ఆ 40 సెకండ్ల ఆలస్యమే ఆటగాడి ప్రాణం తీసిందా...చైనా సోషల్ మీడియాలో విమర్శలేంటి?

చైనా యువ బ్యాడ్మింటన్ ఆటగాడు మృతి

ఫొటో సోర్స్, CCTV

ఫొటో క్యాప్షన్, చైనా యువ బ్యాడ్మింటన్ ఆటగాడు ఝాంగ్ ఝిజీ
    • రచయిత, టెస్సా వాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా యువ బ్యాడ్మింటన్ ఆటగాడి మృతిపై చైనా సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.

17 ఏళ్ల ఝాంగ్ ఝిజీ అనే బ్యాడ్మింటన్ ప్లేయర్ యూత్ మ్యాచ్‌లో ఆడుతుండగా అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. తర్వాత అతను మరణించాడని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ కాగా, ఝాంగ్‌ను పరీక్షించడంలో వైద్యులు దాదాపు 40 సెకన్లు ఆలస్యం చేసినట్లు ఆ వీడియోలో కనిపించింది.

అధికారులు త్వరగా స్పందించి ఉంటే ఆ క్రీడాకారుడు బతికేవాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అతను గుండెపోటుతో చనిపోయాడని ఇండోనేషియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ పీబీఎస్ఐ తెలిపింది.

బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్ షిప్‌లో భాగంగా ఆదివారం ఇండోనేషియా నగరం యోగ్యకర్తాలో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన కజుమా కవానోతో ఝాంగ్ తలపడ్డాడు.

ఝాంగ్ కుప్పకూలిన తరువాత, ఒక వ్యక్తి అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. కానీ కోర్టు లోపల సాయం చేయడానికి రిఫరీ అనుమతి కోసం ఎదురుచూశాడు.

ఈ ఘటన తర్వాత పీబీఎస్ఐ ప్రతినిధి విలేఖరులతో మాట్లాడుతూ, కోర్టులోకి ప్రవేశించే ముందు రిఫరీ అనుమతి అవసరం అన్న నిబంధనను వైద్య బృందాలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు.

“ప్రతి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిబంధన వర్తిస్తుంది." అని ఆ ప్రతినిధి వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

రెండు నిమిషాల్లోనే ఝాంగ్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రాంతీయ విభాగమైన బ్యాడ్మింటన్ ఏషియా తెలిపింది.

భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురైతే అథ్లెట్లను కాపాడేందుకు చర్యలను మరింత వేగంగా తీసుకునేందుకు వీలుగా ఈ నిబంధనను పునఃసమీక్షించాలని ఫెడరేషన్‌ను పీబీఎస్ఐ కోరనుంది.

యూకే ఫుట్‌బాల్ అసోసియేషన్ వంటి ఇతర క్రీడా విభాగాలలో కూడా ఇలాంటి నిబంధన ఉంది.

ఝాంగ్ మరణంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో చైనీస్ యూజర్ల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. చాలా మంది ఈ నిబంధనను తీవ్రంగా ఖండించారు.

"ఏది ముఖ్యం- ఒక మనిషి ప్రాణమా, లేక నియమాలా?" అని ఒక యూజర్ చేసిన వ్యాఖ్యను వేలమంది లైక్ చేశారు.

‘‘అతనిని కాపాడటంలో వాళ్లు గోల్డెన్ పీరియడ్‌ను మిస్సయ్యారా?’’ అంటూ మరో యూజర్ ఝాంగ్ మరణంపై హ్యాష్ ట్యాగ్ కింద చేసిన కామెంట్ వీబోలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ నిబంధనలను సమూలంగా మార్చాలని కొందరు కోరగా, 'ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు అనుమతుల గొడవేంటి?' అని కొందరు ప్రశ్నించారు.

క్రీడా ఈవెంట్లలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రొసీజర్స్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించింది.

‘‘నిబంధనలు ఎలా రూపొందించినా, రిఫరీలు ఎలా వ్యవహరించినా క్రీడా మైదానంలో మనిషి ప్రాణానికి ప్రాధాన్యమివ్వడమే అత్యున్నతమైన నియమం.’’ అని ఆ కథనం పేర్కొంది.

బ్యాడ్మింటన్‌లో రైజింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు ఝాంగ్. అతని హఠాన్మరణంపట్ల అనేకమంది నివాళులు అర్పించారు. సంతాపం తెలియజేశారు.

ఒక ప్రతిభావంతుడైన ఆటగాడిని బ్యాడ్మింటన్ ప్రపంచం కోల్పోయిందని బ్యాడ్మింటన్ ఏషియా ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)