ఎవరీ కావ్య మారన్? తనని చూస్తే టెన్షన్ వస్తోందని రజనీకాంత్ ఎందుకన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''వచ్చేసారి ఎస్ఆర్‌హెచ్ టీంలో మంచి ఆటగాళ్ళను తీసుకోండి. సన్‌రైజర్స్ మ్యాచ్ జరుగుతుంటే కావ్య ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే నాకు టెన్షన్ వస్తోంది. కావ్యను చూస్తుంటే నాకు బీపీ పెరుగుతోంది.'' 2023 ఆగస్టులో జైలర్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ లో రజినీకాంత్ తమిళంలో అన్న మాటలివి.
సూపర్ స్టార్‌గా అభిమానులు పిలుచుకునే రజినీకాంతే కాదు, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లు చూసే చాలా మంది కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్లను మర్చిపోలేరు.
ఐపీఎల్ వచ్చిందంటే చాలు, ఆటగాళ్ల గురించి జనం ఎంతలా మాట్లాడుకుంటారో, కావ్య మారన్ గురించి కూడా తెలుగునాట అంతే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు.
తెలుగు వారు ఎక్కువ మంది తమ సొంతమని భావించే ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సీఈవో కావడంతో కావ్య పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటలో ఒడిదుడుకులకు అనుగుణంగా ఆవిడ బాధపడడం, సంతోషపడటాన్ని కెమెరాలు చూపిస్తే, ఆ ఫోటోలు, వీడియోలను పెద్దయెత్తున షేర్ చేస్తాయి మీమ్ పేజీలు.. అలా క్రికెట్ చూడని వారికి కూడా సోషల్ మీడియా ద్వారా సుపరిచితం కావ్య మారన్.
తన సొంత టీమ్ ఆడే మ్యాచులను ఎంతో ఆసక్తిగా చూసే ఆమె, ఆటలో ప్రతి దశలోనూ తన స్టైల్లో స్పందిస్తారు. వికెట్ పడినప్పుడు బాధపడుతూ, సిక్స్ కొట్టినప్పుడు ఎగిరి గంతులేసే ఆమె స్పందన కెమెరాల్లో పడి బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ కావ్య మారన్ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
కరుణానిధి ముని మనవరాలు
ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టును మొదటగా అంటే 2008-12 మధ్య డెక్కన్ క్రానికల్ సంస్థ నిర్వహించేంది. అప్పట్లో దీని పేరు డెక్కన్ చార్జర్స్. తరువాత తమిళనాడుకు చెందిన సన్ గ్రూపు 2012లో ఈ టీమ్‌ను టేకోవర్ చేసింది.
సన్ నెట్‌వర్క్ యజమాని కళానిధి మారన్ దీనికి యజమాని. భారతదేశంలోనే సంపన్న నిర్మాతల్లో కళానిధి మారన్ ఒకరు . ఈయన కుమార్తే కావ్య మారన్.
ఆమె తాత మురసోలి మారన్ కేంద్ర మంత్రిగా పనిచేయగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఈమె ముని మనవరాలి వరుస అవుతారు.
సన్‌రైజర్స్ వ్యవహారాలు పూర్తి స్థాయిలో చూడడంతో పాటు, సౌతాఫ్రికాలో ఆడే క్రికెట్ లీగ్ ఎస్ఏ20లో కూడా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరుతో ఒక టీమ్ నిర్వహిస్తున్నారు కావ్య. దక్షిణాఫ్రికాలోని కబ్రెహ్ (Gqeberha, గతంలో పోర్ట్ ఎలిజిబెత్) నగరానికి ఈ టీమ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. సన్ గ్రూపు 2022లో ఈ టీంను ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images
సన్ నెట్‌వర్క్‌లో కీలక బాధ్యతలు
చెన్నైలో 1991లో పుట్టిన కావ్య అక్కడే స్టెల్లా మేరీ కాలేజీతో పాటు విదేశాల్లో చదువుకున్నారు.
సన్ మ్యూజిక్, ఇతర ఎఫ్ఎం చానెల్స్ బాధ్యతలు చూశారు. సన్ నెక్స్ట్ ఓటీటీ రూపకల్పన, నిర్వహణలో కూడా కావ్య కీలకంగా వ్యవహరించారు.
2018 నుంచి సన్‌రైజర్స్ వ్యవహారాలు చూస్తున్నారు.
2019లో ఆమె సన్ నెట్‌వర్క్ బోర్డులో చేరారు. ప్రస్తుతం సన్ గ్రూపులో కూడా కావ్య మారన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్నారు.
హైదరాబాద్ జట్టు పాత యాజమాన్యం డెక్కన్ చార్జర్స్ తరపున కూడా ఒకప్పుడు ఆ సంస్థ యజమానికి టి.వెంకట్రామి రెడ్డి కుమార్తె గాయత్రి రెడ్డి టీమ్ వ్యవహారాలు చూసేవారు. యాజమాన్యం మారిన తరువాత కావ్య మారన్ ఆ వ్యవహారాలు చూస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














