హాథ్‌రస్ తొక్కిసలాట: భోలే బాబా పాద ధూళి కోసం భక్తుల ఆరాటం - గ్రౌండ్ రిపోర్ట్

గోమతి
ఫొటో క్యాప్షన్, నారాయణ సాకార్ లాకెట్ చూపిస్తున్న గోమతి
    • రచయిత, దిల్ నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంబులెన్స్ సైరన్ల హోరు, బస్సుల్లోనుంచి వడివడిగా దిగుతున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ జవాన్లు, గుట్టలుగా పోగుపడిన చెప్పులు, జర్నలిస్టుల నిరంతర లైవ్ ప్రసారాలు, కనిపించకుండా పోయిన తమ వారికోసం వెతుకుతున్న ఆప్తులు..

ఇవీ ఉత్తరప్రదేశ్‌లోని సికంద్రారావు పట్టణానికి సమీపంలో ఒక సత్సంగ్ కార్యక్రమం వద్ద తొక్కిసలాట అనంతర దృశ్యాలు.

ఈ ఘటనలో 116 మంది చనిపోయారని మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ ధ్రువీకరించారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు.

మృతుల్లో ఎక్కువమంది మహిళలే.

ఈ సత్సంగ్ నిర్వహణకు ఏర్పాట్లు చాలా రోజుల పాటు సాగాయి. ఎనిమిది రోజుల పాటు టెంట్లు వేశారు.

సత్సంగ్ నిర్వహణకు అనుమతి తీసుకునేటప్పుడు, దాదాపు 80 వేల మంది పాల్గొంటారని అధికారులకు నిర్వాహకులు చెప్పారు. కానీ, పాల్గొన్నవారి సంఖ్య వారు చెప్పినదాని కంటే చాలా ఎక్కువగా ఉంది.

ప్రత్యక్ష సాక్షులు, భక్తులు చెప్పిన వివరాల ప్రకారం, సత్సంగ్ ముగిసిన తర్వాత బాబా పాదధూళి తీసుకోవడం కోసం భక్తులు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

హాథ్‌రస్ తొక్కిసలాట: కీలక సమాచారం

  • యూపీలోని హాథ్‌రస్‌లో జులై 2న నారాయణ సాకార్ సత్సంగ్‌లో తొక్కిసలాట
  • 100కు పైగా మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
  • ప్రభుత్వం జారీ చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు: 92591,89726, 90843,82490
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి.
హాథ్‌రస్ సత్సంగ్

‘కింద పడినవారు పైకి లేవలేకపోయారు’

అలీగఢ్ నుంచి ‘ఎటా’ను కలిపే 34వ నంబర్ జాతీయ రహదారిపై సికంద్రరావు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని ఫుల్‌రాయీ గ్రామంలో ఈ సత్సంగ్ నిర్వహించారు.

ఇక్కడి వందల ఎకరాల్లో టెంట్లు వేశారు. వాటిని ఇప్పుడు హడావిడిగా తొలగిస్తున్నారు.

వేదికకు ఎదురుగా హైవే దగ్గర ఎక్కువ మంది మరణించారు. వర్షం కారణంగా హైవే పక్కనున్న ప్రాంతం అంతా బురదగా మారింది..

ఈ తొక్కిసలాటలో కింద పడినవారు మళ్లీ పైకి లేవలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వర్షం, బురద కారణంగా పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు.

నారాయణ సాకార్ హరి అలియాస్ ‘‘భోలే బాబా’’ నడవడానికి ఒక ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు. బాబా దర్శనం కోసం చాలామంది మహిళలు అక్కడ నిలబడి ఉన్నారు.

సత్సంగ్ ముగియగానే హైవే దగ్గర జనాలు బాగా పెరిగిపోయారు. భోలే బాబా తన వాహనం వైపు వెళ్తుండగా తొక్కిసలాట మొదలైంది.

భక్తులు తొక్కిసలాటలో చిక్కుకున్నప్పుడు భోలే బాబా ఆగకుండా ముందుకు వెళ్లిపోయారని అక్కడున్నవారు చెప్పారు. ఈ దుర్ఘటన తర్వాత బాబా నుంచి లేదా సత్సంగ్‌తో సంబంధమున్న ఇతర వ్యక్తుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

భోలే బాబా భక్తులు

ఫొటో సోర్స్, ANI

భోలే బాబా భక్తులు ఏమంటున్నారు

బహ్‌రైచ్ జిల్లా నుంచి వచ్చిన గోమతి దేవి తన మెడలో నారాయణ సాకార్ చిత్రం ఉన్న లాకెట్‌ ధరించారు. పూర్తి భక్తిశ్రద్ధలతో ఆమె ఆ లాకెట్‌ను ధరించారు.

బస్సులో ఆమెతో పాటు వచ్చిన మరో ఇద్దరు భక్తులు కనిపించడం లేదు. ఈ ఘటన తర్వాత కూడా భోలే బాబాపై గోమతి విశ్వాసం చెదిరిపోలేదు.

కొన్ని గంటల పాటు వెదికిన తర్వాత కూడా వారిద్దరి ఆచూకీ తెలియకపోవడంతో భక్తులను తీసుకొచ్చిన బస్సు వాళ్లిద్దరూ లేకుండానే తిరుగు ప్రయాణమైంది.

ఈ ఘటన తర్వాత కూడా భక్తుల్లో భోలే బాబాపై నమ్మకం తగ్గలేదు.

నాలుగేళ్ల క్రితం భోలే బాబా అనుచరులతో పరిచయమైన తర్వాత గోమతి దేవి కూడా ఆయన లాకెట్ ఉన్న మాల ధరించడం మొదలుపెట్టారు.

‘‘దీన్ని మెడలో వేసుకుంటే లాభాలు కలుగుతాయి. సుఖశాంతులు సిద్ధిస్తాయి. అనారోగ్యాలు నయం అవుతాయి. ఇంట్లోని ఇబ్బందులు తొలగుతాయి. ఉపాధి లభిస్తుంది’’ అని బీబీసీకి గోమతి దేవి చెప్పారు.

బహ్‌రైచ్ నుంచి మరో వ్యక్తి దినేశ్ యాదవ్ మాట్లాడుతూ, ‘‘మా వైపు ప్రజలు భోలే బాబా ఫోటోను పూజిస్తారు. వాళ్లను చూసి మేం కూడా ఆయన్ను పూజించడం మొదలుపెట్టాం. ఏడాది కాలంగా ఇందులో పాల్గొంటున్నాం. బాబా మీద మాకు నమ్మకం ఉంది. మేం ఏం కోరుకుంటే అది జరుగుతుంది’’ అని ఆయన అన్నారు.

ఈ ప్రమాదానికి నారాయణ సాకార్ కారణమని ఆయన అనుకోవట్లేదు.

అంబులెన్స్

తొక్కిసలాట తర్వాత పరిస్థితి

మధ్నాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని సికంద్రారావు సీహెచ్‌ఎస్‌కు తీసుకెళ్లారు. సీహెచ్‌సీ ట్రామా సెంటర్ ప్రాంగణంలో గుట్టలుగా శవాలు ఉన్నాయని అక్కడికి వెళ్లిన పలువురు జర్నలిస్టులు తెలిపారు.

బీఎన్ శర్మ పదేళ్లుగా హాథ్‌రస్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

‘‘నాలుగు గంటల సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, అన్నిచోట్లా శవాలే కనిపించాయి. ఒక చిన్న పాప శ్వాస తీసుకుంటూ కనిపించింది. కానీ, ఆమెకు సరైన సమయానికి చికిత్స అందలేదు. నా కళ్ల ముందే ఆ పాప చనిపోయింది’’ అని బీఎన్ శర్మ చెప్పారు.

సికంద్రారావులో ఇదే పెద్ద ఆసుపత్రి అయినప్పటికీ, వందలాది మంది క్షతగాత్రులను హ్యాండిల్ చేసే సామర్థ్యం లేదు.

మొదట 10 నుంచి 15మంది ప్రజలు గాయపడినట్లు సమాచారం వచ్చింది. అధికారులు కూడా నాలుగు గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చారు.

అధికారులు అక్కడికి సమీపంలోని ఎటా, కాస్‌గంజ్, ఆగ్రా, అలీగఢ్‌లకు మృతదేహాలను తరలించారు. తమ వారిని వెతుక్కుంటూ ఆసుపత్రికి వచ్చిన ఆత్మీయులకు ఇది ఇబ్బందిగా మారింది.

భోలే బాబా సత్సంగ్

ఫొటో సోర్స్, ANI

తమ వారి కోసం కుటుంబీకుల ఆరాటం

మథురలో నివసించే విపుల్ గురుగ్రామ్‌లో ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. తన తల్లిని వెతుక్కుంటూ కొందరు స్నేహితులతో కలిసి ట్యాక్సీ మాట్లాడుకొని రాత్రి 11 గంటల సమయంలో సికంద్రారావుకు విపుల్ వచ్చారు.

తన తల్లి ఆచూకీ కోసం ఆయన హెల్ప్‌లైన్ నంబర్లు, కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ చేశారు. హాస్పిటల్స్ తిరిగారు. కానీ, ఆయనకు ఆమె దొరకలేదు.

30 మృతదేహాలను తరలించిన హాథ్‌రస్ జిల్లా ఆసుపత్రికి కూడా విపుల్ వెళ్లారు. అక్కడ కూడా ఆయన తల్లి కనిపించలేదు.

రాత్రి 2 గంటల సమయంలో అలీగఢ్‌లోని జేఎన్ మెడికల్ కాలేజీకి చేరుకొని అక్కడ కూడా తల్లి కోసం వెదకడం మొదలుపెట్టారు.

‘‘మా అమ్మ సోమవతి దాదాపు పదేళ్లుగా బాబా సత్సంగ్‌లలో పాల్గొంటున్నారు. ఆమెకు బాబాపై చాలా నమ్మకం. మా అమ్మతో కలిసి సత్సంగ్‌కు వచ్చిన వారు తను కనిపించలేదని నాకు చెప్పడంతో వెంటనే గురుగ్రామ్ నుంచి వచ్చాను’’ అని విపుల్ వివరించారు.

ఇతర జిల్లాలకు చెందిన చాలా మంది ప్రజలు కూడా తమ బంధువుల కోసం తీవ్రంగా గాలిస్తూ కనిపించారు.

తన తల్లి సమాచారం కోరుతూ కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ చేసినప్పుడు, అన్ని ఆసుపత్రుల్లోకి వెళ్లి ఆమె గురించి వెతకాలని ఆపరేటర్ సలహా ఇచ్చినట్లు కాస్‌గంజ్‌కు చెందిన శివమ్ కుమార్ చెప్పారు.

భోలే బాబా సత్సంగ్

గుర్తించడం ఎలా?

మృతుల్లో చాలామందిని రాత్రి 12 గంటల వరకు కూడా గుర్తించలేకపోయారు.

గుర్తించిన మృతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. మిగతావారిని వెతకడంలో ఆయా కుటుంబాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

నారాయణ సాకార్ సత్సంగ్‌కు వచ్చినవారిలో ఎక్కువమంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన కులాలకు చెందినవారే.

జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తూ నారాయణ సాకార్ సత్సంగ్‌కు వారు వస్తుంటారు.

నారాయణ సాకార్ సత్సంగ్‌కు హాజరయ్యేవారి సంఖ్య పెరుగుతోందని స్థానిక జర్నలిస్టులు అన్నారు.

‘‘బాబా సత్సంగ్‌లోకి మీడియాను రానివ్వరు. వీడియోలు తీయడం కూడా నిషిద్ధం. మీడియాలో ఆయన ఎక్కువ ప్రచారం చేసుకోరు’’ అని జర్నలిస్ట్ బీఎన్ శర్మ చెప్పారు.

సత్సంగ్ సందర్భంగా, బాబా పాదాలు, శరీరాన్ని కడిగిన నీళ్ల కోసం భక్తులు పోటీపడుతుంటారు. ఆ నీటిని ‘‘చరణామృతం’’ అని పిలుస్తారు.

‘‘బాబా పాదధూళిని భక్తులు ఆశీర్వాదంగా భావిస్తారు. అందుకే బాబా ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచి ధూళిని తీసుకుంటారు. మంగళవారం తొక్కిసలాట జరిగినప్పుడు, చాలామంది మహిళలు, మట్టి తీసుకోవడం కోసం కిందకు వంగారు. పైకి లేవడానికి అవకాశం లేకపోవడంతో తొక్కిసలాటలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు’’ అని బీఎన్ శర్మ వివరించారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)