ఐపీఎల్ 2025 : విశాఖపట్నం, హైదరాబాద్‌‌లో జరిగే మ్యాచ్‌లు ఏవి?

 కోల్‌కతా నైట్ రైడర్స్ విజేత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది
    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐపీఎల్ -ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోలాహలం నేటి నుంచి మొదలవుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ 18వ సీజన్ మరింత కొత్తగా ముస్తాబైంది.

బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌లపై బౌలర్లూ సత్తా చాటేందుకు తీసుకొచ్చిన పలు నిబంధనలు 'గేమ్ చేంజర్‌'గా మారబోతున్నాయి.

కరోనా సమయంలో బంతికి ఉమ్మి రాయడంపై నిషేధం విధించారు.

ఆ నిషేధాన్ని ఇప్పుడు ఎత్తేయడం పేసర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

రాత్రివేళ జరిగే మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ తర్వాత బంతిని మార్చుకునే వెసులుబాటు కల్పించడం ఫీల్డింగ్ జట్లకు ఉపకరిస్తుంది.

అలాగే ఆఫ్ స్టంప్, హైట్ వైడ్స్‌కు హాక్ ఐ టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం కల్పించడం, ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లు నిషేధాన్ని ఎదుర్కొనే ప్రమాదాన్ని తొలగించడం వంటివి ఆటను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.

ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ఐపీఎల్ 18వ సీజన్ మొదలుకానుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హోర్డింగ్

ఐపీఎల్ ఎన్నిరోజులు, ఫైనల్ ఎక్కడ?

మార్చి 22 నుంచి మే 25 వరకు ఏకంగా 65 రోజుల పాటు ఐపీఎల్ జరుగుతుంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగే‌ తొలి మ్యాచ్‌తో ఐపీఎల్‌ ప్రారంభమవుతుంది.

రెండు నెలలకు పైగా పటిష్టమైన పది జట్ల మధ్య జరుగనున్న ఈ టోర్నీ డిఫెండింగ్ చాంపియనే మళ్లీ కప్పును కొడుతుందా, లేదంటే కొత్త జట్టు విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరం.

లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక, హైదరాబాద్‌లో మే 20న క్వాలిఫయర్ 1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 23న కోల్‌కతాలో క్వాలిఫయర్ 2 జరుగుతుంది.

కాబట్టి, హైదరాబాద్‌లోనే తొలి ఫైనలిస్టు ఎవరో తేలనుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ వంటి కీలక మ్యాచ్‌లు జరుగనుండటం హైదరాబాద్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే విషయం.

మే 25న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.

టోర్నీలో భాగంగా 13 నగరాల్లో 74 మ్యాచ్‌లు జరుగుతాయి.

పది జట్లు... 13 ఆతిథ్య నగరాలేంటి?

అవును. టోర్నీ మొత్తం 13 వేదికల్లో జరుగుతుంది. ఎందుకంటే 7 టీమ్‌లకు ఒకే ఒక హోం గ్రౌండ్ ఉండగా, 3 జట్లు రెండు వేదికలను తమ హోం గ్రౌండ్‌లుగా ఎంచుకున్నాయి.

దిల్లీ తమ మ్యాచ్‌లను దిల్లీతో పాటు విశాఖపట్నంలో, పంజాబ్ తమ మ్యాచ్‌లను ముల్లన్‌పూర్‌తో పాటు ధర్మశాలలో, రాజస్తాన్ తమ మ్యాచ్‌లను జైపూర్‌తో పాటు గువాహటిలో ఆడుతుంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం బయట కోల్‌కతా నైట్ రైడర్స్ పోస్టర్

టోర్నీ ఫార్మాట్ ఏమైనా మారిందా?

టోర్నీ ఫార్మాట్‌లో ఎలాంటి మార్పూ లేదు.

ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ 'ఎ'లో చెన్నై, కోల్‌కతా, రాజస్తాన్, బెంగళూరు, పంజాబ్ ఉన్నాయి.

గ్రూప్ 'బి'లో ముంబయి, హైదరాబాద్, గుజరాత్, దిల్లీ, లఖ్‌నవూ చోటు దక్కించుకున్నాయి.

ప్రతీ జట్టూ తమ గ్రూప్‌లోని మిగతా 4 జట్లతో రెండు మ్యాచ్‌ల చొప్పున (8 మ్యాచ్‌లు), మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు (2), మిగతా నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ (4) ఆడతాయి.

అంటే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ఏడు మ్యాచ్‌లు హోం గ్రౌండ్‌లో ఆడుతుంది. ఈ 14 మ్యాచ్‌లు ముగిశాక టాప్-4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

టైమింగ్స్ ఏంటి?

ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి.

మొత్తం షెడ్యూల్‌లో 12 రోజులు మాత్రం ఒకే రోజూ 2 మ్యాచ్‌లు ఉన్నాయి.

అప్పుడు తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది.

విశాఖ, హైదరాబాద్‌లలో..

ఈ ఐపీఎల్‌లో విశాఖపట్నం, హైదరాబాద్‌లోనూ మ్యాచ్‌లు జరగనున్నాయి.

హైదరాబాద్‌లో 9, విశాఖలో 2 మ్యాచ్‌లు జరగనున్నాయి.

విశాఖపట్నంలో మార్చ్ 24న దిల్లీ కేపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఉంది.

మార్చ్ 30న దిల్లీ కేపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది.

హైదరాబాద్‌లో మార్చ్ 31న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది.

మార్చ్ 27న లఖ్‌నవూ సూపర్ కింగ్స్‌తో, ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 23న ముంబయి ఇండియన్స్‌తో, మే 5న దిల్లీ కేపిటల్స్‌తో, మే 10న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతుంది.

మే 20న హైదరాబాద్‌లో క్వాలిఫయర్ 1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈసారి ఆర్సీబీ జట్టుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈసారి ఆర్సీబీ జట్టుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌

5 జట్లకు కొత్త కెప్టెన్లు

నిజానికి ఈ సీజన్‌లో చాలా కొత్త విషయాలు ఉన్నాయి.

పలు జట్ల కెప్టెన్లు మారారు. అయిదు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు.

2024లో కోల్‌కతా జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు సారథ్యం వహించనున్నాడు.

కోల్‌కతా జట్టులో శ్రేయస్ స్థానాన్ని అజింక్యా రహానే భర్తీ చేశాడు.

మెగా వేలానికి ముందు దిల్లీ వదులుకున్న రిషభ్ పంత్ ఇప్పుడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

దిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంచుకుంది.

భారత్‌ తరపున ఇప్పటివరకు ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడని రజత్ పాటిదార్, బెంగళూరు జట్టుకు కెప్టెన్ అవ్వడం ఆశ్చర్యకర అంశం.

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిషబ్ పంత్ గత సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు

ఖరీదైన ఆటగాళ్లు

ఈ సీజన్‌లో రిషబ్ పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు వేలంలో రూ. 27 కోట్ల భారీ మొత్తానికి పంత్‌ను సొంతం చేసుకుంది.

పంత్ తర్వాత శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లతో రెండో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది.

తర్వాత, ఈ జాబితాలో వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్ - రూ. 23.75 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (ఎస్‌ఆర్‌హెచ్- రూ. 23 కోట్లు) ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు క్లాసెన్‌ను రీటెయిన్ చేసుకుంది.

ధోని
ఫొటో క్యాప్షన్, మహేంద్ర సింగ్ ధోని, ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ సీజన్లలో ఆడాడు. 5 టైటిళ్లను గెలిచి, అయిదుసార్లు రన్నరప్‌గా నిలిచాడు

సీఎస్కే రూ. 4 కోట్లకే ధోనిని ఎలా రీటెయిన్ చేసుకుంది?

ఐపీఎల్ ఒక పాత నిబంధనను మళ్లీ తీసుకొచ్చింది.

దీనిప్రకారం, ఒక భారత ఆటగాడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడి అయిదేళ్లు దాటితే అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కింద రీటెయిన్ చేసుకోవచ్చు.

ధోని 2019 వన్డే వరల్డ్ కప్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. కాబట్టి ఈ రూల్ కింద సీఎస్కే అతన్ని రీటెయిన్ చేసుకుంది.

రాజస్థాన్ రాయల్స్ కూడా సందీప్ శర్మను ఇదే రూల్ ప్రకారం అట్టిపెట్టుకుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, @IPL/X

ఫొటో క్యాప్షన్, హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు వెచ్చించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

బాదుడుకు కేరాఫ్ అడ్రస్ 2024 సీజన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో 250కి పైగా స్కోర్లు మొత్తం 10 సార్లు నమోదైంది.

అయితే, ఇందులో ఎనిమిది స్కోర్లు 2024 సీజన్‌లోనే నమోదయ్యాయి.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. 287 పరుగులతో ఈ రికార్డు హైదరాబాద్ పేరిట ఉంది.

ఈ 9 మంది ప్రత్యేకతే వేరు

ఐపీఎల్ తొలి సీజన్‌లో జట్టుతో ఉండి ఈసారి అంటే 18వ సీజన్‌లో కూడా బరిలోకి దిగబోయే ఆటగాళ్లు 9 మంది ఉండటం విశేషం.

మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మనీశ్ పాండే, రహానే, అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, స్వప్నిల్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు.

గతేడాది టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చారు. ఐపీఎల్ కారణంగా ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ టి20 మ్యాచ్ ఆడనున్నారు.

ఐపీఎల్ విజేతలు

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్ విజేతలు

ఐపీఎల్ మొదటి నుంచి నుంచి 17వ సీజన్ వరకు చాంపియన్ల వివరాలు...

2008 రాజస్థాన్ రాయల్స్

2009 డెక్కన్ చార్జర్స్

2010 చెన్నై సూపర్ కింగ్స్

2011 చెన్నై సూపర్ కింగ్స్

2012 కోల్‌కతా నైట్ రైడర్స్

2013 ముంబయి ఇండియన్స్

2014 కోల్‌కతా నైట్ రైడర్స్

2015 ముంబయి ఇండియన్స్

2016 సన్‌రైజర్స్ హైదరాబాద్

2017 ముంబయి ఇండియన్స్

2018 చెన్నై సూపర్ కింగ్స్

2019 ముంబయి ఇండియన్స్

2020 ముంబయి ఇండియన్స్

2021 చెన్నై సూపర్ కింగ్స్

2022 గుజరాత్ టైటాన్స్

2023 చెన్నై సూపర్ కింగ్స్

2024 కోల్‌కతా నైట్ రైడర్స్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)