తమీమ్ ఇక్బాల్: మ్యాచ్ ఆడుతుండగా క్రికెటర్‌కు గుండెపోటు

తమీమ్ ఇక్బాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తమీమ్ ఇక్బాల్(పాత ఫొటో)

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యారు.

వెంటనే ఆయనకు వైద్య చికిత్స అందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.

బంగ్లాదేశ్ జట్టు మాజీ కెప్టెన్ అయిన తమీమ్ ఇక్బాల్, ఢాకా ప్రీమియర్ లీగ్‌లోనూ ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

లీగ్‌లో భాగంగా మ్యాచ్ మొదలయ్యాక తమీమ్ ఒక గంట పాటు మాత్రమే మైదానంలో ఫీల్డింగ్ చేయగలిగారు. ఈ సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి కలిగింది.

తమీమ్ ఇక్బాల్ గుండె ధమనులు బ్లాక్ అయ్యాయని, యాంజియోగ్రఫీ చేశామని డాక్టర్లు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టాస్ తర్వాత ఛాతీలో నొప్పి

ఈ మ్యాచ్‌లో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు తమీమ్ ఇక్బాల్ కెప్టెన్‌గా ఉన్నారని క్రికెట్ వార్తలను కవర్ చేసే క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది.

మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన జరిగిందని మ్యాచ్ రిఫరీ తెలిపారు.

''టాస్ తర్వాత తనకు ఛాతీలో కాస్త నొప్పిగా ఉందని జట్టు ఫిజియో, ట్రైనర్‌కు తమీమ్ చెప్పారు. గ్యాస్ట్రిక్ సమస్య అనుకొని దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకున్నారు. అయినప్పటికీ, పరిస్థితి మెరుగుపడకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. టీమ్ మేనేజర్‌ను సంప్రదించిన తర్వాత అతన్ని తీసుకెళ్లడానికి ఒక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షల అనంతరం గుండెలో బ్లాకేజీ ఉన్నట్లు తేలింది'' అని తమీమ్ ఇక్బాల్ ఫేస్‌బుక్ పేజీ ప్రకారం తెలిసింది.

''తమీమ్‌ను తర్వాత మైదానానికి తీసుకొచ్చారు. ఎయిర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ, అనారోగ్య కారణాలతో ఈ ప్రక్రియ సాధ్యం కాలేదు. కాబట్టి అతన్ని మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది'' అని క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.

టాస్ సమయంలో తమీమ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని హెడ్ కోచ్ మోంటో దత్తా అన్నారు.

''పరిస్థితి దిగజారగానే ఆయన ఫీల్డ్ నుంచి వెళ్లిపోయారు. కారులో ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు వెళ్లొద్దన్నా తమీమ్ మళ్లీ మైదానానికి వచ్చారు. తన కోసం ఎయిర్ అంబులెన్స్ సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు'' అని ఆయన వివరించారు.

తమీమ్‌కు మొదట పరీక్షలు జరిగిన ఆసుపత్రికే మళ్లీ అతన్ని తీసుకెళ్లారు.

వైద్యుల సిఫార్సు మేరకు యాంజియోగ్రామ్, యాంజియోగ్రఫీ పరీక్షలు నిర్వహించారని ఫేస్‌బుక్ పోస్టు పేర్కొంది.

తమీమ్ ఇక్బాల్

అకస్మాత్తుగా రిటైర్మెంట్

2023 జులైలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి తమీమ్ ఇక్బాల్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.

అకస్మాత్తుగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రకటన చేశారు.

భారత్‌లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి మూడు నెలలకు ముందు ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు.

తమీమ్ 2021 టి20 వరల్డ్ కప్‌కు ముందు టి20 క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చారు. మరుసటి ఏడాదే టి20ల నుంచి తప్పుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)