ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎందుకు చేర్చారు... ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాన్హవీ మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎట్టకేలకు ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునరాగమనం చేయబోతోంది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే ప్రతిపాదనకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఇటీవల ఆమోదం తెలిపింది.
ఐఓసీలో ఈ ప్రతిపాదనపై ఓటింగ్ జరిగినప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లోకి రానుంది క్రికెట్.
అయితే, టోర్నీ కచ్చితమైన ఫార్మాట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. చివరగా 1900లో జరిగిన ఫ్రాన్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడారు.
అయితే, ఇప్పుడే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దానికి దారితీసిన పరిణామాలేంటి? ఐఓసీ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోతోంది?
ప్రపంచంలోని ఐదు ఖండాల్లో క్రికెట్ ఆడుతున్నా, చాలా కాలంగా ఒలింపిక్స్‌కు ఈ ఆట దూరంగానే ఉంది.
దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
రకరకాల ఫార్మాట్(టెస్ట్‌లు, వన్డేలు)లు, పరిమిత దేశాలలో మాత్రమే దాని ప్రజాదరణ, బీసీసీఐ వంటి శక్తిమంతమైన క్రికెట్ బోర్డుల విముఖత.
అయితే, క్రికెట్ ట్వంటీ-20 ఫార్మాట్ వచ్చాక, ఆట ముఖచిత్రం మారిపోయింది. ఆ తర్వాత ఐసీసీ కూడా ఒలింపిక్స్‌లోకి క్రికెట్ చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆటను వీలైనన్ని ఎక్కువ దేశాలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంది.
బీసీసీఐ షరతు ఇదే...
ఐసీసీ సభ్య దేశాల్లో కొన్ని మాత్రమే టెస్టు క్రికెట్ ఆడుతున్నాయి. కా,నీ టీ20 వచ్చాక చాలా మారిపోయింది. 2017-18లో ఐసీసీ టీ20 కోసం 104 దేశాలకు సభ్యత్వం ఇచ్చింది.
ఈ చర్య ఒలింపిక్‌లోకి క్రికెట్ ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది.
మొదట్లో బిజీ షెడ్యూల్, ఆర్థిక విషయాలూ బేరీజు వేసుకొని ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలోని క్రికెట్ బోర్డులు ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఆ తర్వాత ఈ దేశాల అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. భారత ఒలింపిక్ సంఘం జోక్యం ఉండకూడదనే షరతుపై టీమిండియాను ఒలింపిక్స్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నామని 2021 బీసీసీఐ ప్రకటన చేసింది.
ఇదే క్రమంలో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ , దక్షిణాసియా , పసిఫిక్ గేమ్స్‌లలో క్రికెట్‌ను చేర్చినప్పుడు మంచి స్పందన వచ్చింది.
ఇది కూడా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే ప్రయత్నాలకు బలం చేకూర్చింది.

ఫొటో సోర్స్, IOC/GREG MARTIN
2028 ఒలింపిక్స్‌లోనే ఎందుకు?
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని ప్రతిపాదిస్తూ దాని వెనుక గల కారణాలను లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నిర్వాహకులు వివరించారు.
వారి అనాలసిస్ ప్రకారం, ట్వంటీ 20 క్రికెట్ ఫార్మాట్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది, ఈ క్రీడకు యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 250 కోట్ల మంది ఈ ఆటను వీక్షించారు.
'డిజిటల్ ప్రపంచంలో క్రికెట్‌కు ఆదరణ భారీగా పెరిగింది, దీనికి విరాట్ కోహ్లీనే ఓ ఉదాహరణ' అని 2028 ఒలింపిక్-పారాలింపిక్ క్రీడల స్పోర్ట్స్ డైరెక్టర్ నికోలో కాంప్రియాని అంటున్నారు.
“ప్రస్తుతం సోషల్ మీడియాలో మూడో అత్యంత ప్రజాదరణ పొందిన అథ్లెట్ కోహ్లీ. ఆయనకు దాదాపు 34 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ముగ్గురు అమెరికన్ సూపర్ స్టార్లైనా లెబ్రాన్ జేమ్స్, టైగర్ వుడ్స్, టామ్ బ్రాడీ సోషల్ మీడియా ఫాలోవర్ల కంటే ఇది అధికం" అని నికోలో అన్నారు.
అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా లాస్ ఏంజెల్స్‌లో క్రికెట్‌ను చేర్చేలా చేశాయి.
గత కొన్నేళ్లుగా అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. టీమిండియా అక్కడ ట్వంటీ 20 మ్యాచ్‌లు కూడా ఆడింది.
2023 జులైలో మేజర్ క్రికెట్ లీగ్ ట్వంటీ20ని అమెరికాలో నిర్వహించారు. భారత ఐపీఎల్ జట్ల యజమానులు, సత్య నాదెళ్ల వంటి ప్రముఖులు ఈ టోర్నమెంట్‌లో పెట్టుబడి పెట్టారు.
అంతేకాదు, వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ట్వంటీ 20 ప్రపంచ కప్-2024కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒలింపిక్స్ కోసం ఐసీసీ పట్టు
అయితే, ఐసీసీ భాగస్వామ్యం లేకుండా ఇదంతా అసాధ్యం. ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చడానికి గత రెండేళ్లలో ఐసీసీ అనేక చర్యలు చేపట్టింది.
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నిర్వాహకులతో కలిసి ఐసీసీ పనిచేసింది. ఐఓసీ తాజా నిర్ణయంపై ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించేందుకు, కొత్త తరాలకు 'క్రికెట్ తలుపులు' తెరిచేందుకు ఇది దోహదపడుతుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తంచేసింది.
“ఈ అద్భుతమైన ప్రయాణం మమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతుందో చూడాలని మేం కూడా ఎదురుచూస్తున్నాం" అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు కూడా హర్షం వ్యక్తం చేశారు.
“ఇపుడు ఒలింపిక్ బంగారు పతకం కోసం ఆడే అవకాశం ఆటగాళ్లకు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొంత మంది క్రీడా ప్రేమికులు ఈ గొప్ప ఆటను ఆస్వాదించనున్నారు'' అని భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒలింపిక్స్‌లో క్రికెట్ చరిత్ర
వాస్తవానికి 1896లో ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడించాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు.
1900లో జరిగిన ఫ్రాన్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చారు. పోటీలోకి నెదర్లాండ్స్, బెల్జియం, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ జట్లు వచ్చాయి.
చివరి నిమిషంలో నెదర్లాండ్స్, బెల్జియం జట్లు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. దీంతో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఒక మ్యాచ్ మాత్రమే నిర్వహించారు.
బ్రిటన్ బంగారు పతకాన్ని గెలుచుకోగా, ఫ్రాన్స్ రజత పతకం సాధించింది.
ఫ్రాన్స్ ఒలింపిక్స్‌లో బ్రిటన్ తరఫున ఆడిన జట్టు, నిజానికి ఆ దేశపు జాతీయ జట్టు కాదు, ఒక క్లబ్ జట్టు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒలింపిక్స్‌లో ఆడుతున్న విషయం ఇరు జట్లకూ తెలియదు. వరల్డ్ ఫెయిర్‌లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు ఇరు జట్లు భావించాయి.
పన్నెండేళ్ల తర్వాత ఒలింపిక్స్ అధికారిక రికార్డుల్లో ఈ మ్యాచ్ చేర్చారు. 1904 ఒలింపిక్స్ అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగాయి, అయితే క్రికెట్ పట్ల ఎక్కువమందికి ఆసక్తి లేదని భావించి ఒలింపిక్స్‌లో చేర్చలేదు.
ప్రస్తుత ఐఓసీ సభ్య దేశాలలో చాలా తక్కువ దేశాలు మాత్రమే క్రికెట్ ఆడుతున్నాయి. మరి ఈ క్రీడను ఒలింపిక్స్‌లో ఎందుకు చేర్చారనే సందేహం చాలామందిలో కలిగింది. కానీ ఐఓసీ సభ్య దేశాలను ఒలింపిక్స్‌లో ఆడేలా చేస్తే, అది ఆ దేశాలలో క్రికెట్ వ్యాప్తికి అవకాశం కల్పిస్తుందని పలువురు భావిస్తున్నారు.
అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుందని, దానికి తగ్గ కృషి చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికోసం ఐసీసీ, ముఖ్యంగా బీసీసీఐ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తదితర శక్తివంతమైన క్రికెట్ బోర్డులు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్: కులగణన పై ఏపీ సర్కార్ తొందరపడుతోందా, వలంటీర్ల పాత్రపై విమర్శలు ఏమిటి?
- పులి గోరును ధరించిన ‘బిగ్‌బాస్’ పోటీదారును ఎందుకు అరెస్ట్ చేశారు?
- తెలంగాణ: మేడిగడ్డ బరాజ్ కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే..
- వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగు వారా? శత్రువులు కూడా మెచ్చుకున్న ఆయన్ను ఎందుకు ఉరి తీశారు?
- క్రికెట్ వరల్డ్ కప్: పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఎలా గెలిచింది... అదీ చేజ్ చేసి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














