ క్రికెటర్లు, నిపుణులు, క్రికెట్ పండితులు.. అభిషేక్ శర్మను భయంలేని బ్యాట్స్‌మెన్‌గా పిలవడంతో పాటు, ఈ తరంలో "ఉత్తమ టీ20 ప్లేయర్‌"గా అభివర్ణిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అభిషేక్ శర్మ, న్యూజీలాండ్, టీీ ట్వంటీ

ఫొటో సోర్స్, Getty Images

14 బంతుల్లోనే అర్ధ శతకం..

36 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 38.39 సగటుతో 1267 పరుగులు చేశాడు.

అతనిస్ట్రైక్ రేటు 195.22. ఈ మ్యాచ్‌లన్నీ కలిపి టీ20ల్లో మొత్తం 86 సిక్సులు బాదాడు. 119 ఫోర్లు దంచాడు.

గువాహటిలో తాజాగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ ఆ లక్ష్యాన్ని కేవలం పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సాధించింది.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మాత్రమే కాకుండా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 57 పరుగులు), ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 28 పరుగులు) ఆకట్టుకున్నారు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు.

టీ ట్వంటీల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది.

ఇంగ్లండ్‌తో డర్బన్‌ వేదికగా 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లోనే యువీ తన అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు.

ఇదే మ్యాచ్‌లో స్టువార్ట్ బ్రాడ్ వేసిన బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన రికార్డు నెలకొల్పాడు.

"బాగా ఆడావు. కానీ 12 బంతుల్లో 50 పరుగులు అందుకోలేకపోయావు. అయినా ఇలానే దూసుకువెళ్తూ ఉండు" అని మ్యాచ్ ముగిసిన తర్వాత 'ఎక్స్'లో యువరాజ్ సింగ్ సరదాగా పోస్ట్ చేశారు.

అభిషేక్ శర్మ, న్యూజీలాండ్, టీీ ట్వంటీ

ఫొటో సోర్స్, Getty Images

యువరాజ్ రికార్డు గురించి శర్మ ఏమన్నాడంటే..

యువరాజ్ సింగ్‌ను అభిషేక్ శర్మ మెంటార్‌గా చెబుతుంటాడు. అభిషేక్ శర్మకు తొలిరోజుల్లో యువరాజే శిక్షణ ఇచ్చాడు. యువరాజ్‌ను అభిషేక్ శర్మ ‘గురువు’గా క్రికెట్ ప్రపంచం భావిస్తుంటుంది.

మ్యాచ్ ముగిసిన తరువాత యువరాజ్ సింగ్ రికార్డు గురించి అభిషేక్ శర్మ మాట్లాడుతూ "దాన్ని సాధించడం ఎవరికైనా చాలా కష్టం. కానీ, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చాలా మంది బ్యాట్స్‌మెన్ బాగా ఆడుతున్నారు. ఈ సిరీస్‌లోనే కావచ్చు లేదా భవిష్యత్తులోనైనా ఇది జరగొచ్చేమో" అన్నారు.

"నేను క్రికెట్‌లో ఏం నేర్చుకున్నా కూడా అదంతా యవీ పాజీ, రోహిత్ భాయ్ నుంచే . క్రికెట్‌‌‌కు వారిసేవలు అద్భుతం" అని అభిషేక్ శర్మ అన్నాడు.

"అతను తన ఇన్నింగ్స్‌ను ఎప్పుడూ ప్లాన్ చేయడు. తాను ఎదుర్కొన్నమొదటి బంతినే బౌండరీ ఆవలకు పంపుతాడు. ఒక వేళ అతను తన ఇన్నింగ్స్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అతను సాధించలేనిది ఏముంటుంది?" అని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నారు.

"ఈ బ్యాట్స్‌మెన్‌లో ఏదో ఉంది. అతనిలో అసలు ఎలాంటి భయం లేదు. ఇది నమ్మశక్యం కానిది" అని న్యూజీలాండ్ క్రికెటర్, వ్యాఖ్యాత ఇయాన్ స్మిత్ అన్నారు.

అభిషేక్ శర్మ, న్యూజీలాండ్, టీీ ట్వంటీ

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లో ఎలాంటి స్పందన వచ్చిందంటే…?

"యవరాజ్ సింగ్ గురువు, అభిషేక్ శర్మ శిష్యుడు. వాళ్లిద్దరూ అద్భుతంం. ఫాస్ట్ బౌలర్లకు వాళ్లిద్దరూ శత్రువులు. యువీ తన రోజుల్లో ఏ ఫాస్ట్ బౌలర్ లయనైనా దెబ్బతీసేవాడు. ఇప్పుడు అతని శిష్యుడు అదే పని చేస్తున్నాడు" అని పాకిస్తానీ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తన "ది గేమ్ ప్లాన్" షోలో చెప్పారు.

"అభిషేక్ శర్మ, మిగతా ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఆటతీరు చూస్తుంటే భారత్ ఏదో ఓరోజు వన్డేల్లో 500 పరుగులు చేస్తుందేమో అనిపిస్తోంది" అని కూడా కమ్రాన్ అక్మల్ అన్నారు.

"అభిషేక్ శర్మ వంటి యువ భారత బ్యాట్స్‌మెన్ దేనికీ భయపడరు. వాళ్లు ఎలాంటి ఒత్తిడీ తీసుకోరు. వాళ్లతో టీ20ల్లో ఎవరూ పోటీ పడలేరు. అభిషేక్ శర్మ ఆట తీరును చూస్తుంటే అతడిని మ్యాస్ట్రో అంటే బాగుంటుందేమోనని అనిపిస్తోంది" అని ఇదే షోలో పాకిస్తాన్ మాజీ క్రికెట్ బసిత్ అలీ వ్యాఖ్యానించారు.

అభిషేక్ శర్మ, న్యూజీలాండ్, టీీ ట్వంటీ

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లో అభిషేక్ క్రేజ్ ఎలా ఉందంటే..

పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో అభిషేక్ శర్మ చాలా పాపులర్ క్రికెటర్. 2025లో పాకిస్తాన్‌ నుంచి ఎక్కువగా గూగుల్‌లో వెతికిన ప్లేయర్ అతడే.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఏడాదిన్నర కాలంలోనే బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న అభిషేక్ శర్మ ఆటపై పాకిస్థానీ క్రికెట్ అభిమానుల్లో చాలా ఆసక్తి కనబడుతోంది.

గూగుల్ సెర్చ్ డేటా ప్రకారం.. పాకిస్తానీ క్రికెటర్లు బాబర్ అజామ్, షాహీన్ షా అఫ్రిదీ, హ్యారీస్ రౌఫ్ వంటి వారి కంటే కూడా ఎక్కువగా 2025లో అతని గురించే వెతికారు.

2025లో అభిషేక్ శర్మ.. పలు మ్యాచ్‌ల్లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. 40.75 సగటుతో 163 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 161గా ఉంది. ఈ సిరీస్ 2-1తో భారత్ చేజిక్కించుకుంది.

అదే ఏడాది జరిగిన ఆసియా కప్‌లో… పాకిస్తాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 74 పరుగులు స్కోర్ చేసి, భారత విజయానికి బాటలు వేశాడు. అప్పుడు అతణ్ని "రైజింగ్ స్టార్స్ ఆఫ్ టీ20"ల్లో ఒకరిగా క్రికెట్ విశ్లేషకులు అభివర్ణించారు.

అభిషేక్ శర్మ, న్యూజీలాండ్, టీీ ట్వంటీ

ఫొటో సోర్స్, Getty Images

యువీ అభిషేక్ బంధం అలా మొదలైంది

వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు, యువరాజ్ శైలిని పుణికిపుచ్చుకున్న ఆటగాడిగా అభిషేక్ శర్మను క్రికెట్ నిపుణులు భావిస్తుంటారు.

యువరాజ్ సింగ్‌ నుంచి అభిషేక్ శర్మ స్ఫూర్తి పొందాడు. ఓ రంజీ ట్రోఫీ సందర్బంగా వీళ్లిద్దరూ కలిశారు.

రంజీ ట్రోఫీలో అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌కు అవకాశం ఇవ్వాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ భావించింది.

అప్పుడు యువరాజ్ సింగ్ తన అస్వస్థతత నుంచి కోలుకుంటున్న సమయం. ఆ టైమ్‌లో అతను భారత జట్టులో తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే, బీసీసీఐ ఆదేశాల మేరకు రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు మైదానంలోకి దిగాడు.

అప్పుడు అండర్-19 నుంచి ఇద్దరు ఆటగాళ్లు టీమ్‌లోకి వస్తున్నారని యవరాజ్ సింగ్‌కు చెప్పారు. అందులో ఒకరు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అని, మరొకరు లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్ అని అతడికి చెప్పారు.

2025 ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన తర్వాత… అతని తండ్రి రాజ్‌కుమార్ శర్మ బీబీసీ ప్రతినిధి భరత్ శర్మతో మాట్లాడారు

"తన వద్ద ఇదివరకే బౌలర్లు ఉన్నందున ఓ బ్యాట్స్‌మెన్ కావాలని యువరాజ్ సింగ్ అప్పుడు చెప్పారు. అప్పుడు సెలెక్టర్లు 'అలా కాదు, వాళ్లిద్దరికీ ఓ అవకాశం ఇవ్వాల'ని చెప్పారు. ఒక మ్యాచ్‌లో ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లు ముందుగానే ఔట్ అయ్యారు. అప్పుడు యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు అభిషేక్‌ను ప్యాడ్స్ వేసుకుని రమ్మని చెప్పాడు. అలా అభిషేక్ క్రీజులోకి వచ్చే సమయానికి యువరాజ్ 40 పరుగుల వద్ద ఉన్నాడు. యువరాజ్ చూస్తుండగానే అతను వేగంగా సెంచరీ చేసేశాడు’’ అని రాజ్ కుమార్ శర్మ చెప్పారు.

"మైదానంలో ఉండగానే అభిషేక్ శర్మకు తాను శిక్షణ ఇస్తానని యువరాజ్ సింగ్ చెప్పారు. దానికి అంగీకరించిన అభిషేక్ శర్మ… యువరాజ్‌ను తన ఐడల్‌గా, దైవంగా భావిస్తాడు. యువరాజ్‌ను చూస్తూనే అభిషేక్ ఆడడం నేర్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి అభిషేక్‌కు యువీనే శిక్షణనిస్తున్నాడు" అని శర్మ అన్నారు.

వీళ్లిద్దరూ కలిసిన ఉన్న అనేక వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "నువ్వు మెరుగుపడలేదు. సిక్సులే కాదు గ్రౌండ్ షాట్సు కూడా ఆడాలి " అని యువరాజ్ చెప్పడం ఓ వీడియోలో కనిపించింది.

"యువీనే అతనికి శిక్షణనిస్తున్నాడు. అతను నా కొడుకు పట్ల పూర్తి జాగ్రత్త తీసుకుంటాడు. అతనే అభిషేక్‌ను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేలా చేశాడు ఒక ప్రపంచస్థాయి ఆల్‌రౌండర్ దగ్గర శిక్షణ పొందితే ఏ ఆటగాడైనా ఎక్కడి వరకు వెళ్తాడో ఊహించండి. ఇది ప్రారంభం మాత్రమే" అని రాజ్‌కుమార్ శర్మ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)