మిల్ఖా సింగ్: 'మీరు పరిగెత్తడం లేదు, ఎగిరిపోతున్నారు' అని పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అన్నప్పుడు...

- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచ ప్రఖ్యాత భారత అథ్లెట్ మిల్ఖా సింగ్ శుక్రవారం రాత్రి చండీఘడ్‌లో కన్ను మూశారు. ఆయన కోవిడ్‌తో బాధపడుతూ చండీఘడ్‌లోని పీజీఐఎంఆర్ ఆస్పత్రిలో చేరారు.
91 ఏళ్ల మిల్ఖా సింగ్ కోవిడ్‌ను జయించినప్పటికీ ఇతర అనారోగ్య కారణాల వలన శుక్రవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
1929లో అవిభక్త భారతదేశంలో జన్మించిన మిల్ఖా సింగ్ కథ ఎంతో స్ఫూర్తిదాయకం.
విభజన సమయంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో జరిగిన అల్లర్ల నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. తన కళ్ల ముందే తన కుటుంబ సభ్యులను చంపేసినా స్థైర్యాన్ని కోల్పోలేదు. రైల్లో టికెట్ లేకుండా ప్రయాణించి పట్టుబడ్డారు. జైలు శిక్ష అనుభవించారు.
ఒక గ్లాసు పాల కోసం సైన్యంలో చేరి, పరిగెత్తారు. క్రమంగా భారత అత్యుత్తమ అథ్లెట్‌గా ఎదిగారు.
1960 రోమ్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టినప్పటికీ, మిల్ఖా సింగ్ భారతదేశానికి పతకం సాధించలేకపోయారు. 400 మీటర్ల రేసులో నాల్గవ స్థానంలో నిలిచారు. కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయారు.
మిల్ఖా సింగ్ 400 మీటర్ల రేసును 45.73 సెకన్లలో పూర్తి చేసినప్పటికీ, జర్మన్ అథ్లెట్ కార్ల్ కౌఫ్మన్ కన్నా సెకెండులో వందో వంతు వెనుకబడ్డారు. కానీ, ఈ టైమింగ్ మరో 40 సంవత్సరాల వరకు నేషనల్ రికార్డుగా నిలిచింది.

ఫొటో సోర్స్, AFP
'ఈ పరుగు నిన్ను నిలబెడుతుంది లేదా నాశనం చేస్తుంది'
1958 కార్డిఫ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించడంతో మిల్ఖా సింగ్ తొలిసారిగా ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేశారు. అప్పటి ప్రపంచ రికార్డ్ హోల్డర్ మాల్కం స్పెన్స్‌ను 440 గజాల పరుగుల పోటీలో ఓడించారు.
ఆ ముందు రోజు రాత్రి మిల్ఖా సింగ్ నిద్రపోలేదు. మర్నాడు సాయంత్రం 4.00 గంటలకు 440 గజాల రేసు ఫైనల్ జరగనుంది.
పొద్దున్నే లేచి టబ్‌లో వేడినీళ్లు పోసుకుని స్నానం చేశారు. దాంతో, శరీరానికి విశ్రాంతి లభించింది. అల్పాహారం తీసుకుని, మళ్లీ దుప్పటి కప్పుకుని నిద్రపోయారు. మధ్యాహ్నం మెలకువ వచ్చింది.
భోజనంలో ఒక కప్పు సూప్, రెండు డబల్ రొట్టె ముక్కలు తీసుకున్నారు. సాయంత్రం ఫైనల్ రేసు ఉంది కాబట్టి మితంగా ఆహారం తీసుకున్నారు.
"ఆరోజు తెల్లటి పొడవైన రుమాలుతో నా జుత్తు చుట్టుకున్నాను. నా ఎయిర్ ఇండియా బ్యాగ్‌లో స్పైక్డ్ షూస్, గ్లూకోజ్ ప్యాకెట్, ఒక దువ్వెన, తువ్వాలు పెట్టుకున్నాను. కళ్లు మూసుకుని గురు నానక్‌ను, గురు గోవింద్ సింగ్‌ను, శివుడిని తలుచుకున్నాను.
నా సహచరులందరూ బస్సులో కూర్చున్నారు. నేను కూడా బస్సెక్కి నా సీటులో కుర్చున్నాక, 'మిల్ఖా సింగ్ ఈ రోజు రంగు వెలిసి కనిపిస్తున్నాడు' అంటూ నా సహచరులు ఆట పట్టించారు. 'ఏమైంది? ఈరోజు మీ మొహంలో సంతోషం కనిపించడం లేదు' అని ఒకరు అడిగారు. నేనేమీ జవాబు చెప్పలేదు కానీ నా మనసెందుకో కొంచం తేలిక పడింది.
నేను టెన్షన్‌గా ఉండడం చూసి నా కోచ్ డాక్టర్ హోవార్డ్ నా పక్క వచ్చి కూర్చుని ధైర్యం చెప్పారు. 'ఈరోజు నీ పరుగు నిన్ను నిలబెడుతుంది లేదా నాశనం చేస్తుంది. నేను చెప్పిన చిట్కాలు పాటిస్తే మాల్కం స్పెన్స్‌ను మీరు ఓడించగలుగుతారు. ఆ సామర్థ్యం మీలో ఉంది' అని అన్నారు" అంటూ మిల్ఖా సింగ్ ఆ రోజును గుర్తు చేసుకుంటూ చెప్పారు.
ఆ మాటలు మిల్ఖా సింగ్‌కు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. స్టేడియం చేరుకున్న తరువాత ఆయన నేరుగా డ్రెస్సింగ్ రూముకు వెళ్లి, పడుకున్నారు. కొంచం జ్వరం వచ్చినట్లుగా అనిపించింది.
అప్పుడే డాక్టర్ హోవార్డ్ మళ్లీ వచ్చి పక్కన కూర్చున్నారు. వీపుకు, కాళ్లకు మసాజ్ చేశారు.
"బాబూ, నువ్వు తయారవ్వు. మరో గంటలో రేసు మొదలవబోతోంది" అని చెప్పారు.
గత కొద్ది రోజులుగా హోవార్డ్, మిల్ఖా సింగ్ ప్రత్యర్థుల మెళకువలను పరిశీలిస్తూ ఉన్నారు.
"స్పెన్స్ పరుగును నేను గమనించాను. 400 మీటర్ల రేసులో ఆయన ముందు 300 మీటర్లు మెల్లిగా పరిగెడతారు. చివరి 100 గజాల్లో అందరినీ మెడ్డించి ముందుకు వెళిపోతారు. నువ్వు 400 మీటర్లు పరిగెత్తక్కర్లేదు. 350 మీటర్లు పరిగెడితే చాలు. రేసు 350 మీటర్లు మాత్రమే అనుకో" అంటూ ముందు రోజు రాత్రి హోవార్డ్ మిల్ఖాకు సలహా ఇచ్చారు.
"440 గజాల రేసు ఫైనల్ కాల్ మధ్యాహ్నం 3.50 నిముషాలకు వచ్చింది. ఆరుగురు అథెట్లు ప్రారంభ రేఖ దగ్గరకు వెళ్లి నిలబడ్డాం. తువ్వాలుతో నా కాళ్లకు ఉన్న చెమట తుడుచుకున్నాను. నా షూ లేసులు గట్టిగా కట్టుకుంటుండగా రెండో కాల్ వచ్చింది. నేను ట్రాక్ సూట్ విప్పేశా. నా నడుంపై భారత్ అని రాసి ఉంది. దాని కింద అశోక చక్రం ఉంది. దీర్ఘంగా శ్వాస తీసుకున్నా. రేసులో ఉన్నవాళ్లందరినీ విష్ చేశాను."
ఇంగ్లడ్ అథ్లెట్ సాల్స్బరీ మొదటి లైనులో, తరువాత వరుసగా దక్షిణాఫ్రికాకు చెందిన స్పెన్స్, ఆస్ట్రేలియా అథ్లెట్ కేర్, జమైకా అథ్లెట్ గాస్పర్, కెనడాకు చెందిన టొబాకో, ఆరోలైనులో భారత అథ్లెట్ మిల్ఖా సింగ్ నిలబడి ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం అర అడుగు అడుగు మాత్రమే తేడా
స్టార్ చెప్పగానే మిల్ఖా సింగ్ తన ఎడమ కాలిని వెనక్కు పెట్టి, కుడి కాలును ముందుకు తీసుకొచ్చి, రెండు చేతులతో నేలను తాకారు.
తుపాకీ శబ్దం వినిపించగానే మిల్ఖా వేగంగా పరిగెత్తారు. హోవార్డ్ సలహాను గుర్తు చేసుకున్నారు. మొదటి 300 మీటర్లలోనే తన మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగించారు.
మిల్ఖా మెరుపు వేగంగా ముందుకు సాగిపోతున్నారు. మిల్ఖాను ఓడించడానికి స్పెన్స్ పరుగు వేగం పెంచారు. కానీ అదృష్టం మిల్ఖా సింగ్ వెంటే ఉంది.
"రేసు ముగియడానికి 50 గజాల దూరం ఉన్నప్పుడే నేను వైట్ టేపు చూశా. స్పెన్స్ కన్నా ముందు అక్కడికి చేరుకోవడానికి నా సర్వశక్తులూ ఒడ్డి పరిగెత్తాను. నేను టేపును అందుకునేసరికి స్పెన్స్ నా కన్నా అర అడుగు మాత్రమే వెనుకబడి ఉన్నారు. అక్కడ అందరూ గొంతు చించుకుని అరవడం మొదలుపెట్టారు.. 'కమాన్ సింగ్, కమాన్ సింగ్' అంటూ అరుపులు వినిపించాయి. టేపు తాకుతూనే నాకు స్పృహ తప్పిపోయింది. అక్కడే మూర్ఛపోయాను."
వెంటనే స్ట్రెచర్‌పై మిల్ఖా సింగ్‌ను తీసుకెళ్లి ఆక్సిజన్ అందించారు. తెలివి వచ్చిన తరువాత తన విజయాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. సహచరులు ఆయనను భుజాలపై ఎత్తుకుని తిప్పారు. త్రివర్ణ పతాకాన్ని తన ఒంటికి చుట్టుకుని స్టేడియం మొత్తం పరిగెత్తారు.
కామన్వెల్త్ క్రీడల్లో ఒక భారతీయుడు బంగారు పతకం సాధించడం ఇదే మొదటిసారి.
విజయలక్ష్మి పండిట్ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకున్నారు
ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్, మిల్ఖా సింగ్ మెడలో స్వర్ణ పతకం వేస్తుండగా భారత జెండా పైకి ఎగిరింది. అది చూసి మిల్ఖా సింగ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
వీఐపీ ఆవరణ నుంచి చిన్న జుత్తుతో, చీర కట్టుకుని ఒక మహిళ తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూశారు. భారత టీం చీఫ్ అశ్వని కుమార్ ఆమెను పరిచయం చేశారు. ఆమె బ్రిటన్‌లో భారత హైకమిషనర్ విజయలక్ష్మి పండిట్.
"ఆమె నన్ను కౌగలించుకుని అభినందించారు. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన తరువాత ఏం బహుమతి ఇవ్వమంటారు? అని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మిమ్మల్ని అడగమన్నారని చెప్పారు. ఏం అడగాలో నాకు తెలియలేదు. ఈ ఆనందంలో భారతదేశం మొత్తానికి సెలవు ప్రకటించమని నా నోట్లో నుంచి వచ్చింది. నేను మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఒక రోజు దేశమంతా సెలవు ప్రకటించారు." అని మిల్ఖా సింగ్ చెప్పారు.

ఫ్లయింగ్ సిక్కు అనే పేరు ఎలా వచ్చిందంటే?
1960లో భారత, పాకిస్తాన్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనేందుకు మిల్ఖా సింగ్‌కు పాకిస్తాన్ నుంచి ఆహ్వానం వచ్చింది.
టోక్యో ఆసియా క్రీడల్లో అక్కడి అత్యుత్తమ రన్నర్ అబ్దుల్ ఖాలిక్‌ను 200 మీటర్ల రేసులో ఫోటో ఫినిష్‌లో ఓడించాడు.
ఇప్పుడు వారిద్దరూ తమ దేశంలో తలపడాలని పాకిస్తానీయులు కోరుకున్నారు.
అయితే, మిల్ఖా సింగ్ పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించారు. విభజన సమయం తాలూక చేదు జ్ఞాపకాలు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. తన కళ్ల ముందే తన తండ్రిని హత్య చేసిన సంగతి ఆయన ఎప్పటికీ మరచిపోలేకపోయారు.
కానీ, నెహ్రూ ఆదేశాల మేరకు మిల్ఖా సింగ్ పాకిస్తాన్ వెళ్లారు. లాహోర్ స్టేడియంలో తుపాకీ శబ్దం వినిపించగానే మిల్ఖా సింగ్ పరిత్తడం ప్రారంభించారు.
ప్రేక్షకులు అరవడం మొదలుపెట్టారు.. 'పాకిస్తాన్ జిందాబాద్, అబ్దుల్ ఖాలిక్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. ఖాలిక్, మిల్ఖా కన్నా ముందున్నారు. కానీ 100 మీటర్లు పూర్తయే లోపే మిల్ఖా ఆయనను దాటేశారు.
మిల్ఖా టేపును తాకే సమయానికి ఖాలిక్ పదిగజాల దూరంలో ఉన్నారు. 20.7 సెకన్లలో రేసు గెలిచారు. ఇది అప్పటి ప్రపంచ రికార్డుకు సమానం.
రేసు పూర్తయ్యాక ఖాలిక్ అక్కడే నేల మీద కూర్చుండిపోయి ఏడుపు ప్రారంభించారు.
మిల్ఖా ఆయన దగ్గరకు వెళ్లి భుజం తట్టి "గెలుపోటములు ఆటలో భాగం. వాటిని మనసుకు ఎక్కించుకోకూడదు" అని చెప్పారు.
రేసు తరువాత మిల్ఖా విక్టరీ ల్యాప్ చేశారు.
మిల్ఖా సింగుకు స్వర్ణ పతకం అందిస్తూ "మీరు ఈరోజు పరిగెత్తలేదు, ఎగిరిపోయారు. మీకు ఫ్లయింగ్ సిక్కు అనే బిరుదు ఇస్తున్నాను" అంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఫీల్డ్-మార్షల్ అయూబ్ ఖాన్ ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- దేశ విభజన: "ఆ ముస్లింలు ఇక్కడే ఉండిపోవడం దేశానికి మేలు చేసినట్టేం కాదు" - బీబీసీతో యోగి ఆదిత్యనాథ్
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- ఇరాన్ ఎన్నికలు: హసన్ రౌహానీ తరువాత అధ్యక్ష పదవిని చేపట్టేదెవరు?
- ఏపీ: నూతన విద్యా విధానంతో వచ్చే మార్పులేంటి.. ఉపాధ్యాయ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు ఎందుకు పంపారు
- క్రీడారంగంలో తమిళనాడు, మహారాష్ట్రల నుంచి నేర్చుకోవాల్సిందేమిటి?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సీన్ తీసుకున్నారా... ప్రశ్నించిన బీజేపీ, స్పందించిన కాంగ్రెస్
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఈశా సింగ్ - తెలంగాణ షూటర్: ‘తుపాకీ పేలుతున్న శబ్దం నా చెవులకు సంగీతంలా వినిపిస్తుంది’ - BBC ISWOTY
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








