పారుల్ పర్మార్: ప్రపంచ పారా బాడ్మింటన్‌లో ప్రపంచంలో నంబర్ వన్ BBC ISWOTY

पारुल परमार

మిగతా రంగాలతో పోల్చి చూసినపుడు క్రీడాకారులకు వారు ఏ క్రీడలో ఎంత అత్యుత్తమ ప్రతిభ కనబరిచినా వారు ఆయా క్రీడల్లో ప్రముఖులుగా ఉండే కాలం చాలా తక్కువగా ఉంటుంది. నలబై ఏళ్లు వచ్చినా తాము ఆడే క్రీడల్లో క్రియాశీలంగా కొనసాగుతున్న క్రీడాకారులు చాలా అరుదు. అలాంటి వారు ఓ గుప్పెడు మందే ఉంటారు.

అలా చూసినపుడు పారుల్ దాల్సుక్‌భాయ్ పర్మార్‌ను సూపర్‌వుమన్‌గా భావించవచ్చు. ఆమె వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు. పారా బాడ్మింటన్‌లో డబ్ల్యూఎస్ ఎస్ఎల్3 కేటగిరీలో ఆమె ఇప్పటికీ ప్రపంచ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు.

ఆమె అగ్రస్థానం ఎంత విశిష్టమైనదంటే.. ప్రపంచ నంబర్ టూ స్థానంలో ఉన్న క్రీడాకారిణి మానసి గిరీశ్‌చంద్ర జోషి కన్నా దాదాపు 1,000 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు పారుల్.

పారుల్ ప్రస్తుతం 3,210 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉంటే.. మానసి 2,370 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

బాడ్మింటన్ కోర్టులో పారుల్ ప్రతిభ.. ఆమెకు 2009లోనే ప్రతిష్టాత్మక అర్జున అవార్డును ఆర్జించిపెట్టింది. అప్పటి నుంచీ తన అద్భుత కెరీర్‌లో మరిన్ని అవార్డులు అందుకుంటూనే ఉన్నారామె.

पारुल परमार

సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటూ...

పారుల్ స్వస్థలం గుజరాత్‌లోని గాంధీనగర్. ఆమెకు చాలా చిన్న వయసులోనే పోలియో సోకింది.

ఆపైన మూడేళ్ల వయసులో ఊయల మీద నుంచి పడిపోవటంతో ఆమె జీవితం మరింతగా కష్టాల్లో పడింది. ఆమె మెడ ఎముక (కాలర్ బోన్)కు తీవ్ర గాయమైంది. కుడి కాలు విరిగింది.

ఆమె కోలుకోవటానికి సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. పారుల్ తండ్రి బాడ్మింటన్ క్రీడాకారుడు. ప్రతి రోజూ స్థానిక జిమ్‌ఖానాకు వెళ్లి ఆడేవారు.

పారుల్‌కి శారీరక వ్యాయామం అవసరమని, ఏదైనా శారీరక కార్యక్రమం చేయించాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఆమెను తండ్రి తన వెంట జిమ్‌ఖానాకు తీసుకెళ్లటం మొదలుపెట్టారు.

ఆమె మొదట తన తండ్రి ఆడుతుంటూ చూసేవారు. అనంతరం ఆమె తన చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆడటం మొదలుపెట్టారు. తొలుత ఇతరులు అడుతుంటే చూసే పారుల్ నెమ్మదిగా తాను కూడా ఆడటం ప్రారంభించారు.

అలా బ్యాడ్మింటన్ మీద ఆమెలో ప్రేమ చిగురించింది. స్థానిక కోచ్ సురేంద్ర పారిఖ్.. బాడ్మింటన్‌లో ఆమె నైపుణ్యాలను గమనించారు. ఆమె ఆ ఆట ఆడేలా, మరింతగా ప్రాక్టీస్ చేసేలా ఆయన ప్రోత్సహించారు.

బలమైన మద్దతు...

తనను విజయపథంలో నడిపించటానికి తన తల్లిదండ్రులు, తోబుట్టువులు చాలా త్యాగాలు చేశారని చెప్తారు పారుల్.

ఆమె బ్యాడ్మింటన్ రాకెట్ విరిగిపోతే ఆమె తోబుట్టువులు తమ అవసరాలను పక్కనపెట్టి సంతోషంగా కొత్త రాకెట్ కొనివ్వటానికి ప్రాధాన్యమిచ్చేవారు.

పారుల్ బాడ్మింటన్‌లో ముందుకు సాగటానికి ఆమెకు అవసరమైనవన్నీ అందించటమే తమ లక్ష్యంగా ఆమె కుటుంబం భావించేది.

తన క్రీడా ప్రయాణంలో తనకు అంగవైకల్యం ఉందనే భావన కానీ, ఏదో లోపం ఉందనే భావన కానీ ఎవరూ తనకు కలగనివ్వలేదని పారుల్ చెప్పారు.

पारुल परमार

ఒకసారి ఆమె స్కూలులో ‘నువ్వు ఏం కావాలనుకుంటున్నావు?’ అని ఆమె టీచర్ పారుల్‌ని అడిగారు. దానికి ఆమె దగ్గర సమాధానం లేదు. ఆమె అదే ప్రశ్నని ఆమె తండ్రికి వేశారు. ఆయన ఏమాత్రం సందేహించకుండా ‘నువ్వు మంచి బాడ్మింటన్ ప్లేయర్‌వి అవుతావు’ అని బదులిచ్చాడు.

చివరికి పారుల్ తన తండ్రి అంచనాలను, తన అంచనాలను కూడా అధిగమిస్తూ రాణించారు.

ప్రొఫెషనల్ స్థాయి పారా బాడ్మింటన్ ఉంటుందని తొలుత తెలియని పారుల్.. తనకు బలమైన మద్దతు ఉందని చెప్తారు.

వివిధ టోర్నమెంటుల్లో పాల్గొనటం కోసం ప్రయాణాలు చేయాల్సి వచ్చినపుడు.. కేవలం ఆమె కుటుంబం మాత్రమే కాదు.. సహ క్రీడాకారులు, ఇంకా చాలా మంది ఇతరులు కూడా ఆర్థికంగా సాయం చేయటానికి ముందుకు వచ్చేవారు.

తన లాగా వైకల్యాలు ఉన్న ఇతర క్రీడాకారులు చాలా మందికి వారి కుటుంబాల నుంచి, సమాజం నుంచి ఈ తరహా మద్దతు లభించదని ఆమె చెప్తున్నారు.

విజయాల పరంపర...

పారుల్ 2007లో సింగిల్స్, డబుల్స్ రెండు పారా వరల్డ్ టైటిల్స్ గెలిచారు. ఆ తర్వాత 2015లో, మళ్లీ 2017లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లు కూడా గెలుచుకున్నారు.

2014, 2018 ఏషియన్ పారా గేమ్స్ లో పారుల్ స్వర్ణ పతకాలు సాధించారు. ఇన్నేళ్లుగా ఈ కేటగిరీలో నేషనల్ చాంపియన్‌గా కొనసాగారు.

ఇప్పుడు టోక్యో పారా ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించటానికి పారుల్ సంసిద్ధమవుతున్నారు.

2009లో నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి అర్జున అవార్డు స్వీకరించటం తన క్రీడా జీవితంలో అత్యుత్తమ క్షణమని ఆమె చెప్తారు.

తాను ఏదో ఒక రోజు ఆ స్థాయిని చేరుతానని తన జీవితం తొలి నాళ్లలో ఎన్నడూ ఊహించలేదంటారు.

(బీబీసీ పంపిన ఈమెయిల్ ప్రశ్నావళికి పారుల్ పార్మార్ ఇచ్చిన సమాధానాలు ఈ కథనానికి ఆధారం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)