BBC ISWOTY: టోక్యో ఒలింపిక్స్‌లో సింధు, మేరీ కోమ్‌లపై భారత్ ఆశలు - పీటీ ఉష

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పీవీ సింధు, మేరీ కోమ్ పతకాలు తెచ్చిపెట్టే అవకాశముందని భారత స్పోర్ట్స్ దిగ్గజం పీటీ ఉష అన్నారు.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్-2020 అవార్డుకు నామినీలను ప్రకటించిన బీబీసీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆమె మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ విజయ అవకాశాల గురించి ఆమె వివరించారు.
''పీవీ సింధు, మేరీ కోమ్.. భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి ఒలింపిక్స్‌లో సింధు ఓ పతకం గెలిచింది. ఈ సారీ స్వర్ణం తీసుకుని వస్తుందని అనుకుంటున్నాను. మేరీ కోమ్ కూడా మంచి ప్రదర్శనలు ఇస్తూ వస్తోంది. ఆమె కూడా ఈ సారి పతకం తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు'' అని ఉష అన్నారు.
దిల్లీలో సోమవారం నిర్వహించిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ రెండో ఎడిషన్‌కు నామినీలను ప్రకటించారు. దేశంలోని మహిళా క్రీడాకారుల విజయగాథలను అందరికీ సుపరిచితం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్-2020 కోసం ఐదుగురు క్రీడాకారిణులు నామినేట్ అయ్యారు. వీరిలో షూటర్ మను భాకర్, స్ప్రింటర్ ద్యుతీ చంద్, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, రెజ్లర్ వినేశ్ ఫోగట్, హాకీ కెప్టెన్ రాణి ఉన్నారు.
ప్రెస్ కాన్ఫరెన్స్‌కు భారత స్పోర్ట్స్ దిగ్గజం పీటీ ఉష, పారాబ్యాడ్మింటన్ ఛాంపియన్ మానసి జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులో భాగంగా అసమాన ప్రతిభ కనబరుస్తున్న భారత మహిళా క్రీడాకారులను బీబీసీ సత్కరిస్తుంది. వారి విజయ గాథలను అందరికీ పరిచయం చేస్తుంది. అన్ని రకాల క్రీడల్లోనూ అమ్మాయిల ప్రాతినిధ్యం పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
ఈ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు దేశంలోని భిన్న భాషలకు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్టులు హాజరయ్యారు. డిజిటల్ మాధ్యమంలో భారత మహిళా క్రీడాకారుల ప్రాతినిధ్యంపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మానసి జోషి స్పందించారు.
''సాధారణంగా ఇంటర్నెట్‌లో మహిళా క్రీడాకారిణుల గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంటుంది. అందులో భారత్‌కు చెందిన మహిళా క్రీడాకారిణుల సమాచారం మరింత తక్కువ ఉంటుంది. మన మహిళా అథ్లెట్లు, వారు చేస్తున్న కృషి, వారి విజయ గాథల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం ద్వారా ఈ అంతరాన్ని పూరించొచ్చు''అని ఆమె అన్నారు.
''బీబీసీ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలతో స్పోర్ట్స్‌లో మహిళలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. దీంతో నేను ఆడే పారా బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం వారిలో పెరుగుతుంది'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పోర్ట్స్‌లో ఎలాంటి మార్పులు వస్తున్నాయనే అంశంపై పీటీ ఉష మాట్లాడారు.
''నేను స్పోర్ట్స్‌లో క్రియాశీలంగా భాగమైనప్పుడు, అన్ని సదుపాయాలు ఉండేవి కాదు. విదేశీ పోటీల్లో పాల్గొన్న అనుభవం లేకపోవడంతో నా పతకం తృటిలో చేజారింది. ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. మన అథ్లెట్లకు కోచింగ్ ఇచ్చేందుకు విదేశీ కోచ్‌లు కూడా వస్తున్నారు. ఇప్పుడు సదుపాయాలు కూడా మెరుగయ్యాయి. అయితే, ఇవి ఇంకా మెరుగు పడాల్సిన అవసరముంది. ప్రతి చిన్న స్కూల్‌లోనూ పిల్లల కోసం రన్నింగ్ ట్రాక్ లేదా స్పోర్ట్స్ కోర్ట్ ఉండాలని నేను భావిస్తాను'' అని ఉష చెప్పారు.
క్రీడల్లో మహిళలకు ''ఎక్స్‌పైరీ డేట్'' లాంటిదేమైనా ఉంటుందా? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఉష స్పందించారు. ''పెళ్లితో అమ్మాయిల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. వ్యక్తిగత జీవితాన్ని, స్పోర్ట్స్‌ను అమ్మాయిలు సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది''అని చెబుతూ జర్నలిస్టు ఆ ప్రశ్నను అడిగారు.
''మహిళలకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని నేనైతే అనుకోను. 1976-77లో నా కెరియర్‌ను మొదలుపెట్టాను. 1990ల వరకు స్పోర్ట్స్‌లో క్రియాశీలంగా పాల్గొన్నారు. 102 అంతర్జాతీయ పతకాలు సాధించాను. దీని తర్వాత సొంతంగా స్పోర్ట్స్ స్కూల్‌ను మొదలుపెట్టాను. దాని నుంచి ఏడుగురు అంతర్జాతీయ అథ్లెట్లు వచ్చారు. వీరు 76 అంతర్జాతీయ పతకాలను భారత్‌కు తీసుకొచ్చారు. నా విద్యార్థుల్లో ఇద్దరు ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నారు. 1980లో నాకు వివాహమైంది. నా భర్త, నా కొడుకు, మా అమ్మ నాతోనే ఎప్పుడూ ఉంటారు. నేను కుటుంబాన్ని, కెరియర్‌ను సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. పెళ్లి అయిన తర్వాత కెరియర్‌లో ముందుకు వెళ్లాలంటే కుటుంబ మద్దతు చాలా అవసరమని నేను భావిస్తాను'' అని ఆమె చెప్పారు.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేతల కోసం బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లలో ఓటింగ్ జరుగుతుంది. దీనిలో వచ్చే ఓటింగ్ ఆధారంగానే విజేతలను ప్రకటిస్తారు. మరోవైపు ఓ వర్ధమాన క్రీడాకారిణికి ''ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు''ను ఇస్తారు. భారత స్పోర్ట్స్‌లో విశేష కృషి చేసిన క్రీడాకారిణికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా ఇస్తారు. ఫిబ్రవరి 24, సాయంత్రం 6 గంటల వరకు ఈ ఓటింగ్ కొనసాగుతుంది. మార్చి 8న దిల్లీలో నిర్వహించే వర్చువల్ కార్యక్రమంలో టైటిల్ విజేతను ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి:
- చెస్ ఒలంపియాడ్: ఫైనల్ రౌండ్ ఆడుతుండగా ఇంటర్నెట్ సమస్య.. సంయుక్త చాంపియన్లుగా భారత్, రష్యా
- BBC Telugu Exclusive Interview: ఫైనల్ ఫోబియాపై పీవీ సింధు ఏమన్నారు?
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- సైనా-సింధు: ఒకరు విప్లవం తెచ్చారు.. మరొకరు ముందుకు తీసుకెళ్తున్నారు
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
- BBC EXCLUSIVE: సైనా నెహ్వాల్ ఇంటర్వ్యూ.. ‘సింధు టాప్ ప్లేయరే, కానీ ఈరోజు నాది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









