భావన జాట్: అంతర్జాతీయ పోటీల అనుభవం లేకుండానే ఒలింపిక్స్‌కు...

భావన జాట్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

రాజస్థాన్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన భావన జాట్... ఆర్థిక ఇబ్బందులు, వసతుల లేమి, ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలను దాటుకుని ఇప్పుడు క్రీడల్లో స్ఫూర్తినిచ్చే స్థాయికి చేరారు.

2021 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె రేస్ వాకింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

క్రీడల్లో ఆమె ప్రయాణం వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది.

ఓసారి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనేందుకు భావన వెళ్లారు. అక్కడ రేస్ వాకింగ్ పోటీలో పాల్గొనే అవకాశం మాత్రమే దొరికింది.

దీంతో ఆమె అందులో పాల్గొన్నారు. అనుకోకుండా అప్పటికప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం... ఆమెను ఇప్పుడు ఒలింపిక్స్ వరకూ తీసుకువెళ్తోంది.

చిన్నప్పటి నుంచి భావనకు పట్టుదల ఎక్కువ. క్రీడల్లో ఏదో సాధించలన్న సంకల్పం ఆమెలో అప్పటి నుంచే ఉంది. అయితే, అందులో దేన్ని ఎంచుకోవాలి? ఎలా రాణించాలి? అనే విషయాలపై ఆమెకు స్పష్టత లేదు.

2009లో భావన జాతీయ స్థాయి స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ప్రయత్నించాలని అనుకున్నారు. అయితే, రాష్ట్ర జట్టుకు ఎంపికవ్వాలంటే, అంతకన్నా ముందు ఆమె జిల్లా స్థాయి పోటీల్లో గెలవాల్సి ఉంటుంది.

భావనను ఆమె టీచర్ జిల్లా స్థాయిలో జరుగుతున్న ట్రయల్స్‌కు తీసుకువెళ్లారు. అక్కడ రేస్ వాకింగ్ పోటీలో స్థానం మాత్రమే ఖాళీగా ఉంది.

కొద్దిసేపు ఆలోచించిన తర్వాత భావన రేస్ వాకింగ్ ప్రయత్నించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ మంచి ప్రదర్శన చేసి ఎంపికయ్యారు.

భావనది పేద కుటుంబం. తండ్రి పేరు శంకర్ లాల్ జాట్. ఆయన రైతు. తల్లి నోసార్ దేవి గృహిణి. రాజస్థాన్‌లోని కబ్రాలో తమకున్న రెండు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ వారు బతుకీడుస్తున్నారు.

భావనకు శిక్షణ ఇప్పించడం ఆ కుటుంబానికి తలకు మించిన పనే. పైగా స్థానికంగా వసతులేవీ అందుబాటులో లేకపోవడంతో ఆమెకు మరిన్ని సవాళ్లు ఎదురయ్యాయి.

కానీ, భావన వెనక్కితగ్గలేదు. ఊర్లో షార్ట్స్ వేసుకుని, రేస్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే... అందరూ ఆమెను విచిత్రంగా చూసేవారు. అందుకే, జనం ఎక్కువగా ఉండరని వేకువజామునే లేచి ఆమె ప్రాక్టీస్‌ చేసేవారు.

సమాజం నుంచి ఒత్తిడి ఎదురైనా, కుటుంబం తనకు అండగా నిలిచిందని భావన చెప్పారు. తన కెరీర్ కోసం తన అన్న కాలేజీ మానేసి, ఉద్యోగం చేశారని వివరించారు.

భావన జాట్

భావన కష్టాలకు తగ్గట్లు ఫలితాలు రావడం మొదలైంది. స్థానిక, జిల్లా స్థాయి పోటీల్లో విజయాలు నమోదు చేసిన ఆమె... ఇండియన్ రైల్వేస్‌లో చేరారు.

2019లో ఆల్ ఇండియా రైల్వేస్ పోటీల్లో 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్‌లో భావన స్వర్ణం గెలిచారు. గంటా 36 నిమిషాల 17 సెకన్ల టైమింగ్‌తో ఆమె రేసు పూర్తి చేశారు.

ఈ విజయం ఒలింపిక్స్ కోసం సన్నద్ధమయ్యేందుకు తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె చెప్పారు.

2020లో రాంచీలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో గంటా 29 నిమిషాల 54 సెకన్ల టైమింగ్‌తో జాతీయ రికార్డు నమోదు చేశారు. ఈ ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించారు.

అంతర్జాతీయ స్థాయిలో ఉన్న దిగ్గజ అథ్లెట్లతో పోటీపడేందుకు భారత్‌లోని మహిళా అథ్లెట్లకు మరిన్ని అవకాశాలు రావాలని భావన అంటున్నారు. అప్పుడే, భారత అథ్లెట్ల సాంకేతికత, సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని ఆమె అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనకుండానే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం భావన నైపుణ్యానికి అద్దం పడుతోంది.

ఒలింపిక్స్‌లో పోటీపడటం ఆమెకు పూర్తిగా ఒక కొత్త సవాలే. కానీ, తన పాత రికార్డులను బద్దలుకొట్టి, దేశానికి పతకం తేవాలని ఆశిస్తున్నానని ఆమె అన్నారు.

(భావన జాట్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)