పారిస్ ఒలింపిక్స్: ఫ్రాన్స్‌లో హిజాబ్‌పై నిషేధం, ఈ నిబంధనపై క్రీడాకారులు ఏమంటున్నారు?

 ఇబ్తిహాజ్ మొహమ్మద్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అమెరికా నుంచి హిజాబ్ ధరించి పోటీ పడిన తొలి మహిళ ఇబ్తిహాజ్ మొహమ్మద్
    • రచయిత, టాయిరిజ్ కింగ్
    • హోదా, బీబీసీ స్పోర్ట్

ఫ్రాన్స్‌లో సీన్ నది పక్కనే ఉండే ‘సిటీ డు సినిమా’ అనే స్టూడియో సినిమా నిర్మాణానికి ఆ దేశంలో పెట్టింది పేరు.

గుహ మాదిరి కనిపించే ఈ స్టూడియో రాబోయే జూలైలో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ చేసే క్రీడాకారులకు స్పోర్ట్స్ విలేజ్‌గా మారిపోనుంది.

వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన క్రీడాకారులు ఇక్కడ డైనింగ్ హాల్‌లో ఒకే చోట కూర్చుని, తమ కథలను సహచరులతో పంచుకోనున్నారు.

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వివిధ వర్గాలు, జాతుల వారందరూ కలిసి కూర్చునే బహుళ సాంస్కృతిక సమ్మేళనం ఒలింపిక్స్.

కానీ, ఈ సమావేశంలో హోస్ట్‌గా వ్యవహరించే వారి డ్రస్ కోడ్ అతిథులకు భిన్నంగా కనిపించనుంది.

గత ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) అథ్లెట్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్రీడాకారులు వారి మతపరమైన విశ్వాసాలతో పాటు వారి దేశాలకు ప్రాతినిధ్యం వహించవచ్చని చెప్పింది.

‘‘గేమ్స్ విలేజ్‌లో కూడా ఐఓసీ నిబంధనలు వర్తించనున్నాయి’’ అని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి ఐఓసీ అధికార ప్రతినిధి చెప్పారు.

‘‘హిజాబ్ లేదా ఏదైనా మతపరమైన సంస్కృతికి చెందిన డ్రస్‌ను తప్పనిసరిగా ధరించాలన్న ఆంక్షలు ఏమీ లేవు’’ అని చెప్పారు.

అయితే, ఫ్రెంచ్ జట్టు దీనికి భిన్నమైన ఆదేశాలు జారీ చేసింది.

‘‘హిజాబ్‌ (తలను, మెడను వస్త్రంతో కప్పుకునే విధానం)పై నిషేధం రెండు రకాల వివక్షకు ఉదాహరణ’’ అని వివక్షపై పోరాటం చేసేందుకు పార్సియన్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేసిన వెరోనికా నోసెదా చెప్పారు.

ఇది ఇస్లామోఫోబియా ఫలితమని, అలాగే లింగ వివక్ష అని అన్నారు.

లెబనాన్‌ కోసం అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడిన అసైల్ టోఫెలీ కూడా వెరోనికా వాదనను అంగీకరించారు.

‘‘ఇది నిజంగా ఫ్రెంచ్ సమాజపు ఆలోచన కాదు. ప్రభుత్వపు ఆలోచన’’ అని అన్నారు.

గత కొన్నేళ్లుగా, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష వాతావరణం ఫ్రాన్స్‌లో పెరుగుతోందని, క్రీడలలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.

స్వేచ్ఛ, సమానత్వం, సహోదర భావం ఫ్రెంచ్ విప్లవ నినాదం. ఇది ఫ్రాన్స్ ఆకాంక్షల అత్యంత ప్రసిద్ధ వ్యక్తీకరణగా చెప్పొచ్చు. ఫ్రాన్స్ రాజ్యాంగంలో, నాణేలలో, స్టాంపులలో, ప్రభుత్వ భవంతుల్లో ఈ నినాదం ఇమిడి ఉంటుంది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్

ఫ్రాన్స్ సిద్ధాంతాలు, హిజాబ్

ఫ్రాన్స్‌లో కనిపించే మరో ముఖ్యమైన సిద్ధాంతం లౌకికత్వం.

ఫ్రాన్స్ ప్రజలు తమ మత ఆచారాలు లేదా చిహ్నాలను వదులుకోవాలని ఇక్కడి లౌకికత్వం సూచించదు. కానీ, కానీ, ప్రభుత్వం, ప్రజాసంస్థలు మాత్రం వీటికి దూరంగా ఉండాలి.

అయితే, గత దశాబ్దంలో జరిగిన ఉగ్రవాద దాడులు, దానికి సమాంతరంగా దేశంలో మరోసారి కరుడుగట్టిన రైట్ వింగ్ రాజకీయాలు పేట్రెగిన నేపథ్యంలో దీనిపై ఫ్రాన్స్ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ పలుసార్లు ఈ పదానికి అర్థాన్ని నిర్వచిస్తూ వస్తున్నారు.

ఫ్రాన్స్ రిపబ్లిక్‌లో లౌకికత్వం అంటే దేనినైనా నమ్మే స్వేచ్ఛ లేదా నమ్మకపోయే స్వేచ్ఛ అని అర్థం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించనంత వరకు ఏ మతాన్ని అయినా వారు ఆచరించే అవకాశం ఉంటుంది.

లౌకికత్వం అంటే దేశపు తటస్థ విధానానికి చెందినది. అంటే దీనర్థం సమాజం లేదా ప్రజా జీవితం నుంచి మతాన్ని తొలగించాలని అర్థం కాదు. లౌకికత్వం పునాదుల మీదనే ఫ్రాన్స్ ఎదిగింది

ఈ విధానంపై మరింత స్పష్టత కోసం 2004లో ఫ్రాన్స్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద, ఎలాంటి నిర్దిష్ట వివరణలు ఇవ్వకుండా, ప్రభుత్వ స్కూళ్లలో మతపరమైన చిహ్నాలు ధరించడం నిషేధం.

లౌకికత్వానికి కట్టుబడి ఫ్రెంచ్ జాతీయ జట్టు బరిలోకి దిగుతుంది

ఫ్రాన్స్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఫ్రెంచ్ జాతీయ జట్టు ఒక సంస్థగా లౌకికత్వానికి కట్టుబడి ఉంటుందని గత సెప్టెంబర్‌లో ఆ దేశ క్రీడా మంత్రి ఎమిలీ ఆడియా-కాస్ట్రా చెప్పారు. అంటే ప్రజా సేవలలో పూర్తి తటస్థత ఉంటుందని, ఫ్రాన్స్ జట్టు ఈ సమయంలో తలపై ఎలాంటి వస్త్రాన్ని ధరించదని తెలిపారు.

ఇతర దేశాల క్రీడాకారులు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో తమకు నచ్చిన మతపరమైన చిహ్నాలను ధరించుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఒకవేళ ఫ్రాన్స్ జట్టు సభ్యులు తమ దేశ నిబంధనలను పాటించాల్సి వస్తే, అలా చేయలేరు.

ఫ్రాన్స్ ఈ విధానంపై చాలా అంతర్జాతీయ సంస్థలు విమర్శలు చేస్తున్నాయి.

హిజాబ్ ధరించిన మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

సానుకూలత, వ్యతిరేకత

‘‘ఒక మహిళ ఏది ధరించాలో లేదా ఏది ధరించవద్దో అనే విషయంపై ఎవరూ నిర్దేశం చేయకూడదు’’ అని ఐరాస మానవ హక్కుల కార్యాలయానికి చెందిన అధికార ప్రతినిధి చెప్పారు.

‘‘బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన ఆచారాలను పాటిస్తూ తలపై ధరించే వస్త్రంపై నిషేధం విధించడం, ముస్లిం మహిళా హక్కుల ఉల్లంఘన’’ అని మానవ హక్కుల చారిటీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.

అయితే, ఫ్రాన్స్‌లో చాలామంది ఈ నిషేధానికి మద్దతు ఇస్తున్నారు.

‘‘ఇది చాలా క్లిష్టమైన, సున్నితమైన విషయం’’ అని ఫ్రెంచ్ రాజకీయాలు, సమాజంపై ఎంతో కాలంగా రిపోర్టు చేస్తున్న సెబాస్టియన్ మైలార్డ్ చెప్పారు.

‘‘పారిస్ నుంచి లండన్‌ వెళ్లినప్పుడు, ఇదే నాకు అతిపెద్ద తేడాగా అనిపించింది. బ్రిటన్‌లో ఏ మతాని అయినా స్వేచ్ఛగా ప్రదర్శించుకోవచ్చు. కానీ, పారిస్‌లో ఇది తరచూ రెచ్చగొట్టేదిలా కనిపిస్తుంది’’ అని తెలిపారు.

పారిస్ ఒలింపిక్స్ 2023 మతపరమైన చిహ్నాలు నిషేధం విషయంలో నెలకొన్న చిన్న వివాదాన్ని ఆమె గుర్తుకు చేసుకున్నారు.

ఒలింపిక్స్ అధికారిక పోస్టర్‌ను మార్చి నెలలో ఆవిష్కరించారు. దానిలో పారిస్‌లోని పలు ప్రముఖ ప్రాంతాలన్ని కలిసి, ఒక స్టేడియం రూపంలో దర్శనమిస్తున్నాయి.

ఈ అధికారిక పోస్టర్‌ను రూపొందించిన కళాకారుడు, దీనిలో గోల్డెన్ క్రాస్ ఆన్ ది హోటల్ దెస్ ఇన్‌వాలిడ్స్‌ను పెట్టలేదు. దీంతో, బిలియన్ యూరోల ఫ్రాన్స్ పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడుస్తున్న ఈ క్రీడా కార్యక్రమం, చట్టబద్ధత సిద్ధాంతాలకు ఎంత సీరియస్‌గా తీసుకుంటుందనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది.

‘‘ముస్లిం కమ్యూనిటీ కేంద్రంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. వీరు ఫ్రెంచ్ సమాజంలో తమని పూర్తిగా చేర్చుకోవాలని కోరుకుంటున్నారు. అంతేకాక, మతపరమైన ఆచారాల విషయంలో సొంత విధానాలను అనుసరిస్తామని అంటున్నారు. వీటన్నింటిన్నీ ఎలా సమన్వయం చేసుకోవాలనే చర్చ మాలో పదేపదే జరుగుతూనే ఉంటుంది’’ అని మైలార్డ్ అన్నారు.

అలీజాదే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టోక్యో 2020 ఒలింపిక్స్‌ తొలి రౌండ్‌లో బ్రిడన్‌కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ జేడ్ జోన్స్‌పై అలిజాదే గెలుపు

రంజాన్‌లో ఫ్రెంచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నిబంధనలు

గత ఏడాది రంజాన్ సమయంలో ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఎఫ్ఎఫ్ఎఫ్) ఒక ఆదేశం జారీ చేసింది. ఇఫ్తార్ సమయంలో మ్యాచ్‌లు ఆపవద్దని తెలిపింది. ఈ ఏడాది రంజాన్, అంతర్జాతీయంగా క్రీడాకారులకు బ్రేక్ ఒకేసారి వచ్చాయి. అయితే, ఈసారి కూడా ముస్లిం క్రీడాకారుల ఆహారం, సాధన సమయాల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఎఫ్ఎఫ్ఎఫ్ ధ్రువీకరించింది.

యూత్ క్యాంప్‌లలో లేదా సీనియర్ టీమ్స్‌లో ఉపవాసాల నుంచి క్రీడాకారులను నిరోధించాలని దీని ఉద్దేశ్యం. ఈ ఆంక్షల కారణంతో ఫ్రాన్స్ అండర్ 19 టీమ్ కోసం ఆడే లియన్ మిడ్‌ఫీల్డర్ మహ్మదౌ దియావారా జట్టుకు దూరమయ్యారు.

ఇతర క్రీడల్లోకూడా ఇదే పరిస్థితి కనిపించింది. అండర్ 23 స్థాయిలో ఫ్రాన్స్ తరఫున ఆడే బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి డియాబా కోనెట్ హిజాబ్ వేసుకోవడంపై విధించిన నిషేధం తన హృదయాన్ని ముక్కలు చేసిందని చెబుతూ అమెరికా వెళ్లిపోయారు.

ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వహించే చిన్న స్థాయి మ్యాచులలో కూడా ముస్లిం మహిళలు మైదానంలో హిజాబ్ ధరించకుండా నిషేధం ఉంది. కొందరు క్రీడాకారులు దీనికి పరిష్కారంగా రక్షణాత్మక స్క్రమ్‌క్యాప్‌లు ధరిస్తున్నారు.

అయితే, అతిపెద్ద క్రీడా వేదికపైకి చేరుకోవాలంటే క్రీడాకారులు ఈ నిబంధనలు పాటించాలి లేదంటే ఆ క్రీడ నుంచి వైదొలగాలి. కానీ, ఒలింపిక్స్‌ను సీరియస్‌గా తీసుకున్న క్రీడాకారులకు ఈ నియమాలతో ఏమీ పాలుపోలేని స్థితిలో పడపోయారు.

పారిస్ 2024లో దేశ జట్టుకు చెందిన స్పోర్ట్స్ కిట్‌ను ధరించడమో లేదా వ్యక్తిగత విశ్వాలకు కట్టుబడి ఉండటమో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి.

ఇఖ్రా ఇస్మాయిల్

ఫొటో సోర్స్, ARRON WATSON-MCNAB

ఫొటో క్యాప్షన్, ఇఖ్రా ఇస్మాయిల్

హిజాబ్ గురించి ముస్లిం మహిళలు ఏం చెబుతున్నారు?

గత వేసవిలో జరిగిన ఉమెన్ సాకర్ వరల్డ్ కప్‌లో మొరాకో డిఫెండర్ నౌహైలా బెంజినా చరిత్ర సృష్టించారు.

2014లో మార్చిన ఫిఫా నిబంధనలలో ఆధ్యాత్మిక విశ్వాసాలతో తలపై వస్త్రం కప్పుకునేందుకు అనుమతిచ్చారు. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో నౌహైలా ప్రపంచ కప్‌లో హిజాబ్ ధరించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.

రియో ఒలింపిక్స్ 2016లో, ఫెన్సర్ ఇబ్తిహాజ్ మొహమ్మద్ హెడ్‌స్కార్ఫ్ ధరించి ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి అమెరికన్‌గా నిలిచారు.

హిజాబ్ ధరించి మెడల్ సాధించిన మరో క్రీడాకారిణి ఇరాన్‌కు చెందిన టైక్వాండో ప్లేయర్ కిమియా అలిజాదే. ఆ తర్వాత ఆమె జర్మనీ వెళ్లిపోయారు. హిజాబ్ ధరించడం తప్పనిసరి చేసిన ఇరాన్ ప్రభుత్వాన్ని ఆమె ఇప్పుడు తప్పు పడుతున్నారు. శరణార్థి టీమ్‌ తరఫున అలిజాదే టోక్యో గేమ్స్ 2021 కు అర్హత సాధించాక, హిజాబ్‌కు దూరంగా ఉన్నారు.

‘‘హిజాబ్ ధరించడం నా గుర్తింపులో ఒక భాగం. క్రీడల విషయానికి వస్తే, నేను మైదానం నుంచి బయటికి వెళ్లేది లేదు’’ అని ఇఖ్రా ఇస్మాయిల్ చెప్పారు. ఈమె హిల్‌టాప్ ఫుట్‌బాల్ క్లబ్ డైరెక్టర్. క్యూపీఆర్ కమ్యూనిటీ ట్రస్టులో మహిళ శరణార్థి ఫుట్‌బాల్ కోఆర్డినేటర్. ముస్లిం అయిన ఇఖ్రా చిన్నప్పటి నుంచి క్రీడా అభిమాని.

‘‘ఫుట్‌బాల్ మానవ హక్కు. ప్రతి ఒక్కరికీ అందులో పాల్గొనే హక్కు ఉండాలి’’ అని అన్నారు.

యాస్మిన్ అబుకర్ లండన్‌లోని సిస్టర్‌హుడ్ ఎఫ్‌సీ అనే ముస్లిం మహిళల క్లబ్ వ్యవస్థాపకురాలు.

ఈ క్లబ్‌ను స్థాపించడానికి తనను ప్రేరేపించిన విషయంపై మాట్లాడుతూ.. ‘‘ ఫుట్‌బాల్ ఆడకుండా ముస్లిం అమ్మాయిలను ఆపుతున్న విషయాలేంటని నేను వారిని అడిగేదాన్ని. వారు చెప్పిన సమాధానాలు విని చాలా బాధేసేది’’ అని తెలిపారు.

సగం మంది అమ్మాయిలు ఇది వారికి చెందినది కాదని ఫుట్‌బాల్‌ను వదిలేసినట్లు చెప్పారని తెలిపారు. మిగిలిన వారు మతపరమైన విశ్వాసాలతో కలిసి వెళ్లే క్రీడ ఇది కాదని భావించారు. ‘‘నా తల్లిదండ్రులు ఫ్రాన్స్ వెళ్లనందుకు చాలా అదృష్టవంతురాలిని’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)