జెమీమా రోడ్రిగ్స్: కలగా మొదలై చరిత్రగా నిలిచే ఇన్నింగ్స్ ఆడిన క్రికెటర్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫియోనా విన్
- హోదా, స్పోర్ట్స్ రిపోర్టర్
ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరింది. జెమీమా రోడ్రిగ్స్ అజేయ సెంచరీతో జట్టు గెలుపు తీరాలకు చేరింది.
నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది.
339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ హీరో మాత్రం జెమీమానే.
134 బంతుల్లో 14 ఫోర్లతో అజేయంగా 127 పరుగులు చేసింది జెమీమా. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో నిలిచి విజయాన్ని అందించింది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 89 పరుగులతో ఆకట్టుకుంది.
జెమీమా, హర్మన్ ప్రీత్ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


ఫొటో సోర్స్, Getty Images
ఫీబీ లిచ్‌ఫీల్డ్ సెంచరీ
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది.
ఆస్ట్రేలియా తరఫున ఫీబీ లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 119 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచింది.
టీమిండియా బౌలర్లలో శ్రీచరణి, దీప్తిశర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ గెలుపుతో భారత్ మూడోసారి వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. గతంలో 2005, 2017లలో ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్‌ను గెలవలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
టీమిండియా జెర్సీకి ఫోటో అంటించి...
టీనేజర్‌గా ఉన్నప్పుడు జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టులో తన స్థానాన్ని ఊహించుకుంటూ ఒక పని చేశారు. ఫోటోలోని తన ముఖాన్ని కత్తిరించి, టీమిండియా జెర్సీ ఇమేజ్‌పై అంటించుకున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా తనే 'నో బాల్స్ పాడ్‌కాస్ట్'లో వెల్లడించారు. టీమిండియాకు ఆడాలనే ఇన్‌స్పిరేషన్ కోసం రోజూ ఆ ఫోటోను చూస్తుండేదాన్నని ఆమె అన్నారు.
తనకు నాలుగేళ్లున్నప్పుడు గల్లీలో తన సోదరులతో క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచే టీమిండియాకు ఆడాలని కలగన్నట్లు చెప్పారు.
గురువారం డీవై పాటిల్ స్టేడియంలో జెమీమా రోడ్రిగ్స్, ఆల్ టైమ్ క్లాసిక్ వన్డే ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో ఒకటి అనదగిన ఆటతీరును ప్రదర్శించింది.
ఆమె ఆటతోనే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఓడిపోయింది. భారత్‌కు మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్ బెర్తు దక్కింది.
ఈ మ్యాచ్‌కు 11 రోజుల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో జట్టులో జెమీమా స్థానం దక్కించుకోలేకపోయారు. ఆ మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది.
అత్యధిక ఒత్తిడితో కూడిన సెమీస్ మ్యాచ్‌లో ప్రపంచ అత్యుత్తమ జట్టుపై జెమీమా సాధించిన ప్రతీ పరుగుకు స్టేడియంలోని ప్రేక్షకులంతా నీరాజనం పలికారు.
మహిళల వన్డే చరిత్రలో రికార్డు ఛేదనలో (339 పరుగులు) ఆమె పోరాటాన్ని ఆస్వాదించారు.
అమన్‌జోత్ కౌర్ విన్నింగ్ బౌండరీ కొట్టగానే క్రీజులో కూలబడిన రోడ్రిగ్స్, దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది.
ఈ వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ఏడ్చానని, ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోలేదని, యాంగ్జైటీతో బాధపడ్డానని మ్యాచ్ అనంతరం జెమీమా వెల్లడించింది.
ఎలాంటి ప్రదర్శన చేసినా మైదానంలో ఎప్పుడు హుషారుగా, నవ్వుతూ కనిపించే జెమీమాలో ఇదో భిన్న కోణం.
జెమీమా ఇప్పటికే ఒక స్టార్ క్రికెటర్. సెమీస్ మ్యాచ్‌లో కనబరిచిన పట్టుదల, దృఢసంకల్పం ఆమె స్టార్‌డమ్‌ను ఇప్పుడు మరింత పెంచుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతాయి.
డెర్బీ వేదికగా 2017 వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన 171 పరుగుల ఇన్నింగ్స్ చిరస్మరణీయం. ఈ ఇన్నింగ్స్‌తో భారత్ ఫైనల్‌కు చేరుకుంది.
అయితే, కేప్‌టౌన్ వేదికగా 2023 టి20 సెమీస్‌లో దురదృష్టవశాత్తు బ్యాట్ క్రీజులో తట్టుకొని హర్మన్ రనౌట్ కావడంతో టీమిండియా వెనుదిరిగింది.
ఈ వరల్డ్ కప్ గ్రూప్ దశలో కూాడా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరో అత్యుత్తమ మ్యాచ్ జరిగింది. అక్టోబర్ 12న జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 330 పరుగుల విజయలక్ష్యాన్ని ఇవ్వగా, అలిస్సా హీలీ సారథ్యంలోని ఆసీస్ జట్టు ఆ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలిచింది. హీలీ ఈ మ్యాచ్‌లో 142 పరుగులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
థ్రిల్లర్ సెమీస్
గురువారం నాటి థ్రిల్లర్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరును మరో స్థాయిలో నిలబెట్టింది.
ఫీబీ లిచ్‌ఫీల్డ్ 119 పరుగులతో పాటు ఎలిస్ పెర్రీ, ఆష్ గార్డ్‌నర్ హాఫ్ సెంచరీలతో ఆసీస్ 338 పరుగులు చేసింది.
షెఫాలీ వర్మ (10), స్మృతి మంధాన (24) తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో భారత్ నిలదొక్కుకోవడానికి సమయం పట్టింది.
ఈ దశలో వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 8 ఏళ్లుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఆధిపత్యం అలాగే ముందుకు సాగుతున్నట్లుగా, ఏ అడ్డూ లేనట్లుగా కనిపించింది.
వికెట్ల మధ్య వేగం, తెలివిగా కదులుతూ స్టంప్‌లు కాపాడుకున్న వైనం, ఫీల్డర్ల మధ్య గ్యాప్‌లు చూస్తూ కచ్చితమైన షాట్లు ఆడే జెమీమా అద్భుత ప్రతిభ ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరిచింది.

ఫొటో సోర్స్, Getty Images
‘అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి గల్లీ క్రికెట్’
మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ ఒత్తిడిలో హీలీ, టహిలా మెక్‌క్రాత్ తమకు అందివచ్చిన అవకాశాలను జారవిడిచారు.
2017లో హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్‌తో షాక్ తిన్న తర్వాతి నుంచి, వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఆస్ట్రేలియాకు మళ్లీ భారత్ చేతిలోనే ఓటమి ఎదురైంది.
మహిళా క్రికెట్ ఇప్పటివరకు చూడని అత్యున్నత నాణ్యతతో కూడిన బ్యాటింగ్ ఇదేనని నిస్సందేహంగా చెప్పొచ్చు.
సొంతగడ్డపై భారత్, వరల్డ్ కప్ గెలిస్తే భారత మహిళల క్రికెట్‌కు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి.
ఆదివారం నాటి టైటిల్‌పోరులో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. అంటే ఈ ఫైనల్లో ఎవరు గెలిచినా, 2000 తర్వాత కొత్త విజేతగా అవతరిస్తారు.
అయితే, భారత విజయం మహిళల ఆటను రీచ్, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కొత్త శిఖరాలకు చేర్చగలదు.
'భారత్‌లో ఇప్పుడు మహిళల క్రికెట్ అభివృద్ధి చెందుతున్న వేగం నమ్మశక్యం కానిది' అని బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌తో ఐపీఎల్ మాజీ బ్యాటర్ అభిషేక్ జున్‌జున్‌వాలా అన్నారు.
'వీధుల్లో అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు క్రికెట్ ఆడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటిది మీరు చూసి ఉండరు. వాళ్లంతా ఒక జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలా ఎదగాలని కోరుకుంటున్నారు.
మహిళలకు క్రికెట్ ఇప్పుడొక కెరీర్ అవకాశంగా ఎదిగింది. ఒకవేళ ఈ వరల్డ్‌కప్‌లో ఇండియా గెలిస్తే భారత్‌లో మహిళల క్రికెట్ గతి మరింత మారుతుంది. ఆట పరంగా ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ వేగంగా పురోగతి చెందుతోంది. ఇక వాణిజ్య పరంగా చాలా మార్పులు వస్తాయి' అని ఆయన అన్నారు.
అబ్బాయిలు, అమ్మాయిలు అంతా స్టేడియాల్లో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ పేర్లున్న జెర్సీలు ధరిస్తున్నారు. సొంతగడ్డపై టీమిండియా ఆటను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














