రాధే మా: సాదాసీదా జీవితం నచ్చని ఈ ‘మహిళా బాబా’ ఎవరు, ఆమె ప్రపంచం ఎలా ఉంటుంది?

- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
అద్భుతాలు చేస్తానని ఆమె చెబుతారు. భక్తులు ఆమెను దేవతగా కొలుస్తారు. 'రాధే మా' పేరుతో ప్రసిద్ధి పొందిన ఆమె అసలు పేరు సుఖ్‌విందర్ కౌర్.
భారత్‌లో వివాదాస్పదమైన, పెరుగుతున్న 'బాబాల ప్రపంచం'లో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్న మహిళల్లో 'రాధే మా' ఒకరు.
భయం, భక్తి, మూఢనమ్మకాలు, రహస్యాలు నిండిన ఈ బాబాల ప్రపంచంలోకి అడుగు పెట్టడం చాలా కష్టం. అయినా, రాధే మా ప్రపంచంలోకి బీబీసీ ప్రవేశించింది. ఆ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నించింది.
లూయిస్ విట్టన్, గుచ్చి వంటి ఖరీదైన గ్లోబల్ బ్రాండ్‌ల బ్యాగ్‌లు, బంగారు నగలు, వజ్రా భరణాలు ధరించినవారు, ఫ్యాషనబుల్ లిబాస్ దుస్తులు ధరించిన మహిళలు ఒకచోట గుమిగూడుతున్నారు.
వీరంతా రాధే మా భక్తులు. దిల్లీలో ఆమె దర్శనం కోసం అర్ధరాత్రి వేళ వారంతా అక్కడికి వచ్చారు.

రాధే మా తనను తాను 'మిరకిల్ మా' ( అద్భుతాలు సృష్టించే మాత) అని చెప్పుకుంటారు. మిగతా సాధువుల్లా ఆమెకు సాదాసీదా జీవితం నచ్చదు. అలాగే ఆమె ఆహార్యం కూడా సాధారణంగా ఉండదు. సుదీర్ఘ ప్రవచనాలూ ఇవ్వరు. ఉదయం వేళల్లో భక్తులను కలవరు.
‘‘ వాస్తవం ఏంటంటే నేను చేసే అద్భుతాలు విలువైనవి. లేకపోతే ఎవరూ డబ్బును విరాళంగా ఇవ్వరు. వాళ్ల జీవితంలో అద్భుతాలు జరిగి, వారు కోరుకున్నది నెరవేరుతుంది. కాబట్టే వారు విరాళాలు ఇస్తారు'' అని బీబీసీతో చెప్పారు రాధే మా .
ఆమె దీవెనలతో సంతానం లేని మహిళలకు పిల్లలు పుట్టారని, కూతుళ్లు మాత్రమే ఉన్న కుటుంబంలో కొడుకు జన్మించాడని, నష్టాల ఊబిలో ఉన్న వ్యాపారం కుదుటపడిందనీ, ఇలా ఆమె మహిమల కథలు ప్రచారంలో ఉన్నాయి.
దైవిక శక్తులు ఉన్నాయనే మాట 'రాధే మా'కు మాత్రమే పరిమితం కాదు. భారత్‌లో ఇలాంటి బాబాల గ్రూపులు చాలా ఉన్నాయి. ప్రతి ఏడాది ఇలాంటి బాబాలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ల సంఖ్యను ఎవరూ లెక్కించడంలేదు.

కొందరు బాబాలపై అవినీతి, లైంగిక హింస, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి.
రాధే మాపై కూడా క్షుద్రపూజలు (బ్లాక్ మ్యాజిక్) చేశారంటూ, వరకట్నం తీసుకోవాలంటూ కుటుంబాన్ని ప్రేరేపించారనే ఆరోపణలు వచ్చాయి. పోలీసుల దర్యాప్తు తర్వాత ఈ అభియోగాలన్నీ కోర్టులో రద్దయ్యాయి.
కానీ, వేలమంది భక్తులు ఇప్పటికీ ఈ బాబాలు, మాతల దర్శనం కోసం పోటెత్తుతారు. నిరుడు ఇలాంటి ఒక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా చనిపోయారు.
''ఆరాధన, ధ్యానం, ప్రార్థనల ద్వారా దైవిక శక్తులు లభిస్తాయని, అలాంటి శక్తులు పొందినవారు అద్భుతాలు చేస్తారని నమ్మే కుటుంబాలు భారత్‌లో చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని దేవుడిగా లేదా బాబాలుగా నమ్ముతారు' అని బీబీసీతో భారత్‌లోని ప్రముఖ మూఢనమ్మకాల వ్యతిరేక సంస్థ ఏబీఏఎన్‌ఎస్ అధిపతి ప్రొఫెసర్ శ్యామ్ మానవ్ చెప్పారు.

రాధే మా భక్తులు ఎవరు?
నిరక్ష్యరాస్యులు, పేదవారు ఎక్కువగా ఇలాంటి వాటిని విశ్వసిస్తారనే భావన ఉంది. కానీ, రాధే మా దగ్గరకు వచ్చేవారిలో ఉన్నత విద్యావంతులు, ధనిక వ్యాపార కుటుంబాలకు చెందినవారు చాలామంది ఉంటారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన సైద్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ పుష్పిందర్ భాటియాను నేను కలిశాను. పుష్పిందర్ ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నడుపుతున్నారు. దర్శనం కోసం ఏర్పాటు చేసిన లైన్‌లో ఆయన నిల్చున్నారు.
''మానవ రూపంలో ఉన్న దైవిక శక్తిని అనుసరిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. మొదట్లో కొన్ని ప్రశ్నలు తలెత్తేవి. దేవుడు నిజంగా మానవరూపంలో వస్తాడా? ఇది నిజమా? మీ జీవితం మొత్తం మారిపోయేలా ఆమె దీవెనలు పనిచేస్తాయా? ఈ అద్భుతాలు ఎలా జరుగుతాయి? అని అనుకునేవాడిని'' అని ఆయన చెప్పారు.
కుటుంబంలో ఒక విషాద ఘటన తర్వాత రాధే మా చెంతకు వచ్చారు భాటియా.
తొలి దర్శన సమయంలోనే ఆమె మహిమ తనను ఆకర్షించిందని భాటియా చెప్పారు.

రాధే మా దర్శనం కోసం భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. దిల్లీలోని ఒక ప్రైవేట్ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన ఒక దర్శన కార్యక్రమంలో ఆ క్షణాన్ని నేను చూశాను.
అక్కడికి వచ్చిన వందల మంది భక్తుల్లో ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. ఒక సీనియర్ పోలీసు అధికారి కుటుంబం కూడా ఉంది. ప్రత్యేకంగా ఆమె దర్శనం కోసం వారు విమానంలో వచ్చారు.
ఒక జర్నలిస్టుగా ఆ కార్యక్రమాన్ని రిపోర్టు చేయడం కోసం నేను అక్కడికి వెళ్లాను. కానీ, ముందుగా ఆమె దీవెనలు తీసుకోవాలంటూ నన్ను లైన్‌లో ముందు నిలబెట్టారు. తర్వాత అక్కడ ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు. ఒకవేళ నేను సరిగ్గా చేయకపోతే నా కుటుంబానికి హాని కలుగుతుందని హెచ్చరించారు.
రాధేమాకు ఎరుపు, బంగారు రంగులు ఇష్టం. ఆ గదిని ఆ రెండు రంగుల్లో అలంకరించారు. అక్కడ 'రాధే మా' తన కళ్లతోనే అన్ని భావాలను పలికించారు.
ఒక క్షణంలో సంతోషం, మరో క్షణంలో కోపం... అసలు ఆమె కోపం అక్కడే ఉన్న ఆమె భక్తునిలోకి ఎలా ప్రవేశించిందో నాకు అర్థం కాలేదు. వెంటనే ఆయన ట్రాన్స్‌లోకి వెళ్లినట్లు కనిపించారు. గది మొత్తం నిశ్శబ్ధంగా మారింది. ఆ భక్తుని తల, శరీరం చాలా వేగంగా ఊగడం మొదలైంది. తర్వాత ఆయన నేలపై పడుకున్నారు.
అప్పుడు భక్తులంతా కోపం వదిలి శాంతించాలంటూ 'రాధే మా'ను వేడుకున్నారు. కొన్ని క్షణాల తర్వాత, ఒక పాపులర్ బాలీవుడ్ పాట వినిపించింది. తర్వాత ఆమె డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఆమె శాంతించినట్లు లెక్క. తర్వాత, మళ్లీ దర్శనానికి సంబంధించిన లైన్ కదలడం మొదలైంది.

తరచుగా ‘నేనెవరు?’ అనే ప్రశ్న
పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామం దోరంగలాలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో రాధే మా జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు సుఖ్‌విందర్.
ఒక గురువు ఉపదేశం తర్వాత తనకు దైవశక్తులు లభించాయని రాధే మా చెబుతుంటారు.
''పైలట్ కావాలని, డాక్టర్ కావాలని పిల్లలు కోరుకుంటున్నారు. రాధే మా మాత్రం తరచుగా నేనెవర్నీ? అని అడిగేవారు. దీంతో మా నాన్న ఆమెను ఒక గురువు దగ్గరికి తీసుకెళ్లారు. ఆమె మానవ రూపంలో ఉన్న దేవత అని చెప్పారు'' అని రాధే మా సోదరి రాజిందర్ కౌర్ చెప్పారు.
'రాధే మా' పేరు మీద ఒక ఆలయాన్ని ఆమె నిర్వహిస్తున్నారు. రాధే మా భర్త మోహన్ సింగ్, దీన్ని నిర్మించారు. ఆయన విదేశాల్లో పనిచేసి సంపాదించిన సొమ్ముతో నిర్మించారు.
''ఆయనను మేం 'డాడీ' అని పిలుస్తాం. ఆమె మా తల్లి, ఆయన మా తండ్రి'' అని రాజిందర్ కౌర్ అన్నారు.
రాధే మా 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆమె భర్త విదేశాల్లో ఉండేవారు. అప్పుడు రాధే మా తన ఇద్దరు కుమారులను సోదరి పర్యవేక్షణలో వదిలేసి భక్తుల ఇళ్లలో నివసించడం మొదలుపెట్టారు. ఈ భక్తుల్లో ఎక్కువమంది వ్యాపారవేత్తలే.
ముంబయికి చేరేవరకు ఆమె ఒక నగరం నుంచి మరో నగరానికి మకాం మారుస్తూనే ఉన్నారు. అక్కడే ఒక వ్యాపారి ఇంట్లో పదేళ్లకుపైగా ఉండి తర్వాత తన కుటుంబం వద్దకు తిరిగొచ్చారు.

రాధే మా ప్రపంచం
రాధే మా ఇప్పుడు తన ఇద్దరు కుమారులు నిర్మించిన ఒక పెద్ద భవనంలో నివసిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమారులు కూడా పెద్ద వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. ఈ కుటుంబాలు కూడా రాధే మా భక్తులు.
ఆ భవనంలో కుటుంబీకులతో కాకుండా ప్రత్యేకంగా వేరే అంతస్థులో ఆమె ఉంటారు. భక్తులకు దర్శనం ఇవ్వడానికి లేదా ప్రజా కార్యక్రమంలో పాల్గొనడానికి వేరే నగరంలో విమానంలో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆమె అక్కడి నుంచి బయటకు వస్తారు.
''మొదట, ఆమె మాలో ఒకరిగా జీవించడంలేదు. ఆమె రక్షణలో, ఆమె కృపలో జీవించడం మా అదృష్టం. రెండోది ఆమె మమ్మల్ని తన కుటుంబంగా చూడరు. భక్తులుగా భావిస్తారు '' అని రాధే మా కోడలు మేఘా సింగ్ చెప్పారు. రాధే మా ప్రజా కార్యక్రమాలను మేఘా సింగ్ నిర్వహిస్తారు.
'రాధే మా'కు సమర్పించే విరాళాలను సమాజం కోసం వినియోగిస్తామని ఆమె తెలిపారు.
అయితే, రాధే మా ఫ్యాషనబుల్ దుస్తులు, నగలను ఇష్టపడతారు.
''వివాహం అయిన ప్రతీ స్త్రీ తరహాలోనే నేను కూడా మంచి దుస్తులు, ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను ఇష్టపడతాను. మేకప్ పట్ల నాకు ఇష్టం ఉండదు'' అని రాధే మా చెప్పారు.
అయితే, ఆమె చాలా మేకప్‌తో కనిపిస్తారు.

శ్రీ రాధే మా చారిటబుల్ సొసైటీ ద్వారా నెలకు రూ. 1000-2000 పెన్షన్ పొందుతున్న 500 మంది మహిళల్లో కుమారి ఒకరు.
ఆమెతో పాటు పెన్షన్ పొందుతున్న ఇతర మహిళలు కూడా రాధే మా మహిమలంటూ కొన్ని ఘటనలను పంచుకున్నారు.
''ఆమెకు రోజూ దీపం వెలిగించకపోతే మాకు ఏదో ఒక చెడు జరుగుతుంది. అనారోగ్యం పాలవుతాను'' అని సుర్జీత్ కౌర్ అనే మహిళ చెప్పారు. ఆమె ప్రతిరోజూ రాధే మా కోసం దీపం వెలిగిస్తారు.
దేవుడి దయ కోల్పోతామనే భయంతో భక్తులు ఇలా చేస్తుంటారని ప్రొఫెసర్ మానవ్ అన్నారు.
''బాబాలు చెప్పే కొన్ని అంచనాలు నిజం అవుతాయి. అప్పుడు ఆ క్రెడిట్ వారికి దక్కుతుంది. కానీ, జరగనివాటికి బాబాలను బాధ్యులను చేయరు. ఆ నిందను భక్తులే తీసుకుంటారు. సరిగ్గా ప్రార్థన చేయకపోవడం వల్ల, ఆరాధించకపోవడం వల్లే ఇలా జరిగిందనుకుంటారు'' అని మానవ్ వివరించారు.
రాధే మా ప్రజా కార్యక్రమాల్లో నేను కలిసిన కొంతమంది ప్రజలు, ఆమెకు దైవిక శక్తులున్నాయనే వాదనపై అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇవన్నీ కల్పిత కథలని ఒకరు కొట్టిపారేశారు.
తన కళ్లతో ఆమె చేసిన ఎలాంటి అద్భుతాలను చూడలేదని మరొకరు అన్నారు. ఖరీదైన మేకప్, దుస్తులు ధరించడం వల్ల దేవుడు కాలేరని వ్యాఖ్యానించారు.
రియాలిటీ షో కార్యక్రమంలో 'రాధే మా'ను చూసిన తర్వాత, నిజ జీవితంలో ఆమె ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సుకతతో ఆమె నిర్వహించే కార్యక్రమానికి హాజరైనట్లు వారు తెలిపారు.

భక్తి, భయం
పరిశోధనలో భాగంగా నేను కొందరు రాధే మా మాజీ అనుచరులను కలిశాను. ఆమె చెప్పినవేవీ తమ జీవితంలో జగలేదని, నిజానికి ఆమె వల్ల చెడు జరిగిందని వారు అన్నారు. తమ గుర్తింపు బయటపెట్టడానికి వారు ఇష్టపడలేదు.
ఒకరోజు సాయంత్రం జరిగిన ఒక ఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
రాధే మా తన గదిలో నేలపై కూర్చున్న భక్తుల్లో కొందరిని జంతువుల్లా అరవమని కోరారు. వారు దీనికి ఒప్పుకున్నారు.
కుక్కలు, కోతుల్లా ప్రవర్తించమని, వాటిలా అరవమని ఆమె కోరడంతో వారు అలాగే మొరగడం, గంతులేయడం చేశారు.
ఇలాంటిది నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు.
అప్పుడు అదే గదిలో ఉన్న రాధే మా కోడలు మేఘా సింగ్‌ను వాళ్లంతా అలా ఎందుకు చేస్తున్నారని అడిగాను.
ఆమె ఎలాంటి తడబాటు లేకుండా బదులిచ్చారు.
రాధే మా 30 ఏళ్లకు పైగా ఇదే గదికి పరిమితమయ్యారని మేఘా చెప్పారు. దర్శనం సమయంలోనే బయటకు వస్తారని అన్నారు.
''ఆమెకు ఉన్న ఏకైక వినోదం ఇదొక్కటే. ఇలాంటి చర్యల ద్వారా మేం ఆమెను నవ్వించడానికి ప్రయత్నిస్తాం'' అని ఆమె కొనసాగించారు.

రాధే మా భక్తుల నుంచి ఏం ఆశిస్తారని నేను ఆమె భక్తుల్లో ఒకరైన పుష్పిందర్ సింగ్‌ను అడిగాను.
''ఏమీ లేదు. కానీ, నా దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తి విశ్వాసంతో, విశాల హృదయంలో రండి అని మాత్రమే ఆమె చెబుతుంటారు. కొత్తవారైనా, లేక పాత భక్తులైనా ఈ రకమైన నమ్మకంతో ఆమె దగ్గరకు వెళ్తే అద్భుతాలు జరుగుతాయి. అలా కాకుండా ఆమెను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్తే మీకు ఆమె కృప దక్కదు'' అని ఆయన బదులిచ్చారు.
భక్తి ఉంటే అన్ని విధాలుగా దేవుడి ముందు లొంగిపోవాలని ఆయన చెప్పారు.
ఇలా ఎలాంటి ప్రశ్నలు వేయకుండా లొంగిపోవడాన్నే మూఢనమ్మకం అంటారని ప్రొఫెసర్ మానవ్ అన్నారు.
''గురువుపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచిన వారికి మాత్రమే ఫలితం దక్కుతుందని అంటుంటారు. ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే, పరీక్షించడానికి ప్రయత్నిస్తే దీవెనలు పొందలేరని నమ్ముతారు'' అని మానవ్ వివరించారు.
తన అనుచరులంతా ఎప్పుడూ తన వెంటే ఉంటారని, తన పట్ల నమ్మకం లేని వారి గురించి పెద్దగా పట్టించుకోనని రాధే మా అంటారు.
''నేను పట్టించుకోను. పైనుంచి దేవుడు అంతా చూస్తున్నాడు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు'' అని నవ్వుతూ రాధే మా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














