నడక పందెంలో నేషనల్ రికార్డ్ బ్రేక్ చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ

ఫొటో సోర్స్, RAMBABOO
- రచయిత, అనంత్ ఝనానె
- హోదా, బీబీసీ ప్రతినిధి, లఖ్‌నవూ
రాంబాబు వయసు 23 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఓ కుగ్రామంలో నివసిస్తుంటారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలి పనులు చేసేవారు. ఆయన ఇప్పుడు ఒక జాతీయ రికార్డును బద్దలు కొట్టారు.
జాతీయ క్రీడల్లో 35 కిలోమీటర్ల పురుషుల నడక పందెంలో ఈ ఘనత సాధించారు. కేవలం రెండు గంటల 36 నిమిషాల 34 సెకన్లలో ఈ నడక పూర్తి చేసి బంగారు పతకం గెలుచుకున్నారు.
జాతీయ రికార్డును మూడు నిమిషాల తేడాతో బద్దలు కొట్టారు. కొత్త రికార్డును నెలకొల్పారు. ఙూూ
రాంబాబు సాధించిన ఈ విజయంతో.. ఆయన ఉపాధి హామీ పథకం కూలీగా పనిచేస్తున్న ఒక వీడియో వైరల్ వైరల్‌గా మారింది.
ఈ చిన్న వీడియోను 2020 కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో రాంబాబు సెల్ఫీ మోడ్‌లో చిత్రీకరించారు.
లాక్‌డౌన్ కష్ట కాలంలో అతడు నెలన్నర పాటు పలుగు, పారతో చెరువు తవ్వే పని చేశారు.
జాతీయ క్రీడల్లో అద్భుత విజయం తర్వాత రాంబాబు మరింత శిక్షణ కోసం పుణే వెళ్లారు.
గత ఏడాది కాలంగా ఆయన తన ఇంటికి వెళ్లలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బతకడానికి కూలి పని
పురుషుల 35 కిలోమీటర్ల నడకలో రికార్డు బద్దలుకొట్టే విజయానికి ముందు రాంబాబు నాలుగు నెలల పాటు బెంగళూరులో శిక్షణ పొందారు.
ఆయన 2018 సెప్టెంబర్ నుంచీ ఈ శిక్షణ పొందుతున్నప్పటికీ.. 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా ఆయన తన గ్రామానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
ఆ కష్ట కాలాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ: ''ఇంటికి వెళ్లాక అక్కడ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు. లాక్‌డౌన్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. కుటుంబ మనుగడ కోసం మా నాన్నతో కలిసి నేను కూడా నెలన్నర రోజుల పాటు కూలి పని చేశాను. లాక్‌డౌన్ తొలగిపోయాక నేను భోపాల్ వెళ్లి శిక్షణ తీసుకోవటం కొనసాగించాను'' అని రాంబాబు వివరించారు.
''లాక్‌డౌన్‌లో నేను కూలి పని చేస్తున్నప్పుడు కూడా.. దేశం కోసం ఆడగలననే పూర్తి విశ్వాసం నాకు ఉంది'' అని చెప్పారాయన.
ఆయన తండ్రి ఛోటేలాల్ (55) భూమిలేని వ్యవసాయ కార్మికుడు. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తుంటారు. తన తండ్రి కూలీగా పనిచేస్తూ తన చెల్లెలి చదువు, తన శిక్షణ ఖర్చులను చూసుకుంటున్నారని రాంబాబు తెలిపారు.
రాంబాబు గత రెండేళ్లుగా క్రమం తప్పకుండా శిక్షణ పొందుతున్నారని, 2021 నవంబర్‌లో జాతీయ శిబిరానికి వెళ్లారని ఆయన కోచ్ బసంత్ కుమార్ బీబీసీతో చెప్పారు. అక్కడి నుంచి రాంబాబు రెండు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు.
''భారతదేశంలో చాలా మంది అథ్లెట్లు పేద కుటుంబాల నుంచి వస్తారు. దాదాపు 70, 80 శాతం మంది వర్ధమాన క్రీడాకారులవి పేద కుటుంబాలే. వారు తమ శిక్షణ పూర్తి చేయటానికి ఆరంభంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లో వారు రాణిస్తున్న కొద్దీ వారి కష్టాలు తగ్గుతూ వస్తాయి'' అని కోచ్ వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రెస్టారెంట్‌లో వెయిటర్
రాంబాబు కూడా ఆకలి తీర్చుకోవటానికి చాలా చిన్న చిన్న ఉద్యోగాలు, పనులు చేయాల్సిన పరిస్థితులను ఎదుర్కొన్నారు.
రాంబాబు తాను 2016-17లో 17 ఏళ్ల వయసులో పరుగు పోటీల శిక్షణ కోసం బనారస్ వచ్చినట్లు చెప్పారు.
అప్పుడు ఆయనకు ఇంటి దగ్గర నుంచి డబ్బులు వచ్చేవి కావు. అప్పుడు బతకటం కోసం ఆయన ఒక రెస్టారెంట్‌లో పార్ట్ టైమ్ వెయిటర్‌గా పనిచేశారు.
''కానీ పని ఎంత ఎక్కువగా ఉండేదంటే.. శిక్షణ తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోవటానికి వీలయ్యేది కాదు. దీంతో నెల రోజులు పని చేశాక ఆ ఉద్యోగం వదిలేశాను'' అని చెప్పారు.
అనంతరం బనారస్‌లోని ఒక కొరియర్ ప్యాకేజీ కంపెనీలో మూడు, నాలుగు నెలల పాటు పనిచేశారు. కొరియర్ కోసం ఉపయోగించే సంచులు కుట్టేవారు. అయితే అక్కడ పనిచేసేటపుడు ఆయన మోకాలికి గాయమయింది.
దీంతో ఆ కొరియర్ కంపెనీలో పని మానేసి, చందౌలీలోని నార్తరన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ శిబిరంలో రన్నింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. కానీ మోకాలి గాయం కారణంగా రన్నింగ్ వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 'నడక పోటీ'లో శిక్షణ ప్రారంభించారు.

ఫొటో సోర్స్, SANTOSH SONI
భోపాల్‌లో శిక్షణ
తొలుత ఉత్తర ప్రదేశ్‌లోని బనారస్‌లో సిగ్రా స్టేడియంలో తాను ప్రాక్టీస్ చేశానని, ఆ తర్వాత సాయ్‌ఫాయ్ ఎటావా స్పోర్ట్స్ కాలేజీలో ఏడాది పాటు శిక్షణ పొందానని రాంబాబు తెలిపారు.
లాక్‌డౌన్ సమయంలో ఆయన శిక్షణ కోసం భోపాల్ చేరుకున్నారు. కానీ అక్కడ కూడా కష్టాలు తగ్గలేదు.
''ప్రభుత్వం అమలు చేస్తున్న 'వచ్చి ఆడు' పథకం కింద.. ఆటగాడు స్పోర్ట్స్ అథారిటీలో లేకపోయినా, హాస్టల్‌లో ఉండకపోయినా.. కాలేజీలోకి వెళ్లి ప్రాక్టీస్ చేయవచ్చు'' అని రాంబాబు వివరించారు.
ఆయన ఈ పథకం కింద భోపాల్‌లో శిక్షణ పొందేవారు. కానీ కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో.. బయటి నుంచి వచ్చే వారికి ఈ సదుపాయాన్ని ఆపేశారు. అప్పుడు రాంబాబు భోపాల్‌లోని స్పోర్ట్స్ కాలేజ్ దగ్గర రోడ్డు మీద ప్రాక్టీస్ చేసేవారు.

ఫొటో సోర్స్, @airnewsalerts
సర్కారు సాయం చేసిందా?
ఈ అంశం మీద రాంబాబు స్పందిస్తూ.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించానని, కానీ సాయానికి సంబంధించి హామీ ఏదీ లభించలేదని రాంబాబు చెప్తున్నారు.
యూపీ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ తనకు మంచి ఉద్యోగం కానీ, తాను సాధించిన పతకాలకు ఏదైనా బహుమానం గానీ ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు.
ఇప్పటివరకూ జాతీయ స్థాయిలో నాలుగు పతకాలు గెలిచానని, కానీ తనకు ఎలాంటి ప్రోత్సాహమూ అందలేదని రాంబాబు తెలిపారు.
నేషనల్ రికార్డు బద్దలు కొట్టిన తర్వాత రాంబాబు రాబోయే పోటీలకు సిద్ధమవుతున్నారు. ఒలింపిక్ క్వాలిఫికేషన్ పోటీలు 2023 జనవరి 30 నుంచి మొదలవుతాయి.
2023 అక్టోబర్ 23 నుంచి ఏసియన్ గేమ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ అర్హత సాధించటంతో పాటు ఏసియన్ గేమ్స్‌లో పతకం కొట్టటం తన తర్వాతి లక్ష్యాలని రాంబాబు చెప్పారు.

ఫొటో సోర్స్, SANTOSH SONI
ఊర్లో కుటుంబం ఎలా ఉంది?
రాంబాబు కుటుంబం పరిస్థితిని తెలుసుకోవటానికి స్థానిక జర్నలిస్ట్ సంతోష్ సోని.. సోన్‌భద్ర జిల్లా కేంద్రానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహౌరా భైరవ్ గాంధీ గ్రామానికి వెళ్లారు.
రాంబాబు తండ్రి, తల్లి, చెల్లి గ్రామంలో ఒక కచ్చా ఇంటిలో నివసిస్తున్నారు.
''రాంబాబు రికార్డు సృష్టించాక అందరి నుంచీ మాకు ఫోన్లు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్, మీడియా.. అందరూ ఫోన్లు చేస్తున్నారు. మాకు సంతోషంగా ఉంది. ఊరి జనం కూడా సంతోషంగా ఉన్నారు'' అని రాంబాబు తల్లి మీనాదేవి చెప్పారు.
రాంబాబు తండ్రి ఛోటేలాల్ కూడా తన కొడుకు సాధించిన విజయం పట్ల సంతోషంగా, గర్వంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవటంలోదనే అసంతృప్తి ఆయనలో ఉంది.
''మన దేశం పేరు, మా ఊరి పేరుకు కీర్తి సాధించటం చాలా బాగుంది. కానీ మమ్మల్ని మా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మాకు కనీసం మంచి నీళ్లు కూడా అందటం లేదు. ప్రభుత్వ సదుపాయాలేవీ లేవు. మేం కిలోమీటరు దూరం నుంచి మంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం'' అని ఆయన పేర్కొన్నారు.
తమ కుటుంబానికి తాగునీటి సదుపాయం కల్పించి, నివాస సదుపాయం కల్పిస్తే బాగుంటుందని ఛోటేలాల్ ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, SANTOSH SONI
'మిల్ఖా సింగ్‌లా కావాలని కలలు కనేవాడు'
రాంబాబు తన కుటుంబ సభ్యులను కలిసి ఏడాది అవుతోంది. ఆయన చెల్లెలు సుమన్ ఇంతకుముందు అలహాబాద్ యూనివర్సిటీలో బీఎస్‌సీ చదివేది. ఇప్పుడు ఎన్ఐటీలో బీటెక్‌కు ఎంపికయ్యారు.
అడ్మిషన్ల కౌన్సిలింగ్ కోసం నిరీక్షిస్తున్నారు.
''రాంబాబు చిన్నపుడు మిల్ఖా సింగ్‌లా కావాలని కలలు కనేవాడు. ఇప్పుడు అతడి కల నిజమవుతోంది. ఒలింపిక్స్‌కు వెళ్లాలని మేం ఆశిస్తున్నాం'' అని సుమన్ చెప్పింది.
ప్రభుత్వం నుంచి రాంబాబుకు సాయం అందాలని కూడా ఆమె ఆశిస్తోంది. ''మా తల్లిదండ్రులు ఎంత కాలం పని చేసి శిక్షణ అందివ్వగలరు? మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ఏ చిన్నారి అయినా ఏదైనా చేయాలని అనుకున్నపుడు, వారి ఇంట్లో పరిస్థితి బాగోలేనపుడు.. సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది'' అంటోందామె.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













